Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 16-17

16 దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు. దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు. అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.

ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు. వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణ, సితార వాద్యాలను వాయించేవారు. యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు. అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.

దావీదు కృతజ్ఞతా స్తోత్ర గీతం

యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి.
    యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.
యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి.
    యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!
10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి;
    యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖసంతోషాలు పొందెదరు గాక!
11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి.
    ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.
13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డలారా,
    యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.
14 యెహోవాయే మన దేవుడు
    ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది!
15 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు.
    ఆయన మాట వేయితరాల పంట!
16 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక.
    అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం
17 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు.
    అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక.
18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను.
    వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!”
    అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు.
19 దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే.
    వారు ఆ రాజ్యంలో పరాయి వారు.
20 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు.
    వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు.
21 కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు.
    యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.
22 “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు;
    నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!”
    అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు.
23 భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి!
    యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి!
24 యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి.
    దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!
25 యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి
    అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి.
26 ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే!
    కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.
27 యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు.
    యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు!
28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!
29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి!
    మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి
    యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!
30 భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి.
    కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు.
31 భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక!
    “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!
32 సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక!
    పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబుచ్చుగాక!
33 అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి!
    ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు.
34 ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు!
    యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది.
35 “మా సంరక్షకుడవగు ఓ దేవా!
    మమ్ములను రక్షింపుము!
మమ్ములను ఒక దగ్గరికి చేర్చి
    మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము.
అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము.
    మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.
36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
    సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక!

అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!

37 పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు. 38 ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెడ్రి పేరు యెదూతూను.

39 యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు. 40 దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు. 41 హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక. 42 హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.

43 పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.

దావీదుకు దేవుని వాగ్దానం

17 దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”

“నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు.

కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు:

“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు. 5-6 ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్కడికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక నాయకులను నేను ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు గొర్రెల కాపరులవలె వున్నారు. ఇశ్రాయేలులో నేను ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లెటప్పుడు ఆ నాయకులెవ్వరితోనూ, “మీరు నాకు దేవదారు కలపతో ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు?” అని నేను అనలేదు.’

“కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను. నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను. ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లక్రింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు. 10 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను.

“‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను.[a] 11 నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను. 12 నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను. 13 నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను 14 ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’”

15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు.

దావీదు ప్రార్థన

16 అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు:

“యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు. 17 వాటన్నిటికీ మించి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు! 18 నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు! 19 యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు! 20 నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు! 21 ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు! 22 ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు!

23 “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి! 24 నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు ‘సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని’ ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.

25 “నా దేవా, నీవు నాకొక నివాసం ఏర్పాటు చేస్తాను అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను మనోధైర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను. 26 యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు. 27 యెహోవా, నా కుటుంబాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహరించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగుతుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా నీ ఆశీర్వాదం పొందుతుంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International