Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 15

యూదా మీద అజర్యా పరిపాలన

15 ఇశ్రాయేలు రాజుగా యరొబాము పరిపాలన చేసే 27వ సంవత్సరమున యూదాకు రాజైన అమాజ్యా కుమారుడు అజర్యా రాజయ్యాడు. అతను పరిపాలన ప్రారంభించేనాటికి, అజర్యా 16 సంవత్సరముల వయస్సు గలవాడు. యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అజర్యా తల్లి పేరు యెరూషలేముకు చెందిన యెకొల్యా. తన తండ్రి అమాజ్యావలె, అజర్యా యెహోవా మంచివని చెప్పిన పనులు చేశాడు. అతని తండ్రి అమాజ్యా చేసిన వాటినే అజర్యా అనుసరించాడు. కాని అతను ఉన్నత స్థానాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాల్లో[a] ప్రజలింకా బలులు అర్పించుచూ, ధూపం వేయుచుండిరి.

యెహోవా అజర్యా రాజును కుష్ఠరోగిగా చేశాడు. అతను మరణించేంత వరకు కుష్ఠరోగియే. అజర్యా విడిగా ఒక ఇంట్లో ఉన్నాడు. రాజు కుమారుడైన యోతాము రాజభవన సంరక్షణలో శ్రద్ధ వహించాడు. ప్రజలను న్యాయ విచారణ చేశాడు.

అజర్యా చేసిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. అజర్యా మరణించగా, దావీదు నగరంలో అతని పూర్వీకులతో పాటు సమాధి చేయబడ్డాడు. అజర్యా కుమారుడు యెతాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

ఇశ్రాయేలు మీద జెకర్యా కొద్ది కాలపు పరిపాలన

యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలులోని షోమ్రోనుపై ఆరు నెలలు పరిపాలించాడు. ఇది యూదా రాజుగా అజర్యా పరిపాలనకు వచ్చిన 38వ సంవత్సరమున జరిగింది. యెహోవా తప్పు అని చెప్పిన పనులు జెకర్యా చేశాడు. అతని పూర్వీకులు చేసిన వాటినే అతను చేసాడు. నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలవల్ల ఇశ్రాయేలును పాపమునకు పాల్పడజేసిన ఆ పాపకార్యాలను అతను ఆపలేదు.

10 యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యాకు విరోధంగా కుట్రపన్నాడు. షల్లూము జెకర్యాను ప్రజల ముందర చంపివేశాడు. అతని తర్వాత షల్లూము క్రొత్తగా రాజయ్యాడు. 11 జెకర్యా చేసిన ఇతర పనులన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి. 12 ఈ విధంగా యెహోవా చెప్పినవన్నీ నిజమయ్యాయి. యెహూ యొక్క సంతతిలోని నాలుగు తరాల వారు ఇశ్రాయేలు రాజులుగా ఉందురని యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలు మీద షల్లూము కొద్దికాలము అధికారం చేయుట

13 యాబేషు కుమారుడైన షల్లూము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఇది యూదా రాజుగా ఉజ్జియా పరిపాలన చేసే 39వ సంవత్సరంలో జరిగింది. షోమ్రోనులో షల్లూము ఒక నెల పరిపాలించాడు.

14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సానుండి షోమ్రోనుకు వచ్చాడు. మెనహేము యాబేషు కుమారుడైన షల్లూమును చంపివేశాడు. తర్వాత మెనహేము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

15 షల్లూము చేసిన అన్ని పనులు జెకర్యాకు విరుద్ధంగా అతని పథకములతో సహా “ఇశ్రయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి.

ఇశ్రాయేలులో మెనహేము పరిపాలన

16 షల్లూము మరణానంతరం, మెనహేము తిప్సహు ఆ పరిసర ప్రాంతాన్ని ఓడించాడు. అతనికై ప్రజలు నగరద్వారాన్ని తెరవడానికి అంగీకరించలేదు. అందువల్ల మెనహేము వారిని ఓడించాడు. నగరంలోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చాడు.

17 అజర్యా యూదా రాజుగా వున్న 39వ సంవత్సరమున, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. షోమ్రోనులో మెనహేము పది సంవత్సరాల పాటు పరిపాలించాడు. 18 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు మెనహేము చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీయులను పాపాలకు గురిచేసిన ఆ పాపాలను మెనహేము ఆపలేదు.

19 అష్షూరు రాజయిన పూలు ఇశ్రాయేలుకు ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. మెనహేము పూలుకు 75,000 పౌన్ల వెండి ఇచ్చాడు. పూలు మెనహేముకి సహాయపడుననీ, మెనహేము రాజ్యాన్ని బలిష్ఠం చేయుననీ అనుకుని అతను అలా చేశాడు. 20 ధనవంతులూ, అధికారం గలవారూ పన్నులు చెల్లించునట్లుగా చేసి మెనహేము డబ్బును వసూలు చేశాడు. మెనహేము ప్రతి వ్యక్తికీ 20 తులాల వెండి పన్నుగా విధించాడు. తర్వాత మెనహేము అష్షూరు రాజుకి ఆ డబ్బు ఇచ్చాడు. అందువల్ల అష్షూరు రాజు ఇశ్రాయేలును విడిచి వెళ్లాడు.

21 మెనహేము చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరితగ్రంథంలో” వ్రా యబడినవి. 22 మెనహేము మరణించగా, అతని పూర్వికులతో పాటు, అతడు సమాధి చేయబడ్డాడు. మెనహేము కుమారుడు పెకహ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

ఇశ్రాయేలులో పెకహ్యా పరిపాలనఏ

23 అజర్యా యూదా రాజుగా వున్న 50 వ సంవత్సరమున, మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. పెకహ్యా రెండేండ్లు పాలించాడు. 24 యెహోవా తప్పని చెప్పిన కార్యాలను పెకహ్యా చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలును పాపకార్యాలకు గురిచేసిన ఆ పాపాలను పెకహ్యా ఆపలేదు.

25 పెకహ్యా సైన్యానికి అధిపతి అయిన పెకహు రెమల్యా కుమారుడు. పెకహు రాజైన పెకహ్యాకు విరోధముగా పన్నాగము చేశాడు. అతనిని షోమ్రోనులోని రాజభవనములో అతను చంపాడు. గిలాదునుంచి వచ్చిన 50 మంది మనుష్యులు పెకహ్యాని చంపేటప్పుడు పెకహుతో పాటువున్నారు. అతని తర్వాత పెకహు క్రొత్తగా రాజయ్యాడు.

26 పెకహ్యా చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.

ఇశ్రాయేలులో పెకహు పరిపాలన

27 యూదా రాజుగా అజర్యా వున్న 52వ సంవత్సరమున షోమ్రోనులోని ఇశ్రాయేలుని రెమల్యా కొడుకైన పెకహు పరిపాలించసాగాడు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలించాడు. 28 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు పెకహు చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుని పాపానికి గురిచేసిన ఆ పాపాలను పెకహు ఆపలేదు.

29 అష్షూరు పాలకుడైన తిగ్లత్పిలేసెరు ఇశ్రాయేలుకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా పెకహు వున్న కాలంలో ఇది జరిగింది. తిగ్లత్పిలేసరు, ఈయోను, ఆబేల్బేత్మయకా, హాసోరు, గిలాదు, యానోయహు కెదెషు గలిలయ మరియు నఫ్తాలీ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ అన్ని స్థలాలనుండి తిగ్లత్పిలేసరు ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకు వెళ్లాడు.

30 హోషేయా కొడుకు ఏలా, రెమల్యా కొడుకు పెకహు మీద పన్నాగం పన్నాడు. హోషేయా పెకహును చంపివేశాడు. అప్పుడు హోషేయా పెకహుకు పిదప క్రొత్తగా రాజు అయ్యాడు. ఇది ఉజ్జియా కొడుకు యోతాము యొక్క 20వ సంవత్సరం యూదా పరిపాలనలో జరిగింది.

31 పెకహు చేసిన అన్ని ఘనకార్యములు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

యూదాపై యోతాము పరిపాలన

32 ఉజ్జియా కుమారుడైన యోతాము యూదాకు రాజయ్యాడు. రెమల్యా కొడుకైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న రెండవ సంవత్సరంలో ఇది జరిగింది. 33 యోతాము రాజయినప్పుడు, అతను 25 యేండ్లవాడు. యోతాము యెరూషలేములో 16 సంవత్సరాలు పాలించాడు. యోతాము తల్లి పేరు యెరూషా. ఆమె సాదోకు కుమార్తె. 34 తన తండ్రి ఉజ్జియావలె, యెహోవా మంచివని చెప్పిన పనులు యోతాము చేశాడు. 35 కాని అతను ఉన్నత స్థలాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాలలో ప్రజలు నేటికి బలులు అర్పించుచూ ధూపం వేయుచున్నారు. యెహోవా ఆలయానికి గల పై ద్వారమును యోతాము నిర్మించాడు. 36 యోతాము చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

37 ఆ సమయమున, సిరియా రాజయిన రెజీనును, రెమల్యా కొడుకైన పెకహును యూదాకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి యెహోవా పంపాడు.

38 యోతాము మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను అతని పూర్వికుడైన దావీదు పేరు మీదగల నగరంలో సమాధి చేయబడ్డాడు. యోతాము కుమారుడు అహాజు అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

2 దినవృత్తాంతములు 26

యూదా రాజుగా ఉజ్జియా

26 తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. ఎలతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు.

తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేముకు చెందిన స్త్రీ. యెహోవా అతని నుండి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలు కొనసాగించాడు. తన తండ్రి అమజ్యావలెనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.

ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు. ఫిలిష్తీయులతోను, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతోను, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన యుద్ధాలలో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దులవరకు ఉజ్జియా పేరు ప్రతిష్ఠలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడగుటచే ఉజ్జియా ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు.

యెరూషలేములో మూలద్వారాం వద్ద, లోయ ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపర్చాడు. 10 ఎడారిలో సహితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావుల కూడా తవ్వించాడు. కొండల (మన్యం) ప్రాంతంలోను, మైదాన ప్రాంతాలలోను అతనికి పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువైన కొండలయందు, మైదానములందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్షతోటల పెంపకంలో శ్రద్ధవహించే రైతులు కూడ అతనికి వున్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు.

11 ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సైన్యం ఉంది. కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా అనేవారు సైన్యాన్ని, వివిధ భాగాలుగా విభజించారు. వారి పైఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా సైనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజించారు. హనన్యా రాజాధికారులలో ఒకడు. 12 సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు. 13 వంశాలవారీ ఎంపికైన సైన్యాధికారుల క్రింద మొత్తం మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో కాకలు తీరిన సైనికులున్నారు. ఆ సైనికులు శత్రువుల నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు. 14 ఉజ్జియా సైన్యానికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు కవచాలు విల్లంబులు, ఒడిసెల రాళ్లు సరఫరా చేశాడు. 15 మేధావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారుచేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసిరి వేయటం మొదలైన పనులు చేసేవి. ఉజ్జియా చాలా ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం అందటంతో అతను చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.

16 ఉజ్జియా గొప్పవాడు కావటంతో పాటు, గర్విష్ఠి కూడా అయ్యాడు. అతని గర్వమే అతని వినాశనానికి కారణమయ్యింది. అతని దేవుడైన యెహోవాకు అతడు విశ్వాసపాత్రుడు కాలేదు. బలిపీఠం మీద ధూపం వేయటానికి అతడు ఆలయంలోకి వెళ్లాడు. 17 యాజకుడైన అజర్యా, మరియు ధైర్యంగల యెహోవా సేవకులు ఎనుబది మంది ఉజ్జియాను వెంబడించి ఆలయంలోకి వెళ్లారు. 18 ఉజ్జియా తప్పు చేస్తున్నట్లు వారతనిని మందలించారు. వారు యిలా అన్నారు: “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటం నీ పనికాదు. ఈ పని చేయటం నీకు మంచిది కాదు. యాజకులైన అహరోను సంతానంవారు మాత్రమే యెహోవాకు ధూపం వేయాలి. ధూపం వేసే పవిత్ర కార్యానికి ఈ యాజకులు శిక్షణ పొందారు. ఈ అతిపవిత్ర స్థలం నుండి నీవు బయటకు పొమ్ము. నీవు విశ్వాసంగా లేవు. ప్రభువైన యెహోవా నీ ఈ ప్రవర్తనకు నిన్ను గౌరవించడు!”

19 కాని ఉజ్జియాకు కోపం వచ్చింది. అతని చేతిలో ధూపకలశం ఉంది. యాజకులపట్ల ఉజ్జియా కోపగించుకుంటూ ఉండగనే అతని నుదటిపై కుష్ఠురోగం[a] పుట్టింది. ఆలయంలో ధూపపీఠం ప్రక్కనేవున్న యాజకుల ముందే ఇది జరిగింది. 20 ప్రధాన యాజకుడైన అజర్యా, మరియు ఇతర యాజకులు ఉజ్జియా వైపు చూశారు. అతని నుదటి మీద కుష్ఠు రోగాన్ని వారు చూడగలిగారు. యాజకులు వెంటనే ఉజ్జియాను ఆలయం నుండి బయటికి తరిమేశారు. యెహోవా అతనిని శిక్షకు గురిచేసిన కారణంగా ఉజ్జియా తనకుతానే బయటకు వచ్చాడు. 21 రాజైన ఉజ్జియా కుష్ఠురోగి అయ్యాడు. అతడు యెహోవా ఆలయంలో మళ్లీ ప్రవేశించలేక పోయాడు. ఉజ్జియా కుమారుడు యోతాము రాజగృహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజు తరపున ప్రజాపాలకుడయ్యాడు.

22 మొదటి నుండి చివరి వరకు ఉజ్జియా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. యెషయా తండ్రిపేరు ఆమోజు. 23 ఉజ్జియా చనిపోయినప్పుడు అతనిని అతని పూర్వీకుల దగ్గరగా సమాధిచేశారు. ఉజ్జియా కుష్ఠురోగి కావటంవల్ల రాజుల శ్మశాన వాటికకు దగ్గరలోవున్న పొలంలో అతడు సమాధి చేయబడ్డాడు. పిమ్మట ఉజ్జియా స్థానంలో అతని కుమారుడు యోతాము కొత్త రాజు అయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International