Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 11-14

11 రెహబాము యెరూషలేముకు వచ్చిన పిమ్మట ఒక లక్షాఎనబై వేలమంది కాకలు తీరిన సైనికులను సమీకరించాడు. ఈ సైనికులను యూదా, బెన్యామీను వంశాల నుండే ఎంపిక చేశాడు. వీరందరినీ ఇశ్రాయేలుపై దాడి చేసి ఆ రాజ్యాన్ని తిరిగి తన ఏలుబడిలోకి తీసుకొని రావటానికి సమీకరించాడు. కాని యెహోవా వాక్కు షెమయాకు వినవచ్చింది. షెమయా దైవజ్ఞుడు. యెహోవా యిలా చెప్పాడు: “షెమయా, నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతో మాట్లాడుము. యూదాలోను, బెన్యామీను ప్రాంతంలోను నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరితో కూడా మాట్లాడుము. వారికి యీలా చెప్పుము: యెహోవా తెలియజేయునదేమనగా: ‘మీరు మీ సోదరులతో యుద్ధం చేయరాదు! ప్రతి ఒక్కడూ తన ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి. ఇది యిలా జరిగేలా నేనే చేశాను’” కావున రాజైన రెహబాము, అతని సైన్యం యెహోవా మాట విని వెనుకకు వెళ్లి పోయారు. వారు యరొబాముపై దాడి చేయలేదు.

రెహబాము యూదాను బలపర్చటం

రెహబాము యెరూషలేములో నివసించాడు. పరాయి రాజుల దండయాత్రల నుండి రక్షణగా అతడు యూదాలో బలమైన నగరాలను నిర్మించాడు. బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, శోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరయీము, లాకీషు, అజేకా, 10 జొర్యా, అయ్యాలోను, మరియు హెబ్రోనులో గల నగరాలను బాగుచేయించాడు. యూదాలోను, బెన్యామీనులోనుగల ఈ నగరాలు బలమైనవిగా తీర్చిదిద్దబడ్డాయి. 11 రెహబాము ఈ నగరాలను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, నియమించాడు. ఆ నగరాలకు ఆహార పదార్థాలు, నూనె, ద్రాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు. 12 రెహబాము ప్రతి నగరంలో డాళ్లను, ఈటెలను కూడ వుంచి వాటిని చాలా బలమైనవిగా చేశాడు. యూదా, బెన్యామీను ప్రజల, నగరాలను రెహబాము తన అధీనంలో వుంచుకున్నాడు.

13 ఇశ్రాయేలులో వున్న యాజకులు, లేవీయులు అంతా రెహబాముతో ఒక అవగాహనకు వచ్చి, అతనితో కలిశారు. 14 లేవీయులు తమ పచ్చిక బీళ్లను, వారి స్వంత పొలాలను వదిలి యూదాకు, యెరూషలేముకు వచ్చారు. లేవీయులు ఇది ఎందుకు చేశారనగా యరొబాము, అతని కుమారులు తమను యెహోవా సేవలో, యాజకులుగా పని చేయటానికి తిరస్కరించారు.

15 ఉన్నత స్థలాలలో ఆరాధనలకై యరొబాము తన స్వంత యాజకులను ఎంపిక చేసుకొన్నాడు. ఆ గుట్టల మీద అతడు తాను చేసిన మేక, గిత్త దూడల విగ్రహాలను ప్రతిష్ఠించాడు. 16 లేవీయులు ఇశ్రాయేలును వదిలి పెట్టడంతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాలో విశ్వాసమున్న ఇశ్రాయేలు గోత్రాలవారంతా యెరూషలేముకు వచ్చారు. వారు తమ పూర్వీకుల దేవునికి బలులు అర్పించటానికి వచ్చారు. 17 వారంతా యూదా రాజ్యాన్ని బలమైనదిగా చేశారు. వారు సొలొమోను కుమారుడు రెహబాముకు మూడు సంవత్సరాలపాటు మద్దతు యిచ్చారు. ఆ విధంగా చేయటానికి కారణమేమనగా ఆ సమయంలో వారు దావీదు సొలొమోను నడిచిన రీతిగా నడుచుకున్నారు.

రెహబాము కుటుంబం

18 రెహబాము మహలతు అనే స్త్రీని వివాహం చేసికొన్నాడు. ఆమె తండ్రి పేరు యెరీమోతు. ఆమె తల్లి పేరు అబీహాయిలు. యెరీమోతు తండ్రి పేరు దావీదు. అబీహాయిలు తండ్రిపేరు ఏలీయాబు. ఏలీయాబు తండ్రిపేరు యెష్షయి. 19 రెహబాముకు మహలతు ద్వారా యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు. 20 పిమ్మట రెహబాము మయకాను వివాహం చేసికొన్నాడు. మయకా అబ్షాలోము మనుమరాలు.[a] రెహబాముకు మయకావల్ల అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు అనువారు పుట్టారు. 21 తన ఇతర భార్యల కన్న, దాసీల కన్న, రెహబాము మయకాను ఎక్కువగా ప్రేమించాడు. మయకా అబ్షాలోము మనుమరాలు. రెహబాముకు పద్ధెనిమిది మంది భార్యలు, అరవై మంది దాసీలు వున్నారు. రెహబాముకు ఇరవై ఎనిమిది మంది కుమారులు, ఇరవై మంది కుమార్తెలు వున్నారు.

22 అబీయాను అతని సోదరులపై నాయకునిగా రెహబాము నియమించాడు. అబీయాను రాజుగా చేసే వుద్దేశంతోనే రెహబాము ఈ పని చేశాడు. 23 రెహబాము చాలా తెలివిగా ప్రవర్తించాడు. తన కుమారులందరినీ యూదా, బెన్యామీను ప్రాంతాలలో వున్న బలమైన నగారాలన్నిటికీ పంపాడు. రెహబాము తన కుమారులకు ఆహారాది వస్తువులను పుష్కలంగా సరఫరా చేశాడు. తన కుమారులకు భార్యలను కూడా అతడు ఎంపిక చేశాడు.

ఈజిప్టు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తుట

12 రెహబాము చాలా శక్తివంతుడైన రాజయ్యాడు. అతడు తన రాజ్యాన్ని కూడ చాలా బలపర్చాడు. ఆ తరువాత రెహబాము, యూదా వంశంవారు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించటం మాని వేశారు.

రెహబాము రాజయ్యాక ఐదవ సంవత్సరంలో షీషకు యెరూషలేముపై దండెత్తాడు. షీషకు ఈజిప్టుకు రాజు. రెహబాము, యూదా ప్రజలు యెహోవాకు విశ్వాసపాత్రంగా లేకపోవుటచే ఇది జరిగింది. షీషకు వద్ద పన్నెండువేల రథాలు, అరవై వేల మంది గుర్రపు స్వారీ చేయగలవారు, మరియు ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది సైనికులు వున్నారు. షీషకు యొక్క మహా సైన్యంలో లిబ్యా సైనికులు (లూబీయులు), సుక్కీయులు, ఇథియోఫియనులు (కూషీయులు) వున్నారు. షీషకు యూదాలోని బలమైన నగరాలను ఓడించాడు. పిమ్మట షీషకు తన సైన్యాన్ని యెరూషలేముకు నడిపించాడు.

తరువాత ప్రవక్తయగు షెమయా రెహబాము వద్దకు, యూదా నాయకుల వద్దకు వచ్చాడు. ఆ యూదా నాయకులంతా షీషకుకి భయపడి యెరూషలేములో సమావేశమయ్యారు. షెమయా రెహబాముతోను, యూదా నాయకుల తోను యీలా చెప్పాడు, “యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ‘రెహబామూ, నీవు మరియు యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టారు. నా ధర్మశాస్త్రాన్ని పాటించటానికి నిరాకరించారు. ఇప్పుడు మిమ్మల్ని నా సహాయం లేకుండా షీషకును ఎదుర్కోటానికి వదిలి పెడుతున్నాను.’”

అది విన్న యూదా నాయకులు, రాజైన రెహబామును విచారించి, తమను తాము తగ్గించుకొని విధేయులయ్యారు. “యెహోవా న్యాయమైనవాడు” అని అన్నారు.

రాజు, యూదా పెద్దలు విధేయులైనట్లు యెహోవా గమనించాడు. పిమ్మట షెమయాకు యెహోవా వర్తమానం ఒకటి వినవచ్చింది. యెహోవా షెమయాతో యీలా చెప్పాడు: “రాజు, నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. కావున వారిని నేను నాశనం చేయను. పైగా వారికి వెంటనే రక్షణ కల్పిస్తాను. యెరూషలేము మీద నా కోపాగ్నిని కురిపించటానికి నేను షీషకును వినియోగించను. కాని యెరూషలేము ప్రజలు మాత్రం షీషకుయొక్క సేవకులౌతారు. నాకు సేవచేయటం ఇతర దేశాల రాజులను సేవించటంకంటె భిన్నమైనదని వారు తెలిసి కొనేటందుకే ఇది యీలా జరుగుతుంది.”

షీషకు యెరూషలేముపై దండెత్తి ఆలయాన్ని కొల్లగొట్టాడు. షీషకు ఈజిప్టు రాజు. అతడింకా రాజభవనంలో వున్న ఖజానాను కూడ కొల్లగొట్టాడు. షీషకు దొరికిన ప్రతి వస్తువును తీసుకొని, ధనరాశులను పట్టుకుపోయాడు. అతడింకా సొలొమోను చేయించిన బంగారు డాళ్లనుకూడా పట్టుకుపోయాడు. 10 రాజైన రెహబాము బంగారు డాళ్ల స్థానంలో కంచు డాళ్లను చేయించాడు. రాజభవన ప్రధాన ద్వారం వద్ద కాపలాదారుల అధిపతులకు రెహబాము కంచు డాళ్లను యిచ్చాడు. 11 రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు ద్వారపాలకులు కంచు డాళ్లను వెలికితీసి వాడేవారు. పిమ్మట వారు మళ్ళీ ఆ కంచు డాళ్లను ఆయుధాగారంలో వుంచేవారు.

12 రెహబాము తనను తాను తగ్గించుకున్న తరువాత, యెహోవా అతని పట్ల తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అందువల్ల యెహోవా రెహబామును పూర్తిగా నాశనం చేయలేదు. యూదాలో ఇంకా కొంత మంచితనం మిగిలివుంది.

13 యెరూషలేములో రెహబాము చాలా శక్తివంతమైన రాజుగా రూపొందాడు. అతడు రాజయ్యేనాటికి నలబై ఒక్క సంవత్సరాలవాడు. రెహబాము రాజుగా యెరూషలేములో పదిహేడు సంవత్సరాలు వున్నాడు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో యెహోవా తనపేరు ప్రతిష్ఠాపనకు యెరూషలేమునే ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి పేరు నయమా. నయమా అమ్మోను దేశస్తురాలు. 14 దేవుడైన యెహోవాను అనుసరించటం మాని రెహబాము చెడుకార్యాలకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు యెహోవాని అనుసరించాలని హృదయమందు తీర్మానించు కొనలేదు.

15 రెహబాము రాజైనప్పటి నుండి అతని పాలన అంతమయ్యేవరకు అతను చేసిన విషయాలన్నీ షెమయా రచనలలోను, ఇద్దో రచనలలోను పొందుపర్చబడ్డాయి. షెమయా ఒక ప్రవక్త. ఇద్దో ఒక దీర్ఘదర్శి వీరిద్దరూ కుటుంబ చరిత్రలు రాశారు. రెహబాము, యరొబాము రాజులిద్దరూ పాలించిన కాలంలో వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి, 16 రెహబాము చనిపోగా అతనిని దావీదు నగరంలో సమాధిచేశారు. పిమ్మట రెహబాము కుమారుడు అబీయా కొత్తగా రాజయ్యాడు.

యూదా రాజుగా అబీయా

13 ఇశ్రాయేలు రాజుగా యరొబాము[b] పద్దెనిమిదవ సంవత్సరంలో కొనసాగుతూ వుండగా, అబీయా యూదాకు కొత్తగా రాజయ్యాడు. అబీయా యెరూషలేములో మూడేండ్లు పాలించాడు. అబీయా తల్లి పేరు మయకా.[c] మయకా తండ్రి పేరు ఊరియేలు. ఊరియేలు గిబియా పట్టణంవాడు. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయాకు నాలుగు లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయా ఆ సైన్యాన్ని యుద్ధానికి నడిపించాడు. యరొబాముకు ఎనిమిది లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయాతో యుద్ధానికి యరొబాము సిద్ధమయ్యాడు.

అప్పుడు అబీయా కొండల దేశమైన ఎఫ్రాయిములో వున్న సెమరాయిము పర్వతం మీద నిలబడి యీలా అన్నాడు: “యరొబామూ, ఇశ్రాయేలీయులందరూ నేను చెప్పేది వినండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుకు, అతని కుమారులకు శాశ్వతంగా ఇశ్రాయేలు రాజులు కావటానికి హక్కు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి. ఉప్పు ఒడంబడిక[d] ద్వారా దావీదుకు దేవుడు ఈ హక్కు యిచ్చాడు. కాని యరొబాము యెహోవాకు వ్యతిరేకి అయ్యాడు! యరొబాము నెబాతు కుమారుడు. నెబాతు దావీదు కుమారుడైన సొలొమోను అధికారులలో ఒకడు. అయితే పనికి మాలిన, దుష్టవ్యక్తులు యరొబాముకు స్నేహితులయ్యారు. యరొబాము, ఆ చెడ్డ మనుష్యులే రెహబాముకు ఎదురు తిరిగారు అప్పుడు రెహబాము చిన్నవాడు. అనుభవంలేనివాడు. అందువల్ల యరొబామును, అతని చెడు స్నేహితులను రెహబాము అదుపులో పెట్టలేకపోయాడు.

“ఓ యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు. మీరు యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టారు. యాజకులు అహరోను సంతతివారు. మీ స్వంత యాజకులను మీరు ఎంపిక చేసుకున్నారు. ఇది పరదేశీయులు చేసే పద్ధతి. ఒక గిత్తను గాని, ఏడు గొర్రె పొట్టేళ్లనుగాని తీసుకొని తనను పరిశుద్ధునిగా చేసుకోవటానికి ఎవడు వచ్చినా అతడు దేవుళ్ళుకాని విగ్రహాలకు యాజకులు కావచ్చు.

10 “కాని, మా విషయానికి వస్తే యెహోవాయే మా దేవుడు. యూదా ప్రజలమైన మేము దేవునిపట్ల భయభక్తులు కలిగియున్నాము. మేము ఆయనను వదిలిపెట్టలేదు! యెహోవాను సేవించే యాజకులు అహరోను సంతతివారే. యెహోవా సేవలో యాజకులకు లేవీయులు తోడ్పడతారు. 11 వారు దహనబలులు, సుగంధద్రవ్యాలతో ధూపం నిత్యం ఉదయ సాయంకాలాల్లో సమర్పిస్తారు. ఆలయంలో ప్రత్యేకమైన బల్లమీద నైవేద్యపు రొట్టెలను వారు వరుసలలో పెడతారు. వారు ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభం నిలిపి ప్రమిదలు వెలిగిస్తారు. మన దేవుడైన యెహోవా ఆజ్ఞను మేము అనుసరిస్తాము. కాని యరొబామూ, నీవు మరియు నీతోవున్న ఇశ్రాయేలీయులూ యెహోవాను లక్ష్యపెట్టడంలేదు. మీరు ఆయనను వదిలి పెట్టారు. 12 దేవుడే మాకు తోడై వున్నాడు. ఆయనే మా అధిపతి. ఆయన యాజకులు మాతో వున్నారు. మీపై యుద్ధానికి యెహోవా యాజకులు బూరలు ఊది మమ్మల్ని పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడగు యెహోవా మీదికి యుద్ధానికి పోకండి. ఎందువల్లనంటే, మీరు విజయం పొందలేరు!”

13 కాని యరొబాము కొంతమంది సైనికులను అబీయా సైన్యం వెనుక చాటుగా పొంచి వుండటానికి పంపాడు. యరొబాము సైన్యం అబీయా సైన్యానికి ఎదురుగా వుంది. యరొబాము సైన్యం నుండి రహస్యంగా వెళ్లిన సైనికులు అబీయా సైన్యానికి వెనకగా వున్నారు. 14 యూదాకు చెందిన అబీయా సైన్యంలోని భటులు వెనుదిరిగి చూచినప్పుడు యరొబాము సైన్యం తమను ముందు నుండి, వెనుక నుండి ఎదుర్కొంటున్నట్లు భావించారు. యూదా సైనికులు యెహోవాను పిలిచారు. యాజకులు బూరలు ఊదారు. 15 పిమ్మట అబీయా సైన్యం కేకలు పెట్టింది. యూదా సైనికులు యుద్ధ నినాదాలు చేసినప్పుడు, దేవుడు యరొబాము సైన్యాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు నుండి వచ్చిన యరొబాము సైన్యాన్ని యూదా నుంచి వచ్చిన అబీయా సైన్యం ఓడించింది. 16 యూదా సైనికుల నుండి ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేలా దేవుడు యూదా సైన్యానికి తోడ్పడ్డాడు. 17 అబీయా సైన్యం ఇశ్రాయేలు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఐదులక్షల మంది ఇశ్రాయేలు యోధులు చనిపోయారు. 18 ఆ విధంగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడ్డారు; యూదా ప్రజలు గెలిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా మీద వారు ఆధారపడిన కారణంగా యూదా సైన్యం విజయం సాధించింది.

19 అబీయా సైన్యం యరొబాము సైన్యాన్ని తరిమి కొట్టింది. అబీయా సైన్యం యరొబాముకు చెందిన బేతేలు, యెషానా, ఎఫ్రోను పట్టణాలను పట్టుకుంది. వారు ఆ పట్టణాలతో పాటు వాటి పరిసర గ్రామాలను కూడా వశపర్చుకున్నారు.

20 అబీయా నివసించియున్నంత కాలం యరొబాము బలమైన రాజు కాలేకపోయాడు. యెహోవా యరొబామును చంపేశాడు. 21 అబీయా మిక్కిలి బలవంతుడైన రాజయ్యాడు అతడు పదునల్గురు స్త్రీలను వివాహమాడాడు. అతడు ఇరువై యిద్దరు కుమారులకు, పదహారుగురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. 22 అబీయా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయగు ఇద్దో రచనల్లో పొందుపర్చబడ్డాయి.

14 అబీయా తన పూర్వీకులతో నిద్రంచాడు. దావీదు నగరంలో ప్రజలు అతనిని సమాధి చేశారు. పిమ్మట అబీయా కుమారుడు ఆసా అతని స్థానంలో కొత్తగా రాజయ్యాడు. ఆసా పరిపాలనా కాలంలో పది సంవత్సరాలపాటు దేశంలో శాంతి నెలకొన్నది.

యూదా రాజుగా ఆసా

తన దేవుడైన యెహోవా దృష్టకి మంచివైన, న్యాయమైన పనులు ఆసా చేశాడు. విగ్రహాలను ఆరాధించటానికి వినియోగించిన వింత బలిపీఠాలను ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి, స్మారక శిలలను[e] పగులగొట్టాడు. అషేరా దేవతా స్తంభాలను[f] కూడా ఆసా విరుగగొట్టాడు. యూదా ప్రజలను దేవుడైన యెహోవాను అనుసరించమని ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరాధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు. యూదా పట్టణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను, ధూప పీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా వున్న కాలంలో రాజ్యంలో శాంతి నెలకొన్నది. యూదాలో శాంతి విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మించాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించటంతో ఆసాకు ఆ కాలంలో యుద్ధాలు లేవు.

ఆసా యూదా ప్రజలతో యిలా చెప్పాడు: “మనమీ పట్టణాలను నిర్మించి, వాటిచుట్టూ ప్రాకారాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలను, ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాము. ఈ దేశంలో ఇంకను నివసిస్తూండగానే మనమీ పనులు చేద్దాము. ఈ దేశం మనది. ఎందువల్లననగా మన ప్రభువైన దేవుని మనం అనుసరించాము. మనచుట్టూ ఆయన మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు.” పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం సాధించారు.

ఆసాకు మూడు లక్షలమంది యూదా వంశాల వారున్న సైన్యం; రెండు లక్షల ఎనబై వేలమంది బెన్యామీను కుటుంబాలకు చెందిన వారు సైన్యం వున్నాయి. యూదా సైనికులు పెద్ద పెద్ద డాళ్లను, ఈటెలను ధరించారు. బెన్యామీను సైనికులు చిన్న డాళ్లను ధరించి, ధనుస్సులతో బాణాలు వేయగల నేర్పరులు. వారంతా బలమైన, ధైర్యంగల సైనికులు.

పిమ్మట జెరహు అనేవాడు ఆసా మీదికి దండెత్తాడు. జెరహు ఇథియోపియావాడు.[g] జెరహు సైన్యంలో పదిలక్షలమంది సైనికులు, మూడు వందల రథాలు వున్నాయి. జెరహు సైన్యం మారేషా వరకు చొచ్చుకు వచ్చింది. 10 జెరహును ఎదుర్కోవటానికి ఆసా బయలుదేరి వెళ్లాడు. మారేషా వద్ద జెపాతా లోయలో ఆసా సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యింది.

11 ఆసా తన దేవుడైన యెహోవాకు యిలా ప్రార్థన చేశాడు “ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను రక్షించేవాడవు నీ వొక్కడివే! ఓ ప్రభూ, మా దైవమా మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి యున్నాము. ఈ మహా సైన్యాన్ని నీ పేరుతో మేము ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర నీయకుము!”

12 పిమ్మట యెహోవా ఆసా వద్దవున్న యూదా సైన్యాన్ని ఇథియోపియా (కూషు) సైన్యాన్ని ఓడించటానికి వినియోగించాడు. ఇథియోపియా సైన్యం పారిపోయింది. 13 ఆసా సైన్యం ఇథియోపియా సైన్యాన్ని గెరారు పట్టణం వరకు తరుముకుంటూ పోయింది. ఇథియోపియా సైనికులు అనేకమంది చనిపోవటంతో యుద్ధం చేయటానికి మళ్లీ వారు ఒక సైన్యంగా కూడ గట్టుకోలేకపోయారు. యెహోవా చేత, ఆయన సైన్యం చేత వారు అణచివేయబడ్డారు. శత్రుసైన్యం నుండి ఆసా, మరియు అతని సైనికులు అనేక విలువైన వస్తువులను దోచుకున్నారు. 14 ఆసా మరియు అతని సైన్యం గెరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను ఓడించారు. ఆ పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. ఆ పట్టణాలలో విలువైన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. ఆ విలువైన వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది. 15 ఆసా సైన్యం గొర్రెల కాపరులు నివసించే ప్రాంతాల మీద కూడా దాడి చేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటెలను పట్టుకుపోయారు. తరువాత ఆసా సైన్యం యెరూషలేముకు వెళ్లిపోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International