M’Cheyne Bible Reading Plan
నెబుకద్నెజరు రాజు యూదాకు వచ్చుట
24 యెహోయాకీము కాలంలో బబులోను రాజయిన నెబుకద్నెజరు యూదా దేశానికి వచ్చాడు. యెహోయాకీము నెబుకద్నెజరుని మూడేండ్లు సేవించాడు. తర్వాత యెహోయాకీము నెబుకద్నెజరుకు ప్రతికూలుడై అతని పరిపాలన నుండి విముక్తుడయ్యాడు. 2 యెహోవా బబులోనువారి బృందాలు, సిరియనులు, మోయాబీయులు, అమ్మోనీయులు మొదలైన వారిని యెహోయాకీముకి విరుద్ధంగా యుద్ధము చేయునట్లు చేశాడు. యెహోవా ఆ బృందాలను యూదాని ధ్వంసం చేయమని పంపించాడు. ఇది యెహోవా చెప్పినట్లుగానే జరిగింది. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను అవి చెప్పడానికి ఉపయోగించాడు.
3 యూదాలో అవి జరుగేటట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. ఈ విధంగా యెహోవా వారిని తన దృష్టినుండి మరల్చాడు. మనష్షే చేసిన పాపాలన్నిటి కారణాన యెహోవా ఇలా చేశాడు. 4 మనష్షే పలువురు అమాయకులను చంపినందువల్ల, యెహోవా ఇదంతా చేశాడు. మనష్షే యెరూషలేమును వారి రక్తముతో నింపివేశాడు. మరియు యెహోవా ఆ పాపాలను మన్నించడు.
5 యెహోయాకీము చేసిన ఇతర కార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 6 యెహోయాకీము మరణించగా, అతని పూర్వికులతో పాటుగా అతనిని సమాధి చేశారు. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
7 బబులోను రాజు ఈజిప్టు వాగుకి యూఫ్రటీసు నదికి మధ్యగల ప్రదేశమంతటిని స్వాధీనము చేసుకున్నాడు. ఈ ప్రదేశము అంతకు ముందు ఈజిప్టువారు తమ అదుపులో ఉంచుకున్నారు. అందువల్ల ఈజిప్టు రాజు ఈజిప్టుని ఏ మాత్రమూ విడువదలచుకోలేదు.
నెబుకద్నెజరు యెరూషలేమును వశం చేసుకొనుట
8 యెహోయాకీను, పరిపాలన ప్రారంభించిన నాడు, అతను 18 యేండ్లవాడు. అతను యెరూషలేములో 3 మాసాలు పరపాలించాడు. అతని తల్లి పేరు నెహుష్తా ఆమె యెరూషలేముకు చెందిన ఎల్నాతాను కుమార్తె. 9 యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోయాకీను చేశాడు. అతను తన తండ్రి చేసిన అవే పనులు చేసాడు.
10 ఆ సమయమున బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క అధికారులు యెరూషలేముకు వచ్చి ముట్టిడించారు. 11 తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజరు నగరానికి వచ్చాడు. అతని సైన్యము అప్పటికే నగరాన్ని చుట్టుముట్టుతూ ఉంది. 12 యూదా రాజు యెహోయాకీను బబులోను రాజుని కలుసుకోడానికి వెలుపలికి వచ్చాడు. యెహోయాకీను తల్లి, అతని అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూడా అతనితో పాటు వెళ్లారు. అప్పుడు బబులోను రాజు యెహోయాకీనుని బంధించాడు. ఇది నెబుకద్నెజరు పరిపాలనాకాలపు 8వ సంవత్సరమున జరిగింది.
13 నెబుకద్నెజరు యెరూషలేమునుండి, యెహోవా యొక్క ఆలయములోని నిధులన్నిటినీ, రాజభవనములోని నిధులన్నిటినీ తీసుకొనెను. నెబుకద్నెజరు ఇశ్రాయేలు రాజయిన సొలొమోను యెహోవా యొక్క ఆలయములో ఉంచిన అన్ని బంగారు పాత్రలను ముక్కలు చేశాడు. యెహోవా చెప్పినట్లుగానే ఇది సంభవించింది.
14 నెబుకద్నెజరు యెరూషలేములోని ప్రజలందరిని బంధించాడు. అతను నాయకులందరినీ, ధనవంతులను బంధించాడు. అతను 10,000 మంది ప్రజలను బందీలుగా తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పనిలో చెయ్యి తిరిగినవారిని, నిపుణులను తీసుకు వెళ్లాడు. సామాన్యులలోని నిరుపేదలను తప్ప మరెవ్వరిని విడిచి పెట్టలేదు. 15 నెబుకద్నెజరు యెహోయాకీనుని బందీగా చేసి బబులోనుకు తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పైగా రాజమాతను, అతని భార్యలను, అధికారులను, ప్రముఖ వ్యక్తులను తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు వారిని యెరూషలేము నుండి బబులోనుకి బందీలుగా చేసి తీసుకువెళ్లాడు. 16 7,000 మంది సైనికులుండిరి. నెబుకద్నెజరు సైనికులందరినీ, 1,000 మంది పనిలో చెయ్యి తిరిగినవారినీ, నిపుణులను తీసుకు వెళ్లాడు. ఈ వ్యక్తులందరు యుద్ధానికి సిద్ధంగా వుండే సుశిక్షుతులైన సైనికులు. బబులోను రాజు వారినందరినీ బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్లాడు.
సిద్కియా రాజు
17 బబులోను రాజు మత్తన్యాను కొత్త రాజుగా చేశాడు. మత్తన్యా యెహోయాకీము యొక్క పిన తండ్రి. అతను అతని పేరుని సిద్కియా అని మార్చి వేశాడు. 18 సిద్కియా పరిపాలన ప్రారంభించే నాటికి ఇరవై ఒక్క సంవత్సరములవాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె. 19 యెహోవా తప్పు అని చెప్పిన పనులు సిద్కియా చేశాడు. సిద్కియా యెహోయాకీను చేసిన పనులే చేశాడు. 20 యెహోవా యెరూషలేము యూదాల పట్ల ఆగ్రహం చెందాడు. యెహోవా వారిని దూరపరచెను.
6 అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను చర్చించటం మాని ముందుకు వెళ్తూ పరిపూర్ణత చెందుదాం. ఘోరమైన తప్పులు చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్ల విశ్వాసం, 2 బాప్తిస్మమును[a] గురించి బోధించటం, చేతులు తల మీద ఉంచి అభిషేకించటం, చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్పు, యివి మన పునాదులు. ఈ పునాదుల్ని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉందాం. 3 దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది.
4 ఒకసారి వెలిగింపబడినవాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసినవాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్నవాళ్ళు, 5 దైవసందేశం యొక్క మంచితనాన్ని రుచి చూసినవాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచినవాళ్ళు 6 పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు.
7 తన మీద తరుచుగా పడ్తున్న వర్షాన్ని పీల్చుకొనే భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి దేవుని ఆశీస్సులు పొందుతుంది. 8 కాని, ముళ్ళ మొక్కలు, కలుపుమొక్కలతో పెరిగే భూమి నిరుపయోగమైనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. చివరకు దాన్ని కాల్చి వేస్తాడు.
9 ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది. 10 దేవుడు అన్యాయం చెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం చేసారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన ప్రేమను ఆయన మరిచిపోడు. 11 మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరివరకు చూపాలి. 12 మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడినదానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని అనుసరించండి.
13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ, 14 ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.” 15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
16 ప్రజలు తమకన్నా గొప్పవాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి. 17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు.
తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.
యూదా శత్రువులు శిక్షింపబడుదురు
3 “ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదాను, యెరూషలేమును నేను తిరిగి తీసుకొని వస్తాను. 2 రాజ్యాలన్నింటిని కూడా నేను సమావేశ పరుస్తాను. ఈ రాజ్యాలన్నింటిని క్రిందికి యెహోషాపాతు లోయలోకి నేను తీసుకొని వస్తాను. అక్కడ వారికి నేను తీర్పు చెప్తాను. ఆ రాజ్యాలు నా ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టాయి. వారు ఇతర రాజ్యాలలో జీవించేలా వారు వారిని బలవంత పెట్టారు. కనుక ఆ రాజ్యాలను శిక్షిస్తాను. ఆ రాజ్యాలు నా దేశాన్ని విభజింపచేశాయి. 3 నా ప్రజల కోసం వారు చీట్లు వేసుకొన్నారు. ఒక వేశ్యను కొనేందుకు వారు ఒక బాలుని అమ్ముకొన్నారు. మరియు తాగడానికి ద్రాక్షామద్యం కొనేందుకు వారు ఒక బాలికను అమ్ముకొన్నారు.
4 “తూరూ! సీదోనూ! ఫిలిష్తీయలోని అన్నిప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదైనా చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను మిమ్ముల్ని శిక్షిస్తాను. 5 నా వెండి, బంగారం మీరు తీసుకొన్నారు. నా ప్రశస్త ఐశ్వర్యాలు మీరు తీసుకొని మీమీ ఆలయాల్లో పెట్టుకొన్నారు.
6 “యూదా, యెరూషలేము ప్రజలను మీరు గ్రీకువాళ్ళకు అమ్మేశారు. ఆ విధంగా మీరు వారిని దేశానికి దూరంగా తీసికొని వెళ్ళగలిగారు. 7 మీరు నా ప్రజలను అంత దూరస్థలానికి పంపించి వేశారు. కానీ నేను వారిని వెనుకకు తీసికొని వస్తాను. మరియు మీరు చేసినదానికి నేను మిమ్ముల్ని శిక్షిస్తాను. 8 మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము ప్రజలకు అమ్మివేస్తారు.” ఆ విషయాలు యెహోవా చెప్పాడు.
యుద్ధానికి సిద్ధపడండి
9 రాజ్యాలలో దీనిని ప్రకటించండి:
యుద్ధానికి సిద్ధపడండి!
బలాఢ్యులను మేల్కొలపండి!
యుద్ధ వీరులందరినీ దగ్గరగా రానివ్వండి,
వారిని రానివ్వండి!
10 మీ నాగటి కర్రులను చెడగొట్టి కత్తులు చేయండి.
మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి.
బలహీనుడ్ని కూడ
“నేను బలాఢ్యుడను” అని చెప్పనీయండి.
11 సకల రాజ్యాల్లారా, త్వరపడండి!
ఆ స్థలానికి కూడి రండి!
యెహోవా, బలమైన నీ సైనికులను తీసికొని రా.
12 రాజ్యాల్లారా, మేల్కొనండి.
యెహోషాపాతు లోయలోనికి రండి.
చుట్టుపక్కల రాజ్యాలన్నింటికీ తీర్పు చెప్పేందుకు
అక్కడ నేను కూర్చుంటాను.
13 పంట సిద్ధంగా ఉంది గనుక
కొడవలి పట్టుకొని రండి.
రండి, ద్రాక్షా గానుగ నిండిపోయింది గనుక
ద్రాక్షాపండ్లమీద నడవండి.
వారి దుర్మార్గం చాలాఉంది గనుక
పీపాలు నిండిపోయి పొర్లిపోతాయి.
14 తీర్మాన లోయలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు.
యెహోవా ప్రత్యేక దినం తీర్మాన లోయకు సమీపంగా ఉంది.
15 సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి.
నక్షత్రాలు ప్రకాశించడం మానివేస్తాయి.
16 యెహోవా దేవుడు సీయోనులోనుండి కేకవేస్తాడు.
యెరూషలేమునుండి ఆయన కేక వేస్తాడు.
మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి.
కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్థానం.
ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు.
17 “మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు.
నా పవిత్ర పర్వతమైన సీయోనులో నేను నివసిస్తాను.
యెరూషలేము పవిత్రం అవుతుంది.
పరాయివారు ఆ పట్టణంలోనుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.”
యూదాకు కొత్తజీవితం వాగ్దానం చేయబడుట
18 “ఆ రోజున పర్వతాలనుండి తియ్యటి ద్రాక్షారసం కారుతుంది.
కొండల్లో పాలు, తేనెలు ప్రవహిస్తాయి.
మరియు యూదాలోని ఖాళీ నదులన్నిటిలో నీళ్ళు ప్రవహిస్తాయి.
యెహోవా ఆలయంలోనుండి ఒక నీటి ఊట చిమ్ముతుంది.
అది షిత్తీము లోయకు నీళ్ళు ఇస్తుంది.
19 ఈజిఫ్టు ఖాళీ అవుతుంది.
ఎదోము ఖాళీ అరణ్యం అవుతుంది.
ఎందుకంటే యూదా ప్రజలపట్ల వారు క్రూరంగా ఉన్నారు.
వారి దేశంలోని నిర్దోషప్రజలను వారు చంపివేశారు.
20 కాని యూదాలో మనుష్యులు ఎల్లప్పుడూ నివసిస్తారు.
అనేక తరాలవరకు యెరూషలేములో మనుష్యులు నివసిస్తారు.
21 ఆ మనుష్యులు చాలా మంది ప్రజలను చంపేశారు.
కనుక ఆ ప్రజలను నేను నిజంగా శిక్షిస్తాను!”
యెహోవా దేవుడు సీయోనులో నివసిస్తాడు.
దావీదు స్తుతి కీర్తన.
143 యెహోవా, నా ప్రార్థన వినుము.
నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
2 నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
3 కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
4 నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
5 కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
6 యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.
7 యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
8 యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
9 యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.
© 1997 Bible League International