Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 యోహాను

దేవుడు ఎన్నుకున్న అమ్మగారికి, ఆమె సంతానానికి, పెద్దనైన నేను వ్రాస్తున్నది ఏమనగా, మీ పట్ల నాకు నిజమైన ప్రేమవుంది. సత్యం మాలో శాశ్వతంగా ఉంది కాబట్టే, నాకే కాకుండా సత్యం తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది.

తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, ప్రేమతో ఇచ్చిన కృప, దయ, శాంతి మనలో ఉండాలని కోరుతున్నాను.

మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించినట్లు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. అమ్మా! మొదటినుండి ఉన్న ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను కాని, క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండాలని అంటున్నాను. ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.

యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు. పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.

క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించినవానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనేవానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది. 10 ఈ ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చినవాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటివాణ్ణి పలుకరించకండి. 11 ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు.

12 నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. కాని కాగితాన్ని, సిరాను ఉపయోగించటం నాకు యిష్టం లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. 13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం,[a] వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు.

3 యోహాను

నా ప్రియ మిత్రుడైన గాయునకు,

పెద్దనైన నాకు నీపట్ల నిజమైన ప్రేమ ఉంది.

ప్రియ మిత్రమా! నీ ఆత్మ క్షేమంగా ఉన్నట్లు నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ జీవితం చక్కటి మార్గాల్లో నడవాలని ప్రార్థిస్తున్నాను. కొందరు సోదరులు వచ్చి నీలో ఉన్న సత్యాన్ని గురించి చెప్పారు. నీవేవిధంగా సత్యాన్ని అనుసరిస్తున్నావో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది. నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవటంకన్నా మించిన ఆనందం నాకు మరొకటి లేదు.

ప్రియ మిత్రమా! ఆ సోదరులు నీకు పరాయి వాళ్ళయినా వాళ్ళకోసం నీవు చేస్తున్నది విశ్వాసంతో చేస్తున్నావు. 6-7 నీ ప్రేమను గురించి వాళ్ళు సంఘానికి చెప్పారు. వాళ్ళు క్రైస్తవులు కాని వాళ్ళనుండి సహాయం కోరక క్రీస్తు పేరు కోసం బయలుదేరారు. నీవు దేవునికి నచ్చే విధంగా వాళ్ళను సాగనంపి మంచి పని చేసావు. సత్యం కోసం మనం కలిసి పని చెయ్యాలంటే, అలాంటివాళ్ళను ఆదరించాలి.

నేను సంఘానికి వ్రాసాను. కాని దియొత్రెఫే తనకు ప్రాముఖ్యత కావాలని కోరుకుంటున్నాడు కనుక, మనకు సుస్వాగతం చెప్పలేదు. 10 దానితో తృప్తి పడక సోదరులకు సుస్వాగతం చెప్పటానికి అంగీకరించటం లేదు. పైగా సుస్వాగతం చెప్పేవాళ్ళను అడ్డగిస్తూ వాళ్ళను సంఘంనుండి బహిష్కరిస్తున్నాడు. అందువల్ల నేను వస్తే అతడు మనల్ని గురించి ద్వేషంతో ఎందుకు మాట్లాడుతున్నాడో కనుక్కుంటాను.

11 ప్రియ స్నేహితుడా! చెడుననుసరించటం మాని మంచిని అనుసరించు. మంచి చేసినవాణ్ణి దేవుడు తనవానిగా పరిగణిస్తాడు. చెడు చేసినవాడెవ్వడు దేవుణ్ణి ఎరుగడు.

12 దేమేత్రిని గురించి అందరూ సదాభిప్రాయంతో మాట్లాడుకొంటారు. సత్యమే అతణ్ణి గురించి సదాభిప్రాయము కలిగిస్తుంది. మేము కూడా అతణ్ణి గురించి సదాభిప్రాయంతో మాట్లాడుకుంటున్నాము. మేము చెపుతున్నది నిజమని నీకు తెలుసు.

13 నేను నీకు వ్రాయవలసినవి ఎన్నో ఉన్నాయి. కాని సిరాతో, కలంతో వ్రాయాలని అనిపించటం లేదు. 14 నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. 15 నీకు శాంతి కలుగుగాక! ఇక్కడి స్నేహితులు తమ అభివందనాలు తెలుపుతున్నారు. అక్కడి స్నేహితుల్ని ఒక్కొక్కరిని పేరుతో పిలిచి అభివందనాలు తెలుపు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International