Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
దానియేలు 5-6

గోడమీది వ్రాత

రాజైన బెల్షస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు. బెల్షస్సరు ద్రాక్షామద్యం త్రాగుతుండగా తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంనుంచి తీసుకువచ్చిన బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకులకు ఆజ్ఞాపించాడు. బెల్షస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు. కనుక యెరూషలేము ఆలయంనుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు. త్రాగుచూ వారు బంగారం, వెండి, కంచు, ఇనుము, కర్ర, రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.

అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడి, గోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు.

రాజైన బెల్షస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం పాలిపోయింది. మోకాళ్ళు వణకుతు ఒకదానితో ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంకాగా, అతడు నిలబడలేక పోయాడు. అప్పుడు ఇంద్రజాలికుల్ని, కల్దీయుల్ని, తన సమక్షానికి తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీది ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహూకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు.

అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు. బెల్షస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్లబోయింది.

10 విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజుయొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్థిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు. 11 నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల[a] ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేకవంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్రజాలికులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు. 12 నేను మాటలాడుతున్న వ్యక్తి పేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్థాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది.

13 అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా? 14 నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను. 15 వివేకవంతుల్నీ, ఇంద్రజాలికుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుపలేకపోయారు. 16 నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.

17 తర్వాత దానియేలు రాజుతో, “బెల్షస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకో. లేకపోతే, ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.

18 “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తివంతుడైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు. 19 పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడేవారు. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింపజేయ తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. ఏ మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచుకుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.

20 “కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయ్యానాడు, మొండివాడయ్యాడు. అందువల్ల అతనినుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది. 21 అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవి గాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చుకొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించువాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించగలడని తెలుసుకొన్నాడు.

22 “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు, 23 అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు. 24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు. 25 ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి:

మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.

26 “ఈ మాటలకు అర్థం ఇది:

మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.

27 టెకేల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.

28 ఉఫార్సీన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసివేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”

29 తర్వాత బెల్షస్సరు ఊదారంగు బట్టలు దానియేలుకు ధరింపచేసేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు. 30 ఆ రాత్రే బబులోను రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు. 31 దర్యావేషు అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు.

సింహాల బోనులో దానియేలు

తన రాజ్యం అంతటినీ పరిపాలించేందుకు నూట ఇరవైమంది రాజ్యాధికారులను ఎంపిక చేయాలని దర్యావేషు తలంచాడు. అది మంచి ఆలోచన అనుకొన్నాడు. మరియు ఆ నూట ఇరవైమంది రాజ్యాధికారుల మీద ఆధిపత్యం గలవారుగా ముగ్గురిని ఎంపిక చేసాడు. ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ఒకడు. ఎవ్వరూ తనను మోసగించ కూడదని ఆ ముగ్గురిపైన, మరి ఆ నూట ఇరవైమంది పైన దానియేల్ని అధికారిగా ఎంపిక చేశాడు. అందువల్ల తన రాజ్యంలో ఏమీ తాను నష్టపడేది ఉండదు. రాజు దానియేలును మెచ్చుకొన్నాడు. తన మంచి ప్రవర్తన వల్లను, తన సామర్థ్యం వల్లను దానియేలుకు రాజు అలా చేయగలిగాడు. రాజు దానియేలు వశుడయ్యాడు. రాజ్యమంతటికీ దానియేలును పరిపాలకునిగా చెయ్యాలని తలంచాడు. కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యాధికారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొనలేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజును మోసగించలేదు. కష్టించి పని చేసాడు.

చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు.

అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి. ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసివేయబడతాడు. రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి, ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు. అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి, కాగితంపై సంతకం పెట్టాడు.

10 దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.

11 అప్పుడు ఆ మనుష్యులు ఒక బృందంగా వెళ్లి, దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సహాయం కోరుతున్నట్లు వారు కనుగొన్నారు. అందువల్ల వారు బృందంగా రాజు వద్దకు వెళ్లి, రాజు చేసిన చట్టం గురించి అతనితో మాట్లాడారు. 12 వారు, “దర్యావేషు రాజా, మీరొక చట్టం జారీ చేశారు. దాని ప్రకారం వచ్చే ముఫ్పై రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని కాక ఇతర దేవుణ్ణి గాని వ్యక్తిని గాని ప్రార్థించినట్లయితే, అతను సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు. ఆ చట్టం మీద నీవు సంతకం చేశావు. అవును గదా” అని జ్ఞాపకం చేశారు.

“అవును, నేను ఆ చట్టం మీద సంతకం చేసి మాదీయుల, పారసీకుల చట్టాలు రద్దు చేయరానివి లేక మార్చరానివి” అని ప్రకటించానని రాజు బదులు చెప్పాడు.

13 అప్పుడు ఆ మనుష్యులు రాజుతో, “యూదానుంచి తీసుకొని రాబడిన బందీలలో దానియేలు అనబడే ఆ వ్యక్తి మీ మాటలపట్ల శ్రద్ధ వహించ లేదు. మీరు చేసిన చట్టాన్ని పాటించ లేదు. ప్రతిరోజూ అతనింకా మూడుసార్లు తన దేవుని స్తుతిస్తున్నాడు” అని చెప్పారు.

14 ఇది వినగానే రాజు చాలా విచారించి, దానియేలును రక్షించడానికి నిశ్చయించాడు. దానియేలును కాపాడేందుకు సూర్యాస్తమయం వరకు ఒక ఉపాయం కోసం రాజు ప్రయత్నించాడు, కాని ప్రయోజనం లేకపోయింది. 15 తర్వాత ఆ మనుష్యులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు, రద్దు చేయుటకు వీలులేదు” అని వారు చెప్పారు.

16 అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొనివచ్చి, సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నాను.” 17 ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు. 18 తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని ఆదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు.

19 ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. 20 రాజు చింతాక్రాంతుడుగా సింహాల గుహవద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు దేవుని సేవకుడవైన దానియేలూ, నీవెప్పుడూ ఆరాధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడగలిగెనా?”

21 “రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి! 22 నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూతను పంపి, సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాలు నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు” అని దానియేలు బదులు చెప్పాడు.

23 దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దానియేలును పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరగలేదు.

24 తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపడానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని విరుగగొట్టాయి.

25 తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు మాట్లాడే మనుష్యులకందరికీ రాజైన దర్యావేషు ఈ క్రింది లేఖను వ్రాశాడు:

అందరికి శుభమగు గాక!

26 నేనిప్పుడు క్రొత్త చట్టం చేస్తున్నాను. నా రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తిస్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి భయపడి వణకాలి.

దానియేలు దేవుడే సజీవుడు.
    ఆయన ఎప్పుడూ జీవిస్తాడు.
ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు,
    ఆయన పరిపాలన అంతం కాదు.
27 దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు.
    ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోకమందునూ, భూమి మీదనూ చేస్తాడు.
దేవుడు దానియేలును సింహాలనుండి రక్షించాడు.

28 అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనూ, పారశీకుడైన కోరెషు రాజుగావున్న కాలంలోనూ దానియేలు అభివృద్ధి చెందాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International