Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 22-24

అహజ్యా యూదా రాజవటం

22 యెహోరాము స్థానంలో యెరూషలేము ప్రజలు అహజ్యాను[a] కొత్త రాజుగా చేసారు. అహజ్యా యెహోరాము యొక్క చిన్న కుమారుడు. అరబీయులతో యెహోరాము మీదికి వచ్చిన ప్రజలు యెహోరాము కుమారులందరినీ చంపివేశారుగాని, చిన్నవానిని మాత్రం వదిలారు. అందువల్ల అహజ్యా యూదాలో పరిపాలించగలిగాడు. అహజ్యా పరిపాలన ఆరంభించే నాటికి ఇరువది రెండేండ్లవాడు.[b] యెరూషలేములో అహజ్యా ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. అతల్యా తండ్రి పేరు ఒమ్రీ. అహాబు కుటుంబం నివసించిన తీరునే అహజ్యా నివసించాడు. అతడలా నివసించటానికి కారణం అతని తల్లి అతనిని దుష్టకార్యాలకు ప్రేరేపించటమే. యెహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం వారు సలహాదారులయ్యారు. వారు అహజ్యాకు తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని చావుకు దారితీశాయి. అహాబు కుటుంబం అతని కిచ్చిన సలహనే అహజ్యా పాటించాడు. ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో కలిసి అహజ్యా అరాము (సిరియా) రాజైన హజాయేలుపై యుద్ధానికి రామోత్గిలాదు పట్టణానికి వెళ్లాడు. యెహోరాము తండ్రి ఇశ్రాయేలు రాజైన అహాబు. కాని అరామీయులు (సిరియనులు) యుద్ధంలో యెహోరామును గాయపర్చారు. యెహోరాము తన గాయాలను నయం చేసికోటానికి యెజ్రెయేలుకు తిరిగి వెళ్లాడు. అరాము రాజైన హజాయేలుతో రామోతు వద్ద పోరాడుతుండగా అతడు గాయపడ్డాడు. పిమ్మట యెహోరామును చూడటానికి అహజ్యా (యెహోయహాజు) యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు. అహజ్యా తండ్రి పేరు యూదా రాజైన యెహోరాము. యెహోరాము తండ్రి పేరు అహాబు. యెహోరాము గాయపడటంతో అతడు యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు.

యెహోరామును చూడటానికి అహజ్యా వెళ్లినప్పుడు దేవుడు అతనికి మరణం కలుగజేశాడు. అహజ్యా వెళ్లి యెహోరాముతో కలిసి యెహూను చూడటానికి వెళ్లాడు. యెహూ తండ్రి పేరు నింషీ. అహాబు వంశాన్ని నాశనం చేయటానికి దేవుడు యెహూను నియమించాడు. అహాబు వంశాన్ని యెహూ నాశనం చేస్తూవున్నాడు. అప్పుడతడు యూదా పెద్దలను, అహజ్యా సేవలో వున్న అతని బంధువులను చూశాడు. యూదా పెద్దలను, అహజ్యా బంధువులను యెహూ చంపివేశాడు. పిమ్మట అహజ్యా కొరకు యెహూ వెదికాడు. అతడు సమరయ (షోమ్రోను) పట్టణంలో దాగుకొనే ప్రయత్నం చేస్తూండగా యెహూ మనుష్యులు అతనిని పట్టుకున్నారు. వారు అహజ్యాను యెహూ వద్దకు తీసుకొని వచ్చారు. వారు అహజ్యాను చంపి, సమాధి చేశారు. “అహజ్యా యెహోషాపాతు వారసుడు. యెహోషాపాతు యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు” అని వారు అన్నారు. యూదా రాజ్యాన్ని సమైక్యంగా వుంచే శక్తి అహజ్యా కుటుంబానికి లేదు.

రాణి అతల్యా

10 అహజ్యా తల్లి పేరు అతల్యా. తన కుమారుడు చంపబడ్డాడని తెలుసుకోగానే ఆమె యూదాలో రాజ వంశస్తుల నందరినీ చంపివేసింది. 11 కాని యెహోషెబతు[c] అనే స్త్రీ అహజ్యా కుమారుడైన యోవాషును దాచివేసింది. యోవాషును, అతని దాదిని యెహోషెబతు లోపలి పడకగదిలో దాచింది. యెహోషెబతు రాజైన యెహోరాము కుమార్తె. ఆమె యెహోయాదా భర్యా. యెహోయాదా ఒక యాజకుడు. పైగా యెహోషెబతు అహజ్యాకు సోదరి. యెహోషెబతు దాచిన కారణంగా, యోవాషును అతల్యా చంపలేకపోయింది. 12 ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా పరిపాలన కొనసాగింది.

యాజకుడైన యెహోయాదా, రాజైన యోవాషు

23 ఆరు సంవత్సరాల అనంతరం యెహోయాదా తనశక్తిని, ధైర్యాన్ని చూపించాడు. అతడు సైనికాధిపతులతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ అధిపతులు ఎవరంటే యెరోహాము కుమారుడు అజర్యా; యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలు; ఓబేదు కుమారుడైన అజర్యా; అదాయా కుమారుడైన మయశేయా; మరియు జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు. వారు యూదా రాజ్యమంతా తిరిగి, యూదా పట్టణాలలో వున్న లేవీయులను కూడ గట్టారు. వారు ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలనుకూడ కలుపుకున్నారు. పిమ్మట వారు యెరూషలేముకు వెళ్లారు. వీరంతా ఆలయంలో సమావేశమై రాజుతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు.

ఆ ప్రజలనుద్దేశించి యెహోయాదా యిలా అన్నాడు: “రాజకుమారుడు పరిపాలిస్తాడు. దావీదు సంతతి వారి విషయంలో యెహోవా ఇదే వాగ్దానం చేశాడు. ఇప్పుడు మీరు చేయవలసినదేమనగా: విశ్రాంతి దినాన విధులకు వెళ్లే యాజకులు, లేవీయులలో మూడవ వంతు వారు ద్వారాల వద్ద కాపలా వుండాలి. మీలో ఒక వంతు రాజు ఇంటి వద్ద వుండాలి. ఇంకొక వంతు ప్రధాన ద్వారం (పునాది ద్వారం) వద్ద నిఘావేయాలి. మిగిలిన వారంతా ఆలయ ఆవరణలలో వుండాలి. యెహోవా ఆలయంలో ఎవ్వరినీ ప్రవేశించనీయకండి. యాజకుడు, లేవీయులు పరిశుద్ధులు గనుక వారు మాత్రమే సేవ చేయటానికి లోనికి అనుమతింపబడాలి. వీరు మినహా, మిగిలిన వారంతా యెహోవా నిర్దేశించిన తమ తమ పనులను యధావిధిగా ఆచరించాలి. లేవీయులు రాజు వద్ద నిలవాలి. ప్రతి ఒక్కడూ తన కత్తిని తప్పక ధరించి వుండాలి. ఎవ్వడేగాని ఆలయంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే వానిని చంపి వేయండి. రాజు ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడ అతనితో వెళ్లాలి.”

యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినదంతా లేవీయులు, యూదా ప్రజలు అంగీకరించారు. యాజకుల వర్గాలలో ఎవ్వరినీ యాజకుడైన యెహోయాదా ఉపేక్షించి ఊరు కోలేదు. విశ్రాంతి దినాన బయటకు వెళ్లిన వారితో కలిసి ప్రతి సైన్యాధిపతి, అతని మనుష్యులు లోనికి వచ్చారు. యాజకుడైన యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, చిన్న పెద్ద డాళ్లను అధికారులకు ఇచ్చాడు. ఆ ఆయుధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి. 10 పిమ్మట యెహోయాదా ఎవరెక్కడ నిలబడాలో ఆ మనుష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కడూ తన ఆయుధాన్ని ధరించివున్నాడు. వారంతా ఆలయానికి కుడినుండి ఎడమ ప్రక్కకు బారులుదీరి నిలబడ్డారు. వారు బలిపీఠానికి, ఆలయానికి రాజుకు దగ్గరగా నిలబడ్డారు. 11 వారు రాజకుమారుణ్ణి బయటకు తీసికొని వచ్చి, వాని తలపై కిరీటం పెట్టారు. ఒక ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని అతనికిచ్చారు.[d] తరువాత వారు యోవాషును రాజుగా ప్రకటించారు. యెహోయాదా, అతని కుమారులు కలిసి యోవాషును అభిషిక్తుని చేశారు. వారు “రాజు చిరంజీవియగు గాక!” అని అన్నారు.

12 ప్రజలు ఆలయానికి పరుగెత్తే శబ్దం, రాజును ప్రశంసించే ధ్వనులు అతల్యా విన్నది. ఆమె ఆలయంలో వున్న ప్రజల వద్దకు వచ్చింది. 13 ఆమె రాజును పరికించి చూసింది. ముందు ద్వారం వద్ద రాజస్తంభం దగ్గర రాజు నిలబడి ఉన్నాడు. అధికారులు, బూరలు వూదే వారు రాజుదగ్గర వున్నారు. దేశప్రజలు చాలా సంతోషంగా వున్నారు. వారు బూరలు వూదుతూ వున్నారు. సంగీత వాద్య విశేషాలపై గాయకులు పాడుతున్నారు. ప్రజలందరి చేత దేవునికి స్తుతిగీతాలు గాయకులు తమతోపాటు పాడించారు. ఇదంతా చూచి కలత చెందిన అతల్యా తన బట్టలు చింపుకొని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.

14 యాజకుడైన యెహోయాదా సైన్యాధిపతులను బయటకు రప్పించాడు. “అతల్యాను బయటవున్న సైన్యం వద్దకు తీసుకొని వెళ్లండి. ఆమెను ఎవరైనా అనుసరిస్తే వారిని మీ కత్తులతో నరికి వేయండి” అని వారికి చెప్పాడు. “కాని, అతల్యాను ఆలయంలో మాత్రం చంపవద్దు” అని యాజకుడు సైనికులను హెచ్చరించాడు. 15 తర్వాత అతల్యా రాజ భవనపు అశ్వద్వారం వద్దకు వచ్చినప్పుడు వారామెను పట్టుకున్నారు. ఆమెను ఆ భవనం వద్దనే వారు చంపివేశారు.

16 అప్పుడు యెహోయాదా ప్రజలతోను, రాజుతోను ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారంతా యెహోవా భక్తులై ఆయనను అనుసరించటానికి ఒప్పుకున్నారు. 17 ఆ జనమంతా బయలు విగ్రహం ఆలయంలోకి వెళ్లి దానిని నిలువునా పగులగొట్టారు. బయలు ఆలయంలో వున్న బలిపీఠాలను, ఇతర విగ్రహాలను కూడ వారు నాశనం చేశారు. బయలు పీఠాల ముగింటనే బయలు దేవత యాజకుడైన మత్తానును చంపివేశారు.

18 పిమ్మట యెహోయాదా యెహోవా ఆలయ బాధ్యతలు స్వీకరించే యాజకులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు లేవీయులు. ఆలయ యాజమాన్యం పనిని దావీదు వారికి అప్పజెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం ఆ యాజకులు యెహోవాకు దహనబలులు సమర్పిస్తారు. దావీదు ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆనందోత్సాహాలతో బలులు అర్పించారు. 19 ఏరకంగానైనా సరే అపరిశుభ్రంగా ఎవ్వరూ ఆలయంలో ప్రవేశించకుండా యెహోయాదా ఆలయ ద్వారాల వద్ద కాపలాదారులను నియమించాడు.

20 యెహోయాదా సైన్యాధిపతులను, ప్రజానాయకులను, ప్రాంతీయ పాలకులను, ఇతర ప్రజలందరినీ తనతో తీసికొని వెళ్లాడు. ఆలయం నుండి రాజును కూడ తనతో తీసుకొని పై ద్వారం గుండా రాజభవనానికి వెళ్లాడు. అక్కడ వారు రాజును సింహాసనంపై కూర్చుండబెట్టారు. 21 యూదా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. అతల్యా కత్తివేటుకు గురియై చనిపోవటంతో యెరూషలేము నగరంలో శాంతి నెలకొన్నది.

యోవాషు ఆలయాన్ని పునరుద్ధరించుట

24 యోవాషు రాజయ్యేనాటికి ఏడేండ్లవాడు. అతడు యెరూషలేములో నలబై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా. జిబ్యా బెయేర్షెబా పట్టణ కాపురస్థురాలు. యాజకుడైన యెహోయాదా జీవించియున్నంత కాలం యోవాషు యెహోవా సన్నిధిని అన్నీ మంచి పనులు చేశాడు. యోవాషుకు ఇద్దరు భార్యలను యెహోయాదా ఎంపిక చేశాడు. యోవాషుకు కుమారులు, కుమార్తెలు కలిగారు.

కొంతకాలం తరువాత ఆలయాన్ని పునరుద్ధరించాలని యోవాషు నిర్ణయించాడు. యాజకులను, లేవీయులను, యోవాషు సమావేశపర్చి, “మీరు యూదా పట్టణాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలిచ్చే సొమ్మును జమచేయండి. ఆ ధనంతో మీ దేవుని ఆలయాన్ని పునరుద్ధరించండి. ఈ పని త్వరగా చేయండి” అని చెప్పాడు. కాని, లేవీయులు త్వరపడలేదు.

ప్రముఖ యాజకుడైన యెహోయాదాను రాజైన యోవాషు పిలిపించి, “యెహోయాదా, యూదా నుండి, యెరూషలేము నుండి లేవీయులు పన్ను వసూలు చేసి తీసుకొని వచ్చేలా నీవు ఎందుకు ఏర్పాటు చేయలేదు? యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పన్ను వసూళ్లను పవిత్ర గుడారానికై వెచ్చించే వారుగదా!” అని అన్నాడు.

గతంలో అతల్యా కుమారులు ఆలయంలో జొరబడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్నిటినీ వారు బయలు దేవుళ్ల ఆరాధనకు వినియోగించారు. అతల్యా ఒక దుష్ట స్త్రీ.

రాజైన యోవాషు ఒక పెట్టె చేయించి దానిని యెహోవా ఆలయ ద్వారం బయట పెట్టించాడు. పిమ్మట లేవీయులు యూదాలోను, యెరూషలేములోను ఒక ప్రకటన చేశారు. ప్రజలందరినీ పన్ను డబ్బు యెహోవా కొరకు తెమ్మని చెప్పారు. వారు ఎడారిలో వున్నప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను చెల్లించమని చెప్పినదే ఈ పన్నుధనం. 10 పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోషపడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి ఆ పెట్టెలో వుంచారు. ఆ పెట్టె నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూవచ్చారు. 11 తరువాత లేవీయులు ఆ పెట్టెను రాజాధికారుల యొద్దకు తీసుకొని వెళ్లారు. పెట్టె డబ్బుతో నిండివున్నట్లు వారు చూశారు. రాజు యొక్క కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెట్టెలోని డబ్బును బయటికి తీశారు. మళ్లీ ఆ పెట్టెను యధాస్థానంలో వుంచారు. వారలా అనేక పర్యాయాలు చేసి ధనాన్ని విశేషంగా సేకరించారు. 12 తరువాత రాజైన యోవాషు, యెహోయాదా ఆ ధనాన్ని ఆలయ పునరుద్ధరణకు పనిచేస్తున్న పనివారికి చెల్లించారు. ఆలయపు పనిలో నిమగ్నమైన వారు నిపుణులైన కొయ్యచెక్కడపు (నగిషీ) పనివారిని, వడ్రంగులను ఆలయ పునరుద్ధరణకై కిరాయికి నియమించారు. ఆలయ పునరుద్ధరణ పనికి ఇనుము, కంచు పనులలో మంచి అనుభవం వున్నవారిని కూడా వారు కిరాయికి నియమించారు.

13 పనిమీద తనిఖీకై నియమింపబడిన వారు చాలా నమ్మకస్థులు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దాని పూర్వరూపం ఏమాత్రం మార్చకుండా దానిని పునరుద్ధరించి, ఇంకా బలంగా తీర్చిదిద్దారు. 14 పని పూర్తయ్యాక, మిగిలిన డబ్బును రాజైన యోవాషుకు, యెహోయాదాకు వారు తిరిగి యిచ్చి వేశారు. వారాధనాన్ని ఇంకా ఆలయానికి కావలసిన వస్తుసామగ్రికి, పరికరాలకు వినియోగించారు. ఈ వస్తు సామగ్రిని ఆలయ ఆరాధనలోను, దహన బలులు సమర్పించటంలో వినియోగించారు. వెండి బంగారాలతో వారింకా గిన్నెలను, ఇతర పరికరాలను చేయించారు. యాజకులు యెహోవా ఆలయంలో యెహోయాదా బ్రతికివున్నంత కాలం దహనబలులు అర్పించారు.

15 యెహోయాదా వృద్ధుడయ్యాడు. అతడు దీర్ఘకాలం జీవించి పిమ్మట చనిపోయాడు. చనిపోయేనాటికి యెహోయాదా నూటముప్పై యేండ్ల వయస్సువాడు. 16 దావీదు నగరంలో రాజులను వుంచేచోట ప్రజలు యెహోయాదాను సమాధిచేశారు. ఇశ్రాయేలులో యెహోవాకు, ఆయన ఆలయానికి తన జీవిత కాలంలో ఎనలేని సేవ చేసినందువలన ప్రజలతనిని అక్కడ సమాధి చేశారు.

17 యెహోయాదా చనిపోయిన పిమ్మట, యూదా పెద్దలు వచ్చి రాజైన యోవాషుకు తలవంచి నమస్కరించారు. ఆ పెద్దల విన్నపాన్ని రాజు విన్నాడు. 18 రాజు, పెద్దలు కూడ యెహోవా ఆలయాన్ని తిరస్కరించారు. వారి పూర్వీకులు యెహోవా దేవుని ఆరాధించారు. ఇప్పుడు వీరు అషేరా దేవతా స్తంభాలను, ఇతర విగ్రహాలను పూజించటం మొదలు పెట్టారు. రాజు, ప్రజానాయకులు దుష్టనడక నడచిన కారణంగా దేవుడు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించాడు. 19 వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయటానికి యెహోవా వారివద్దకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ప్రజలను హెచ్చరించారు. అయినా ప్రజలు వారి హెచ్చిరికను పెడచెవిని పెట్టారు.

20 దేవుని ఆత్మ జెకర్యా మీదికి వచ్చింది. జెకర్యా తండ్రి యాజకుడైన యెహోయాదా. జెకర్యా ప్రజలముందు నిలబడి యిలా అన్నాడు: “దేవుడు యిలా చెబుతున్నాడు. ‘ప్రజలారా, యెహోవా ఆజ్ఞలను మీరు ఎందుకు మీరుతున్నారు.? మీరు విజయవంతులు కాలేరు. మీరు యెహోవాని వదిలిపెట్టారు. అందువల్ల దేవుడు కూడ మిమ్మల్ని వదిలివేస్తున్నాడు!’”

21 కాని ప్రజలు జెకర్యాకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. జెకర్యాను చంపమని రాజు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వటంతో, వారతనిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రజలీపని ఆలయ ఆవరణలో చేశారు. 22 రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు.

23 సంవత్సరాంతంలో అరాము (సిరియా) సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా, యెరూషలేములపై దండెత్తి ప్రజానాయకులందరినీ చంపివేశారు. వారు విలువైన వస్తువులన్నీ దోచుకుని వాటిని దమస్కు (డెమాస్కస్) రాజుకు పంపించారు. 24 అరాము సైన్యం ఒక చిన్న దండుగా వచ్చినప్పటికీ, యూదాకు చెందిన ఒక మహా సైన్యాన్ని ఓడించగలిగేలా యెహోవా వారికి తోడ్పడ్డాడు. వారి పూర్వీకులు ఆరాధించిన దైవాన్ని యూదా ప్రజలు వదిలి పెట్టిన కారణంగా యెహోవా ఈ పని చేశాడు. అందువల్లనే యోవాషు శిక్షింపబడ్డాడు. 25 అరామీయులు (సిరియనులు) యోవాషును వదిలి వెళ్లేటప్పటికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. యోవాషు స్వంత సేవకులే అతనిపై కుట్రపన్నారు. యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను యెవాషు చంపిన కారణంగా వారు అలా ప్రవర్తించారు. యోవాషును అతని పక్క మీదనే సేవకులు హత్యచేశారు. చనిపోయిన యోవాషును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారు. కాని రాజులను వుంచే చోట మాత్రం అతనిని వారు సమాధి చేయలేదు.

26 జాబాదు మరియు యెహోజాబాదు అనేవారు. యోవాషు మీద కుట్ర పన్నిన సేవకులు. జాబాదు తల్లి పేరు షిమాతు అమ్మోనీయురాలు. యెహోజాబాదు తల్లిపేరు షిమ్రీతు. షిమ్రీతు మోయాబు స్త్రీ. 27 యోవాషు కుమారుల గురించిన వృత్తాంతాలు, అతనిని గురించిన గొప్ప ప్రవచనాలు అతడు ఆలయాన్ని పునరుద్ధరించిన విధము మొదలైన విషయాలన్నీ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయ బడ్డాయి. అతని తరువాత అమజ్యా కొత్త రాజయ్యాడు. అమజ్యా యోవాషు కుమారుడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International