Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మత్తయి 15-16

దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం

(మార్కు 7:1-23)

15 కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి, “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు.

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు? దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు. 5-6 కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు,

‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు.
    కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి.
వాళ్ళ ఆరాధనలు వ్యర్థం!
    వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’”(A)

అని అన్నాడు.

10 యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. 11 మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు.

12 ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు.

13 యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది. 14 వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు.

15 పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు.

16 యేసు, “మీక్కూడా అర్థంకాలేదా? 17 నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? 18 కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. 19 ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి. 20 వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు.

యేసు యూదులు కాని స్త్రీకి సహాయం చేయటం

(మార్కు 7:24-30)

21 యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది.

23 యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు.

24 యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల[a] కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు.

25 ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది.

26 యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు.

27 “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది.

28 అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.

యేసు అనేకులను నయం చేయటం

29 యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.

30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. 31 మూగ వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు నయమైపోయింది. కుంటి వాళ్ళు నడిచారు. గ్రుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు.

యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మార్కు 8:1-10)

32 యేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళపట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్ఛ పడిపోతారు” అని అన్నాడు.

33 ఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు.

34 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” యేసు అడిగాడు.

“ఏడు రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

35 యేసు ప్రజల్ని కూర్చోమన్నాడు. 36 ఆ తర్వాత ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు. 37 అందరూ సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు. 38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. 39 యేసు ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి వెళ్ళాడు.

కొందరు యేసు అధికారాన్ని సందేహించటం

(మార్కు 8:11-13; లూకా 12:54-56)

16 పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, “ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాక్కూడా చూపండి” అని అడిగారు.

ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు. ఉదయం ఆకాశం ఎఱ్ఱగావుండి, ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు కాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం? దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు అద్భుతకార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు.

శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం

(మార్కు 8:14-21)

శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు. యేసు వాళ్ళతో, “జాగ్రత్త! పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి” అని అన్నాడు.

ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు” అని అన్నారు.

వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు. మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? 10 మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? 11 నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు.

12 ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది.

యేసే క్రీస్తు

(మార్కు 8:27-30; లూకా 9:18-21)

13 యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు.

14 వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.

15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు.

16 సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు.

17 యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. 18 నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. 19 దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు.

20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.

యేసు పొందనున్న మరణం

(మార్కు 8:31–9:1; లూకా 9:22-27)

21 అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు.

22 పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.

23 యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు.

24 యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 25 తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. 26 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని[b] పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు? 27 మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. 28 ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International