Historical
దేవాలయం వద్ద జరిగిన పాప క్రియలు
8 ఒకరోజు నేను (యెహెజ్కేలు) నా ఇంటిలో కూర్చొని ఉన్నాను. యూదా పెద్దలు నా ముందు కూర్చున్నారు. ఇది చెరబట్టబడిన కాలంలో ఆరవ సంవత్సరం, ఆరవ నెల (సెప్టెంబరు) ఐదవ రోజున జరిగింది. నా ప్రభువైన యెహోవా శక్తి అకస్మాత్తుగా నామీదికి వచ్చింది. 2 అగ్నివంటి రూపాన్నొకటి నేను చూశాను. అది మానవ శరీరంలా ఉంది. నడుము నుండి క్రిందికి అది అగ్నిలా కన్పించింది. నడుము నుండి పైకి ఆ ఆకారం దేదీప్యమానంగా వెలుగొందుతూ, అగ్నిలో కర్రుకాలిన లోహంలా ఉంది. 3 పిమ్మట చెయ్యివంటిదొకటి నేను చూశాను. ఆ చెయ్యి నా మీదికి వచ్చి నా తలపై జుట్టుపట్టుకుంది. పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపింది. ఆ దేవదర్శనంలో ఆయన నన్ను యెరూషలేముకు తీసుకొని వెళ్లాడు. ఆయన నన్ను లోపలి ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. అది నగరానికి ఉత్తర దిశన ఉంది. ఆ ద్వారం దగ్గరే దేవుడు అసూయపడేలా చేసిన విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. 4 కాని ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది. ఆ మహిమ నేను కెబారు కాలువ వద్ద లోయలో చూసిన దర్శనంలా ఉంది.
5 దేవుడు నాతో మాట్లాడుతూ, “నరపుత్రుడా, ఉత్తర దిశవైపు చూడు!” అన్నాడు. నేను ఉత్తరానికి చూశాను. అక్కడ బలిపీఠం వద్దగల ద్వారానికి ఉత్తరంగా దేవుడు అసూయ పడునట్లు చేసిన విగ్రహం ఉంది.
6 మళ్లీ దేవుడు నాకు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారో నీవు చూస్తున్నావా? వారు దానిని ఖచ్చితంగా నా ఆలయం ప్రక్కనే నెలకొల్పారు! నీవు నాతో వస్తే, ఇంకా భయంకరమైన విషయాలు చూస్తావు!”
7 అందువల్ల నేను ఆవరణద్వారం వద్దకు వెళ్లాను. గోడలో ఒక రంధ్రాన్ని చూశాను. 8 దేవుడు నాతో, “నరపుత్రుడా, గోడలో ఒక రంధ్రం చెయ్యి” అని చెప్పాడు. కాబట్టి నేను ఆ తలుపులో ఒక రంధ్రాన్ని చేశాను. లోపల ఒక తలుపు కన్పించింది.
9 అప్పుడు దేవుడు నాతో, “లోనికి వెళ్లి ఇక్కడ ప్రజలు చేస్తున్న భయంకరమైన, దుష్టమైన పనులను చూడు” అని అన్నాడు. 10 నేను లోనికి వెళ్లి చూశాను. అక్కడ మీరు ఊహించటానికే అసహ్యకరమైన పాముల, బల్లుల, క్రిమికీటకాదుల, ఇతర జంతువుల ప్రతిమలు, శిల్పాలు ఉన్నాయి. అవన్నీ ఇశ్రాయేలీయులు ఆరాధించే హేయమైన విగ్రహాలు. ఆ జంతువుల బొమ్మలు అన్ని గోడల మీదా చుట్టూ చెక్కబడి ఉన్నాయి!
11 అక్కడ షాఫాము[a] కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది. 12 అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో ఏమి చేస్తున్నారో నీవు చూశావా? ప్రతి ఒక్కడూ తన బూటకపు దేవునికి ఒక గది కలిగి ఉన్నాడు! ‘మనల్ని యెహోవా చూడలేడు. యెహోవా ఈ దేశాన్ని వదిలేశాడు’ అని వారిలో వారనుకుంటున్నారు.” 13 దేవుడు మళ్లీ, “నీవు నాతో వస్తే, ఆ మనుష్యులు మరీ భయంకరమైన పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు.
14 దేవుడు నన్ను ఆలయ ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. ఈ ద్వారం ఉత్తరపు దిక్కున ఉంది. అక్కడ స్త్రీలు కూర్చుని, ఏడ్వటం చూశాను. వారంతా బూటకపు దైవము తమ్మూజును[b] గురించి దుఃఖిస్తున్నారు!
15 దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ భయంకరమైన విషయాలు గమనించావా? నా వెంట రమ్ము. నీవింతకంటే ఘోరమైన విషయాలు చూస్తావు!” 16 ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది క్రిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు!
17 అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, ఇది చూశావు గదా! యూదా ప్రజలు ఈ నా ఆలయాన్ని అతి సామాన్యమైనదిగా భావిస్తూ, ఆలయంలోనే వారు చెడు పనులు కొనసాగిస్తున్నారు.! ఈ దేశమంతా దౌర్జన్యంతో నిండిపోయింది. వారు నిరంతరం చెడుకార్యాలు చేస్తూ నాకు పిచ్చి పట్టిస్తున్నారు. చూడు, ఒక బూటకపు దేవతలా చంద్రుని ఆరాధించటానికి వారు ముక్కులకు ఉంగరాలు[c] పెట్టుకుంటున్నారు. 18 వారికి నా కోపం చూపిస్తాను! వారిపట్ల ఏమాత్రం కనికరం చూపించను! వారిని గురించి నేను విచారించను! వారు ప్రాధేయపడి నన్ను పిలుస్తారు. కాని వారి అభ్యర్థనను నేను వినను!”
దేవుని సందేశకులు యెరూషలేమును శిక్షించుట
9 పిమ్మట దేవుడు నగరాన్ని శిక్షించటానికి నియమితులైన నాయకులను పిలిచాడు. ప్రతి నాయకుడూ తన చేతిలో ఒక విధ్వంసకర ఆయుధం కలిగి ఉన్నాడు. 2 పై ద్వారం నుంచి ఆరుగురు మనుష్యులు బాటవెంట నడచి రావటం చూశాను. ఈ ద్వారం ఉత్తర దిశన ఉంది. ప్రతి ఒక్కడూ తన చేతిలో ఒక మారణాయుధాన్ని కలిగియున్నాడు. వారిలో ఒకడు నార బట్టలు[d] ధరించాడు. అతని నడుముకు లేఖకుని కలం, సిరాబుడ్డి[e] వేలాడకట్టుకున్నాడు. ఈ మనుష్యులు ఆలయంలో కంచు పీఠం వద్దకు వెళ్లి, అక్కడ నిలబడ్డారు. 3 అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి అతను ఎక్కడకు వెళ్లాడో అక్కడకి వచ్చింది. ఆ తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు పిలిచింది.
4 పిమ్మట యెహోవా (మహిమ) అతనితో, “యెరూషలేము నగరం గుండా వెళ్లు. ఈ నగరంలో ప్రజలు చేస్తున్న భయంకరమైన పనులన్నిటికీ కలత చెంది, విచారిస్తున్న వారి ఒక్కొక్కరి నుదుటి మీద ఒక గుర్తు పెట్టు” అని చెప్పాడు.
5-6 మళ్లీ దేవుడు ఇతర ఐదుగురు మనుష్యులతో, “మీరు ఆ మొదటి వ్యక్తిని అనుసరించి వెళ్లవలసిందిగా మిమ్ముల్ని కోరుతున్నాను. నుదుటి మీద గుర్తులేని ప్రతివానిని మీరు చంపివేయండి. వారు పెద్దలేగాని, పిన్నలేగాని, యువతులేగాని, పిల్లలేగాని, తల్లులేగాని ఎవరైనా లెక్కచేయవద్దు. మీ ఆయుధాన్ని వినియోగించి నుదుటిపై గుర్తులేని ప్రతివానిని చంపివేయండి. ఏ మాత్రం దయాదాక్షిణ్యం చూపవద్దు. ఎవ్వరిపట్లా జాలిపడవద్దు! ఈ నా ఆలయం వద్దనే మొదలు పెట్టండి” అని చెప్పాడు. ఆలయం ముందు ఉన్న పెద్దలతోనే వారు మొదలు పెట్టారు.
7 ఆ మనుష్యులతో దేవుడు ఇలా చెప్పాడు, “ఈ స్థలాన్ని అపవిత్రం చేయండి. శవాలతో ఈ ఆవరణాన్ని నింపివేయండి! ఇప్పుడు వెళ్లండి!” కావున వారు వెళ్లి నగర ప్రజలను చంపివేశారు.
8 ఆ మనుష్యులు ప్రజలను చంపటానికి వెళ్లగా, నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి ఆనించి నమస్కరించి, “నా ప్రభువైన ఓ యెహోవా, యెరూషలేముపై నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు ఇశ్రాయేలులో మిగిలి ఉన్న వారిని చంపివేయటం లేదు కదా!” అని అన్నాను.
9 అది విన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా వంశాల వారు అనేక ఘోరపాపాలు చేశారు. ఈ దేశంలో ప్రజలు ఎక్కడ బడితే అక్కడ హత్య చేయబడుతున్నారు. ఈ నగరం నేరాలతో నిండిపోయింది. ఎందువల్లనంటే ప్రజలు, ‘యెహోవా ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయాడు కనుక మనం చేసే పనులను ఆయన చూడలేడు’ అని అనుకొంటున్నారు. 10 కాని నేను ఏ మాత్రం కనికరం చూపను. ఈ ప్రజలు పట్ల విచారించను. వారు దాన్ని వారి మీదకే తెచ్చుకొన్నారు. నేను కేవలం వారికి అర్హమైన శిక్ష విధిస్తున్నాను!”
11 పిమ్మట నారబట్టలు ధరించి కలం, సిరాబుడ్డి పట్టుకున్న వ్యక్తి వచ్చి, “మీ ఆజ్ఞ ప్రకారం నేను అంతా చేశాను” అని అన్నాడు.
యెహోవా మహిమ దేవాలయమును వదలుట
10 తరువాత నేను కెరూబు దూతల తలలపైవున్న పాత్రవైవు చూశాను. అది స్వచ్చమైన నీలపు మణిగా కనబడింది. ఆ పాత్రమీద సింహాసనం వంటిది ఒకటుంది. అక్కడ నుండి దేవుణ్ణి చూడవచ్చు. 2 నారబట్టలు వేసుకున్న వ్యక్తితో దేవుడు ఇలా అన్నాడు: “నీవు కెరూబు చక్రాల మధ్య ప్రాంతంలోకి రమ్ము. కెరూబు దూతల మధ్య నుండి కొన్ని మండే నిప్పు కణికెలను తీసుకో. ఆ నిప్పును నీ చేతిలో పట్టుకొని వెళ్లి, దానిని యెరూషలేము నగరంపై విసిరివేయి.”
ఆ వ్యక్తి నా ప్రక్క నుండి వెళ్లాడు. 3 ఆ వ్యక్తి మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షిణానవున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది. 4 పిమ్మట దేవుని మహిమా ప్రకాశం కెరూబు దూతల మీదినుండి పైకి లేచింది. ఆ దూతలు ఆలయం గడపమీద నిలబడి ఉన్నారు. పిమ్మట ఆలయాన్ని మేఘం నింపి వేసింది. యెహోవా తేజస్సు ఆలయ ఆవరణాన్నంతా ఆవరించింది. 5 ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడైన దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది.
6 నారబట్టలు ధరించిన వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు కెరూబుల మద్య చక్రాల నడిమి ప్రాంతంలోకి వెళ్లి, మండే నిప్పును తీసుకొని రమ్ము. కావున ఆ వ్యక్తి ఒక చక్రం ప్రక్కగా నిలబడ్డాడు. 7 కెరూబులలో ఒకరు తన చేయిచాపి వాటి మధ్యనున్న మండే నిప్పును తీశాడు. ఆ నిప్పును ఆ వ్యక్తి చేతిలో వేశాడు. దానిని తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. 8 (కెరూబుల రెక్కల క్రింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.)
9 అక్కడ నాలుగు చక్రాలున్నట్లు నేనప్పుడు చూశాను. ప్రతి కెరూబుల ప్రక్క ఒక చక్రం చొప్పున ఉన్నాయి. చక్రాలు స్వచ్చమైన విలువైన రాయిగా కనిపించాయి. 10 మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవన్నీ ఒకే రీతిగా కన్పించాయి. ఒక చక్రంలో మరి యొకటి ఉన్నట్లు అవి కన్పించాయి. 11 కదిలినప్పుడు ఆ నాలుగూ ఒకేసారి ఏ దిశలోనైనా వెళ్ళగలిగినవి. కాని కెరూబులు కదలినప్పుడు అటు ఇటు తిరిగేవారు కాదు. తమ తలలు చూస్తున్న దిశలోనే వారు కదలి వెళ్లేవారు. వారు కదలినప్పుడు అటు ఇటు తిరుగలేదు. 12 వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల మీద. చేతుల మీద, వారి రెక్కల మీద. వారి చక్రాల మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద కన్నులున్నాయి! 13 నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే “చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు.
14-15 ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం.[f] రెండవ ముఖం మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ వద్ద దర్శనంలో చూచిన జీవులే.
పిమ్మట కెరూబు గాలిలోకి పైకి లేచారు. 16 వాటితో పాటు చక్రాలు లేచాయి. కెరూబులు రెక్కలు లేపి గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు తమ దిశను మార్చలేదు. 17 కెరూబులు గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు వారితో వెళ్లాయి. కెరూబు దూతలు నిలకడగా ఉన్నప్పుడు చక్రాలు కూడా అలానే ఉండేవి. ఎందువల్లనంటే ఆ జీవియొక్క ఆత్మ (శక్తి) అంతా చక్రాలలోనే ఉంది.
18 తరువాత యోహోవా మహిమ ఆలయ గుమ్మం మీది నుండి పైకిలేచి, కెరూబుల మీదికి వచ్చి అగింది. 19 అప్పుడు కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలోకి ఎగిరిపోయారు. వారు దేవాలయాన్ని వదిలి వెళ్లటం నేను చూశాను! చక్రాలు వారితో వెళ్లాయి. తరువాత వారు ఆలయపు తూర్పు ద్వారం వద్ద ఆగారు. ఇశ్రాయేలు దేవుని మహిమ గాలిలో వారిపై నిలిచింది.
20 అప్పుడు నేను కెబారు కాలువవద్ద దర్శించిన ఇశ్రాయేలు దేవుని మహిమ క్రింద ఉన్న జీవులను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ జీవులే కెరూబు దూతలని నేను తెలుసుకొన్నాను. 21 ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు మరియు మానవుల చేతులను పోలినటువంటివి వాటి రెక్కల క్రింద ఉన్నాయి. 22 కెరూబుల ముఖాలు నేను కెబారు కాలువ వద్ద దర్శించిన జీవుల ముఖాల మాదిరిగానే ఉన్నాయి. అవన్నీ అవి పోయే దిక్కు వైపే తిన్నగా చూస్తూ ఉన్నాయి.
© 1997 Bible League International