Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 8-10

మోషే యాజకుల్ని నియమించుట

యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “అహరోనును, అతని కుమారులను, వారి వస్త్రాలు, అభిషేకించే తైలాన్ని, పాపపరిహారార్థపు కోడెదూడ, రెండు పొట్టేళ్ళను, ఒక గంపెడు పులియని రొట్టెలను నీతో తీసుకొని, ప్రజలందరినీ సన్నిధి గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశపర్చు.”

యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేసాడు. ప్రజలు సన్నిధి గుడారం దగ్గర సమావేశం అయ్యారు. అప్పుడు మోషే, “చేయవలసినదానిని యెహోవా సెలవిచ్చాడు.”

అప్పుడు అహరోనును, అతని కుమారులను మోషే తీసుకొని వచ్చాడు. అతడు వారికి నీళ్లతో స్నానం చేయించాడు. అప్పుడు అహరోనుకు మోషే చొక్కా తొడిగించాడు. అహరోనుకు నడికట్టును మోషే చుట్టాడు. అంతట ఒక నిలువుపాటి అంగీని మోషే అహరోనుకు తొడిగించాడు. తర్వాత మోషే ఏఫోదును అహరోనుకు ధరింపజేసాడు. నైపుణ్యంగా అల్లిక చేయబడిన నడికట్టును మోషే అహరోను నడుముకు బిగించాడు. ఆ విధంగా ఏఫోదును అహరోనుకు మోషే ధరింపజేసాడు. తర్వాత మోషే, న్యాయతీర్పు పైవస్త్రంలో ఊరీము, తుమ్మీములను ఉంచాడు. అహరోను తలమీద తలపాగాను కూడా మోషే పెట్టాడు. ఈ తలపాగా ముందర భాగంలో బంగారు బద్దను మోషే పెట్టాడు. ఈ బంగారు బద్ద పరిశుద్ధ కిరీటం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇలా చేసాడు.

10 తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకొని పవిత్ర గుడారాన్నీ, దానిలోని వస్తువులన్నిటినీ ప్రతిష్ఠించాడు. ఈ విధంగా వాటిని మోషే పరిశుద్ధం చేసాడు. 11 ఆ అభిషేక తైలంలో కొంత బలిపీఠం మీద ఏడుసార్లు మోషే చిలకరించాడు. బలిపీఠం, దాని పరికరాలు, పాత్రలు అన్నింటినీ మోషే ప్రతిష్ఠించాడు. గంగాళాన్ని, దాని పీటను కూడా మోషే ప్రతిష్ఠించాడు. ఈవిధంగా మోషే వాటిని పరిశుద్ధం చేశాడు. 12 అప్పుడు అభిషేక తైలంలో కొంత అహరోను తలమీద మోషే పోసాడు, ఈ విధంగా అహరోనును అతడు పరిశుద్ధం చేశాడు. 13 అప్పుడు మోషే అహరోను కుమారులను తీసుకొనివచ్చి, వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి దట్టీలు కట్టాడు. తర్వాత వారి తలలమీద పాగాలను అతడు చుట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే మోషే ఇవన్నీ చేసాడు.

14 అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను మోషే తీసుకొనివచ్చాడు. పాపపరిహారార్థ బలికొరకైన కోడె దూడ తలమీద అహరోను, అతని కుమారులు వారి చేతులు ఉంచారు. 15 అప్పుడు మోషే ఆ కోడె దూడను వధించి, దాని రక్తాన్ని తీసాడు. మోషే కొంచెం రక్తం తీసుకొని, తన వ్రేలితో దానిని బలిపీఠపు కొమ్ములన్నింటి మీద చల్లాడు. ఈ విధంగా బలిపీఠాన్ని బలులకోసం మోషే సిద్ధం చేసాడు, తర్వాత ఆ రక్తాన్ని బలిపీఠపు అడుగున మోషే పోసాడు. ఈ విధంగా ప్రజల పాపాలను పరిహారం చేసే బలుల కోసం బలిపీఠాన్ని మోషే సిద్ధం చేసాడు. 16 ఆ కోడెదూడ లోపలి భాగాలనుండి కొవ్వు అంతటినీ మోషే తీసాడు. కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని, రెండు మూత్ర పిండాలను, వాటిమీద కొవ్వును మోషే తీసి బలిపీఠం మీద వాటిని దహించాడు. 17 అయితే ఆ కోడెదూడ చర్మాని దాన్ని మాంసాన్ని, దాని పేడను వారి బస వెలుపలకు మోషే తీసుకుపోయాడు. నివాసానికి వెలుపల మంట వేసి అందులో వాటిని మోషే కాల్చివేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే అవన్నీ చేసాడు.

18 తర్వాత మోషే దహనబలి పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు. 19 అప్పుడు మోషే ఆ పొట్టేలును వధించి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. 20 పొట్టేలును మోషే ముక్కలుగా కోసాడు. లోపలి భాగాలను, కాళ్లను, నీళ్ళతో మోషే కడిగాడు. 21 తర్వాత మొత్తం పొట్టేలును బలిపీఠం మీద మోషే దహించాడు. తలను, భాగాలను, కొవ్వును మోషే దహించాడు. అది హోమంగా అర్పించబడిన దహనబలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. యెహోవా ఆజ్ఞాపించినట్లే మోషే వాటిని చేసాడు.

22 అప్పుడు మోషే మరొక పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు ఈ పొట్టేలు ఉపయోగించబడింది. అహరోను, అతని కుమారులు ఆ పోట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు. 23 అప్పుడు మోషే ఈ పోట్టేలును వధించాడు. దాని రక్తంలో కొంత అతడు తీసుకొని, అహరోను చెవి కొనమీద, కుడిచేతి బొటన వేలిమీద, అహరోను కుడికాలి బొటనవేలి మీద వేసాడు. 24 తర్వాత అహరోను కమారులను బలిపీఠం దగ్గరకు మోషే తీసుకొని వచ్చాడు. ఆ రక్తంలో కొంత వారి కుడి చెవుల కొనలమీద, కుడి చేతుల బొటనవేళ్ళమీద, వారి కుడి కాళ్ల బొటనవ్రేళ్ల మీద మోషే వేసాడు. తర్వాత బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని మోషే చిలకరించాడు. 25 కొవ్వును, కొవ్విన తోకను, లోపలి భాగాలమీది కొవ్వు అంతటినీ, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని రెండు మూత్ర పిండాలను, వాటి కొవ్వును, కుడి తొడను మోషే తీసాడు. 26 ఒక గంపెడు పులియని రొట్టెలు ప్రతిరోజూ యెహోవా ముందు ఉంచబడ్డాయి. ఆ రొట్టెల్లో నూనె కలిపి చేయబడ్డ రొట్టె ఒకటి, పులియని రొట్టెల్లోనుంచి ఒక రొట్టెను మోషే తీసుకొని, పొట్టేలు కుడి తొడమీద, కొవ్వుమీద ఆ రొట్టె ముక్కల్ని ఉంచాడు. 27 తర్వాత మోషే వాటన్నింటినీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టాడు. నైవేద్యంగా ఆ ముక్కలను యెహోవా ఎదుట మోషే అల్లాడించాడు. 28 అప్పుడు అహరోను అతని కుమారుల చేతుల్లోనుండి మోషే వాటిని తీసుకొన్నాడు. బలిపీఠం మీద దహనబలిగా వాటిని దహించాడు. కాబట్టి అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు అర్పణ అది. అది అగ్నితో అర్పించబడిన అర్పణ. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. 29 దాని బోరను మోషే తీసుకొని, యెహోవా ఎదుట అర్పణగా దానిని అల్లాడించాడు. యాజకులను నియమించుటలో పొట్టేలు యొక్క ఆ భాగం మోషేకు చెందుతుంది. ఇది యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు జరిగింది.

30 బలిపీఠం మీద ఉన్న అభిషేకతైలం కొంత, రక్తం కొంత మోషే తీసుకొన్నాడు. అందులో కొంచెం అహరోను మీద, అతని వస్త్రాల మీద, మరియు అహరోనుతో ఉన్న అతని కుమారుల మీద, వారి వస్త్రాల మీద కొంచెం చల్లాడు. ఈ విధంగా అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను మోషే పవిత్రం చేసాడు.

31 అప్పుడు అహరోనుతో, అతని కుమారులతో మోషే ఇలా చెప్పాడు: “మీకు నా ఆజ్ఞ జ్ఞాపకం ఉందా? ‘అహరోను, అతని కుమారులు వీటిని తినాలి’ అని నేను చెప్పాను. కనుక నియామక కార్యక్రమంనుండి రొట్టెలు, మాంసం ఉన్న గంప తీసుకోండి. సన్నిధి దగ్గర ఆ మాంసాన్ని ఉడకబెట్టండి. ఆ రొట్టెను ఆ మాంసాన్ని అక్కడే మీరు తినాలి. 32 రొట్టెగాని, మాంసంగాని ఏమైనా మిగిలిపోతే, దాన్ని కాల్చివేయాలి. 33 నియామక క్రమం ఏడు రోజులపాటు ఉంటుంది. మీ అభిషేకం పూర్తి అయ్యేంతవరకు మీరు సన్నిధి గుడారంనుండి బయటకు వెళ్ల కూడదు. 34 ఈ వేళ మనం చేసిన వాటన్నింటినీ చేయుమని యెహోవా ఆజ్ఞాపించాడు. మీ పాపాలను తుడిచివేసేందుకు ఆయన వీటిని ఆజ్ఞాపించాడు. 35 ఏడు రోజుల పాటు రాత్రింబవళ్లు సన్నిధి గుడారం దగ్గరే మీరు నిలిచి ఉండాలి. యెహోవా ఆజ్ఞలకు మీరు విధేయులు కాకాపోతే మీరు చనిపోతారు. ఈ ఆజ్ఞలు నాకు యెహోవా ఇచ్చాడు.”

36 కనుక యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ అహరోను, అతని కుమారులు జరిగించారు.

దేవుడు యాజకులను అంగీకరించుట

ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారులను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా అతడు పిలిచాడు. అహరోనుతో మోషే ఇలా చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడను పాపపరిహారార్థబలిగాను, పొట్టేలును దహనబలిగాను యెహోవాకు అర్పించండి. ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు. సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’”

కనుక ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిలబడ్డారు. “యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” అన్నాడు మోషే.

అప్పుడు అహరోనుతో మోషే ఈ సంగతులు చెప్పాడు: “వెళ్లి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరిగించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, దహనబలి అర్పణలు అర్పించు. మీ పాపాలు, ప్రజల పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరిహరించే వాటిని జరిగించు.”

కనుక అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. పాపపరిహారార్థ బలికోసం కోడె దూడను అతడు వధించాడు. ఈ పాపపరిహారార్థ బలి అతని కోసమే. అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. అహరోను తన వేలు ఆ రక్తంలో ముంచి, బలిపీఠం కొమ్ములమీద దాన్ని చల్లాడు. తర్వాత అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం అడుగున పోసాడు. 10 పాపపరిహారార్థ బలిలోనుంచి కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని అహరోను తీసుకొని, బలిపీఠం మీద అతడు వాటిని దహించాడు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లే అతడు అలా చేసాడు. 11 తర్వాత మాంసాన్ని, చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చివేసాడు.

12 తర్వాత, దహనబలి పశువును అహరోను వధించాడు. అది ముక్కలుగా కోయబడింది. దాని రక్తాన్ని అహరోను కుమారులు అహరోను దగ్గరకు తీసుకొని వచ్చారు. అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాడు. 13 దహనబలి పశువు యొక్క ముక్కలను, దాని తలను అహరోను కుమారులు అహరోనుకు అందించారు. అప్పుడు అహరోను వాటిని బలిపీఠం మీద దహించాడు. 14 దహన బలి పశువు లోపలి భాగాలను, కాళ్లను కూడా అహరోను కడిగాడు. వాటిని బలిపీఠం మీద అతడు కాల్చివేసాడు.

15 తర్వాత ప్రజల అర్పణను అహరోను తీసుకొచ్చాడు. ప్రజల పాప పరిహారార్థ బలిగా మేకను వధించాడు. మొదటిదాని వలెనే అతడు పాప పరిహారార్థంగా ఆ మేకను అర్పించాడు. 16 అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు. 17 అహరోను బలిపీఠం దగ్గరకు ధాన్యార్పణను తీసుకువచ్చాడు. అతడు గుప్పెడు ధాన్యార్పణ తీసుకొని, బలిపీఠం మీద ఆనాటి అనుదిన బలిని పక్కగా పెట్టాడు.

18 ప్రజల సమాధాన బలి అర్పణలుగా కోడెదూడను, పొట్టేలును కూడ అహరోను వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. ఈ రక్తాన్ని అహరోను బలిపీఠం చుట్టూ చిలకరించాడు. 19 కోడెదూడ, పొట్టేలు కొవ్వునుకూడ అహరోను కుమారులు అహరోను దగ్గరకు తెచ్చారు. కొవ్విన తోకను లోపలి భాగాలమీది కొవ్వును మూతగ్రంథులను, కాలేయము యొక్క కొవ్విన భాగాన్ని వారు తీసుకొచ్చారు. 20 కొవ్విన ఈ భాగాలను కోడెదూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు ఉంచారు. కొవ్విన ఈ భాగాలను బలిపీఠం మీద అహరోను కాల్చివేసాడు. 21 మోషే ఆజ్ఞాపించిన ప్రకారం నైవేద్యంగా బోరలను, కుడితొడను యెహోవా ఎదుట అహరోను అల్లాడించాడు.

22 అప్పుడు అహరోను ప్రజల వైపుగా తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. అహరోను పాపపరిహారార్థ బలి అర్పణను, దహనబలి అర్పణను, సమాధాన బలి అర్పణ, అర్పించటం ముగించిన తర్వాత అతడు బలిపీఠం నుండి దిగి వచ్చాడు.

23 మోషే, అహరోనులు సన్నిధి గుడారం లోపలకు వెళ్లారు. వారు బయటకు వచ్చి ప్రజలను ఆశీర్వదించారు. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. 24 యెహోవా నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీది దహన బలిని, కొవ్వును దహించి వేసింది. ప్రజలంతా ఇది చూచినప్పుడు ఉత్సాహధ్వనిచేసి సాష్టాంగపడ్డారు.

దేవుని అగ్ని నాదాబు, అబీహులను నాశనం చేయుట

10 అప్పుడు అహరోను కుమారులైన నాదాబు, అబీహులు పాపం చేసారు. ధూపం వేసేందుకు ఒక్కో కుమారుడు ఒక్కో ధూపార్తిని తీసుకొన్నాడు. వారు వేరే నిప్పు తీసుకొని ధూపం అంటించారు. వారు ఉపయోగించాలని దేవుడు ఆజ్ఞాపించిన నిప్పును వారు ఉపయోగించలేదు. కనుక యెహోవా నుండి అగ్ని వచ్చి నాదాబు, అబీహులను నాశనం చేసింది. యెహోవా ఎదుట వారు మరణించారు.

అప్పుడు అహరోనుతో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ‘నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి.’” కనుక అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు.

అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలుకు ఇద్దరు కుమారులుండిరి. వారు మిషాయేలు, ఎల్సాఫాను. “పరిశుద్ధ స్థలం ముందునకు వెళ్లండి. మీ సోదరుల శవాలను బస వెలుపలకు తీసుకొని పొండి” అని మోషే వారిద్దరితో చెప్పాడు.

కనుక మిషాయేలు, ఎల్సాఫాను మోషేకు విధేయులయ్యారు. నాదాబు, అబీహు శవాలను బస వెలుపలకు వారు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.

అప్పుడు అహరోనుతోను, అతని ఇతర కుమారులు ఎలీయాజరు, ఈతామారులతో మోషే ఇలా మాట్లాడాడు. “ఏమి విచారపడకండి. మీబట్టలు చింపుకోవద్దు, జుట్టు చిందరవందర చేసుకోవద్దు. మీరు అలాంటివి చేయకుండా ఉంటే మీరు చావకుండా ఉంటారు. అలానే యెహోవా తన ప్రజలందరి మీద కోపగించకుండా ఉంటాడు. ఇశ్రాయేలు జాతి మొత్తం మీ బంధువులే. నాదాబు, అబీహులను యెహోవా కాల్చివేసినందుకు వారంతా ఏడుస్తారు. కాని మీరు మాత్రం సన్నిధి గుడారం వదిలి వెళ్లకూడదు. ఆ ద్వారం నుండి కనుక మీరు బయటకు వెళ్తే మీరు చనిపోతారు. ఎందుచేతనంటే యెహోవా ప్రత్యేక తైలం మీమీద ఉంది.” గనుక అహరోను, ఎలీయాజరు, ఈతామారు మోషేకు విధేయులయ్యారు.

అప్పుడు అహరోనుతో యెహోవా అన్నాడు: “మీరు సన్నిధి గుడారంలోనికి వచ్చేటప్పుడు నీవుగాని నీ కుమారులుగాని ద్రాక్షారసం, మద్యం తాగకూడదు. మీరు అలాంటివి చేస్తే చనిపోతారు. మీతరాలన్నింటికీ ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 10 పవిత్రం, అపవిత్రం అనే నిర్దిష్టమైన వ్యత్యాసాన్ని మీరు పాటించాలి. 11 యెహోవా తన ఆజ్ఞలను మోషేకు ఇచ్చాడు, వాటిని మోషే ప్రజలకు ఇచ్చాడు. అహరోనూ, నీవు ఆ ఆజ్ఞలు అన్నింటి విషయమై ప్రజలకు ప్రబోధించాలి.”

12 అహరోనుకు ఎలీయాజరు, ఈతామారు అనే ఇద్దరు కుమారులు ఇంకా బ్రతికి ఉన్నారు. అహరోనుతో, అతని ఇద్దరు కుమారులతో మోషే ఇలా అన్నాడు: “అగ్నిచే దహించబడిన బలులలో ధాన్యార్పణ కొంత మిగిలిపోయింది. ధాన్యార్పణంలోని ఆ భాగాన్ని మీరు తినాలి. అయితే అందులో పొంగే పదార్థం కలుపకుండా మీరు తినాలి. బలిపీఠం దగ్గరే దాన్ని తినాలి. ఎందుచేతనంటే ఆ అర్పణ అతి పరిశుద్ధం. 13 అది యెహోవా కోసం అగ్నిమీద దహించబడిన అర్పణలలో భాగమైయున్నది. ఆ భాగం నీకు నీ కుమారులకు చెందుతుంది అని నీకు నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రబోధిస్తుంది. అయితే పరిశుద్ద స్థలంలోనే మీరు దాన్ని తినాలి.

14 “మరియు నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నైవేద్యంల్లోనుంచి బోరను తినవచ్చును. మీరు వాటిని పవిత్ర స్థలంలో తినాల్సిన అవసరం లేదు గాని పరిశుభ్రమైన స్థలంలో తినాలి. ఎందుచేతనంటే అవి సమాధాన బలిలోనివి. ఆ కానుకలను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇస్తారు. ఆ జంతువుల్లో కొంత భాగాన్ని ప్రజలు తింటారు కాని బోర మాత్రం మీ వంతు అవుతుంది. 15 నిప్పుమీద దహించబడిన బలిలో భాగంగా ప్రజలు వారు అర్పించే జంతువుల కొవ్వును తీసుకొని రావాలి. సమాధాన బలిలోని తొడను, నైవేద్యంలోని బోరనుకూడా వారు తీసుకుని రావాలి. అది యెహోవా ఎదుట అల్లాడించబడుతుంది. ఆ తర్వాత అది ఆ అర్పణలో మీ భాగం అవుతుంది. బలి అర్పణల్లోని ఆ భాగం యెహోవా ఆజ్ఞాపించినట్టు శాశ్వతంగా మీ వంతు అవుతుంది.”

16 పాప పరిహారార్థబలి మేక కోసం మోషే చూశాడు. అయితే అప్పటికే అది దహించివేయబడింది. అహరోను కుమారుల్లో మిగిలిన వారి మీద (ఎలీయాజరు, ఈతామారు) మోషేకు చాలా కోపం వచ్చింది. 17 మోషే, “ఆ మేకను మీరు పరిశుద్ధ స్థలంలోనే తినాల్సిఉంది. అది చాలా పరిశుద్ధం. దాన్ని యెహోవా ఎదుట మీరెందుకు తినలేదు? ప్రజల దోషాన్ని తీసివేసేందుకు దాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. ఆ మేక బలి ప్రజల పాపాలను తుడిచి వేసేందుకు ఉద్దేశించబడింది. 18 చూడండి, ఆ మేక రక్తాన్ని పవిత్ర స్థలం లోపలకు మీరు తీసుకొని రాలేదు. నేను ఆజ్ఞాపించిన ప్రకారం మీరు దాన్ని పరిశుద్ధ స్థలంలోనే తినాల్సి ఉంది”! అని అన్నాడు.

19 కాని, మోషేతో అహరోను చెప్పాడు: “చూడు, ఈవేళ వారు తమ పాపపరిహారార్థ బలిని, దహన బలి అర్పణను యెహోవా ఎదుటికి తెచ్చారు. అయితే ఈవేళ నాకు ఏమి జరిగిందో నీకు తెలుసు. పాపపరిహారార్థ బలిని ఈ వేళ నేను తింటే యెహోవా ఆనందిస్తాడని నీవు అనుకొంటావా? లేదు!”

20 మోషే ఇది విన్నప్పుడు ఒప్పుకొన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International