Historical
సౌలు కుటుంబానికి కష్టాలు రావటం
4 హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, అతని ప్రజలు చాలా గాభరా చెందారు. 2 సౌలు సైన్యంలో దళాధిపతులైన ఇరువురు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో ఒకని పేరు బయనా, మరియొకని పేరు రేకాబు. బయానా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు బెన్యామీను వంశానికి[a] చెందిన వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెందినది. 3 కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు.
4 సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారిక్రిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.
5 రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు. 6-7 రేకాబు, బయనా గోధుమలు తీసుకొని వెళ్లాలనే నెపంతో నట్టింట్లోకి వచ్చారు. ఇష్బోషెతు తన పడకగదిలో పక్కమీద పడుకున్నాడు. రేకాబు, బయనాలిద్దరూ ఇష్బోషెతును పొడిచి చంపారు. వారు అతని తల నరికి దానిని వారితో తీసుకొనిపోయారు. రాత్రంతా ప్రయాణం చేసి, 8 హెబ్రోనుకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదుకు ఇచ్చారు.
రేకాబు, బయనాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!”
9 రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు. 10 ఒకానొకడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. వాడు వచ్చి, ‘సౌలు చచ్చిపోయాడు!’ అని చెప్పాడు. ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితోషికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని సిక్లగు వద్ద చంపివేశాను. 11 కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్కమీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!”
12 దావీదు కొందరు యువకులను పిలిచి రేకాబు, బయనాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు రేకాబు, బయనాల కాళ్లు, చేతులు నరికి, హెబ్రోను మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధి వద్ద పాతి పెట్టారు.
ఇశ్రాయేలీయులు దావీదును రాజు చేయటం
5 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం![b] 2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”
3 ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.
4 పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు. 5 హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.
దావీదు యెరూషలేమును జయించుట
6 రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులుదేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు.[c] ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు”[d] అని అన్నారు. 7 కాని దావీదు సీయోను కోటను[e] వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.
8 ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం[f] ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గ్రుడ్డివారు ఇంట్లోకి[g] రాలేరని” అంటారు.
9 దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో[h] నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు. 10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.
11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు. 12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.
13 దావీదు యెరూషలేము నుండి పెక్కు మంది దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమార్తెలు కలిగారు. 14 యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల పేర్లు: షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా మరియు ఎలీపేలెటు.
ఫిలిష్తీయుల పైకి దావీదు యుద్దానికి పోవటం
17 ఇశ్రాయేలీయులు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలిష్తీయులంతా దావీదును చంపాలని వెదకటం మొదలు పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక కోటలోకి వెళ్లాడు. 18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగారు.
19 దావీదు ప్రార్థన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దానికి వెళ్లనా? ఫిలిష్తీయులను ఓడించటంలో నాకు సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు.
“వెళ్లు. ఫిలిష్తీయులను ఓడించటంలో నీకు నేను తప్పక సహాయం చేస్తాను” అని యెహోవా చెప్పాడు.
20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి, ఫిలిష్తీయులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించినట్లు, యెహోవా నా శత్రువులను నాముందు చెల్లాచెదురై పారిపోయేలా చేసాడు,” అని అనుకున్నాడు దావీదు. ఆ కారణం చేత దావీదు ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[i] అని పేరుపెట్టాడు. 21 ఫిలిష్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని మనుష్యులు ఆ విగ్రహాలన్నిటినీ తీసుకొని వెళ్లారు.
22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.
23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో. 24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”
25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుముకుంటూ పోయి చంపాడు.
దేవుని పవిత్ర పెట్టెను యెరూషలెముకు తరలించుట
6 దావీదు మరల ప్రత్యేకంగా ఉత్తములైన ముప్పదివేల మంది ఇశ్రాయేలు యోధులను సమకూర్చుకొన్నాడు. 2 దావీదు వారిని తీసుకొని యూదాలో ఉన్న బాలాకు[j] ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెట్టె తీసుకొని, దానిని యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర పెట్టె సైన్యములకు అధిపతియైన యెహోవా పరమ పవిత్ర నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్టె పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైయున్నాడు. 3 దావీదు మనుష్యులు యెహోవా పవిత్ర పెట్టెను ఒక కొత్త బండిపై ఉంచారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి వారా పెట్టెను తెచ్చారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహ్యో అనువారు ఆ బండిని తోలారు.
4 కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి ఉజ్జా, అహ్యోలిరువురూ ఆ బండిని బయలుదేరదీశారు. బండిపై దేవుని పవిత్ర పెట్టె వున్నది. అహ్యో బండిముందు నడుస్తూ ఉన్నాడు. 5 దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి. 6 దావీదు మనుష్యులు నాకోను నూర్పిడి కళ్లం దగ్గరకు రాగానే ఎద్దులు తూలి పడబోయాయి. దానితో బండి మీదవున్న దేవుని ఒడంబడిక పెట్టె ఒరిగి క్రింద పడబోయింది. వెంటనే ఉజ్జా పవిత్ర పెట్టెను పట్టుకున్నాడు. 7 యెహోవాకు ఉజ్జాపై కోపం వచ్చి చంపివేశాడు.[k] దేవుని పవిత్ర పెట్టెను తాకినప్పుడు ఉజ్జా దేవుని గౌరవించినట్లు గాదు. దేవుని పవిత్ర పెట్టెవలన ఉజ్జా చంపబడ్డాడు. 8 ఉజ్జాను యెహోవా చంపినందుకు దావీదు కలత చెందాడు. దావీదు ఆ స్థలానికి “పెరెజ్ – ఉజ్జా”[l] అని పేరు పెట్టాడు. ఆ ప్రదేశం ఈనాటికీ పెరెజ్ – ఉజ్జా అనే పిలవబడుతూ వుంది.
9 ఆ రోజు దావీదు యెహోవా అంటే భయపడిపోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర పెట్టె నా వద్దకు ఎలా వస్తుంది?” అని అడిగాడు. 10 దావీదు పురములోనికి తనకై తాను దేవుని పవిత్ర పెట్టెను దావీదు తీసుకొని పోవుటకు సుముఖత చూపలేదు. గాతువాడైన ఓబేదెదోము[m] ఇంటిలో పవిత్ర పెట్టెను దావీదు వుంచాడు. బాటమీద నుంచి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటివరకు పవిత్ర పెట్టెను దావీదు మోసాడు. 11 ఓబేదెదోము ఇంటి వద్ద యెహోవా పవిత్ర పెట్టె మూడు నెలలపాటు వుండెను. కాబట్టి ఓబేదెదోమును, అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు.
12 ప్రజలు దావీదు వద్దకు వచ్చి, “దేవుని పవిత్ర పెట్టె అక్కడున్న కారణాన యెహోవా ఓబేదెదోము కుటుంబాన్ని, అతని వస్తువాహనాలను ఆశీర్వదించాడు” అని చెప్పారు. దానితో దావీదు ఓబేదెదోము ఇంటి నుండి దేవుని ఒడంబడిక పెట్టెను ఆనందోత్సాహాలతో తేవటానికి వెళ్లాడు. 13 యెహోవా పవిత్ర పెట్టెను మోసేవారు ఆరడుగులు నడిచి ఆగగా, దావీదు ఒక ఎద్దును, ఒక బలిసిన దూడను బలియిచ్చాడు. 14 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని ధరించాడు.
15 యెహోవా పవిత్ర పెట్టెను నగరంలోకి తెస్తూవుండగా దావీదు, ఇశ్రాయేలీయులంతా సంతోషంతో కేకలు వేశారు. బూరలు ఊదారు. 16 సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది.
17 పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు.
18 దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు. 19 నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
మీకాలు దావీదును అవమానించటం
20 దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి వెళ్లాడు. కాని సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు.[n] సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది.
21 అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ తండ్రనీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయకునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను. 22 బహుశః నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!”
23 ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలుగానే చనిపోయింది.
© 1997 Bible League International