Historical
పౌలు తాను నిర్దోషినని వాదించటం
26 అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పకోవచ్చు!” అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: 2 “అగ్రిప్ప రాజా! ఈ రోజు మీ ముందు నిలుచొని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని రుజువు చేసుకోవటానికి అవకాశం కలగటం నా అదృష్టం. 3 మీకు యూదులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకొంటున్నాను.
4 “నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు. 5 వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్ఠగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు. 6 దేవుడు మన పూర్వికులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది. 7 ఈ వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాలవాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు. 8 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు?
9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను. 10 నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధానయాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను. 11 ఎన్నోసార్లు నేను ఒక సమాజమందిరమునుండి మరొక సమాజమందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.
యేసును చూశానని పౌలు సాక్ష్యమివ్వటం
12 “ఒక రోజు నేను, ప్రధాన యాజకుల అధికారంతో, అనుమతితో డెమాస్కసుకు వెళ్తున్నాను. 13 సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు, ఓ రాజా! నేను దారిలో ఉండగా ఆకాశంనుండి ఒక గొప్ప వెలుగు రావటం చూసాను. ఆ వెలుగు సూర్యునికన్నా యింకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద నాతో ఉన్నవాళ్ళ మీద ప్రకాశించింది. 14 మేమంతా నేలపై పడిపొయ్యాము. ఒక స్వరం హెబ్రీ భాషలో నాతో ఈ విధంగా అనటం విన్నాను: ‘సౌలా! సౌలా! నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటంవల్ల నీకే నష్టం కలుగుతుంది.’
15 “నేను, ‘మీరెవరు ప్రభూ!’ అని అడిగాను.
“‘నేను నీవు హింసిస్తున్న యేసును’ అని ప్రభువు జవాబు చెప్పాడు. 16 ‘ఇక లేచి నిలబడు, నిన్ను నా సేవకునిగా నియమించుకోవాలని అనుకున్నాను. నన్ను చూసిన ఈ సంఘటనను గురించి, నేను చూపబోయేవాటిని గురించి యితర్లకు చెప్పటానికి నిన్ను నియమించాలని నీకు ప్రత్యక్షమయ్యాను. 17 నిన్ను నీ వాళ్ళనుండి, యూదులుకాని వాళ్ళనుండి రక్షిస్తాను. 18 నీవు వాళ్ళని సత్యం అర్థం చేసుకొనేట్టు చేయగలవు. వాళ్ళు చీకటినుండి వెలుగుకు తిరుగుతారు. వాళ్ళు సాతాను శక్తినుండి మళ్ళుకొని దేవుని వైపు తిరుగుతారు. వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళతో కలిసి తమ స్థానం పొందాలని యిలా చేస్తున్నాను’అన్నాడు.
పౌలు తన సేవనుగూర్చి చెప్పటం
19 “అందువల్ల అగ్రిప్ప రాజా! ఆకాశంనుండి వచ్చిన దివ్య దర్శనమును నేను అతిక్రమించలేను. 20 మారు మనస్సు పొంది దేవుని వైపు మళ్ళమని, తమ నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సు అన్న విషయం పనుల ద్వారా రుజువు చేయమని ఉపదేశించాను. ఈ ఉపదేశం డెమాస్కసు ప్రజలతో మొదలు పెట్టి యెరూషలేములోని ప్రజలకు, యూదయలోని యితర ప్రజలకు, యూదులు కానివాళ్ళకు చెప్పాను.
21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. 22 కాని దేవుని దయ ఈనాటికీ నా మీద ఉంది. కనుక చిన్నా, పెద్దా అనే భేధం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. మోషే, మరియు ప్రవక్తలు జరుగనున్న వాటిని గురించి ముందే ఈ విధంగా చెప్పారు: 23 ‘క్రీస్తు మరణించవలసి వస్తుంది. కాని బ్రతికి వచ్చినవాళ్ళలో ఆయన మొదటివాడౌతాడు. తన ప్రజలకు, యూదులు కానివాళ్ళకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెపుతున్నాను.’ నేను వీళ్ళు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం లేదు.”
పౌలు అగ్రిప్పను ఒప్పించుటకు ప్రయత్నించటం
24 పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.
25 పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను. 26 రాజుకు యివన్నీ తెలుసు. నేను రాజుతో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టినుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు. 27 అగ్రిప్ప రాజా! నీవు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నావని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.
28 అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.
29 పౌలు, “సులభమో, కష్టమో! నీవే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.
30 రాజు లేవగానే రాష్ట్రాధిపతి, బెర్నీకే, మరియు వాళ్ళతో కూర్చున్నవాళ్ళు లేచి నిలుచున్నారు. 31 వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణదండన పొందటానికి కాని, కారాగారంలో ఉండవలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు. 32 అగ్రిప్ప ఫేస్తుతో, “ఇతడు చక్రవర్తికి విన్నపం చేయకుండా ఉండినట్లైతే విడుదల చేసి ఉండేవాణ్ణి!” అని అన్నాడు.
పౌలు రోమాకు వెళ్ళటం
27 మేము ఇటలీకి ఓడలో ప్రయాణం చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీలను “యూలి” అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు. 2 మేము ఆసియ తీరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియ అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియ ప్రాంతంలోని థెస్సలొనీకకు చెందిన అరిస్తార్కు అనేవాడు మా వెంట ఉన్నాడు.
3 మరునటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి, పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు. 4 అక్కడినుండి మళ్ళీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలి వీచని నీళ్లలో ప్రయాణం సాగించాము. 5 కిలికియ, పంఫూలియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ “లుకియ” ప్రాంతంలో ఉన్న “మూర” అనే పట్టణాన్ని చేరుకున్నాము. 6 మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న “అలెక్సంద్రియ” ఓడను చూసి, మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు.
7 ఎదురు గాలి వీస్తూవుండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా “క్నిదు” తీరాన్ని చేరుకున్నాము. ఎదురు గాలి వల్ల ముందుకు వెళ్ళలేక పోయ్యాము. అందువల్ల దక్షిణంగా వెళ్ళి “క్రేతు” ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని “సల్మోనే” తీరంగుండా ప్రయాణం సాగించాము. 8 ఆ నీళ్లలో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా “మంచి రేవులు” అనే స్థలాన్ని చేరుకున్నాము. ఈ తీరం లసైయ అనే పట్టణానికి దగ్గరగా ఉంది.
9 అప్పటికే చాలా కాలం వృథా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం[a] చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడమని చెబుతూ, 10 “ప్రజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు. 11 కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు. 12 వాళ్ళున్న రేవు చలి కాలంలో ఉండటానికి పనికిరాదు. కనుక అనేకులు ప్రయాణం సాగించమని సలహాయిచ్చారు. చలికాలం గడపటానికి “ఫీనిక్సు” అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫీనిక్సు రేవు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి, వాయవ్య దిశలనుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించటానికి వీలుంటుంది.
తుఫాను
13 దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. 14 అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. 15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. 16 “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. 17 దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.
18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు. 19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. 20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.
21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. 22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. 23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: 24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ 25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. 26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.
27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. 28 బుడుదు[b] నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. 29 ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. 30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. 31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. 32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.
33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. 34 ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. 35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. 36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. 38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.
ఓడ పగిలి పోవటం
39 సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. 40 త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. 41 కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది.
42 నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించుకున్నారు, 43 కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈద గలిగినవాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. 44 మిగతావాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
మెలితే ద్వీపం
28 తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే” అంటారని తెలుసుకున్నాము. 2 ఆ ద్వీపంలో నివసించేవాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. 3 పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. 4 ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు.
5 కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు. 6 వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తమ మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు.
7 ఆ ప్రక్కనున్న పొలాలు “పొప్లి” అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కారాలు చేసాడు. 8 పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 9 ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది.
10 ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణమయ్యేముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు.
రోమాకు రావటం
11 చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండిపోయిన ఒక ఓడలో మూడు నెలల తర్వాత ప్రయాణం చేసాము. అది అలెక్సంద్రియ నగరానికి చెందిన ఓడ. దాని పేరు “కవల దేవతలు.” 12 మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము. 13 మేము రేగియ నగరానికి వచ్చాము. మరుసటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలుదేర గలిగాము. ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము. 14 అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండమన్నారు. ఈ విధంగా రోమా చేరుకున్నాము. 15 రోమాలో ఉన్న సోదరులు మేము వస్తున్నామని విన్నారు. మమ్మల్ని కలుసుకోవటానికి వాళ్ళు అప్పీయా ఫోరన్,[c] ట్రెయిన్ టాబెర్న్ అనే గ్రామాల వరకు వచ్చారు. వీళ్ళను చూడగానే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలిగింది.
రోమా నగరంలో బోధించటం
16 మేము రోమా పట్టణం చేరుకున్నాక పౌలును ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సైనికుణ్ణి అతనికి కాపలాగా ఉంచారు.
17 మూడు రోజుల తర్వాత పౌలు యాదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వికుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏది చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోమా అధికారులకు అప్పగించారు. 18 వాళ్ళు విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు. 19 కాని, దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు. 20 ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు.
21 వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు: “యూదయనుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా మాట్లాడలేదు. 22 కాని అన్ని ప్రాంతలవాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
23 పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతలనుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 24 అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. 25 వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వికులతో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు:
26 ‘ప్రజలతో ఈ విధంగా చెప్పు:
మీరెప్పుడూ వింటుంటారు.
కాని ఎన్నటికి అర్థం చేసుకోరు!
మీరు అన్ని వేళలా చూస్తుంటారు.
కాని ఎన్నటికి గ్రహించరు.
27 వాళ్ళు కళ్ళతో చూసి,
చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని
నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను.
కాని అలా జరుగకూడదని ఈ ప్రజల
హృదయాలు ముందే మొద్దు బారాయి.
వాళ్ళకు బాగా వినిపించదు.
వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’(A)
28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” 29 [d]
30 పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చినవాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. 31 ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.
© 1997 Bible League International