Historical
తొలి పలుకు
1 దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. 2 యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. 3 ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడినవాటిని ఆచరించేవాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది.
శుభాకాంక్షలు
4 యోహాను నుండి,
ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు,
భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! 5 మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక!
ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. 6 మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.
7 చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు[a] కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.
8 భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును[b] నేనే” అని అన్నాడు.
9 నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10 ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11 అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.
12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా[c] ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
17 నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. 18 నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. 19 అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి. 20 నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
ఎఫెసులోని సంఘానికి
2 “ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ విధంగా అంటున్నాడు.
2 “నీవు చేసిన పనులు నాకు తెలుసు. నీవు పట్టుదలతో శ్రమించి పని చేసావు. నీవు దుష్టుల్ని సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులమని చెప్పుకొంటున్నవాళ్ళను నీవు పరీక్షించి వాళ్ళు మోసగాళ్ళని తెలుసుకొన్నావు. 3 నీవు పట్టుదలతో అలసిపోకుండా నా పేరిట కష్టాలు ఓర్చుకొన్నావు.
4 “కాని నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచిపోయావు. ఇది నాకు యిష్టము లేదు. 5 నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో. మారుమనస్సు పొందు. మొదట చేసిన విధంగా చేయి. నీవు మారుమనస్సు పొందకపోతే, నేను వచ్చి నీ దీపాన్ని దాని స్థలం నుండి తీసివేస్తాను. 6 నీకొలాయితులు[d] చేసే పనులు నీకు యిష్టం లేదు. నాకు కూడా యిష్టం లేదు. ఆ విషయంలో మనం ఏకీభవిస్తున్నాము.
7 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. గెలుపు సాధించినవానికి పరదైసులో ఉన్న జీవవృక్షం యొక్క ఫలం తినే అధికారం యిస్తాను.
స్ముర్నలోని సంఘానికి
8 “స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
9 “మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకొంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సాతాను సమాజానికి చెందినవాళ్ళు. 10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సాతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను.
11 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకొంటాడు.
పెర్గములోని సంఘానికి
12 “పెర్గములోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“రెండు వైపులా పదునైన కత్తిగలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
13 “సాతాను సింహాసనం ఎక్కడ ఉందో అక్కడే నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నీకు నా పేరంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతో నా విషయంలో అంతిప తన భక్తిని వ్యక్తపరిచిన కాలంలో కూడా నా పట్ల నీకున్న విశ్వాసాన్ని నీవు వదులుకోలేదు. సాతాను నివసించే పట్టణంలో అంతిప చంపబడ్డాడు.
14 “కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధలు[e] పఠించేవాళ్ళు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు[f] ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేసాడు. 15 నీకొలాయితులను అనుసరించేవాళ్ళు కూడా నీ దగ్గరున్నారు. 16 మారుమనస్సు పొందండి. అలా చేయకపోతే నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చి, నా నోటి నుండి బయలు వెడలు కత్తితో యుద్ధం చేస్తాను.
17 “ఆత్మ క్రీస్తు సంఘాలకు చెప్పిన వాటిని ప్రతివాడు వినాలి.
“విజయం సాధించిన వానికి నేను దాచి ఉంచిన ‘మన్నా’ను[g] తినుటకు యిస్తాను. ఒక తెల్ల రాయి మీద ఒక క్రొత్త పేరు వ్రాసి దాన్ని కూడా అతనికి యిస్తాను. నేను ఆ రాయి ఎవరికి యిస్తానో అతనికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.
తుయతైరలోని సంఘానికి
18 “తుయతైరలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“అగ్ని జ్వాలల్లా మండుతున్న కళ్ళు కలవాడు, కొలిమిలో కాల్చి మెరుగు పెట్టబడిన యిత్తడిలా పాదాలు కలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
19 “నీవు చేస్తున్న పనులు, నీ ప్రేమ, విశ్వాసము, సేవ, పట్టుదల నాకు తెలుసు. నీవు మొదట చేసినదానికన్నా, యిప్పుడు ఎక్కువ చేస్తున్నావని నాకు తెలుసు. 20 తానొక ప్రవక్తనని చెప్పుకొంటున్న యెజెబెలు చేస్తున్న పనుల్ని నీవు సహిస్తున్నావు. ఇది నాకు యిష్టం లేదు. ఆ స్త్రీ తన బోధలతో నా సేవకులను తప్పు దారి పట్టిస్తోంది. దాని కారణంగా వాళ్ళు నీతి లేని కామ కృత్యాలు చేస్తున్నారు. విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తింటున్నారు.[h] 21 అది చేసిన అవినీతికి మారుమనస్సు పొందమని నేను దానికి కొంత గడువునిచ్చాను. కాని అది దానికి అంగీకరించలేదు.
22 “అందువల్ల దానికి కష్టాలు కలిగిస్తాను. అవినీతిగా దానితో కామకృత్యాలు చేసినవాళ్ళు తమ పాపానికి మారుమనస్సు పొందకపోతే, వాళ్ళను తీవ్రంగా శిక్షిస్తాను. 23 దాని బిడ్డల్ని చంపివేస్తాను. అప్పుడు హృదయాల్ని, బుద్ధుల్ని శోధించేవాణ్ణి నేనేనని అన్ని సంఘాలు తెలుసుకొంటాయి. చేసిన కార్యాలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం యిస్తాను.
24 “తుయతైరలో ఉన్న మిగతా ప్రజలకు, అంటే, దాని బోధల్ని ఆచరించని వాళ్ళకు, మరియు సాతాను రహస్యాలను అభ్యసించని వాళ్ళకు నేను చెప్పేదేమిటంటే, నేను మీ మీద మరే భారము వెయ్యను. 25 నేను వచ్చేదాకా మీరు అనుసరిస్తున్న వాటినే అనుసరిస్తూ ఉండండి.
26 “విజయాన్ని సాధించి నా ఇచ్ఛానుసారం చివరిదాకా ఉన్నవానికి నేను జనములపై అధికారం యిస్తాను. 27 అతడు వాళ్ళను కఠిన శాసనాలతో పాలిస్తాడు. వాళ్ళను కుండల్ని పగులకొట్టినట్లు పగులగొడ్తాడు.[i]
28 “ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువచుక్కను కూడా యిస్తాను. 29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.
సార్దీసులోని సంఘానికి
3 “సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
“నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. 2 నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. 3 నీకు లభించినదాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు.
4 “మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. 5 విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. 6 సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి.
ఫిలదెల్ఫియలోని సంఘానికి
7 “ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు.(A) ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.
8 “నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. 9 సాతాను మందిరానికి చెందినవాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనేవాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్నవాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.
11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి.
లవొదికయలోని సంఘానికి
14 “లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఈ విషయాలకు ఆమేన్[j] అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు.
15 “నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. 16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను. 17 ‘నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు’ అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 18 నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. అప్పుడు చూడగల్గుతావు.
19 “నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితితో ఉండి పశ్చాత్తాపం చెందు. 20 ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు.
21 “నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. 22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.”
యోహాను పరలోకాన్ని చూడటం
4 ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. 2 నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. 3 దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.
4 దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. 5 సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. 6 గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది.
సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. 7 మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.[k] 8 ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక:
“భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును
ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు”
అని పాడుతూ ఉన్నాయి.
9 సింహాసనంపై కూర్చొన్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి,
11 “మా ప్రభూ! దైవమా!
నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు,
నీవు అన్నిటినీ సృష్టించావు.
అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి”
అని అన్నారు.
గ్రంథము, గొఱ్ఱెపిల్ల
5 ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి. 2 శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను. 3 పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. 4 ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. 5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు.
6 అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే. 7 ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతినుండి ఆ గ్రంథాన్ని తీసుకొన్నాడు. 8 ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు జీవులు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు, ఆ గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. 9 వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు:
“నీవు వధింపబడినందుకు ప్రతి జాతినుండి ప్రతి భాషనుండి,
ప్రతి దేశంనుండి,
ప్రతి గుంపునుండి,
నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు.
కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు.
10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకులుగా నియమించావు.
వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు.”
11 ఆ తర్వాత చూస్తే నాకు చాలమంది దేవదూతల స్వరం వినిపించింది. వాళ్ళ సంఖ్య కోట్లకొలదిగా ఉంది. వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల చుట్టూ గుమికూడి ఉన్నారు. 12 వాళ్ళు బిగ్గరగా,
“శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌరవాన్ని,
మహిమను, స్తుతిని పొందటానికి వధింపబడిన గొఱ్ఱెపిల్ల యోగ్యమైనవాడు”
అని పాడారు.
13 ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతాళంలో, సముద్రం మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ విధంగా పాడటం విన్నాను:
“సింహాసనంపై కూర్చున్న వానికి, గొఱ్ఱెపిల్లకు చిరకాలం స్తుతి,
గౌరవము, మహిమ, శక్తి కల్గుగాక!”
14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని అన్నాయి. పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు.
© 1997 Bible League International