M’Cheyne Bible Reading Plan
ఇస్సాకు కోసం భార్య
24 అబ్రాహాము కురువృద్ధుడయ్యేంత వరకు జీవించాడు. అబ్రాహామును, అతడు చేసిన దాన్నంతటిని దేవుడు ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము యొక్క పాత సేవకుడు ఆస్తి వ్యవహారాలన్నింటి మీద నిర్వాహకునిగా ఉన్నాడు. ఆ సేవకుణ్ణి అబ్రాహాము తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: “నీ చేయి నా తొడక్రింద పెట్టు. 3 ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వనని భూమ్యాకాశాలకు దేవుడగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు. 4 నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. అప్పుడు ఆమెను ఇక్కడికి (అతని దగ్గరకు) తీసుకురా.”
5 ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశం రావడానికి ఇష్టపడకపోతే, నీ కుమారున్ని నేను నీ స్వంత దేశానికి తీసుకొని వెళ్లవచ్చునా?” అని అడిగాడు.
6 అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా కుమారున్ని ఆ దేశం తీసుకు వెళ్లొద్దు. 7 పరలోక దేవుడైన యెహోవా నా స్వదేశము నుండి ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ దేశం నా తండ్రికి, నా కుటుంబానికి మాతృదేశం. కాని ఈ నూతన దేశం నీ కుటుంబానికి చెందుతుందని యెహోవా వాగ్దానం చేశాడు. ప్రభువు నీకంటే ముందర తన దేవదూతను పంపిస్తాడు. మరి నీవు నా కుమారునికి వధువును అక్కడనుంచి తెస్తావు. 8 అయితే ఆ అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, ఈ వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరిపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు ఆ దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.”
9 కనుక ఆ సేవకుడు తన యజమాని తొడక్రింద తన చేయి పెట్టి వాగ్దానం చేశాడు.
అన్వేషణ ప్రారంభం
10 అబ్రాహాము ఒంటెలలో పదింటిని తీసుకొని ఆ సేవకుడు ఆ చోటు విడిచి వెళ్లాడు. రకరకాల అందాల కానుకలు ఎన్నో తనతో కూడ ఆ సేవకుడు తీసుకెళ్లాడు. మెసపొతేమియాలోని[a] నాహోరు పట్టణం వెళ్లాడు ఆ సేవకుడు. 11 పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు.
12 ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి ఈ మేలు అనుగ్రహించు. 13 ఇదిగో, మంచి నీళ్ల బావి దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుండి అమ్మాయిలు నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు. 14 ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు త్రాగాలి, నీ కడవ క్రింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘త్రాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.”
భార్య దొరికింది
15 అంతలో, ఆ సేవకుడు ప్రార్థన ముగించక ముందే రిబ్కా అనే ఒక అమ్మాయి తన గ్రామం నుండి బావి దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. 16 ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది. 17 అప్పుడు ఆ సేవకుడు ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు త్రాగటానికి దయచేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు.
18 రిబ్కా త్వరగా తన భుజంమీద నుండి కడవ దించి, అతనికి నీళ్లు ఇచ్చింది. “అయ్యా, ఇదిగో త్రాగండి” అంది రిబ్కా. 19 అతను త్రాగటానికి నీళ్ళు పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా. 20 రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.
21 ఆ సేవకుడు మౌనంగా ఆమెను గమనించాడు. యెహోవా తనకు జవాబిచ్చాడని, తన ప్రయాణాన్ని విజయవంతం చేశాడని అతను రూఢిగా తెలుసుకోవాలనుకొన్నాడు. 22 ఒంటెలు నీళ్లు త్రాగడం అయిపోగానే, అతడు అరతులం బంగారపు ఉంగరం రిబ్కాకు ఇచ్చాడు. 5 తులాల ఎత్తుగల బంగారపు గాజులు రెండు అతడు ఆమెకు ఇచ్చాడు. 23 “నీ తండ్రి ఎవరు? మా గుంపు పండుకొనేందుకు నీ తండ్రి ఇంటిలో చోటు ఉందా?” అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు.
24 “నా తండ్రి బెతూయేలు. నాహోరు, మిల్కాయొక్క కుమారుడు” అని రిబ్కా జవాబిచ్చింది. 25 తర్వాత, “అవునండి, మీ ఒంటెలకు గడ్డి, మీరు పండుకొనేందుకు స్థలం మా దగ్గర ఉంది” అని ఆమె చెప్పింది.
26 ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి, 27 “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా స్తుతించబడు గాక. యెహోవా నా యజమానుని పట్ల దయ చూపాడు. నా యజమాని బంధువు యింటికి యెహోవా నన్ను నడిపించాడు” అని చెప్పాడు.
28 అప్పుడు రిబ్కా పరుగెత్తి వెళ్లి తన ఇంటివారికి ఈ సంగతులన్నీ చెప్పింది. 29-30 రిబ్కాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు లాబాను. ఆ మనిషి తనతో చెప్పిన విషయాలు రిబ్కా చెప్పింది. లాబాను ఆమె మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే తన సోదరి చేతులకు ఉంగరం, గాజులు లాబాను చూశాడో, అప్పుడు బావి దగ్గరకు అతడు పరుగెత్తాడు. అక్కడ ఆ మనిషి బావి దగ్గర ఒంటెల ప్రక్కగా నిలబడి ఉన్నాడు. 31 “అయ్యా, తమరికి లోనికి సుస్వాగతం. మీరలా ఇక్కడే బయట నిలబడి ఉండనక్కర్లేదు. మీ ఒంటెలకు స్థలం, మీరు పండుకొనేందుకు గది నేను సిద్ధం చేశాను” అని లాబాను చెప్పాడు.
32 కనుక అబ్రాహాము సేవకుడు ఆ ఇంటిలో ప్రవేశించాడు. ఒంటెల పనిలో అతనికి లాబాను సహాయం చేసి, అతని ఒంటెలకు గడ్డి వేశాడు. అతను, అతనితో ఉన్న మనుష్యులకు కాళ్లు కడుక్కొనేందుకు నీళ్లు ఇచ్చాడు. 33 తర్వాత లాబాను అతనికి భోజనం పెట్టాడు. అయితే ఆ సేవకుడు తినకుండా నిరాకరించాడు. “నేను ఎందుకు వచ్చానో మీతో చెప్పకుండా నేను భోజనం చేయను” అన్నాడు అతను.
కనుక లాబాను, “అలాగైతే మాతో చెప్పు మరి” అన్నాడు.
రిబ్కా కోసం సంప్రదింపు
34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను. 35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ, మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి. 36 నా యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు. 37 నేను ఒక వాగ్దానం చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేశాడు. నా యజమాని ‘నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నెవరినీ అతడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. 38 కనుక నీవు నా తండ్రి దేశానికి వెళ్తానని వాగ్దానం చేయాలి. నా వంశం వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను కుదుర్చు’ అని నాతో చెప్పాడు. 39 ‘ఒక వేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశానికి రాదేమో’ అని నేను నా యజమానితో అన్నాను. 40 అయితే నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను యెహోవాను సేవిస్తాను, యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు సహాయం చేస్తాడు. అక్కడి ప్రజలలో నా కుమారుని కోసం భార్యను నీవు కనుక్కొంటావు. 41 కాని నీవు నా తండ్రి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ఈ ప్రమాణ బాధ్యత నీకు ఉండదు.’
42 “ఈ వేళ నేను ఈ బావి దగ్గరకు వచ్చి అన్నాను: ‘నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా, దయతో నా ప్రయాణం విజయవంతం చేయి. 43 నేను ఈ బావి దగ్గర నిలబడి, నీళ్లకోసం ఒక అమ్మాయి ఇక్కడికి రావాలని నిరీక్షిస్తాను. అప్పుడు నేను, దయచేసి త్రాగటానికి నీ కడవలోనుంచి నీళ్లు ఇమ్మని అడుగుతాను. 44 సరైన అమ్మాయి అయితే ఒక ప్రత్యేక విధానంలో జవాబిస్తుంది. ఈ నీళ్లు త్రాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను అని ఆమె అంటుంది. ఆ విధంగా, నా యజమాని కుమారుని కోసం యెహోవా ఏర్పరచిన స్త్రీ ఆమె అని నేను తెలుసుకొంటాను.’
45 “నేను ప్రార్థించటం ముగించక ముందే, నీళ్ల కోసం రిబ్కా బావి దగ్గరకు వచ్చింది. ఆమె తన నీళ్ల కడవ తన భుజం మీద పెట్టుకొంది. ఆమె వెళ్లి బావినుండి నీళ్లు తోడింది. ‘దయచేసి కొంచెం నీళ్లు ఇమ్మని’ నేను ఆమెతో అన్నాను. 46 వెంటనే ఆమె తన భుజం మీదనుండి కడవ దించి, నాకు నీళ్లు పోసి, ‘ఇవి త్రాగు, నీ ఒంటెలకు కూడ నేను నీళ్లు తెస్తాను’ అంది. అందుచేత నేను నీళ్లు త్రాగాను, నా ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పెట్టింది. 47 అప్పుడు ‘నీ తండ్రి ఎవరు?’ అని నేను ఆమెను అడిగాను. ‘మిల్కా, నాహోరుల కుమారుడైన బెతూయేలు నా తండ్రి’ అని ఆమె జవాబిచ్చింది. అప్పుడు ఆమె చేతికి ఉంగరం, గాజులు నేను ఇచ్చాను. 48 ఆ సమయంలో నేను నా తలవంచి యెహోవాకు వందనాలు చేశాను. నా యజమాని దేవుడైన యెహోవాను నేను స్తుతించాను. నా యజమాని సోదరుని మనుమరాలి దగ్గరకే నన్ను ఆయన తిన్నగా నడిపించినందుకు ఆయనకు వందనాలు చెప్పాను. 49 ఇప్పుడు మీరేం చేస్తారో నాకు చెప్పండి. నా యజమాని యెడల మీరు దయ, నమ్మకత్వం చూపి, మీ కుమార్తెను ఆయనకు ఇస్తారా? లేక మీ కుమార్తెను ఇవ్వటానికి మీరు నిరాకరిస్తారా? నేను ఏమి చెయ్యాలో నాకు తెలిసేటట్లు మీరు చెప్పండి.”
50 అప్పుడు లాబాను, బెతూయేలు జవాబిచ్చారు. “ఇది యెహోవా నుండి వచ్చినట్లు మేము చూస్తున్నాము. కాబట్టి దీన్ని మార్చమని మేము చెప్పుటకు ఏమీలేదు. 51 రిబ్కా నీ ముందే వుంది. ఆమెను తీసుకొని వెళ్లు. నీ యజమాని కుమారుణ్ణి ఆమె పెళ్లి చేసుకొంటుంది. ఇదే యెహోవా కోరేది.”
52 అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా యెదుట నేలపై సాగిలపడ్డాడు.
53 అప్పుడు ఆ సేవకుడు తాను తెచ్చిన కానుకలను రిబ్కాకు ఇచ్చాడు. బంగారు, వెండి నగలు, ఎన్నో అందమైన బట్టలు అతడు రిబ్కాకు యిచ్చాడు. ఆమె సోదరునికి, తల్లికి కూడ చాలా ఖరీదైన కానుకలు అతడు ఇచ్చాడు. 54 ఆ సేవకుడు, అతనితోనున్న సేవకులు భోజనము చేసి, ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. మర్నాడు ఉదయం వారు లేచి, “ఇప్పుడు మేము తిరిగి మా యజమాని దగ్గరకు వెళ్తాం” అని అన్నారు.
55 అప్పుడు రిబ్కా తల్లి, సహోదరుడు ఈ విధంగా చెప్పారు, “రిబ్కాను కొన్నాళ్లు మా దగ్గర ఉండనివ్వు. పది రోజులు ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు.”
56 కానీ ఆ సేవకుడు, “నన్ను ఇంక ఆపవద్దు. నా ప్రయాణాన్ని యెహోవా విజయవంతం చేశాడు. కనుక ఇప్పుడు నా యజమాని దగ్గరకు నన్ను వెళ్లనివ్వండి” అని వారితో చెప్పాడు.
57 “రిబ్కాను పిలిచి, ఆమె ఇష్టం ఏమిటో మేము అడుగుతాం” అన్నారు రిబ్కా అన్న మరియు తల్లి. 58 వారు రిబ్కాను పిలిచి, “నీవు ఈ మనుష్యునితో కలిసి ఇప్పుడే వెళ్తావా?” అని అడిగారు.
“అవును, నేను వెళ్తాను” అంది రిబ్కా.
59 కనుక అబ్రాహాము సేవకునితో, అతని మనుష్యులతో కలిసి రిబ్కా వెళ్లటానికి వారు అనుమతించారు. రిబ్కా దాది కూడ వారితో వెళ్లింది. 60 వారు వెళ్తున్నప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు:
“మా సోదరీ, వేలమందికి, పది వేలమందికి నీవు తల్లివి అవుదువు గాక.
నీ సంతానము వారి శత్రువులను ఓడించి, వారి పట్టణాలను స్వాధీనం చేసుకొందురు గాక!”
61 అప్పుడు రిబ్కా, ఆమె దాది ఒంటెలను ఎక్కి ఆ సేవకుని, అతని మనుష్యులను వెంబడించారు. ఆ విధంగా ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని తిరుగు ప్రయాణమయ్యాడు.
62 అప్పటికి ఇస్సాకు బెయేర్ లహాయిరోయి విడిచి, నెగెవులో నివసిస్తున్నాడు. 63 ఒక సాయంకాలం ఇస్సాకు ధ్యానించుట కోసం అలా బయటకు పోలాల్లోకి వెళ్లాడు. ఇస్సాకు తలెత్తి చూచేటప్పటికి అంత దూరంలో వస్తున్న ఒంటెలు కనిపించాయి.
64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసింది. అప్పుడామె ఒంటె మీద నుండి క్రిందికి దిగింది. 65 “మనలను కలుసుకొనేందుకు ఆ పొలాల్లో నడిచి వస్తున్న యువకుడు ఎవరు?” అంటూ ఆమె సేవకుని అడిగింది.
“ఆయనే నా యజమాని కుమారుడు” అని చెప్పాడు ఆ సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం మీద ముసుగు కప్పుకొంది. 66 జరిగిన సంగతులన్నీ ఇస్సాకుతో ఆ సేవకుడు చెప్పాడు. 67 అప్పుడు ఇస్సాకు ఆ అమ్మాయిని తన తల్లి గుడారంలోకి తీసుకు వచ్చాడు. ఆ రోజు రిబ్కా ఇస్సాకు భార్య అయ్యింది. ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. తన తల్లి మరణించిన తర్వాత అప్పుడు ఇస్సాకు దుఃఖనివారణ పొందాడు.
యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం
(మార్కు 12:38-40; లూకా 11:37-52; 20:45-47)
23 ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: 2 “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు. 3 అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. 4 వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు.
5 “పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. 6 విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. 7 సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు.
8 “మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి. 9 ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. 10 అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’ 11 మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి. 12 ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు.
13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. 14 [a]
15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.
16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?
18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? 20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!
23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.
25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.
27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.
29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!
33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.
35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.
యెరూషలేము విషయంలో దుఃఖించటం
(లూకా 13:34-35)
37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”
నెహెమ్యా చివరి ఆదేశాలు
13 ఆ రోజున మోషే గ్రంథం ప్రజలందరకీ వినిపించేలా బిగ్గరగా పఠింపబడింది. అమ్మోనీయుల్లోగాని, మెయాబీయుల్లోగాని ఏ ఒక్కరూ దేవుని ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండుటకు అనుమతింపబడరన్న నిబంధన మోషే గ్రంథంలో వ్రాసి వుందన్న విషయం జనం గ్రహించారు. 2 ఇశ్రాయేలీయులకి వాళ్లు ఆహారంగాని, నీరుగాని ఇవ్వలేదు. అందుకే ఈ నిబంధన లిఖించబడింది. పైగా ఇశ్రాయేలీయులకు శాపం ఇచ్చేందుకు బిలాముకు డబ్బు కూడా చెల్లించారు. కాని దేవుడు ఆ శాపాన్ని తిప్పికొట్టి, దాన్ని మనకొక వరంగా చేశాడు. 3 ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను విన్నారు. వాళ్లు దాన్ని పాటించారు. విదేశీయుల సంతానాల నుంచి వాళ్లు తమని తాము వేరుజేసుకున్నారు.
4-5 అయితే, ఇది జరిగేందుకు ముందు, ఎల్వాషీబు టొబీయాకి ఆలయంలో ఒక గది ఇచ్చాడు ఎల్వాషీబు దేవుని ఆలయంలో వస్తువులను భద్రపరచే గదులకు బాధ్యుడైన యాజకుడు. ఎల్యాషీబు టోబీయాకి సన్నిహిత మిత్రుడు. ఆ గది ధాన్యార్పణలు ధూప సామగ్రి, ఆలయానికి చెందిన గిన్నెలు, వస్తువులు దాచేందుకు ఉద్దేశింపబడింది. లేవీయులు, గాయకులు ద్వారపాలకుల కోసం పంట ధాన్యాల్లో పదోవంతు కొత్త ద్రాక్షారసం, నూనె కూడా ఆ గదిలోనే ఉంచారు. యాజకులకు వచ్చిన కానుకలను కూడా ఆ గదిలోనే ఉంచారు. కాని, ఎల్యాషీబు ఆ గదిని టోబీయాకి ఇచ్చాడు.
6 ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూషలేములో లేను. నేను బబులోనుకి రాజును కలిసేందుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా రాజును యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాను. 7 అలా నేను యెరూషలేముకి తిరిగి వచ్చాను. యెరూషలేములో ఎల్యాషీబు చేసిన విచారకరమైన విషయం నేను విన్నాను. ఎల్యాషీబు టోబీయాకి మన దేవుని ఆలయంలో ఒక గది యిచ్చాడు! 8 ఎల్యాషీబు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కనుక నేను టోబీయా వస్తువులన్నీ గది బయటికి విసిరేశాను. 9 ఆ గదులను స్వచ్ఛంగా, పరిశుభ్రం చేయాలని ఆజ్ఞనిచ్చాను. తర్వాత నేను గిన్నెలను, వస్తుపులను, ధాన్యాం కానుకలను, ధూప సామగ్రిని తిరిగి ఆ గదుల్లో పెట్టించాను.
10 లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయకులూ తమ స్వంత పొలాల్లో పని చేసుకునేందుకు తిరిగి వెళ్లిపోయారు. 11 అందుకని, నేనా అధికారులకు వాళ్లు చేసింది తప్పని చెప్పాను. “మీరు దేవుని ఆలయం విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు?” అని నేను వాళ్లని నిలదీశాను. తర్వాత, లేవీయులందర్నీ నేను సమావేశపరచాను. నేను వాళ్లకి తమ తమ స్థానాలకి, ఆలయంలో కొలువులకి తిరిగి రమ్మని చెప్పాను. 12 తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో తమ ధాన్యంలో పదోవంతును, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెని సమర్పించారు. ఆ వస్తువులు వస్తువులను భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి.
13 ఆ గిడ్డంగులకి నేనీ క్రింది వారిని భద్రపరచు వారుగా నియమించాను: యాజకుడు షెలెమ్యా, ఉపదేశకుడు సాదోకు, లేవీయుడు పెదయా. వారికి సహాయకుడుగా హానానును నియమించాను. హానాను జక్కూరు కొడుకు, మత్తన్యా మనుమడు. వీళ్లు విశ్వాసపాత్రులన్న విషయం నాకు తెలుసు. వాళ్లు తమ బంధువులకు ఆయా వస్తువులు అందచేసే విషయంలో బాధ్యులు.
14 దేవా, నేను చేసిన ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుపెట్టుకో, నా దేవుని ఆలయ నిర్మాణంకోసం, దాని కొలువులకోసం నేను చిత్తశుద్ధితో నమ్మకంగా చేసినవన్నీ గుర్తంచుకో దేవా.
15 ఆ రోజుల్లో యూదాలో జనం సబ్బాతు (విశ్రాంతి) నాడు కూడా పనిచేయడం నేను గమనించాను. జనం ద్రాక్షాపళ్లు తొక్కి రసం తీయడం చూశాను. జనం ధాన్యం తీసుకురావడం, దాన్ని గాడిదలమీద మోపడం చూశాను. నగరంలో జనం ద్రాక్షాను, అంజూరపళ్లను, రకరకాల వస్తువులను తీసుకు రావడం చూశాను. వాళ్లు సబ్బాతు (విశ్రాంతి) రోజున ఈ వస్తుపులన్నింటినీ యెరూషలేముకి తెస్తున్నారు. అందుకని, నేను వాళ్లకి ఈ విషయంలో హెచ్చరిక చేశాను. నేను వాళ్లకి సబ్బాతు రోజున ఆహారం అమ్మకూడదని చెప్పాను.
16 తూరు నగరానికి చెందిన కొందరు యెరూషలేములో వున్నారు. వాళ్లు చేపలను, రకరకాల వస్తువులను యెరూషలేములోకి తెచ్చి, సబ్బాతు రోజున అమ్ముతున్నారు. యూదులు ఆ వస్తువులను కొంటున్నారు. 17 యూదాలోని ముఖ్యులకు వాళ్లు చేస్తున్నది పొరపాటని చెప్పాను. నేనా ముఖ్యులకి ఇలా చెప్పాను: “మీరు చాలా చెడ్డపని చేస్తున్నారు. మీరు సబ్బాతును నాశనం చేస్తున్నారు. మీరు సబ్బాతును అన్ని ఇతర రోజుల మాదిరిగా మారుస్తున్నారు. 18 మీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమైనది కాదన్నట్లు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.”
19 అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను నేను ఆదేశీంచాను. ఆ తలుపులను సబ్బాతు రోజు ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా స్వంత మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని నేను వాళ్లని కట్టడిచేశాను.
20 ఒకటి రెండు సార్లు వ్యాపారస్తులూ, చిల్లర వర్తకులూ రాత్రి పూట యెరూషలేము ప్రాకారం వెలుపల గడపవలసివచ్చింది. 21 అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లర వర్తకుల్నీ, “రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీరాలేదు.
22 తర్వాత తమని తాము పరిశుద్ధుల్నీ చేసుకోమని నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్లలా చెశాక, వాళ్లు పోయి, ద్వారాలను కావలి కాయాలి. సబ్బాతు రోజును ఒక పవిత్ర దినంగా వుంచేందుకు గాను ఇవన్నీ చేశాను. ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా.
నామీద దయవుంచి, ఘనమైన నీ ప్రేమా, దయ నామీద ప్రసరింపచెయ్యి.
23 ఆ రోజుల్లో కొందరు యూదులు అష్టోదు, అమ్మోను, మోయాబు దేశాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను. 24 ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం ముదికి యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. ఆ పిల్లలు అష్డోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లడేవారు. 25 అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్లకి చెప్పాను. నేను వాళ్లని శపించాను. వాళ్లలో నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్లచేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా చూడండి. 26 ఇలాంటి పెళ్లిళ్లు సొలొమోను లాంటివాడు సైతం పాపం చేసేందుకు కారణమయ్యాయని మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సొలొమోనంతటి గొప్ప రాజు లేడు. సొలొమోను దేవుని ప్రేమ పొందినవాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు దేశమంతటికీ రాజును చేశాడు. అలాంటి సొలొమోను సైతం విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది. 27 మరి ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే చేస్తున్నట్లు వింటున్నాం. మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు.”
28 యోయాదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు. యోయాదా కొడుకుల్లో ఒకడు హోనానువాసి అయిన సన్బల్లటుకి అల్లుడు. నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను పారిపోయేలా కట్టడిచేశాను.
29 ఓ నా దేవా, నీవు వాళ్లని శిక్షించు. వాళ్లు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్లు వ్యవహరించారు. యాజకులతోనూ, లేవీయులతోనూ నీవు చేసుకున్న ఒడంబడికను వాళ్లు పాటించలేదు. 30 అందుకని నేనా యాజకులనూ, లేవీయులనూ శుచులనుగా, పరిశుద్ధులనుగా చేశాను. నేను విదేశీయులందర్నీ, వాళ్లు నేర్పిన వింత విషయాల్నీ తొలగించాను. నేను లేవీయులకీ, యాజకులకీ వాళ్ల అసలైన సొంత విధులనూ, బాధ్యతలనూ అప్పగించాను. 31 జనం కట్టెల కానుకలనూ, తొలి ఫలాలనూ సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా చూశాను.
ఓ నా దేవా, నేను చేసిన ఈ మంచి పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో.
23 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. 2 ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు. 3 అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.
4 పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళు, “దేవుని ప్రధానయాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.
5 అందుకు పౌలు, “సోదరులారా! ప్రధానయాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’”(A)
6 పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.
7 అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. 8 సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. 9 సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.
10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.
11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోమాలో కూడా బోధించాలి” అని అన్నాడు.
పౌలును చంపటానికి కుట్ర
12 మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు. 13 నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు. 14 వాళ్ళు ప్రధానయాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళి, “మేము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం. 15 కనుక మీరు మహాసభ పక్షాన ‘అతణ్ణి గురించి మేము యింకా విశదంగా తెలుసుకోవాలనుకొంటున్నాము’ అని అబద్ధాలు చెప్పి, ఆ సాకుతో పౌలును పంపమని సహస్రాధిపతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు.
16 పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్ళి పౌలుతో చెప్పాడు. 17 పౌలు శతాధిపతిని పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళు. అతనికి యితడు చెప్పవలసిన విషయం ఒకటుంది” అని అన్నాడు. 18 శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి, “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు పిలుచుకెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్పదలిచాడు!” అని అన్నాడు.
19 సహస్రాధిపతి ఆ యువకుని చేయి పట్టుకొని ప్రక్కకు తీసుకెళ్ళి, “నాకేం చెప్పాలనుకొన్నావు?” అని అడిగాడు.
20 ఆ యువకుడు, “పౌలును గురించి యింకా విశదంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ కలిసి, పౌలును రేపు మహాసభకు పిలుచుకు రమ్మని మీకు విజ్ఞాపన చెయ్యాలనుకొంటున్నారు. 21 వాళ్ళ విజ్ఞాపనను అంగీకరించకండి. నలభై కంటే ఎక్కువ మంది పౌలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. అతణ్ణి చంపే దాకా అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం తీసుకున్నారు” అని అన్నాడు.
22 సహస్రాధిపతి యువకుణ్ణి వెళ్ళమని చెబుతూ, తనకీవిషయం చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పవద్దని జాగ్రత్త పరిచాడు.
పౌలును కైసరియకు పంపటం
23 తదుపరి తన శతాధిపతుల్ని యిద్దర్ని పిలిచి, “రెండు వందల సైనికుల్ని, డెబ్బైమంది గుఱ్ఱపు రౌతుల్ని, బళ్ళేలు ఉపయోగించే రెండు వందల సైనికుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియకు వెళ్ళండి. 24 పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి” అని ఆజ్ఞాపించాడు. 25 సహస్రాధిపతి యిలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు:
26 గౌరవనీయులైన ఫేలిక్సు రాష్ట్రాధిపతికి,
క్లౌదియ లూసియ అభివందనాలు చెప్పి వ్రాయునది,
27 ఇతణ్ణి యూదులు పట్టుకొని చంపబొయ్యారు. కాని, నేను యితడు రోమా పౌరుడు అని తెలుసుకొని నా దళాలతో వెళ్ళి అతణ్ణి రక్షించాను. 28 వాళ్ళెందుకు అతణ్ణి అపరాధి అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ళ మహాసభకు పిలుచుకు వెళ్ళాను. 29 వాళ్ళు, తమ ధర్మశాస్త్రం విషయంలో యితణ్ణి అపరాధి అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో ఉంచవలసిన నేరం కాని, మరణదండన వేయవలసిన నేరం కాని ఇతడు చేయలేదు. 30 వాళ్ళు ఇతణ్ణి చంపటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపుతున్నాను. ఇతనిపై నేరారోపణ చేసినవాళ్ళతో ఆ నేరారోపణ మీ సమక్షంలో చెయ్యవచ్చని చెప్పాను.
31 సహస్రాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును రాత్రి వేళ తమతో పిలుచుకు వెళ్ళి అంతిపత్రికి చేరుకున్నారు. 32 మరుసటి రోజు రౌతుల్ని పౌలు వెంట పంపి, సైనికులు కోటకు తిరిగి వచ్చారు. 33 పౌలుతో వెళ్ళినవాళ్ళు కైసరియ చేరుకొని ఆ ఉత్తరాన్ని, పౌలును, రాష్ట్రాధిపతికి అప్పగించారు.
34 రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ ప్రాంతం వాడవు?” అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసుకొని, 35 “నీపై నేరారోపణ చేసినవాళ్ళు యిక్కడికి వచ్చాక నీ విషయం విచారిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత పౌలును హేరోదు భవనంలో ఉంచి కాపలా కాయమని భటులతో చెప్పాడు.
© 1997 Bible League International