Historical
దావీదు వివిధ రాజ్యాలను జయించుట
18 తరువాత దావీదు ఫిలిష్తీయులపైకి దండెత్తి వారిని ఓడించాడు. ఫిలిష్తీయులనుండి గాతు నగరాన్ని, దాని చుట్టు ప్రక్కలనున్న పట్టణాలను వశపర్చుకున్నాడు.
2 పిమ్మట దావీదు మోయాబు దేశాన్ని ఓడించాడు. మోయాబీయులు దావీదుకు దాసులయ్యారు. వారు బంగారం, ఇతర కానుకలను దావీదుకు కప్పంగా చెల్లించారు.
3 హదదెజెరు సైన్యంతో కూడ దావీదు యుద్ధం చేశాడు. సోబా రాజు హదదెజెరు. ఆ సైన్యంలో దావీదు హమాతు పట్టణం వరకు యుద్ధం నిర్వహించాడు. దావీదు అలా ఎందుకు యుద్ధం చేశాడనగా హదదెజెరు తన సామ్రాజ్యాన్ని యూఫ్రటీసు నదివరకు విస్తరింపచేయటానికి ప్రయత్నించాడు. 4 హదదెజెరుకు చెందిన వెయ్యి రథాలను, ఏడువేల రథసారధులను, ఇరవైవేల మంది కాల్బలాన్ని దావీదు వశపర్చుకున్నాడు. హదదెజెరుకు చెందిన రథాల గుర్రాలలో చాలా వాటి కాళ్లను దావీదు విరుగగొట్టాడు. కాని వందరథాలను లాగటానికి కావలసినన్ని మంచి గుర్రాలను మాత్రం దావీదు రక్షించాడు.
5 దమస్కు నగరంలోని అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయపడే నిమిత్తం వచ్చారు. హదదెజెరు సోబాకు రాజు. కాని దావీదు వారిని ఓడించి ఇరవై రెండు వేల సిరియను సైనికులను చంపివేశాడు. 6 తరువాత దావీదు అరాము దేశంలోగల దమస్కు నగరంలో తన సైనిక స్థావరాలు నెలకొల్పాడు. అరామీయులు దావీదుకు సేవకులై కప్పం చెల్లించారు. ఆ విధంగా దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయాన్ని చేకూర్చాడు.
7 హదదెజెరు సైన్యాధికారుల నుండి బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. 8 తెబహు (టిబ్హతు), కూను పట్టణాల నుండి దావీదు చాలా కంచును పట్టుకువచ్చాడు. ఈ పట్టణాలు హదదెజెరుకు చెందినవి. తరువాత కాలంలో లోహాన్నే సొలొమోను ఆలయానికి, కంచు సముద్రం, కంచు స్తంభాలు, ఇతర వస్తు సామగ్రి చేయటానికి వినియోగించాడు.
9 హమాతు రాజు పేరు తోహూ. సోబారాజు పేరు హదదెజెరు. హదదెజెరు సైన్యాన్నంతా దావీదు ఓడించాడని తోహూ విన్నాడు. 10 తోహూ తన కుమారుడైన హదోరమును రాజైన దావీదు వద్దకు తాను శాంతి కోరుతున్నట్లు, తనను దీవించమని అడగటానికి పంపాడు. హదదెజెరుతో దావీదు యుద్ధం చేసి అతనిని ఓడించిన సందర్భంగా తోహూ ఇది చేసాడు. ఇంతకు ముందు తోహూ కూడ హదదెజెరుతో యుద్ధం చేసియున్నాడు. హదోరము తనతో వెండి, బంగారం, కంచు లోహాలతో చేసిన రకరకాల వస్తువులు దావీదుకు కానుకలుగా తీసుకొని వెళ్లి ఇచ్చాడు. 11 రాజైన దావీదు ఆ వస్తువులన్నిటినీ పవిత్రపరచి యెహోవాకు సమర్పించాడు. పైగా ఎదోము, మోయాబుల నుండి, అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయులనుండి, అమాలేకీయుల నుండి తెచ్చిన వెండి బంగారాలను కూడ దావీదు యెహోవాకి సమర్పించాడు.
12 సెరూయా కుమారుడైన అబీషై “ఉప్పులోయ” అని పిలవబడే స్థలంలో పద్దెనిమిదివేల ఎదోమీయులను చంపివేసాడు. 13 ఎదోములో అబీషై సైనిక స్థావరాలు కూడ ఏర్పాటు చేసాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.
దావీదు ముఖ్య అధికారులు
14 ఇశ్రాయేలంతటికీ దావీదు రాజు. ప్రతి పౌరునికీ ఏది మంచిదో, న్యాయమైనదో దావీదు వారికి అది చేశాడు. 15 సెరూయా కుమారుడు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దావీదు చేసిన విషయాలన్నీ గ్రంథ రూపంలో రాశాడు. 16 సాదోకు, అబీమెలెకు యాజకులు. సాదోకు తండ్రి పేరు అహీటూబు. అబీమెలెకు తండ్రి అబ్యాతారు. షవ్షా లేఖకుడు. 17 కెరేతీయులకు, పెలేతీయులకు (రాజు అంగరక్షకులు) నాయకుడుగా బెనాయా నియమితుడయ్యాడు. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. దావీదు కుమారులు ముఖ్యవ్యక్తులై దావీదు రాజుకు సహాయకులుగా వున్నారు.
దావీదు మనుష్యులను అమ్మోనీయులు అవమాన పరచటం
19 అమ్మోనీయుల రాజు పేరు నాహాషు. నాహాషు చనిపోగా అతని కుమారుడు నూతన రాజయ్యాడు. 2 ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్లారు.
3 అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు.” 4 దానితో దావీదు మనుష్యులను హానూను బంధించి వారి గడ్డాలు[a] గొరిగించాడు. తొడల దగ్గర వారి బట్టలు కూడ హానూను కత్తిరించాడు. తరువాత వారిని పంపివేశాడు.
5 దావీదు మనుష్యులు ఆ పరిస్థితిలో ఇంటికి వెళ్లటానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంత మంది మనుష్యులు దావీదు వద్దకు వెళ్లి అతని మనుష్యులకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న దావీదు తన మనుష్యులకు ఇలా కబురు పంపాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత మీరు ఇండ్లకు తిరిగిరండి.”
6 ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్లు గుర్తించారు. దానితో హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పౌనుల[b] (రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపొతేమియా (అరామ్నహరయీము) నుండి రథాలను, రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, వాటిని తోలే వారిని సేకరించారు. 7 అమ్మోనీయులు ముప్పది రెండువేల రథాలను కొన్నారు. వారు మయకా రాజుకు, అతని సైన్యానికి కొంత సొమ్ము చెల్లించి వారి సహాయాన్ని కూడ అర్థించారు. మయకా రాజు, అతని సైనికులు వచ్చి మెదెబా పట్టణం వద్ద గుడారాలు వేశారు. అమ్మోనీయులు తమ పట్టణాల నుండి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు.
8 అమ్మోనీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని దావీదు విన్నాడు. అతను యోవాబును, ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ అమ్మోనీయులను ఎదుర్కోటానికి పంపాడు. 9 అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు నగర ద్వారం వద్ద వున్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు వారి సేనలతో బయట పొలాలలో దిగియుండిరి.
10 తనపై యుద్ధం చేయటానికి రెండు సైనిక కూటాలవారు సిద్ధంగా వున్నట్లు యోవాబు చూశాడు. ఒక వర్గం తనముందు, రెండవ వర్గం తన వెనుక వున్నాయి. అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సైన్యంలో కాకలు తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని అరాము సైన్యంతో పోరాడటానికి పంపాడు. 11 యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై అధీనంలో వుంచాడు. యోవాబు సోదరుడే అబీషై. ఆ సైనికులు అమ్మోనీయుల సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. 12 అబీషైతో యోవాబు ఇలా అన్నాడు: “అరాము సైన్యం గనుక నామీద పైచేయిగా వుంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ అమ్మోనీయుల సైనికులు గనుక నీ శక్తికి మించివుంటే నేను నీకు సహాయంగా వస్తాను. 13 మన ప్రజల కొరకు, మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో మనం చాలా ధైర్యంగా వుండాలి! యెహోవా ఏది మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయుగాక!”
14 యోవాబు, అతని సైనికులు కలిసి అరాము నుండి వచ్చిన సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అరాము సైన్యం యోవాబు సైనికుల ధాటికి తట్టుకోలేక పారిపోయింది. 15 అరాము సైన్యం పారిపోవటం అమ్మోను సైనికులు చూసి, వారు కూడ పారిపోయారు. వారు అబీషైకి, అతని సైన్యానికి జడిసి పారిపోయారు. అమ్మోనీయులు తమ నగరంలోకి వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
16 ఇశ్రాయేలు తమను ఓడించినట్లు అరాము నాయకులు అర్థం చేసుకున్నారు. యూఫ్రటీసు నదికి తూర్పున నివసిస్తున్న అరామీయులను సహాయంగా రమ్మని వారు కబురు పంపారు. అరాముకు చెందిన హదదెజెరు సైన్యానికి షోపకు అధిపతి. అరాములో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సైన్యాలను కూడ షోపకు నడిపించాడు.
17 అరాము ప్రజలు యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త దావీదు విన్నాడు. అందువల్ల దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమీకరించాడు. దావీదు వారిని యోర్దాను నదిని దాటించాడు. వారు అరామీయులకు ఎదురుపడి నిలబడ్డారు. దావీదు తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తపరచి అరామీయులతో తలపడ్డాడు. 18 ఇశ్రాయేలీయుల నుండి అరామీయులు పారిపోయారు. దావీదు, అతని సైనికులు కలిసి ఏడువేల మంది అరాము రథసారధులను, నలుబదివేల మంది అరాము సైనికులను చంపివేశారు.
19 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని హదదెజెరు సైన్యాధికారులు తెలుసుకొని, దావీదుతో సంధి చేసుకొన్నారు. వారు దావీదుకు సేవకులయ్యారు. అటు తరువాత అరామీయులు ఎన్నడూ అమ్మోనీయులకు సహాయం చేయలేదు.
అమ్మోనీయులను యోవాబు నాశనం చేయటం
20 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలం) లో యోవాబు ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి నడిపాడు. సంవత్సరంలో అది రాజులు దండ యాత్రలు చేయటానికి అనువైన సమయం. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే వున్నాడు. ఇంతలో ఇశ్రాయేలు సైన్యం అమ్మోను రాజ్యం మీదికి దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సైనికులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దానిపై దాడిచేసారు.
2 తరువాత దావీదు వచ్చి ఆ రాజు తలపై కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం డెబ్బై ఐదు పౌనుల (రెండు మణుగుల) బరువుంది. కిరీటంలో విలువైన రత్నాలు పొదగబడ్డాయి. ఆ కిరీటం దావీదు తలపై పెట్టబడింది. రబ్బా నగరం నుండి దావీదు అనేక విలువైన వస్తు సామగ్రిని తెప్పించాడు. 3 రబ్బా నగర వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాలతోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బలవంతంగా పని చేయించాడు. ప్రతి అమ్మోనీయుల నగరంలోను దావీదు ఈ విధంగానే చేసాడు. తరువాత దావీదు, అతని సైన్యం యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
ఫిలిష్తీ యోధుల సంహారం
4 ఇదంతా అయిన పిమ్మట ఇశ్రాయేలు ప్రజలు గెజెరు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో తలపడ్డారు. ఈసారి హుషాతీయుడైన సిబ్బెకై సిప్పయి అను వానిని చంపివేసాడు. సిప్పయి ఫిలిష్తీ యోధుల సంతతివాడు. దానితో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారికి బానిసలయ్యారు.
5 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పైకి మరోసారి యుద్ధానికి వెళ్లారు. యాయీరు కుమారుడైన ఎల్హానాను అనేవాడు లహ్మీని చంపాడు. లహ్మీ అనేవాడు గొల్యాతు సోదరుడు. గొల్యాతు గాతు పట్టణానికి చెందినవాడు. లహ్మీ చేతిలోని ఈటె చాలా పెద్దది. బరువైనది. అది నేతగాని మగ్గం దోనెవలె వుంటుంది.
6 గాతు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు వారు మరొక యుద్ధం చేశారు. ఈ పట్టణంలో చాలా పొడుగైన మనిషి ఒకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఇరవై నాలుగు వేళ్లున్నాయి. వాని ప్రతి చేతికి, ప్రతి కాలికి ఆరేసి వేళ్లు చొప్పున వున్నాయి. అతడు కూడ ఫిలిష్తీయుల రెఫాయిము సంతానంలోనివాడే. 7 ఆ మనుష్యుడు ఇశ్రాయేలు వారిని చూచి ఎగతాళి చేసినప్పుడు, యోనాతాను వానిని చంపివేశాడు. యోనాతాను తండ్రి పేరు షిమ్యా. షిమ్యా దావీదుకు సోదరుడు.
8 ఆ ఫిలిష్తీయులంతా గాతు పట్టణానికి చెందిన రెఫాయిము సంతానమే. దావీదు, అతని సేవకులు కలిసి ఆ రాక్షసులనందరినీ చంపివేసారు.
© 1997 Bible League International