Historical
సహాయం చేయమని ఎస్తేరుకు మొర్దెకై నచ్చచెప్పటం
4 మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాద సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు. 2 కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు. 3 రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు.
4-5 ఎస్తేరు పరిచారికలు, నపుంసకులు ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెకి మొర్దెకై గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్రస్తి అయింది. విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మొర్దెకైకి పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించాడు. హతాకు అనే నపుంసకుడు ఎస్తేరు ప్రధాన సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు పోయి అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం ఏమిటో కనుక్కోమని పంపింది. 6 రాజభవన ద్వారం ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్దెకైని హతాకు పోయి కలిశాడు. 7 అప్పుడు మొర్దెకై తన విషయంలో జరిగినదంతా హతాకుకి వివరించి చెప్పాడు. యూదులను హతమార్చేందుకు గాను రాజు గారి బొక్కసంలో సరిగ్గా ఎంత మొత్తం సొమ్ము జమ చేస్తానని హామాను వాగ్దానం చేశాడో చెప్పాడు. 8 యూదులను చంపేయాలన్న మహారాజు ఆజ్ఞ ప్రతిని కూడా మొర్దెకై హతాకుకి ఇచ్చాడు. ఆ తాఖీదు షూషను నగరమంతటా ఎలా చాటబడిందో చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎస్తేరుకి చూపించమనీ, విషయాలన్నీ వివరించి చెప్పమనీ, మహారాజు దగ్గరికి పోయి, మొర్దెకైకీ, తన స్వజనానికీ, క్షమాభిక్షను అర్థించేలా ఎస్తేరును ప్రోత్సహించమనీ అతను హతాకుకి చెప్పాడు.
9 హతాకు రాణివాసానికి తిరిగి వెళ్లి, మొర్దెకై తనకి చెప్పిన విషయాలన్నీ ఎస్తేరుకి చెప్పాడు.
10 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది మాటలు చెప్పమని హతాకును ఆజ్ఞాపించింది: 11 “మహారాజు పిలువ నంపితేగాని స్త్రీగాని, పురుషుడుగాని మహారాజు సన్నిధికి వెళ్లడం నిషిద్ధం. అలా వెళ్లే వ్యక్తి మరణ శిక్షకి గురి అవుతాడు. మహారాజు సామంతులందరికీ, ఆయా సామంత దేశాల ప్రజలందరికీ యీ విషయం తెలుసు. ఆ వ్యక్తిని మహారాజు తన బంగారపు దండంతో అంటినప్పుడు మాత్రమే ఆ మరణ శిక్ష అమలు జరపబడదు. మహారాజు అలా చేస్తే, ఆ వ్యక్తి ప్రాణం నిలుస్తుంది. 30 రోజులుగా మహారాజు నన్ను పిలువనంపలేదు. మరి నేనెలా వెళ్లాలి?”
12-13 అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు. 14 ఒకవేళ నువ్విప్పుడు మౌనం వహిస్తే యూదులకు స్వేచ్ఛా సహాయాలు మరొక చోటునుంచి వస్తాయి. కాని నువ్వూ, నీ తండ్రి కుటుంబ సభ్యులూ అందరూ మరణిస్తారు. బహుశా నువ్వీ మహాత్కార్యం కోసమే మహారాణిగా ఈ సమయంలో ఎంచుకోబడ్డావేమో ఆలోచించుకో.”
15-16 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది సమాధానం పంపింది: “మొర్దెకై! పోయి షూషను నగరంలోని యూదులందర్నీ కూడగట్టు, నా కోసం ఉపవాసం ఉండండి. నేను మూడు రాత్రులూ, పగళ్లూ అన్నపానాలు విసర్జిస్తాను. నేను నీలాగే ఉపవాసముంటాను. అలాగే, నా పరిచారికలు కూడా ఉపవాసం ఉంటారు. మా ఉపవాస దినాలు ముగిశాక, నేను మహారాజు సన్నిధికి వెళ్తాను, ఆయన నన్ను పిలువనంపక పోయినా సరే, వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు సమక్షానికి వెళ్లడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అయినా సరే, నేను వెళ్తాను. నేను చనిపోతే చనిపోతాను.”
17 మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్యమన్నట్లు చేశాడు.
మహారాజుతో ఎస్తేరు మాటలాడుట
5 మూడవ రోజున ఎస్తేరు ప్రత్యేకమైన దుస్తులు ధరించి, రాజ నగరులోని, రాజభవనమెదుటవున్న లోపలి భవనములో నిలిచింది. మహారాజు అక్కడ సింహాసనం మీద కూర్చుని వున్నాడు. అతను న్యాయస్థానంలోకి జనం ప్రవేశించే దిశగా చూపు తిప్పి కూర్చున్నాడు. 2 అప్పుడు అతని దృష్టి లోపలి ఆవరణలో నిలిచివున్న ఎస్తేరుపై పడింది. ఆమెను అక్కడ చూచినంతనే మహారాజు మనస్సు సంతోష భరితమైంది. ఆయన తన చేతిలోని బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు రాజు దర్బారు మందిరంలోకి పోయి బంగారు దండపు కొనని తాకింది.
3 అప్పుడు మహారాజు ఎస్తేరుతో ఇలా అన్నాడు: “మహారాణి, ఏమిటి నీ దిగులు? నువ్వు నన్ను కోరాలనుకున్నదేమిటో కోరుకో, నువ్వేమి కోరుకున్నా, అర్ధ రాజ్యమైనా ఇచ్చేస్తాను.”
4 ఎస్తేరు, “నేను తమకీ, హామానుకీ ఒక విందు ఏర్పాటు చేశాను. దయచేసి మీరూ, హామానూ యీ రోజు నా విందుకి రావాలని నా కోరిక” అని అడిగింది.
5 అప్పుడు మహారాజు సేవకులకు, “మహారాణి ఎస్తేరు కోర్కెను మేము తీర్చాలి. వెంటనే పోయి, హామానును తొందరగా తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు.
ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి మహారాజూ, హామానూ వెళ్లారు. 6 వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూండగా, మహారాజు ఎస్తేరును మళ్లీ ఇలా అడిగాడు: “ఎస్తేరూ, నువ్వేదైనా కోరుకో. అర్ధ రాజ్యమైనా సరే కోరుకో, నేను నీకిస్తాను.”
7 అందుకు ఎస్తేరిలా సమాధానమిచ్చింది, “నేను మిమ్మల్ని కోరదలుచుకున్నది యిదీ మహారాజా! 8 తమరికి నా మనవి అంగీకారమై, నేను కోరినది ఇవ్వాల నుకుంటే, రేపు నేనివ్వబోయే మరో విందుకి మీరూ, హామానూ తప్పక వేంచేయాలి. నా అసలు మనవి ఏమిటో నేను అప్పుడు విన్నవించుకుంటాను.”
మొర్దెకై పట్ల హామాను కోపం
9 హామాను ఆ రోజున రాజభవనం నుంచి ఇంటికి మంచి హుషారుగా, మహానందంగా వెళ్లాడు. కాని, రాజ భవన ద్వారం దగ్గర మరల కనబడిన మొర్దెకై తనని చూసి కూడా లేచి, భయభక్తులతో తనకి నమస్కరించక పోయేసరికి హామానుకు తల కొట్టేసినట్లయింది. అతని కోపం మిన్నుముట్టింది. 10 అయినా, హామాను తన కోపాన్ని అదుపు చేసుకొని, ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ తన మిత్రులనూ, తన భార్య జెరెషునూ పిలిచి కూర్చోబెట్టి, 11 తన ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పడం మొదలెట్టాడు. తనకి చాలా మంది కొడుకులున్నారనీ, మహారాజు తనని ఎన్నో విధాల గౌరవించాడనీ, మిగిలిన నాయకులందరికంటె మహారాజు తనకి ఉన్నత స్థానమిచ్చాడనీ, చెప్పుకున్నాడు. 12 హామాను యింకా ఇలా అన్నాడు, “అంతే ననుకున్నారేమో, కాదు.” “ఎస్తేరు మహారాణి తను యిచ్చిన విందుకి మహారాజుతోబాటు నన్నొక్కడినే ఆహ్వానించింది. రేపు తను యివ్వబోయే మరో విందుకి కూడా మహారాజుతోబాటు నన్ను కూడా మహారాణి ఆహ్వానించింది. 13 అయినా నాకివన్నీ ఏమంత పెద్దగా ఆనందం కలిగించే విషయాలు కావు. ఆ యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చొని ఉండటం ఎప్పటి వరకు నేను చూస్తూ ఉంటానో, అప్పటివరకు నేను నిజంగా సంతోషించలేను.”
14 అప్పుడు హామాను భార్య జెరెషూ, అతని మిత్రులందరూ ఇలా సలహా యిచ్చారు: “మొర్దెకైని ఉరితీసేందుకుగాను ఒక స్తంభం పాతమని ఎవరినైనా పురమాయించు! ఆ ఉరికొయ్య 75 అడుగుల పొడుగు వుండాలి! ఇంకేముంది, రేపు ఉదయం మహారాజుతో ఆ ఉరికొయ్య మీద ఆ యూదుని ఉరితీయించమని చెప్పు. మహారాజుతో కలిసి విందుకి వెళ్లు. అప్పుడిక చూసుకో, నీ ఆనందానికి మేరవుండదు.”
హామానుకి ఆ సలహా నచ్చింది. వెంటనే అతను ఉరి కంబం సిద్ధం చేయమని ఒకణ్ణి ఆజ్ఞాపించాడు.
మొర్దెకైకి గౌరవ సత్కారాలు
6 సరిగ్గా ఆ రాత్రి మహారాజుకి నిద్రపట్టలేదు. అందుకని రాజవంశ చరిత్ర గ్రంథాన్ని తెచ్చి తనకి చదివి వినిపించమని ఒక ఉద్యోగికి పురమాయించాడు. (ఆ చరిత్ర గ్రంథంలో ఒక్కొక్క రాజు పరిపాలన కాలంలో సంభవించిన ప్రతి సంఘటనా నమోదు చెయ్యబడుతుంది.) 2 ఆ ఉద్యోగి మహారాజుకి ఆ గ్రంథం చదివి వినిపించాడు. అహష్వేరోషు మహారాజును హత్య చేసేందుకు బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వారపాలకులు చేస్తున్న కుట్ర గురించి మొర్దెకై పసిగట్టి, ఆ సమాచారాన్ని ఎపరికో తెలియజెయ్యడం గురించి ఆ ఉద్యోగి చదివాడు.
3 అప్పుడు మహారాజు, “ఇందుకు ప్రతిఫలంగా ఆ మొర్దెకైకి ఎలాంటి ఆదర సత్కారాలు జరిగాయి?” అని ప్రశ్నించాడు.
“మొర్దెకైకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు.
4 హామాను సరిగ్గా అప్పుడే రాజభవనపు వెలుపటి ఆవరణలో ప్రవేశించాడు. తను నాటింపజేసిన ఉరి కంబం మీద మొర్దెకైని ఉరితీయించేందుకు మహారాజు అనుమతిని కోరేందుకే అతను వచ్చాడు. అతని అడుగుల చప్పుడు మహారాజు విన్నాడు. “ఆవరణ లోపలికి వచ్చింది ఎవరు?” అన్న మహారాజు ప్రశ్నకి 5 రాజోద్యోగులు “హామాను ఆవరణలో వేచివున్నాడు మహారాజా” అని సమాధానమిచ్చారు.
మహారాజు, “అతన్ని లోపలికి తీసుకురండి” అని ఆదేశించాడు.
6 హామాను లోపలికి వచ్చాక మహారాజు అతన్ని, “మహారాజు ఎవరికైనా గౌరవ సత్కారాలు చెయ్యాలంటే, ఏం చెయ్యాలి హామానూ” అని ప్రశ్నించాడు.
హామాను తనలో తను, “మహారాజు నన్ను కాక మరెవరిని సత్కరించాలని అనుకుంటారు? మహారాజు అంటున్నది నిస్సందేహంగా నన్ను సత్కరించాలనే అయివుంటుంది.” అని తర్కించుకున్నాడు.
7 దానితో హమాను మహారాజుకి ఇలా సమాధాన మిచ్చాడు: “మహారాజు గౌరవించాలనుకున్న వ్యక్తి విషయంలో యిలా చెయ్యాలి. 8 మహారాజు స్వయంగా ధరించిన రాజవస్త్రాలను సేవకులచేత తెప్పించాలి. మహారాజు స్వారీచేసిన ఒక గుర్రాన్ని కూడా తెప్పించాలి. సేవకులచేత ఆ గుర్రం ముఖాన తురాయివంటి ప్రత్యేకమైన ఒక గుర్తు వేయించాలి. 9 తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని, ఆ గుర్రాన్నీ ఒక ప్రముఖ ఉద్యోగి వద్ద వుంచాలి. అప్పుడు మహారాజు సత్కరించాలనుకున్న ఆ వ్యక్తిని ఆ ముఖ్య అధికారి గుర్రం మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో ఊరేగిస్తూ, ‘ఈయనకి మహారాజు చేస్తున్న సన్మానం ఇది’ అంటూ చాటాలి.”
10 అప్పుడు మహారాజు హామానుకి ఇలా ఆజ్ఞాశించాడు: “వెన్వెంటనే పోయి, పట్టు వస్త్రాలూ గుర్రము తీసుకువచ్చి. భవనద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైకి నువ్వు చెప్పిన సత్కార కార్యక్రమమంతా అమలు జరుపుము.”
11 హామాను పోయి పట్టు వస్త్రమూ, గుర్రమూ తెచ్చాడు. ఆ వస్త్రాన్ని మొర్దెకైకి కప్పి, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ మొర్దెకైని నగర వీధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్కరించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని చాటాడు.
12 అటు తర్వాత మొర్దెకై రాజభవన ద్వారం దగ్గరికి తిరిగి వెళ్లాడు. కాని, హామాను సిగ్గుతో తల్లడిల్లుతూ హడావిడిగా ఇంటికి వెళ్లిపోయాడు. 13 తన భార్య జెరెషుకీ, తన మిత్రులందరికీ తనకి జరిగిన పరాభవ మంతటిని గురించి వివరంగా చెప్పాడు. హామాను భార్య, అతనికి ఇంతకు ముందు సలహా ఇచ్చిన మిత్రులూ అతనితో ఇలా అన్నారు: “మొర్దెకై యూదుడే అయితే, నీవు జయం పొందడం అసాధ్యం. నీ పతనం యిప్పటికే ప్రారంభమైంది. నీ నాశనం తథ్యం!”
14 హామానుతో వాళ్లింకా మాట్లాడుతూనే పున్నారు. అంతలోనే మహారాజుగారి నపుంసకులు హామాను ఇంటికి వచ్చారు. వాళ్లు హామానుని ఎస్తేరు సన్నద్ధం చేసిన విందుకి వెళ్లేందుకు తొందరచేశారు.
© 1997 Bible League International