Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 78-79

ఆసాపు ధ్యాన గీతం.

78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
    నేను చెప్పే విషయాలు వినండి.
ఈ కథ మీతో చెబుతాను.
    ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
    మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
ఈ కథను మనము మరచిపోము.
    మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
    ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.
    దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
    మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.
    మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు.
    క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు.
కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.
    దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.
    వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే,
    అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు.
వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు.
    ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.

ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు[a] కలిగి ఉన్నారు.
    కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు.
10 వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపుకోలేదు.
    దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు.
11 ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు.
    ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు.
12 ఈజిప్టులోను, సోయను వద్దను
    దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.
13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు.
    వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.
14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
    ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.
15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు.
    భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు.
    అది ఒక నదిలా ఉంది.
17 కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు.
    అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు.
18 అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు.
    కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు.
19 వారు దేవునికి విరోధంగా మాట్లాడారు.
    “ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా?
20 దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది.
    తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు.
21 ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు.
    యాకోబు[b] మీద దేవునికి చాలా కోపం వచ్చింది.
ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది.
22     ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు.
దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు.
23-24 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు.
    వారికి ఆహారంగా ఆయన మన్నాను కురిపించాడు.
అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు
    ఆకాశంలోని ధాన్యాగారంనుండి ధాన్యం పోసినట్టు ఉంది.
25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.
    ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు.
వర్షం కురిసినట్లుగా పూరేళ్లు[c] వారిమీద వచ్చి పడ్డాయి.
    దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది.
    ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో
    ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.
    కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
30 వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు.
    అందుచేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు ఆ పూరేళ్లను తినివేసారు.
31 ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది. వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు.
    ఆరోగ్యవంతులైన అనేకమంది పడుచువాళ్లు చచ్చేటట్టుగా దేవుడు చేశాడు.
32 కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు.
    దేవుడు చేయగల ఆశ్చర్యకరమైన విషయాల మీద వారు ఆధారపడలేదు.
33 కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను
    ఏదో విపత్తుతో అంతం చేశాడు.
34 దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలినవారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు.
    వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు.
35 దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొన్నారు.
    సర్వోన్నతుడైన దేవుడే తమని రక్షించాడని వారు జ్ఞాపకం చేసుకొన్నారు.
36 వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు,
    కాని వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చెప్పారు.
37 వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు.
    వారు ఒడంబడికకు నమ్మకంగా లేరు.
38 కాని దేవుడు దయకలిగినవాడు.
    వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు.
అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు.
    దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు.
39 వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు.
    మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు.
40 అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు.
    ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.
41 ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు.
42 ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు.
    శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు.
43 ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు.
    సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు.
44 నదులను దేవుడు రక్తంగా మార్చాడు!
    ఈజిప్టువారు నీళ్లు త్రాగలేకపోయారు.
45 ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు.
    ఈజిప్టువారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు.
46 దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు.
    వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు.
47 ఈజిప్టువారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు.
    వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడుకొన్నాడు.
48 దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను
    వారి పశువులను పిడుగుల చేతను చంపేశాడు.
49 దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు.
    నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు.
50 దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు.
    ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు.
    వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.
51 ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు.
    హాము[d] సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు.
52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.
    ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.
    దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు.
    వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.
    తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.
    దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు.
    అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
56 కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.
    ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు.
    వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.
    దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.
    మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.
    ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు.
    దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.
    ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.
    పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
64 యాజకులు చంపివేయబడ్డారు.
    కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
65 త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,
    నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు.
66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.
    దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
67 కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.
    ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.
    మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.
    భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.
    దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,
    తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
    అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.

ఆసాపు స్తుతి కీర్తన.

79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
    ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
    యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
    అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
    మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
    మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
    బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
    నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
    వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
    త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
    నీవు మాకు ఎంతో అవసరం.
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
    నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
    నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
    అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
    నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
    దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
    ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
    మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
    దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International