Historical
4 సమూయేలును గురించిన వార్త ఇశ్రాయేలు దేశమంతా వ్యాపించింది. ఏలీ పండుముసలి వాడయ్యాడు. ఏలీ కుమారులు యెహోవా ఎదుట దుష్ట కార్యాలు చేస్తూనే ఉన్నారు.
ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించుట
అదే సమయంలో ఫిలిష్తీయులంతా ఏకమై ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి దిగారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ దాడిని ఎదుర్కోవటానికి కదలి వెళ్లి ఎబెనెజరు అనే చోట కాచుకొని యుండిరి. ఆఫెకు అనే చోట ఫిలిష్తీయులు బసచేశారు. 2 ఫిలిష్తీయులు దాడికి బారులుతీరి నిలువగా యుద్ధం మొదలయింది.
యుద్ధంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు నాలుగు వేలమంది సైనికులను చంపివేశారు. 3 ఇశ్రాయేలు సైన్యం తమ స్థలాలకు వచ్చారు. వారి నాయకులు, “యెహోవా ఎందువల్ల తమకు ఫిలిష్తీయుల చేతుల్లో ఓటమి కలిగించాడని ఆలోచించారు. వారు తమ యెహోవా ఒడంబడిక పెట్టెను షిలోహునుండి తీసుకుని రావాలని నిర్ణయించారు. ఈ విధంగా యెహోవా మనతో యుద్ధ భూమికి వస్తాడు. ఆయన మన శత్రువులబారినుండి మనల్ని రక్షిస్తాడు” అని అనుకొన్నారు.
4 ఆ విధంగా అనుకొని షిలోహుకు మనుష్యులను పంపారు. వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఒడంబడిక పెట్టెను తీసుకుని వచ్చారు. పెట్టెపైన కెరూబులు ఉన్నారు. మరియు యెహోవా కూర్చొనే సింహాసనంలా వారు ఉన్నారు. ఏలీ కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు ఆ పెట్టెతో వున్నారు.
5 యెహోవా ఒడంబడిక పెట్టె యుద్ధస్థలంలోనికి రాగానే ఇశ్రాయేలు సేనలు పొంగివచ్చే సంతోషంతో భూమి అదిరేలా కేరింతలు పెట్టారు. 6 ఫిలిష్తీయులు ఈ కేకలు విని, “హెబ్రీయుల స్థలములో ఎందుకీ కలకలం?” అని అనుకోసాగారు.
అప్పుడు వారు యెహోవా పవిత్రపెట్టె హెబ్రీయుల శిబిరములోకి వచ్చినదని కనుగొన్నారు. 7 ఫిలిష్తీయులు భీతి చెందారు. “హెబ్రీ శిబిరములోకి దేవుడు వచ్చాడు. మనకు సంకట కాలం వచ్చింది. ఇలా ఇదివరకెన్నడూ జరుగలేదు! 8 మనం వ్యాకుల పాటు చెందియున్నాము. ఆ మహా దేవుని నుండి మనలను రక్షించేవారెవరు? ఈజిప్టువాళ్లను గతంలో అనేక రోగాలకు, దారుణ శిక్షలకు గురిచేసి వారిని అష్టకష్టాలపాలు చేసినవాడు ఈ దేవుడే. 9 అయినను ఫిలిష్తీయుసోదరులారా, ధైర్యంగా ఉండండి. లెండి. వీరకిశోరాలై పోరాడండి! గతంలో హెబ్రీయులు మన బానిసలు. కాబట్టి వీరాధివీరులై పోరాడండి. లేదా మీరు హెబ్రీయులకు బానిసలై పోయే ప్రమాదం వుంది” అంటూ ఫిలిష్తీయుల నాయకులు సైనికులను ఉత్తేజపరిచారు.
10 ఫిలిష్తీయులు వీరోచితంగా పోరాడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించారు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కడూ తన గుడారానికి పారిపోయాడు. ఇది వారికి ఘోర పరాజయం. ముప్పది వేలమంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు. 11 దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు చనిపోయారు.
12 అదేరోజు బెన్యామీను వాడొకడు యుద్ధ భూమినుండి పారిపోయాడు. సంభవించిన ఈ గొప్ప విషాదానికి సూచనగా తన బట్టలు చించుకొని, నెత్తిన దుమ్ము చల్లుకొని షిలోహుకు వెళ్లాడు. 13 ఈ బెన్యామీనీయుడు షిలోహు వెళ్లేసరికి నగర ద్వారం దగ్గర ఒక ఆసనం మీద ఏలీ కూర్చొని ఉన్నాడు. దేవుని పవిత్ర పెట్టె విషయంలో అతను కొంత గాభరాగా వున్నాడు. అందువల్ల అతనక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. బెన్యామీనీయుడు పట్టణంలోనికి వెళ్లి ఈ దుర్వార్తను వెల్లడిచేసాడు. షిలోహు పట్టణమంతా ఒక్కతీరున గగ్గోలుపడి ఏడ్చింది. 14-15 ఏలీ 98 ఏండ్లు వయస్సుగల గుడ్డివానిగా ఉన్నాడు. కనుక అతడు ఏమీ చూడలేక పోయాడు. కాని, ఏడ్పుల ధ్వని ఏలీ విన్నాడు. “ఏమిటీ గొప్ప ఏడ్పుల ధ్వని?” అని ఏలీ అడిగాడు.
బెన్యామీనీయుడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి, జరిగినది అతనితో చెప్పాడు. 16 బెన్యామీనీయుడు తాను ఆ రోజు యుద్ధంనుండి పారిపోయి వచ్చినట్లు చెప్పాడు.
“ఏమి జరిగిందో చెప్పు” అన్నాడు ఏలీ.
17 ఈ వార్త తెచ్చిన బెన్యామీనీయుడు ఏలీతో ఇలా చెప్పాడు: “ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు చిత్తుగా ఓడిపోయారు. వారిలో అనేకమంది సైనికులు చనిపోయారు. నీ ఇరువురు కుమారులూ చనిపోయారు. దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు తీసుకునిపోయారు.”
18 ఏలీ వృద్ధుడు, స్థూలకాయుడు. బెన్యామీనీయుడు దేవుని పవిత్ర పెట్టెనుగూర్చి చెప్పగానే ఏలీ, ద్వారం దగ్గర ఉన్న తన ఆసనంనుండి వెనుకకుపడి, మెడవిరిగి, చనిపోయాడు. ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాల[a] పాటు ఏలీ నడిపించాడు.
మహిమ తొలగిపోయింది
19 ఏలీ కోడలు (ఫీనెహాసు భార్య) గర్భవతి. నెలలు బాగా నిండాయి. దేవుని పవిత్ర పెట్టె శత్రువుల చేత పడటం, తన మామ ఏలీ మరణం, తన భర్త ఫీనెహాసు మరణవార్తలు వినగానే ఆమెకు తీవ్రంగా పురుటినొప్పులు వచ్చాయి. ఆమె వంగిపోయి ప్రసవించేసింది. 20 ఆమె చావు ఘడియల్లో ఉండగా, “చింతపడకు, నీకు కొడుకు పుట్టాడు” అంటూ అక్కడ ఉన్న స్త్రీలు ఆమెను ఓదార్చారు.
కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండానే, “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది!” అంటూ తన కుమారునికి ఈకాబోదు[b] అని పేరు పెట్టింది. 21 తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టటానికి కారణం ఏమంటే, దేవుని పవిత్ర పెట్టె పరుల హస్తగతమయ్యింది; దానికి తోడు తన మామ, భర్త ఇద్దరూ చనిపోయారు. 22 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని పోయారు గనుకనే “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది” అని ఆమె వాపోయింది.
పవిత్ర పెట్టె మూలంగా ఫిలిష్తీయులకు కష్టకాలం
5 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు. 2 దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను[c] దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు. 3 అష్డోదు ప్రజలు ఆ మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యెహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది.
అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు. 4 కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయి ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది. 5 అందువల్ల ఈ నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు.
6 అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు. 7 అష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు.
8 అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.”
అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు.
9 అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా ఆ నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు. 10 కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు.
కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు. 11 వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.”
ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది. 12 చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.
దేవుని పవిత్ర పెట్టె యధా స్థానానికి పంపబడుట
6 దేవుని పవిత్ర పెట్టెను ఏడునెలలు ఫిలిష్తీయులు తమ దేశమందు ఉంచుకున్నారు. 2 ఫిలిష్తీయులు వారి పూజారులను, మాంత్రికులను పిలిచి, “యెహోవా పవిత్ర పెట్టెను మేము ఏమి చేయాలి? ఈ పెట్టెను తిరిగి దాని స్థానానికి పంపాలంటే ఏమి చేయాలో మాకు చెప్పండి” అని అడిగారు.
3 “మీరు ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను తిరిగి పంపదలచుకుంటే ఊరక పంపవద్దు. ఆ దేవుడు మీ పాపాలను క్షమించే విధంగా తగిన కానుకలతో పంపాలి. అప్పుడు మీరు స్వస్థపరచబడి పవిత్రపరచబడతారు. దేవుడు మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని శిక్షించటం మానివేయాలంటే మీరు ఇలా చేయాలి” అని ఆ పూజారులు, మాంత్రికులు చెప్పారు.
4 “తమను క్షమించాలంటే ఇశ్రాయేలు దేవునికి ఏమి కానుకలు పంపాలని” ఫిలిష్తీయులు అడిగారు.
“ఫిలిష్తీ నాయకులు అయిదుగురు ఉన్నారు. (ఒక్కో పట్టణానికి ఒక్కో నాయకుడు.) మీ ప్రజలందరికీ, నాయకులకు ఒకటే సమస్య ఉంది. కనుక గడ్డల్లాంటి బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు ఎలుకల్లా కనబడే బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. 5 మరియు దేశాన్ని పాడుచేస్తోన్న ఎలుకల ప్రతిరూపాలు చేయండి. ఈ బంగారు ప్రతి రూపాలను ఇశ్రాయేలు దేవునికి వెలగా ఇవ్వండి. ఒకవేళ అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు మిమ్మల్ని, మీ దేవుళ్లను, మీ దేశాన్ని శిక్షించటం మానివేస్తాడేమో. 6 ఈజిప్టు వాళ్లలా, ఫరోలా మొండిగా ఉండవద్దు. దేవుడు ఈజిప్టు వాళ్లను శిక్షించాడు. అందుకే ఈజిప్టువాళ్లు ఇశ్రాయేలువాళ్లను ఈజిప్టు విడిచి వెళ్లనిచ్చారు.
7 “మీరు ఒక కొత్త బండిని నిర్మించి, అప్పుడే ఈనిన రెండు ఆవులను తేవాలి. ఆ రెండు ఆవులను ఇదివరలో కాడికట్టి ఉండకూడదు. వాటిని ఆ బండికి కట్టండి. దూడలను ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని గాటిలో ఉంచండి. వాటిని తల్లి ఆవుల వెనుక పోనీయవద్దు.[d] 8 యెహోవా పవిత్ర పెట్టెను ఆ బండి మీద ఉంచండి. బంగారు ప్రతిరూపాలను ఒక సంచిలో వేసి పెట్టె పక్కన పెట్టండి. అవి దేవుడు మీ పాపాలను క్షమించగలందులకు మీరిచ్చే కానుకలు. పిమ్మట బండిని మార్గాన వెళ్లనివ్వండి. 9 బండిని కనిపెట్టి వుండండి. బండి గనుక ఇశ్రాయేలులో బేత్షెమెషు దిశగా వెళితే యెహోవా నిజంగా మనకీ భయంకర రోగం కలుగజేసినట్లు అవుతుంది. ఒకవేళ ఆవులు బేత్షెమెషువైపు పోకపోతే, మనల్ని శిక్షించింది ఇశ్రాయేలు దేవుడు కాదని మనం గ్రహించవచ్చు. మన జబ్బు మనకు ఏదో అలా వచ్చేసింది అని మనం భావించాలి” అని అన్నారు యాజకులు, మాంత్రికులు.
10 యాజకులు, మాంత్రికులు చెప్పిన రీతిగా ఫిలిష్తీయులు అంతా చేశారు. దూడలున్న రెండు ఆవుల్ని తెచ్చి బండికి కట్టి, లేగదూడల్ని ఇంటివద్దనే వుంచారు. 11 ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను, మరియు బంగారు గడ్డలను ఎలుకల బంగారు ప్రతిరూపాలను ఆ బండిమీద పెట్టారు. 12 ఆవులు తిన్నగా బేత్షెమెషువైపు వెళ్లాయి, ఆవులు అదేపనిగా అరుస్తూ బాటమీదే సాగి పోయాయి. అవి కుడికిగాని, ఎడమకిగాని తిరగలేదు. బేత్షెమెషు పొలిమేరవరకు ఫిలిష్తీయుల పాలకులు ఆవులను అనుసరించి వెళ్లారు.
13 లోయలో బేత్షెమెషు ప్రజలు ఆ సమయంలో తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు తలలు పైకెత్తి చూసినప్పుడు పవిత్ర పెట్టె కనబడింది. మరల పెట్టెను చూడగలిగినందుకు వారు ఎంతో ఆనందపడిరి. 14 బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి ఒక పెద్ద బండ వద్ద బండి ఆగింది. బేత్షెమెషు ప్రజలు బండిని నరికివేశారు. ఆవులను చంపి యెహోవాకు బలి అర్పించారు.
15 లేవీయులు యెహోవా పవిత్ర పెట్టెను క్రిందికిదించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ వారు దించారు. ఆ రెండింటినీ లేవీయులు ఆ పెద్ద బండమీద వుంచారు. ఆ రోజు బేత్షెమెషు ప్రజలు దహన బలులను సమర్పించారు.
16 బేత్షెమెషు ప్రజలు చేసిన ఈ సంగతులంతా ఫిలిష్తీయుల పాలకుల ఐదుగురు జాగ్రత్తగా తిలకించి ఎక్రోనునకు ఆ రోజే వెళ్లిపోయారు.
17 ఈ విధంగా వారికి లేచిన గడ్డల ప్రతిరూపాలను బంగారంతో చేయించి ఫిలిష్తీయులు తమ పాప పరిహారంగా యెహోవాకు కానుకలు పంపారు. అదేమాదిరి బంగారు బొమ్మలను ఒక్కొక్కటి చొప్పున ఫిలిష్తీయుల పట్టణాలయిన అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులనుండి పంపారు. 18 ఫిలిష్తీయులు ఎలుకల బంగారు ప్రతిరూపాలను కూడ పంపారు. ఐదుగురు ఫిలిష్తీయుల పాలకుల అధీనంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని బంగారు బొమ్మలను పంపారు ఈ ఫిలిష్తీయుల పట్టణాలలో చుట్టు ప్రాకారాలతో కట్టుదిట్టము చేయబడిన పట్టణాలు, వాటిక్రింద ఉన్న గ్రామాలు చేర్చబడ్డాయి.
ఏ బండ మీదయితే బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను ఉంచారో ఆ పెద్ద బండ బేత్షెమెషువాసి యెహోషువ పొలంలో ఈనాటికీ సాక్షిగావుంది. 19 కాని బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను చూసినప్పుడు అక్కడ యాజకులు లేరు. అందువల్ల దేవుడు బేత్షెమెషు వారిలో డెబ్బదిమందిని చంపాడు. అంత కఠినంగా తమను దేవుడు శిక్షించినందుకు బేత్షెమెషు వారు దుఃఖించారు. 20 “ఈ యెహోవా పవిత్ర దేవుని ముందర నిలబడగల యాజకుడు ఎక్కడ? ఇక్కడ నుండి ఈ పెట్టెను ఎక్కడికి తరలించాలి?” అని వారు యోచనచేశారు.
21 బేత్షెమెషు జనం కిర్యత్యారీము ప్రజలకు వర్తమానం పంపారు. “ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను తిరిగి తెచ్చారని, వచ్చి దానిని తమ నగరానికి తీసుకుని పోవలసినదని సందేశం పంపారు.”
7 కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా పవిత్ర పెట్టెను తీసుకొని వెళ్లారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి వారు యెహోవా పెట్టెను తీసుకొని వెళ్లారు. పెట్టె విషయంలో జాగ్రత్త పుచ్చు కొనేందుకు అబీనాదాబు కుమారుడగు ఎలియాజరును వారు ప్రత్యేక క్రమం ప్రకారం ఏర్పరిచారు. 2 కిర్యత్యారీములో ఆ పెట్టె ఇరువది సుధీర్ఘ సంవత్సరాలుండెను.
ఇశ్రాయేలీయులను యెహోవా రక్షించుట
ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ భక్తిశ్రద్ధలతో యెహోవా ఎదుట దుఃఖపడి ఆయనను వెదకటం మొదలు పెట్టారు. 3 ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు[e] దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.”
4 అది విన్న ఇశ్రాయేలీయులు బయలు[f] అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు.
5 “ఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమావేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను ప్రార్థిస్తాను” అని సమూయేలు వారితో చెప్పాడు.
6 ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు.
7 ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతున్నట్లు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి తరలి వచ్చారు. వారు వస్తున్నారని ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు. 8 వారు సమూయేలుతో “మా కొరకు ప్రభువైన దేవుని ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిష్తీయుల బారినుండి మమ్మును రక్షించమని యెహోవాను వేడుము!” అని విన్నవించారు.
9 అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గొర్రెపిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల కోసం యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతనికి జవాబిచ్చాడు. 10 సమూయేలు బలి పశువును దహించుచున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా ఒక భయంకర ఉరుమును ఫిలిష్తీయుల వద్ద కలిగించాడు. ఆ ఉరుము ఫిలిష్తీయులను భయపెట్టగా వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు సంభవించిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు. 11 ఇశ్రాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి ఫిలిష్తీయులను అందిన వారిని అందినట్లు చంపుతూ బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు.
ఇశ్రాయేలులో ప్రశాంతత
12 ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకార్థంగా మిస్పాకు, షేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని నిలబెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల”[g] అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసాడు” అని చెప్పాడు.
13 ఫిలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు బ్రతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగానే వున్నాడు. 14 ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకుగల ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలను తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు ప్రక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది.
15 సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు. 16 ప్రతి సంవత్సరం సమూయేలు దేశవ్యాప్తంగా సంచారం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు చెబుతూ ఒక స్థలంనుండి మరో స్థలానికి వేళ్లేవాడు. బేతేలు, గిల్గాలు, మిస్పాకు అతడు వెళ్లాడు. కనుక ఈ స్థలాలన్నింటిలో అతడు ఇశ్రాయేలీయులకు తీర్పు చెబుతూ, వారిని పాలించాడు. 17 కానీ సమూయేలు తన ఇల్లు ఉన్న రామాకు తిరిగి వెళ్లేవాడు. రామాలో వున్న ప్రజలను కూడ సమూయేలు పాలిస్తూ, తీర్పు చెప్పేవాడు. రామాలో యెహోవాకు ఒక బలిపీఠాన్ని సమూయేలు నిర్మించాడు.
రాజుకొరకు ఇశ్రాయేలు ప్రజల అభ్యర్థన
8 సమూయేలు వృద్ధుడయిన పిమ్మట తన కుమారులను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా నియమించాడు. 2 సమూయేలు మొదటి కుమారుని పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ బెయేర్షెబాలో న్యాయాధిపతులు. 3 కాని సమూయేలు కుమారులకు తండ్రి నడవడి రాలేదు. యోవేలు, అబీయా, ఇద్దరూలంచం ద్వారా ధన సంపాదనకు పాల్పడినారు. తమ తీర్పులను తారుమారు చేయటానికి ప్రజలను మోసంచేసి రహస్యంగా లంచాలు తీసుకునేవారు. 4 కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు. 5 వారు సమూయేలుతో, “నీవు వృద్ధుడవు. పైగా నీ కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు.
6 ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు. 7 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను కాదు. 8 వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఈజిప్టునుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్ల కూడా వారిప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. 9 అయినా నీవు ప్రజలు చెప్పిన దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.”
10 రాజుకొరకు అడుగుతున్న ప్రజలకు సమూయేలు సమాధాన మిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన విషయమంతా సమూయేలు ప్రజలకు ఇలా వివరంగా చెప్పాడు: 11 “మిమ్మల్ని పాలించేందుకు మీకు గనుక ఒక రాజు ఉంటే అతడు ఇలా చేస్తాడు: అతడు మీ కుమారులను తనకు సేవ చేసేటట్లు బలవంతంచేస్తాడు. అతడు వారిని బలవంతంగా సైనికులుగా చేస్తాడు. వారిని తన రథాలలో, అశ్వదళాలలో పని చేయిస్తాడు. మీ కుమారులు రాజు రథానికి ముందు పరుగెత్తే సంరక్షకులు అవుతారు.
12 “రాజు మీ కుమారులలో కొంతమందిని వేయిమంది మీద అధికారులుగాను, ఏబదిమంది మీద అధికారులుగాను చేస్తాడు. మీ సంతతిలో మరికొంత మందిని రాజు తన భూమిని సాగు చేయుటకు, మరికొంత మందిని పంట కోయుటకు నియమిస్తాడు.
“ఇంకా కొంతమందిని యుద్ధ పరికరాలను, ఆయుధాలను తయారు చేసేందుకు, ఆయన రథాలకు కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చటానికి రాజు వినియోగిస్తాడు.”
13 “ఈ రాజు మీ కుమార్తెలను కూడా తీసుకుని, వారిలో కొంతమందిని అత్తరులు చేసేందుకు, మరికొంత మందిని ఆయన ఆహార పదార్థాలు తయారు చేయటానికి వినియోగిస్తాడు.
14 “ఈ రాజు మీ భూములలో శ్రేష్ఠమైన వాటిని, ద్రాక్షాతోటలను, ఒలీవ తోటలను తీసుకుంటాడు. వాటిని తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు. 15 మీ పంటలోను, ద్రాక్ష దిగుబడిలోను పదవవంతు అతను తీసు కుంటాడు. ఈ పదవ భాగాన్ని రాజు తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.
16 “ఈ రాజు మీ సేవకులను, పనిపిల్లలను కూడ తీసుకుంటాడు. మీకున్న మంచి మంచి పాడి పశువులను, గాడిదలను కూడా తీసుకుంటాడు. వారందరినీ తన స్వంత పనులకు వినియోగించుకుంటాడు. 17 అతను మీ గొర్రెల మందలలో పదవవంతు తీసుకుంటాడు.
“అసలు మీరు కూడా ఈ రాజుకు బానిసలైపోతారు. 18 ఆ సమయం వచ్చినప్పుడు మీరెన్నుకున్న రాజు మూలంగా మీరు చాలా ఏడుస్తారు. కానీ యెహోవా మాత్రం ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు.”
19 సమూయేలు ఇంత చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా ఇలా అన్నారు: “కాదు! మమ్ములను ఏలటానికి మాకో రాజు కావాలి. 20 అప్పుడు మేము ఇతర రాజ్యాలతో సమాన ప్రతిపత్తిగల వారమవుతాము. మా రాజే మా నాయకుడు. యుద్ధంలో ఆయన మమ్మల్ని నడిపించి, మాకోసం ఆయన యుద్ధం చేస్తాడు.”
21 ప్రజలు చెప్పినదంతా విన్న సమూయేలు వారు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేసాడు. 22 “వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు.
అప్పుడు సమూయేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణానికి వెళ్లిపొమ్మని చెప్పాడు.”
© 1997 Bible League International