Historical
దేవాలయ నిర్మాణానికి దావీదు ఆలోచన
7 దావీదు తన కొత్త ఇంటిలో నివసించుచున్న కాలంలో యెహోవా అతనికి చుట్టూ వున్న శత్రువుల నుండి ఏ బాధలూ లేకుండా శాంతిని సమకూర్చాడు. 2 రాజు (దావీదు) నాతాను అనే ఒక ప్రవక్త వద్దకు వెళ్లి, “చూడు, నేను దేవదారు కలపతో నిర్మించబడిన ఒక భవంతిలో ఉంటున్నాను. కాని దేవుని పవిత్ర పెట్టె ఇంకా గుడారంలోనే ఉంచబడింది!” అన్నాడు
3 రాజుతో (దావీదు) నాతాను, “వెళ్లు. నీవు వాస్తవంగా ఏమి చేయాలని అనుకుంటున్నావో అది చేయుము. యెహోవా నీతో ఉన్నాడు” అని చెప్పాడు.
4 కాని ఆ రాత్రి యెహోవా వాక్యం నాతానుకు చేరింది.
5 “యెహోవా నాతానును పిలచి ఆయన మాటగా, ఆయన సేవకుడైన దావీదుతో ఇలా చేప్పమన్నాడు: ‘నా కొరకు ఆలయ నిర్మాణం చేయవలసిన వ్యక్తివి నీవు కాదు. 6 ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు నేను ఆలయంలో నివసించలేదు. ఒక గుడారంలో వుంటూనే అటూ ఇటూ పయనించాను. గుడారాన్నే నివాసంగా వినియోగించుకున్నాను. 7 ఇశ్రాయేలు వంశము వారిలో ఏ ఒక్కరికీ దేవదారు కలపతో నాకు ఆలయం నిర్మించే విషయంపై ఒక్క మాటకూడ చెప్పియుండలేదు.’
8 “సర్వశక్తిమంతుడైన యెహోవా నాతానును దావీదుతో ఇంకా ఇలా చెప్పమన్నాడు, ‘నిన్ను నేను పచ్చిక బయళ్ల నుండి పట్టుకొచ్చాను. నీవు గొర్రెలను కాస్తూ వుండగా నిన్ను పట్టుకొచ్చాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకునిగా వుండేందుకు నిన్ను తెచ్చాను. 9 నీవు ఎక్కడికి వెళితే అక్కడికల్లా నేను నీతో వచ్చాను. నీ కొరకు నీ శత్రువులందకరినీ ఓడించాను. ఇప్పుడు ఈ భూమి మీద అతి ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిన్ను నేను చేస్తాను. 10-11 ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నేనొక స్థలాన్ని ఎంపిక చేస్తాను. ఇశ్రాయేలీయులందరినీ అక్కడ స్థిరపడేలా చేసి వారి స్వంత స్థలంలో వారుండేలా చేస్తాను. ఆ తరువాత వారెన్నడూ కదిలే పనివుండదు. గతంలో నా ఇశ్రాయేలు ప్రజలకు మార్గదర్శకులుగా నేను న్యాయాధిపతులను పంపియున్నాను. కాని దుష్ట జనులు వారిని బాధించారు. అదిప్పుడు జరగదు. నీ శ్రతువులందరి నుండి నీకు శాంతి లభించేలా చేస్తాను. నీ వంశంలో రాజులు వర్ధిల్లేలా చేస్తానని కూడా చెబుతున్నాను.[a]
12 “‘నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నీ పూర్వీకుల వద్దనే సమాధి చేయబడతావు. అప్పుడు నేను నీ స్వంత పిల్లలలో ఒకనిని రాజుగా చేస్తాను. 13 అతడు నా నామాన్ని ఘనపర్చే విధంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు. అతని రాజ్యాన్ని శాశ్వత ప్రాతిపదికపై చాలా బలమైనదిగా చేస్తాను. 14 అతనికి తండ్రిగా నేను వ్యవహరిస్తాను. అతడు నాకు కుమారుడు. అతడు పాపం చేస్తే, అతనిని శిక్షించటానికి వేరే ప్రజలను వినియోగిస్తాను. వారు దండములు ధరించి నా తరుపున పనిచేస్తారు. 15 కాని నేనతనిని ప్రేమతో చూడక మానను. నేనతనిపట్ల దాక్షిణ్యాలు కలిగి ఉంటాను. నేను నా ప్రేమను, దయను సౌలునుండి తొలగించాను. నేను నీ వైపునకు తిరిగినప్పుడు, సౌలును ప్రక్కకు నెట్టాను. నీ వంశానికి నేనది చేయను. 16 నీ వంశం, నీ రాజ్యం శాశ్వతంగా నా ముందు కొనసాగుతాయి.’”
17 నాతాను దావీదుకు అంతా చెప్పాడు. అతను తన దర్శనంలో విన్నదంతా దావీదుకు చెప్పాడు.
దావీదు దేవుని ప్రార్థించటం
18 పిమ్మట దావీదు రాజు లోనికి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ప్రార్థనా పూర్వకంగా యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు,
“యెహోవా, నా దేవా, నీకు నేనెందుకంత ముఖ్యుడనయ్యాను? నా కుటుంబం ఎందుకంత ప్రాముఖ్యం గలదయ్యింది? నన్నెందుకు అంత ముఖ్యమైన వాణ్ణిచేశావు? 19 నేనొక సేవకుణ్ణి తప్ప మరేమీ కాను. కాని నీవు నా పట్ల చాలా కరుణతో వున్నావు. భవిష్యత్తులో నా కుటుంబానికి జరిగే కొన్ని మంచి విషయాలు కూడ చెప్పావు. యెహోవా, నా దేవా, నీవిలా ప్రజలతో ఎప్పుడూ మాట్లాడవు. మాట్లాడతావా? 20 నేను నీతో ఎలా ఎల్లప్పుడూ మాట్లాడగలను? యెహోవా, నా దేవా, నేను కేవలం ఒక సేవకుడినని నీకు తెలుసు; 21 ఈ అద్భుత కార్యాలన్నీ నీవు చేస్తానని అన్నావు గనుక జరిపి నిరూపించావు. పైగా నీవు చేయాలనుకున్న దానిలో ఇదొక పని! ఈ గొప్ప విషయాలన్నీ నాకు తెలపాలని నీవు నిశ్చయించావు. 22 ఈ కారణంవలన నీవు గొప్పవాడవు, ఓ నా ప్రభువైన దేవా! యెహోవా నీకు నీవే సాటి. నీవంటి దేవుడు వేరొకరు లేరు. మాకై మేము ఇదంతా విన్నాము.
23 “ఇశ్రాయేలీయులైన నీ ప్రజలవలె మరో జనం ఈ భూమిమీద లేదు. ఆ ప్రజలు అసాధారణమైన వారు. వారు ఈజిప్టులో బానిసలయ్యారు. కాని నీవు వారిని విముక్తి చేసి తీసుకొని వచ్చావు. వారిని నీ ప్రజలుగా చేశావు. ఇశ్రాయేలీయుల కొరకు నీవు గొప్పవైన, అద్భుతమైన క్రియలు నెరవేర్చావు. నీ దేశంకొరకు ఆశ్చర్యకరమైన పనులు చేశావు. 24 ఇశ్రాయేలు ప్రజలను శాశ్వతంగా నీకు అతి సన్నిహితులైన స్వంత ప్రజలుగా చేసుకున్నావు. యెహోవా, నీవు వారి పవిత్ర దేవుడవు.
25 “ప్రభువైన దేవా! ఇప్పుడు నీవు నీ సేవకుడినైన నా నిమిత్తం, మరియు నా కుటుంబం నిమిత్తం ఈ సంగతులు చేసెదనని వాగ్దానము చేసియున్నావు. నీవిచ్చిన వాగ్దానాలు శాశ్వతంగా నిజమయ్యేలా చేయుము! నా కుటుంబాన్ని శాశ్వతంగా ఒక రాజ కుటుంబంగా చేయుము. 26 అప్పుడు నీ నామము మహిమాన్వితం చేయబడుతుంది. ప్రజలంతా, ‘సర్వశక్తిగల యెహోవా, ఇశ్రాయేలును పరిపాలించు దేవుడు. తన సేవకుడైన దావీదు కుటుంబం ఆయన సేవలో బలముతో కొనసాగుతుంది’ అని అందురు.
27 “సర్వశక్తిమంతుడవైన యెహోవా! ఇశ్రాయేలీయుల దేవా నాకు చాలా విషయాలు విశదం చేశావు. ‘నా వంశాభివృద్దికి నీ ఆశీస్సులిచ్చావు.’ నీ సేవకుడనైన నేను అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 28 యెహోవా, నా దేవా! నీవే దేవునివి. నీవి సత్యవాక్కులు. నీ సేవకుడనైన నాకు ఈ మంచి విషయాలన్నీ వాగ్దానం చేశావు. 29 దయచేసి నా కుటుంబాన్ని దీవించు. నీ ముందు దానిని ఎల్లప్పుడూ వర్ధిల్లేలా చేయుము. యెహోవా, నా దేవా! నీవీ అద్భుత విషయాలు చెప్పావు. నీ దీవెనతో నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడియుండు గాక!”
దావీదు అనేక యుద్ధాలను గెలవటం
8 తరువాత దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు. వారి రాజధాని నగరాన్ని స్వాధీన పర్చుకున్నాడు. 2 దావీదు మోయాబీయులను కూడ ఓడించాడు. పట్టుబడిన వారందరినీ నేల మీద పరుండేలా చేసి, వారి పొడుగు కొలవటానికి ఒక తాడు తీసుకున్నాడు. రెండు కొలతల పొడవున్న వారందరినీ చంపించాడు. ఒక కొలత పొడవున్న వారందరినీ వదిలిపెట్టాడు. దానితో మోయాబీయులంతా దావీదుకు సేవకులయ్యారు. వారంతా ఆయనకు కప్పము[b] చెల్లించారు.
3 సోబారాజు రెహోబు కుమారుడైన హదదెజరును దావీదు ఓడించాడు. యూఫ్రటీసు నదీ తీరానగల తన ఆధిపత్యాన్ని దావీదు తిరిగి చేజిక్కించుకున్నాడు. 4 హదదెజరు నుండి పదిహేడు వందల మంది గుర్రపు దళము వారిని, ఇరవై వేలమంది కాల్బలము వారిని దావీదు పట్టుకున్నాడు. ఒక వంద మంచి గుర్రాలు మినహా మిగిలిన గుర్రాలన్నిటినీ దావీదు కుంటివాటినిగా చేసాడు. ఆ వంద గుర్రాలను రథాలను లాగేందుకు రక్షించాడు.
5 సోబా రాజగు హదదెజరుకు సహయం చేయటానికి దమస్కునుండి సిరియనులు వచ్చిరి. కాని దావీదు ఇరువది రెండువేల మంది సిరియనులను ఓడించాడు. 6 తరువాత దమస్కు అధీనంలోనున్న సిరియా దేశమందు దావీదు రక్షక దళాలను నియమించాడు. సిరియనులు వచ్చి దావీదుకు కప్పము చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయ పరంపర సమకూర్చి పెట్టాడు.
7 హదదెజరు సైనికుల బంగారు డాళ్లను (రక్షకఫలకాలు) దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. 8 బెతహు, బేరోతైలనుండి దావీదు లెక్కకు మించి ఇత్తడి సామగ్రి పట్టుకొనిపోయాడు. (బెతహు, బేరోతై అను రెండు నగరాలూ హదదెజరుకు చెందినవి).
9 హదదెజరు సైన్యాన్ని దావీదు ఓడించినట్లు హమాతు రాజైన తోయి విన్నాడు. 10 తోయి తన కుమారుడైన యోరామును దావీదు రాజువద్దకు పంపాడు. యోరాము వచ్చి దావీదును పలకరించి, హదదెజరుతో పోరాడి ఓడించినందుకు అతన్ని అభినందించాడు. (తోయిపై హదదెజరు గతంలో దండెత్తి యుద్ధాలు చేశాడు). యోరాము దావీదు వద్దకు వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా తెచ్చాడు. 11 దావీదు వాటిని తీసుకొని యెహోవాకి సమర్పించాడు. తాను ఇతర దేశములను ఓడించి తెచ్చి యెహోవాకి సమర్పించిన వెండి బంగారు వస్తువులతో పాటు ఈ సామగ్రిని కూడ ఉంచాడు. 12 తాను జయించిన దేశాలలో సిరియ, మోయాబు, అమ్నోను, ఫిలిష్తీయ, అమాలేకు ఉన్నాయి. సోబా రాజైన రెహోబు కుమారుడు హదదెజరును కూడ దావీదు ఓడించాడు. 13 దావీదు పద్దెనిమిది వేల సిరియనులను ఉప్పులోయలో ఓడించాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి మిక్కిలి కీర్తి గడించాడు. 14 ఎదోములో దావీదు సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహో వా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు.
దావీదు పరిపాలన
15 ఇశ్రాయేలంతటినీ దావీదు పరిపాలించాడు. దావీదు తీసుకున్న నిర్ణయాలు తన ప్రజలందరికీ నిష్పక్ష పాతంగా వుండి ఆమోదయోగ్యంగా వుండేవి. 16 సెరూయా కుమారుడైన యోవాబు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడు పత్రలేఖకుడుగా నియమితుడయ్యాడు. 17 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా ఉన్నారు. శెరాయా అనునతను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. 18 యెహోయాదా కుమారుడు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు[c] అధిపతి అయ్యాడు. దావీదు కుమారులు రాజకీయ సలహాదారులైన ప్రముఖ వ్యక్తులుగా[d] నియమితులయ్యారు.
సౌలు కుటుంబానికి దావీదు కనికరము చూపటం
9 “సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.
2 సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు.
“అవును, నీ సేవకుడనైన సీబానే” అని అన్నాడు సీబా.
3 “అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా జీవించివున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు రాజుతో సీబా యిలా అన్నాడు:
“యోనాతాను కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని రెండు కాళ్లూ అవిటివి.”
4 “ఈ కుమారుడెక్కడున్నాడని” రాజు సీబాను అడిగాడు.
“లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్నాడని” రాజుకు చెప్పాడు సీబా.
5 అప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబారుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని రమ్మని చెప్పాడు. 6 యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు.
“మెఫిబోషెతూ” అని పిలిచాడు దావీదు.
“అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు.
7 మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయపడకు. నేను నీ పట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రియైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి ఇచ్చివేస్తాను. నీవు ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద భోజనం చేస్తావు.”
8 మెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్కరించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ సేవకుడనైన నా పట్ల చాలా దయగలిగియున్నారు! పైగా నేను చచ్చిన కుక్కకంటె హీనమైన వాడిని!”
9 పిమ్మట దావీదు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిచి, “సౌలుకు, సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి పాస్తులన్నీ నీ యజమాని మనుమడైన మెఫీబోషెతుకు ఇచ్చాను. 10 మెఫీబోషెతు కొరకు ఆ భూమిని నీవు సాగుచేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ యజమాని మనుమడు మెఫిబోషెతుకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు నా బల్లవద్ద తింటూ వుంటాడు.”
సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువైమంది సేవకులు వున్నారు. 11 దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అంతా చేస్తాను.”
ఆ ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ కుమారులలో ఒకనిగా భోజనం చేస్తాడు. 12 మెఫీబోషెతుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. సీబా కుటుంబంలోని వారంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు. 13 మెఫీబోషెతు రెండు కాళ్లూ కుంటివే. మెఫీబోషెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతిరోజూ మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు.
హానూను దావీదు మనుష్యులను అవమానించటం
10 తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు హానూను రాజయ్యాడు. 2 మరణవార్త విన్న దావీదు “నాహాషు నాపట్ల చాలా దయగలిగియుండెను. కాబట్టి అతని కుమారుడు హానూను పట్లకూడ నేను దయగలిగి ఉంటాను,” అని అన్నాడు. ఆ ప్రకారం దావీదు తన అధికారులను తండ్రి మరణంతో విచారంలో ఉన్న హానూనును పలకరించి ఓదార్చే నిమిత్తం పంపాడు.
దావీదు అధికారులు అమ్మోనీయుల దేశానికి వెళ్లారు. 3 కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజైన హానూనును కలిసి, “నీ తండ్రి మరణ సందర్భంగా నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలిసికొనే నిమిత్తం గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు.
4 కాబట్టి హానూను దావీదు పంపిన అధికారులను పట్టుకొని, వారి గడ్డాలలో సగభాగం గొరిగించాడు. వారి దుస్తులను కూడ సగంనుంచి తొడలవరకు కత్తిరించి వేశాడు. తరువాత వారిని పంపివేశాడు.
5 ఆ అధికారులు చాలా అవమానం పొందారని విన్న దావీదు కొందరు దూతలను తన అధికారులను కలవటానికి పంపాడు. దూతల ద్వారా, “మీ గడ్డాలు బాగా పెరిగేవరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత యెరూషలేమునకు తిరిగిరండి,” అని కబురు పంపాడు దావీదు రాజు.
అమ్మోనీయులపై యుద్ధం
6 అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.
7 ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు. 8 అమ్మోనీయులు బయటికి వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు నగర ద్వారం దగ్గర మోహరించారు. సోబానుండి రెహోబు నుండి వచ్చిన సిరియనులు, టోబునుండి, మయకానుండి వచ్చిన మనుష్యులందరూ అమ్మోనీయులతో కలిసి రంగంలో నిలబడలేదు.
9 అమ్మోనీయులు తనకు ముందు, వెనుక కూడ నిలబడి వున్నారని యోవాబు గమనించాడు. అందువల్ల తనతో వచ్చిన ఇశ్రాయేలీయులలో కొందరు నేర్పరులైన వారిని ఎన్నుకుని వారిని సిరియనులతో యుద్ధానికి సిద్ధం చేశాడు. 10 మిగిలిన సైన్యాన్ని అమ్మోనీయుల మీదికి పోవటానికి యోవాబు తన సోదరుడైన అబీషైకి ఇచ్చాడు. 11 యోవాబు అబీషైకి ఇలా చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం చేయము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధిక్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. 12 ధైర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన దేవుని నగరాలకోసం మనమంతా వీరోచితంగా పోరాడదాం! యెహోవా దృష్టికి ఏది మంచిదనిపించుతుందో అది ఆయన చేస్తాడు.”
13 తరువాత యోవాబు, అతని మనుష్యులు సిరియనులను ఎదుర్కొన్నారు. యోవాబు యొక్క, అతని సైన్యం యొక్క ధాటికి తట్టుకోలేక సిరియనులు పారి పోయారు. 14 సిరియనులు పారిపోతున్నట్లు అమ్మోనీయులు చూశారు. దానితో వారుకూడ అబీషైకి భయపడి పారిపోయారు. వారు వారి నగరానికి పోయారు.
యోవాబు అమ్మోనీయులతో యుద్ధానంతరం తిరిగి వచ్చి యెరూషలేముకు వెళ్లాడు.
సిరియనులు మళ్లీ యుద్ధానికి సిద్ధమవటం
15 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని సిరియనులు గుర్తించారు. వారంతా మళ్లీ సమకూడి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చారు. 16 హదదెజరు తనదూతలను యూఫ్రటీసు నది అవతల నివసిస్తూ ఉన్న సిరియనులనందరినీ తీసుకొని రావలసినదిగా పంపాడు. ఈ సిరియనులంతా హేలాముకు వచ్చారు. వారి నాయకుడు షోబకు. ఇతడు హదదెజరు సైన్యాధిపతి.
17 దావీదు ఇదంతా విని ఇశ్రాయేలీయులనందరనీ కూడ దీశాడు. వారు యోర్దాను నదిని దాటి హేలాముకు వెళ్లారు.
అక్కడ సిరియనులు యుద్ధానికి సిద్ధమై వారిని ఎదిరించారు. 18 కాని దావీదు సిరియనులను ఓడించాడు. సిరియనులు ఇశ్రాయేలీయులకు భయపడి పారిపోయారు. దావీదు సిరియను సైన్యంలో ఏడు వందల మంది రథసారధులను, నలుబది వేల మంది గుర్రపు దళం వారిని చంపివేశాడు. అంతేగాదు సిరియను సైన్యాధిపతియైన షోబకును కూడ దావీదు చంపివేశాడు.
19 హదదెజరు సామంత రాజులంతా వారి సైన్యాలను ఇశ్రాయేలీయులు ఓడించినట్లు చూశారు. కావున వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసికొని వారిని సేవిస్తూవచ్చారు. మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయటానికి సిరియనులు భయపడి పోయారు.
© 1997 Bible League International