M’Cheyne Bible Reading Plan
యాకోబు సమాధి చేయబడుట
50 ఇశ్రాయేలు మరణించినప్పుడు యోసేపు చాలా విచారించాడు. అతడు తన తండ్రిని కౌగలించుకొని, అతని మీద పడి ఏడ్చి, అతనిని ముద్దు పెట్టుకొన్నాడు. 2 తన తండ్రి దేహమును సిద్ధం చేయమని అతడు తన సేవకులకు (ఆ సేవకులు వైద్యులు) ఆజ్ఞాపించాడు. యాకోబు శరీరాన్ని సమాధి చేసేందుకు వైద్యులు సిద్ధం చేశారు. ఈజిప్టువారి ప్రత్యేక పద్ధతిలో ఆ శరీరాన్ని వారు సిద్ధం చేశారు. 3 ఈజిప్టు వారు ఈ పద్ధతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే, ఆ శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు 40 రోజులు వారికి అవసరం. తర్వాత ఈజిప్టువాళ్లు యాకోబు కోసం దుఃఖించటానికి ప్రత్యేక సమయం తీసుకొన్నారు. ఆ సమయం 70 రోజులు.
4 డెబ్భైరోజుల తర్వాత దుఃఖసమయం ముగిసింది. కనుక ఫరో అధికారులతో యోసేపు మాట్లాడాడు. “దయచేసి ఫరోతో ఇది చెప్పండి: 5 ‘నా తండ్రి మరణ ఘడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేశాను. కనాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేశాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న గుహ. కనుక దయచేసి నేను వెళ్లి, నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను’” అన్నాడు యోసేపు.
6 “నీ మాట నిలబెట్టుకో, వెళ్లి నీ తండ్రిని సమాధి చేయి” అని ఫరో జవాబిచ్చాడు.
7 కనుక యోసేపు తన తండ్రిని సమాధి చేసేందుకు వెళ్లాడు. ఫరో అధికారులంతా, ఫరో పెద్దలు (నాయకులు) యోసేపుతో కూడ వెళ్లారు. ఫరో నాయకులు, ఈజిప్టులోని పెద్దలందరూ యోసేపుతో వెళ్లారు. 8 యోసేపు కుటుంబంలోని వాళ్లందరూ, అతనితో వెళ్లారు. మరియు తన తండ్రి కుటుంబం అంతా యోసేపుతో వెళ్లారు. పిల్లలు, పశువులు మాత్రమే గోషెను దేశంలో విడువబడటం జరిగింది. 9 యోసేపుతో వెళ్లటానికి అందరూ రథాలమీద, గుర్రాలమీద వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు అయింది.
10 యోర్దాను నదికి తూర్పున గోరెన్ ఆఠదు కళ్లం దగ్గరకు వారు వెళ్లారు. ఆ స్థలంలో వారు ఇశ్రాయేలు నిమిత్తం భూస్థాపన క్రమాలు దీర్ఘంగా జరిగించారు. ఆ భూస్థాపన క్రమం ఏడు రోజులపాటు కొనసాగింది. 11 గోరెన్ ఆఠదులో జరిగిన భూస్థాపన క్రమాన్ని కనానులో నివసిస్తున్న ప్రజలు చూశారు. వారు “ఆ ఈజిప్టు వాళ్లు ఎంతగా దుఃఖిస్తున్నారో అని చెప్పుకొన్నారు”. కనుక ఆ స్థలం ఇప్పుడు ఆబేల్ మిస్రాయిము అని పిలువబడుతుంది.
12 కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 13 వారు అతని శరీరాన్ని కనానుకు తీసుకొని వెళ్లి, మక్పేలా గుహలో దానిని పాతిపెట్టారు. హిత్తీయుడగు ఎఫ్రోను దగ్గర అబ్రాహాము కొన్న పొలంలోని మమ్రే సమీపాన ఉన్న గుహ ఇది. సమాధిస్థలంగా ఉపయోగించేందుకు అబ్రాహాము ఆ గుహను కొన్నాడు. 14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత, అతనూ, అతనితో ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్లిపోయారు.
సోదరులు యోసేపుకు ఇంకా భయపడుట
15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు. 16 కనుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం పంపించారు: “నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం.”
యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేశాడు. 18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.
19 అప్పుడు యోసేపు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు. 20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు. 21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగించింది.
22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. 23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.
యోసేపు మరణం
24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.
25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.
26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు.
యోహాను బోధించటం
(మత్తయి 3:1-12; మార్కు 1:1-8; యోహాను 1:19-28)
3 కైసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నైదవ సంవత్సరములో:
యూదయ దేశాన్ని పొంతి పిలాతు పాలిస్తూ ఉన్నాడు.
హేరోదు గలిలయ దేశానికి సామంతరాజుగా ఉన్నాడు.
హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు.
లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా ఉన్నాడు.
2 ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా కుమారుడైన యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది. 3 ఆతర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్ని తిరిగి, “పాప క్షమాపణ పొందాలంటే మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలి” అని బోధించాడు. 4 దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:
“‘ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన
బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంతములో
ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.
5 లోయలు పూడ్చివేయ బడుతాయి.
కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి.
వంకర బాటలు చక్కగా ఔతాయి.
కరుకు బాటలు నునుపుగా ఔతాయి.
6 మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!’”(A)
7 ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు? 8 మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. 9 చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.
10 “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు.
11 యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు.
12 పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
13 “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు.
14 కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు.
అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.
15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.
16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము[a] నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. 17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.” 18 యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.
యోహాను సేవా ఎలా అంతమైయింది
19 రాజ్యాధికారి హేరోదుకు అతని సోదరుని భార్య అయిన హేరోదియతో సంబంధంవుంది. దీని కారణంగా, హేరోదు చేసిన యితర దుష్కార్యాల కారణంగా యోహాను అతణ్ణి తీవ్రంగా విమర్శించాడు. 20 తద్వారా హేరోదు, యోహానును కారాగారంలో ఉంచాడు. ఇలా చేసి తాను చేసిన దుష్కార్యాలకు మరొక దుష్కార్యం చేర్చుకొన్నాడు.
యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం
(మత్తయి 3:13-17; మార్కు 1:9-11)
21 యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. 22 పవిత్రాత్మ ఒక పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. వెంటనే పరలోకం నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీయందు ఎక్కువగా నేను ఆనందించుచున్నాను” అని వినబడింది.
యోసేపు వంశ వృక్షం
(మత్తయి 1:1-17)
23 యేసు బోధించటం మొదలు పెట్టినప్పుడు ఆయనకు సుమారు ముప్పై సంవత్సరాలు. యేసు యోసేపు కుమారుడు అని ప్రజలు అనుకునేవాళ్ళు.
యోసేపు హేలీ కుమారుడు,
24 హేలీ మత్తతు కుమారుడు,
మత్తతు లేవి కుమారుడు.
లేవి మెల్కీ కుమారుడు.
మెల్కీ యన్న కుమారుడు.
యన్న యోసేపు కుమారుడు.
25 యోసేపు మత్తతీయ కుమారుడు,
మత్తతీయ ఆమోసు కుమారుడు.
ఆమోసు నాహోము కుమారుడు,
నాహోము ఎస్లి కుమారుడు.
ఎస్లి నగ్గయి కుమారుడు.
26 నగ్గయి మయతు కుమారుడు.
మయతు మత్తతీయ కుమారుడు.
మత్తతీయ సిమియ కుమారుడు.
సిమియ యోశేఖు కుమారుడు.
యోశేఖు యోదా కుమారుడు.
27 యోదా యోహన్న కుమారుడు.
యోహన్న రేసా కుమారుడు,
రేసా జెరుబ్బాబేలు కుమారుడు.
జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు.
షయల్తీయేలు నేరి కుమారుడు,
28 నేరి మెల్కీ కుమారుడు,
మెల్కీ అద్ది కుమారుడు.
అద్ది కోసాము కుమారుడు,
కోసాము ఎల్మదాము కుమారుడు,
ఎల్మదాము ఏరు కుమారుడు,
29 ఏరు యెహోషువ కుమారుడు.
యెహోషువ ఎలీయెజెరు కుమారుడు.
ఎలీయెజెరు యోరీము కుమారుడు.
యోరీము మత్తతు కుమారుడు,
మత్తతు లేవి కుమారుడు.
30 లేవి షిమ్యోను కుమారుడు,
షిమ్యోను యూదా కుమారుడు,
యూదా యోసేపు కుమారుడు.
యోసేపు యోనాము కుమారుడు.
యోనాము ఎల్యాకీము కుమారుడు,
31 ఎల్యాకీము మెలెయా కుమారుడు.
మెలెయా మెన్నా కుమారుడు.
మెన్నా మత్తతా కుమారుడు.
మత్తతా నాతాను కుమారుడు.
నాతాను దావీదు కుమారుడు,
32 దావీదు యెష్షయి కుమారుడు,
యెష్షయి ఓబేదు కుమారుడు,
ఓబేదు బోయజు కుమారుడు,
బోయజు శల్మాను కుమారుడు,
శల్మాను నయస్సోను కుమారుడు,
33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు.
అమ్మీనాదాబు అరాము కుమారుడు.
అరాము ఎస్రోము కుమారుడు,
ఎస్రోము పెరెసు కుమారుడు,
పెరెసు యూదా కుమారుడు.
34 యూదా యాకోబు కుమారుడు,
యాకోబు ఇస్సాకు కుమారుడు,
ఇస్సాకు అబ్రాహాము కుమారుడు,
అబ్రాహాము తెరహు కుమారుడు,
తెరహు నాహోరు కుమారుడు,
35 నాహోరు సెరూగు కుమారుడు,
సెరూగు రయూ కుమారుడు,
రయూ పెలెగు కుమారుడు,
పెలెగు హెబెరు కుమారుడు,
హెబెరు షేలహు కుమారుడు,
36 షేలహు కేయినాను కుమారుడు,
కేయినాను అర్పక్షదు కుమారుడు,
అర్పక్షదు షేము కుమారుడు,
షేము నోవహు కుమారుడు,
నోవహు లెమెకు కుమారుడు,
37 లెమెకు మెతూషెల కుమారుడు,
మెతూషెల హనోకు కుమారుడు,
హనోకు యెరెదు కుమారుడు,
యెరెదు మహలలేలు కుమారుడు,
మహలలేలు కేయినాను కుమారుడు,
38 కేయినాను ఎనోషు కుమారుడు,
ఎనోషు షేతు కుమారుడు,
షేతు ఆదాము కుమారుడు,
ఆదాము దేవుని కుమారుడు.
ఎలీఫజుకు యోబు జవాబు
16 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను.
మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని ఆదరణకాదు.
3 మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు.
మీరెందుకు వాదము కొనసాగిస్తారు?
4 నా కష్టాలే మీకు ఉంటే ఇప్పుడు
మీరు చెబుతున్న మాటలు నేనూ చెప్పగలను.
మీకు విరోధంగా జ్ఞానం గల మాటలు చెప్పి,
మిమ్మల్ని చూచి నేను తల ఊపగలను.
5 కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను.
6 “అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా చేయలేదు.
కానీ నేను మాట్లాడకపోతే నాకు ఆదరణ లేదు.
7 నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు.
నా కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు.
8 నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు.
నా శరీరం రోగంతో ఉంది, నేను భయంకరంగా కనబడుతున్నాను.
దాని అర్థం నేను దోషిని అని ప్రజలు తలస్తున్నారు.
9 “దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు,
ఆయన నా మీద కోపంగా ఉండి నా శరీరాన్ని చీల్చి వేస్తున్నాడు.
దేవుడు నా మీద తన పళ్లు కొరుకుతున్నాడు.
నా శత్రువుల కళ్లు ద్వేషంతో చూస్తున్నవి.
10 మనుష్యులు నన్ను చూచి నవ్వుతారు.
వాళ్లంతా నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం మీద కొట్టడానికి సమ్మతిస్తారు.
11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు.
12 నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను.
కాని దేవుడు నన్ను చితుకగొట్టేశాడు.
అవును ఆయన నన్ను మెడపట్టి లాగి,
నన్ను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాడు.
గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు.
13 దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు.
నా మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతున్నాడు.
ఆయన దయ చూపించడు. ఆయన నా పైత్య రసాన్ని నేలమీద ఒలకబోస్తాడు.
14 మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు.
యుద్ధంలో సైనికునిలా ఆయన నా మీదకు పరుగెత్తుతాడు.
15 “నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను,
కనుక గోనెపట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను.
నేను ఇక్కడ దుమ్ములో, బూడిదలో కూర్చొని
ఓడిపోయినట్టుగా భావిస్తున్నాను.
16 ఏడ్చుట మూలంగా నా ముఖం ఎర్రబడింది.
ఛాయలు నా కళ్ల చుట్టూరా ఉంగరాల్లా ఉన్నాయి.
17 నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు.
నా ప్రార్థన నిర్మలమయినది.
18 “భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన చెడుగులను కప్పి పెట్టకు).
న్యాయం కోసం అరిచే నా అరుపులను (ప్రార్థనలను) ఆగిపోనీయకు.
19 ఇప్పుడు కూడ ్ర ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు.
20 నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు.
కాని నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
21 ఒక మనిషి తన స్నేహితుని కోసం బ్రతిమలాడినట్టుగా,
నా కోసం దేవునిని బ్రతిమలాడే ఒక మనిషి నాకు కావాలి.
22 “నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది.
17 “నా ఆత్మ భగ్నమై పోయింది.
విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం.
నా జీవితం దాదాపు గతించిపోయింది,
సమాధి నాకోసం నిరీక్షిస్తోంది.
2 మనుష్యులు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు.
వారు నన్ను ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను.
3 “దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు,
మరి ఎవ్వరూ నన్ను బలపరచరు.
4 నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు,
కనుక వారు నన్ను అర్థం చేసుకోరు.
దయచేసి వారిని జయించనీయకు.
5 ‘ఒకడు[a] తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు
అని ప్రజలు చెబుతారని నీకు తెలుసా?’
కాని ఇప్పుడు నా స్నేహితులే నాకు విరోధం అయ్యారు.
6 దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు.
ప్రజలు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు.
7 నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి.
నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది.
8 మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడుతున్నారు.
దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవరపడుతున్నారు.
9 కాని నీతిమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు.
నిర్దోషులు మరింత బలవంతులవుతారు.
10 “కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి.
మీలో ఎవరూ జ్ఞానం గలవారు కారు.
11 నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి.
నా ఆశ అడుగంటింది.
12 కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు.
చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు.
13 “నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం
అయితే, అంధకార సమాధిలో నేను నా పడక వేసుకొంటే
14 సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’
పురుగులను చూసి, ‘నా తల్లివి’ లేక ‘నా సోదరివి’ అని నేను చెప్పవచ్చు
15 కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు.
మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు.
16 (నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చనిపోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా?
మనమంతా చేరి బురదలోకి వెళ్తామా?”
క్రీస్తు యొక్క అపొస్తలులు
4 అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళుగా పరిగణించండి. 2 బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. 3 మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను. 4 నా మనస్సు నిర్మలమైనది. అంత మాత్రాన నేను నిర్దోషినికాను. ప్రభువు నాపై తీర్పు చెపుతాడు. 5 అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.
6 సోదరులారా! “లేఖనాల్లో వ్రాయబడినవాటిని అతిక్రమించకండి” అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని ద్వేషించకండి. 7 ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు?
8 ఇప్పటికే మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ధనవంతులైపొయ్యారు. మేము రాజులం కాకపోయినా, మీరు రాజులైపొయ్యారు. మీరు నిజంగా రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము మీతో సహా రాజులమౌతాము. 9 మరణ శిక్ష పొందిన నేరస్థుల్లాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని చివరన ఉంచాడు. లోకమంతటికీ, దేవదూతలకు, మానవులకు అపొస్తులమైన మేము ప్రదర్శనా వస్తువులయ్యాము. 10 క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం లభిస్తోంది. 11 ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధపడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలు అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు. 12 మేము మా చేతుల్తో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం. 13 అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.
14 మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటంలేదు. నా పుత్రులవలె ప్రేమించి హెచ్చరిస్తున్నాను. 15 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు తండ్రినయ్యాను. 16 కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. 17 ఈ కారణంగా నాకు ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీ దగ్గరకు పంపుతున్నాను. తిమోతి ప్రభువు ప్రేమించిన కుమారుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను.
18 నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు. 19 కాని ప్రభువు చిత్తమైతే నేను త్వరలోనే వస్తాను. గర్వంతో మాట్లాడుతున్నవాళ్ళు ఏమి చెయ్యకలుగుతారో చూస్తాను. 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు. అది శక్తితో కూడినది. 21 మీకేమి కావాలి? మిమ్మల్ని శిక్షించటానికి మీ దగ్గరకు రావాలా? లేక దయ, ప్రేమ చూపటానికి రావాలా?
© 1997 Bible League International