Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 9-11

ఒక యువ ప్రవక్తతో యెహూని అభిషేకించమని ఎలీషా చెప్పుట

ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల బృందంలో ఒకనిని పిలిచి, అతనితో ఎలీషా, “ఈ చిన్న నూనె సీసాని నీచేతిలో తీసుకుని వెళ్లడానికి నీవు సిద్ధంగా ఉండు. రామోత్గిలాదుకు వెళ్లు. నీవక్కడికి చేరుకోగానే, నింషీ కుమారుడైన యెహోషాపాతు కుమారుడగు యెహూ నీకు కనిపిస్తాడు. అతని సోదరులలోనుండి అతనిని చాటుగా పిలిచి, తర్వాత ఒక గదిలోకి తీసుకు వెళ్లు. చిన్న నూనె సీసా తీసుకుపోయి, యెహూ తలమీద నూనె పోసి ఈరీతిగా చెప్పు. ఇది యెహోవా చెప్పింది. ఇశ్రాయేలీయుల కొత్తరాజుగా నిన్ను అభిషేకించాను. తర్వాత నీవు తలుపు తెరిచి పారిపో. అక్కడ నిలిచి వుండవద్దు” అన్నాడు.

అందువల్ల ఈ యువ ప్రవక్త రామోత్గిలాదుకు వెళ్లాడు. ఆ యువకుడు అక్కడకు చేరగానే, అతను సైన్యాధిపతులు అక్కడ కూర్చుని వుండటం చూశాడు. “అధిపతీ! నీకు నేనొక సందేశం తెచ్చాను” అని ఆ యువకుడు చెప్పాడు.

“మేమందరము ఇక్కడున్నాము. ఎవరికి సందేశం?” అని యెహూ అడిగాడు.

“అధిపతీ! నీకే సందేశం” అని యువకుడు చెప్పాడు.

యెహూ లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు యువ ప్రవక్త యెహూను అభిషేకించాడు. ఆ యువ ప్రవక్త యెహూతో ఈ విధంగా చెప్పాడు: “యెహోవా యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే కొత్తరాజుగా నిన్ను అభిషేకించానని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నీ రాజైన అహాబు వంశాన్ని నీవు నాశనం చెయ్యాలి. కాబట్టి నా సేవకులు, ప్రవక్తలు, యెహోవా యొక్క మనుష్యుల మరణానికి కారణమైన యెజెబెలును శిక్షిస్తున్నాను. అందువల్ల అహాబు వంశీయులందరూ మరణిస్తారు. అహాబు వంశంలో మగపిల్లవాడెవ్వడూ బతకనీయకుండా చేస్తాను. ఆ మగబిడ్డ సేవకుడైనా సరే స్వతంత్రుడైనా సరే భేదము లేదు. నెబాతు కుమారుడైన యరొబాము వంశంవలె, అహీయా కుమారుడైన బయెషా వంశంవలె అహాబు వంశాన్ని చేస్తాను. 10 యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలుని కుక్కలు తింటాయి, యెజెబెలు సమాధి చేయబడదు.”

ఆ తర్వాత యువ ప్రవక్త తలుపు తెరిచి పరుగెత్తుకొని పోయాడు.

యెహూని రాజుగా సేవకులు ప్రకటించుట

11 యెహూ తన రాజ ఉద్యోగుల వద్దకు వెళ్లాడు. ఒక అధికారి యెహూతో, “అంతా మంచిగా వున్నదా? ఈ పిచ్చివాడు నీ వద్దకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు.

ఆ సేవకులకు యెహూ ఇలా సమాధాన మిచ్చాడు. “ఆ వ్యక్తిని గురించి నీకు తెలుసు. అతను చెప్పే పిచ్చి విషయాలు నీకు తెలుసు.”

12 అధికారులు, “కాదు నిజం చెప్పు. అతడు ఏమి చెప్పాడు?” అని అడిగాడు. ఆ యువ ప్రవక్త చెప్పిన విషయాలు యెహూ అధికారులకు, “అతడు చెప్పిన దేమనగా, ‘ఇశ్రాయేలుకు కొత్తరాజుగా నేను నిన్ను అభిషేకించానని యెహోవా చెప్పాడు’ అని అతను నాకు చెప్పాడు.”

13 తర్వాత ప్రతి అధికారి వెంటనే తమ దుస్తులు తీసివేసి, యెహూ ఎదుట మెట్లమీద పరిచారు. ఆ తర్వాత, “యెహూ రాజు” అని బూర ఊది ప్రకటించారు.

యెహూ యెజ్రెయేలుకు వెళ్లుట

14 అందువల్ల యెహోషాపాతు కుమారుడైన యెహూ, యెహోరాముకు విరుద్ధంగా పధక రచన చేసెను. యెహోషాపాతు నింషీ కుమారుడు.

ఆ సమయమున యెహోరాము మరియు ఇశ్రాయేలు వాళ్లు సిరియాకు రాజయిన హజాయేలుకు వ్యతిరేకంగా రామోత్గిలాదును కాపాడటానికి ప్రయత్నించారు. 15 సిరియా రాజయిన హజాయేలుకు ప్రతికూలంగా యెహోరాము రాజు యుద్ధం చేశాడు. కాని సిరియనులు యెహోరాము రాజును గాయపరిచారు. అతను ఆ గాయాల నుంచి బయటపడటానికి యెజ్రేయేలుకు వెళ్లాడు.

అందువల్ల యెహూ అధికారులను ఉద్దేశించి, “నేను కొత్త రాజని మీరు సమ్మతించినట్లయితే, ఇప్పుడు ఎవరినీ నగరం నుంచి తప్పించుకొనకుండా చేయండి. ఎందుకనగా, ఈ విషయం యెజ్రెయేలీయులతో చెప్పకూడదు” అని పలికాడు.

16 యెజ్రెయేలులో యెహోరాము మంచము పట్టి విశ్రాంతి పొందుచున్నాడు. అందువల్ల యెహూ తన రథమెక్కి, యెజ్రెయేలుకు వెళ్లాడు. యూదా రాజయిన అహజ్యా యెహోరామును చూడడానికి యెజ్రెయేలుకు వచ్చాడు.

17 యెజ్రెయేలులోని ఒక గోపురం మీద ఒక కాపలావాడు నిలబడివున్నాడు. యెహూ యొక్క పెద్ద సైన్యం రావడం అతను చూశాడు. “చాలా మంది మనుష్యులు వచ్చుట చూస్తున్నాను.” అని అతను చెప్పాడు.

“వారిని కలుసుకునేందుకు ఎవరినైనా గుర్రం మీద పంపుము. ఆ మనుష్యులు శాంతికోసం వస్తున్నారో లేదో కనుక్కోమని ఈ దూతతో చెప్పుము” అని యెహోరాము చెప్పాడు.

18 అందువల్ల ఆ దూత యెహూని కలుసుకోవడానికి గుర్రమెక్కి వెళ్లాడు. వార్తహరుడు, “మీరు శాంతికోసం వచ్చారా? లేదా అని యెహోరాము, అడుగుతున్నాడు” అని పలికాడు.

“శాంతితో నీకేమీ పని లేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని యెహూ చెప్పాడు.

“దూత ఆ బృందం వద్దకు వెళ్లాడు. కాని ఇంత వరకూ తిరిగి రాలేదు” అని కాపలాదారుడు యెహోరాముతో చెప్పాడు.

19 తర్వాత యెహోరాము రెండవ దూతను గుర్రంమీద పంపాడు. ఈ వ్యక్తి యెహూ బృందం వారి వద్దకు వచ్చి, “యెహోరాము రాజు శాంతి అని చెప్పుచున్నాడు” అన్నాడు.

“నీకు శాంతితో ఏమీ పనిలేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని సమాధానమిచ్చాడు.

20 “రెండవ దూత బృందం వద్దకు వెళ్లాడు. కాని అతను కూడా ఇంకా తిరిగి రాలేదు. పిచ్చివానివలె, ఒకడు అతని రథం నడుపుతున్నాడు. నింషీ కుమారుడైన యెహూవలె నడుపుతున్నాడు” అని కాపలాదారుడు యెహోరాముతో అన్నాడు.

21 “నా రథం తీసుకుని రా” అని యెహోరాము చెప్పాడు.

అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథమును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోరాము, యూదా రాజయిన అహజ్య, ఇద్దరూ రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు యెజ్రెయేలియుడైన నాబోతు పొలం వద్ద యెహూని కలుసుకున్నారు.

22 యెహోరాము యెహూని చూసి, “యెహూ, నీవు శాంతికోసం వచ్చావా?” అని అడిగాడు.

“నీ తల్లి యెజెబెలు వ్యభిచారము, చేతబడితనము ఘోరముగా చేయుచుండగా సమాధానం ఎక్కడనుండి వచ్చును?” అన్నాడు.

23 యెహోరాము గుర్రాలను వెనక్కి పరుగు తీయించాడు. యెహోరాము అహజ్యాను చూసి “అహజ్యా, ఇది ఒక మాయోపాయం” అని చెప్పి, పారిపోవుచు ఉండెను.

24 అప్పుడు యెహూ తన బలంకొద్దీ బాణం లాగి యెహోరాముని వీపుమీద కొట్టగా, ఆ బాణం యెహోరాము గుండెలోనుండి దూసుకొని వెళ్లగా, యెహోరాము తన రథం మీదనే మరణించాడు.

25 యెహూ తన అధిపతియైన బిద్కరుతో, “యెహోరాము దేహాన్ని పైకి ఎత్తి, యెజ్రెయేలులో నాబోతు పొలంలోకి విసిరివేయుము. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు, నేను యెహోరాము తండ్రి అయిన అహాబుతో కలిసి పయనం చేసినప్పుడు, ఇది అతనికి జరుగునని యెహోవా చెప్పాడు. 26 ‘నిన్న నాబోతు అతని కుమారుల రక్తం నేను చూశాననీ, అందువల్ల ఈ పొలంలో అహాబును శిక్షించెదననీ’ యెహోవా చెప్పెను. కావున, యెహోవా చెప్పినట్లు ఈ కళేబరాన్ని తీసుకొని పొలంలోకి విసరుము అనెను.”

27 యూదా రాజయిన అహజ్యా దీనిని చూసి పారిపోయాడు. అతను ఉద్యానవన గృహంద్వారా తప్పించుకొనడానికి ప్రయత్నించాడు. యెహూ అతనిని అనుసరించాడు. “అహజ్యా తన రథంలోకి వెళ్లినా, అతనిని చంపి వేయుము” అని యెహూ చెప్పాడు.

అందువల్ల యెహూ మనుష్యులు అహజ్యాను ఇబ్లెయాము దగ్గర గూరునకు వెళ్లే బాటమీద కొట్టగా అహజ్యా మెగిద్దోకు పారిపోయి అతను అక్కడ మరణించాడు. 28 అహజ్యా సేవకులు అహజ్యా శరీరాన్ని రథంలో తీసుకొని యెరూషలేముకు వెళ్లారు. వారు అహజ్యాను దావీదు నగరంలో అతని పూర్వికుల సమాధిలో సమాధి చేశారు.

29 ఇశ్రాయేలు రాజుగా యెహోరాము పదకొండవ పరిపాలనా సంవత్సరమున అహజ్యా యూదాకు రాజయ్యాడు.

యెజెబెలు భయంకర మరణం

30 యెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది. జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషణములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా నిలిచి వెలుపలికి చూచింది. 31 యెహూ గుమ్మం ద్వారా నగరం ప్రవేశించాడు. ఆమె అతనిని చూసి, “జిమ్రీ వంటివాడా, అతనివలె నీవు నీ యజమానిని చంపివేశావు. సమాధానంగా వచ్చుచున్నావా” అని అడిగింది.

32 యెహూ కిటికీ పైకి చూశాడు. “దాని ప్రక్కన ఎవరున్నారు? ఎవరు?” అన్నాడు. ఇద్దరో ముగ్గురో నపుంసకులు యెహూని కిటికీ నుండి చూశారు. 33 వారితో యెహూ, “యెజెబెలుని క్రిందికి త్రోసి వేయండి” అన్నాడు.

తర్వాత నపుంసకులు యెజెబెలుని క్రిందికి త్రోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు యెజెబెలు శరీరం మీదుగా నడిచాయి. 34 యెహూ ఇంట్లోకి వెళ్లి అన్నపానాదులు చేసిన తరువాత, “ఇప్పుడు ఈ శాపగ్రస్తురాలిని చూడండి, ఈమె ఒక రాజు కుమార్తె. అందువల్ల ఆమెను సమాధి చేయండి” అన్నాడు.

35 ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయడానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు మాత్రమే కనిపించాయి. 36 అందువల్ల ఆ మనుష్యులు వెనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు యెహూ, “యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలు శవాన్ని కుక్కలు తింటాయని యెహోవా తన సేవకుడు తిష్బీవాడయిన ఏలీయాతో చెప్పాడు. 37 యెజ్రెయేలు ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుందనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఏలీయా చెప్పాడు.”

షోమ్రోను నాయకులకు యెహూ ఉత్తరాలు వ్రాయుట

10 షోమ్రోనులో అహాబుకి డెబ్భైమంది కుమారులుండిరి. యెహూ ఉత్తరాలు రాసి యెజ్రెయేలు రాజులకు నాయకులకు వాటిని షోమ్రోనుకు పంపాడు. అహాబు కుమారులను పెంచిన ప్రజలకు కూడా ఆ ఉత్తరాలు అతడు పంపాడు. ఆ ఉత్తరాలలో యెహూ ఇట్లు చెప్పాడు: 2-3 “మీకీ ఉత్తరం చేరగానే, మీ తండ్రి కుమారులలో సర్వశ్రేష్టుడైన వానిని ఎన్నుకోండి. మీకు రథాలు గుర్రాలు వున్నాయి. మీరు బలిష్టమైన నగరంలో ఉంటున్నారు. మీకు ఆయుధాలు కూడా వున్నాయి. మీరెన్నుకున్న అతని కుమారుని తండ్రి సింహాసనం మీద కుర్చోబెట్టండి. తర్వాత మీ తండ్రి వంశం కోసం పోరాడండి.”

కాని యెజ్రెయేలు పరిపాలకులు, నాయకులు చాలా భయపడిపోయారు. “ఆ రాజులిద్దరు (యెహోరాము మరియు అహజ్యా) యెహూని ఆపలేక పోయారు. కనుక మనము కూడా అతనిని ఆపలేము” అని వారు అనుకున్నారు.

అహాబు గృహ సంరక్షకుడు, నగరాన్ని అదుపులో ఉంచిన వాడు, అహాబు పిల్లలను పెంచిన పెద్దలు ప్రజలు యెహూకి ఒక సందేశం పంపారు. “మేము మీ సేవకులం. మీరేమి చెపితే మేమది చేస్తాము. మేమెవరిని రాజుగా చేసుకోవాలి. మీకు ఏది మంచిదిగా తోస్తే అది మాకు చెయ్యండి” అని తెలియజేసారు.

షోమ్రోను నాయకులు అహాబు పిల్లలను చంపుట

తర్వాత యెహూ రెండవ ఉత్తరం ఆ నాయకులకు రాశాడు. “మీరు కనుక నన్ను సమర్థిస్తే నా మాట పాటిస్తే, ఇప్పుడు అహాబు కుమారుల తలలు నరికి వేయండి. రేపు ఈపాటికి వాటిని యెజ్రెయేలులో నా వద్దకు తీసుకురండి” అని యెహూ చెప్పాడు.

అహాబుకి డెబ్భైమంది కుమారులు. వారు తమను పెంచిన నగర నాయకులతో ఉన్నారు. ఈ లేఖను నగర నాయకులు అందుకోగానే, వారు రాజ కుమారులు డెబ్భైమందిని తీసుకొని వెళ్లి చంపివేశారు. తర్వాత నాయకులు రాజ కుమారుల తలలను బుట్టలలో వేసి యెజ్రెయేలులోని యెహూకి ఆ బుట్టలు పంపారు. దూత యెహూని సమీపించి అతనికిది చెప్పాడు: “వాళ్లు రాజకుమారుల తలలు తెచ్చారు!”

తర్వాత యెహూ, “నగర ద్వారం వద్ద ఉదయం వరకు రెండు వరసలలో ఆ తలలు ఉంచండి” అని చెప్పాడు.

ఉదయాన, యెహూ వెలుపలికి వెళ్లి, ప్రజల యెదుట నిలచి వారితో ఇలా అన్నాడు: “మీరు అమాయకులు. చూడండి. నేను నా యజమానికి విరుద్ధంగా పథకాలు వేశాను. నేనతనిని చంపాను. కాని ఆహాబు పిల్లలందరినీ ఎవరు చంపారు? మీరే చంపారు. 10 యెహోవా చెప్పినదంతా జరుగుతుందని మీరు గ్రహించాలి. మరియు యెహోవా అహాబు వంశానికి సంబంధించిన యీ విషయాలు చెప్పేందుకు ఏలీయాని ఉపయెగించాడు. యెహోవా తాను చేస్తానన్న పనులు చేశాడు.”

11 అందువల్ల యెహూ యెజ్రెయేలులో నివసించే అహాబు వంశీయులనందరినీ చంపివేశాడు. యెహూ ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగలలేదు.

యెహూ అహజ్యా బంధువులను చంపుట

12 యెహూ యెజ్రెయేలు విడిచి షోమ్రోనుకు వెళ్లాడు. త్రోవలో యెహూ గొర్రెల కాపరులు శిబిరం అనేచోట ఆగాడు. ఆ చోట గొర్రెల కాపరులు గొర్రెల మీద ఉన్నిని కత్తిరిస్తున్నారు. 13 యూదా రాజయిన అహజ్యా యొక్క బంధువులను యెహూ కలుసుకున్నాడు. “ఎవరు మీరు?” అని యెహూ ప్రశ్నించాడు.

వారు, “మేము యూదా రాజయిన అహజ్యా బంధువులము. రాజకుమారులను రాణిగారి పిల్లలను చూసి వెళ్లుదామని వచ్చాము” అని సమాధానం చెప్పారు.

14 తర్వాత యెహూ, “వారిని సజీవులుగా తీసుకువెళ్లండి” అని తన మనుష్యులకు చెప్పాడు.

యెహూ మనుష్యులు అహజ్యా బంధువులను సజీవులుగా పట్టుకున్నారు. వారు నలభై రెండు మంది. బేతెకెదు బావి వద్ద యెహూ వారిని చంపివేశాడు. యెహూ ఒక్కరిని కూడా ప్రాణాలతో వుండనివ్వలేదు.

యెహూ యెహోనాదాబును కలుసుకొనుట

15 అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను రేకాబు కుమారుడైన యెహోనాదాబును కలుసుకున్నాడు. యెహూని కలుసుకోవాలని యెహోనాదాబు వెళ్లుచున్నాడు. యెహూ యెహోనాదాబును అభినందించి, “నేను నీకు నమ్మకస్థుడనైన స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్థుడనైన స్నేహితుడవేనా?” అని అడిగాడు.

“నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని యెహోనాదాబు బదులు చెప్పాడు.

“అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ చెప్పాడు.

తర్వాత యెహూ యెహోనాదాబును లాగి తన రథంలోకి ఎక్కించుకున్నాడు.

16 “నాతోపాటురా. యెహోవాపట్ల నా భావాలు ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు” అని యెహూ చెప్పాడు.

అందువల్ల యెహోనాదాబు యెహూ రథంలో వెళ్లాడు. 17 యెహూ షోమ్రోనుకి వచ్చి, అక్కడ ఇంకా సజీవులై వున్న అహాబు వంశీయులందరిని హతమార్చాడు. యెహూవా ఏలీయాతో చెప్పినట్లుగా, యెహూ అన్ని పనులు చేసాడు.

యెహూ బయలును పూజించే వారిని పిలుచుట

18 తర్వాత యెహూ ప్రజలందరినీ సమీకరించాడు. వారితో యెహూ, “అహాబు కొద్దిగా బయలు దేవుని సేవించాడు. కాని యెహూ అనే నేను బయలు దేవునికి ఎక్కువ సేవ చేస్తాను. 19 ఇప్పుడు బయలు దేవుని ప్రవక్తలను యాజకులను అందరినీ పిలవండి. బయలు దేవుని పూజించేవారినందరినీ పిలవండి. ఈ సమావేశానికి అందురూ హాజరు అయ్యేలా చూడండి. బయలు దేవునికి నేనొక గొప్పబలి సమర్పించాలి. ఈ సమావేశానికి రానివారిని నేను చంపుతాను” అని చెప్పాడు.

కాని యెహూ వారిపట్ల కుయుక్తి పన్నాడు. బయలు ఆరాధకులను యెహూ నాశనం చేయదలచాడు. 20 “బయలుకు ఒక పవిత్ర సమావేశం ఏర్పాటు చేయండి” అని యెహూ చెప్పాడు. మరియు యాజకులు సమావేశం ప్రకటించారు. 21 తర్వాత యెహూ ఇశ్రాయేలు దేశమంతటా ఒక సందేశం పంపాడు. బయలు ఆరాధకులందరూ వచ్చారు. ఎవ్వరూ ఇంట్లో వుండలేదు. బయలు దేవుని మందిరంలో బయలు ఆరాధకుందరూ వచ్చారు. మందిరం ప్రజలతో నిండిపోయింది.

22 దుస్తులు దగ్గర ఉంచబడిన వ్యక్తితో యెహూ ఇట్లనెను. “బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకురండి” అని చెప్పగా ఆ వ్యక్తి బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకు వచ్చాడు.

23 తర్వాత యెహూ, రేకాబు కుమారుడైన యెహూనాదాబు బయలు మందిరంలోనికి పోయారు. బయలు ఆరాధకులను ఉద్దేశించి, “మీ చుట్టు ప్రక్కల చూడండి. మీతో యెహోవా యొక్క సేవకులెవరూ లేరని చూసుకోండి. బయలు ఆరాధకులు మాత్రమే ఇక్కడున్నారని నిర్ధారణ చేసుకోండి” అని యెహూ చెప్పాడు. 24 బయలు ఆరాధకులు గుడిలోకి వెళ్లారు; బలులు మరియు దహన బలులు అర్పించాలనుకున్నారు.

కాని వెలుపల, యెహూ ఎనభై మందితో వేచియున్నాడు. “ఎవ్వరూ తప్పించుకోకుండా చూడండి. ఎవరైనా ఒక్కనినైనా తప్పించినట్లయితే, ఆ వ్యక్తి తన ప్రాణమునే ఫలితంగా పెట్టవలసి వస్తుంది” అని యెహూ చెప్పాడు.

25 త్వరగా యెహూ తన దహన బలుల అర్పణ పూర్తి చేయగా, అతను కాపలాదారులకు, అధిపతులకు ఇలా చెప్పాడు. “లోపలికి వెళ్లి, బయలు ఆరాధకులను చంపండి. ఆలయంలోనుండి ఎవ్వరూ సజీవంగా బయటికి రాకుండా చూడండి” అని చెప్పాడు.

అందువల్ల అధిపతులు ఖడ్గాలు ప్రయోగించి బయలు ఆరాధకులను చంపివేశారు. ఆ తర్వాత కాపలా దార్లు, అధిపతులు బయలు ఆరాధకుల శరీరాలను బయటికి విసిరివేశారు. తర్వాత వారు బయలు దేవత ఆలయంలోని లోపలిగదిలోనికి వెళ్లారు. 26 బయలు ఆలయంలో వున్న జ్ఞాపక శిలలను[a] వారు వెలుపలికి తీసుకువచ్చి, దేవాలయాన్ని దగ్ధం చేశారు. 27 తర్వాత దేవాలయంలోని జ్ఞాపకశిలలను నుగ్గు నుగ్గు చేశారు. బయలు దేవాలయాన్ని కూడా నుగ్గు నుగ్గు చేశారు. వారు బయలు దేవాలయాన్ని ఒక మరుగుదొడ్డిగా మార్చారు. ప్రజలు ఇప్పటికి ఆ ప్రదేశమును బైలు గదిగా (పాయిఖానాగా) వాడతారు.

28 ఈ విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు ఆరాధనను నాశనం చేశాడు. 29 కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు పూర్తిగా తొలగలేదు; అందువల్ల ఇశ్రాయేలు పాపం చేయవలసి వచ్చింది. బేతేలు, దానులలో బంగారు దూడలను యెహూ నాశనం చెయ్యలేదు.

ఇశ్రాయేలుమీద యెహూ పరిపాలన

30 యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు.

31 కాని హృదయపూర్వకంగా యెహూ జాగ్రత్తగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నివసించలేదు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన యరొబాము పాపాలను యెహూ ఆపలేకపోయాడు.

హజాయేలు ఇశ్రాయేలును ఓడించుట

32 ఆ సమయమున, యెహోవా ఇశ్రాయేలును భాగాలుగా ఛేదింపసాగాడు. సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలు ప్రతి సరిహద్దుననున్ను ఇశ్రాయేలు వారిని ఓడించాడు. 33 యోర్దాను నదికి తూర్పునవున్న ప్రదేశాన్ని హజాయేలు జయించాడు. గాదీయులకును, రూబేనీయులకును మరియు మనష్షేవంశాలకు చెందిన ప్రాంతాలను, గిలాదుప్రాంతములన్నీ, అర్నోను లోయ ప్రక్కనున్న అరోయేరు ప్రదేశంలోని గిలాదు, బాషాను ప్రాంతాల వరకూ హజాయేలు జయించాడు.

యెహూ మరణం

34 యెహూ కావించిన ఇతర గొప్ప పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 35 యెహూ మరణించగా, అతని పూర్వికులతో పాటుగా సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలు యెహూని సమాధి చేశారు. అతని తర్వాత, యెహూ కుమారుడైన యెహోయాహాజు ఇశ్రాయేలుకు కొత్తగా రాజయ్యాడు. 36 షోమ్రోనులో ఇశ్రాయేలు మీద యెహూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పరిపాలించాడు.

అతల్యా యూదాలోని రాజకుమారులందరిని చంపుట

11 అతల్యా అహజ్యా యొక్క తల్లి. తన కుమారుడు చనిపోయినట్లు ఆమె చూసింది. అందువల్ల ఆమె లేచి రాజవంశం అంతటినీ చంపివేసింది.

యెహోషెబ రాజైన యెహోరాము యొక్క కుమార్తె. అహజ్యా సోదరి. యోవాషు రాజ కుమారులలో ఒకడు. మిగిలిన పిల్లలు చంపబడినప్పుడు యెహోషెబ యెవాషును తీసుకుని దాచింది. ఆమె యెవాషును అతని దాదిని ఆమె పడక గదిలో ఉంచింది. అందువల్ల యెహోషెబ మరియు దాది అతల్యాకి తెలియకుండా యెవాషును కాపాడారు. ఆ విధంగా యోవాషు మరణించలేదు.

తర్వాత యోవాషు మరియు యెహోషెబా యెహోవా యొక్క ఆలయంలో దాగివున్నారు. అక్కడ యోవాషు ఆరు సంవత్సరములు దాగివున్నాడు. మరియు అతల్యా యూదా దేశాన్ని పరిపాలించింది.

ఏడవ సంవత్సరమున ప్రధాన యాజకుడయిన యెహోయాదా సైనికుల అధిపతులను కాపలాదారులను రప్పించాడు. యెహోయాదా వారిని యెహోవా ఆలయములో ఒక చోట సమకూర్చాడు. తర్వాత యెహోయాదా వారితో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఆలయంలో యెహోయాదా వారిని ఒక వాగ్దానం చేయమని నిర్భందించాడు. అప్పుడు వారికి రాజుగారి కుమారుడైన యెవాషును చూపించాడు.

తర్వాత యెహోయాదా వారికొక ఆజ్ఞ విధించాడు. “ఈ పని మీరు చెయ్యాలి. ప్రతి విశ్రాంతి రోజున మీలో ఒక మూడోవంతు రావాలి. మీరు రాజభవనాన్ని కాపలా కాయాలి. రెండో మూడోవంతు సూరు ద్వారం వద్ద వుండాలి. మరియు మరియొక మూడోవంతు కాపలాదారులకు వెనకాల ద్వారం వద్ద వుండాలి. ఈ విధంగా మీరు ఒక గోడవలె యెవాషును రక్షించాలి. ప్రతి విశ్రాంతి రోజు మీలో రెండువంతులు యెహోవా ఆలయాన్ని కాపలా కాయాలి. యెవాషు రాజుని రక్షించాలి. యెవాషు రాజు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్లినా మీరు అతని వెంట వుండాలి. మొత్తం రాజుని అవరించి వుండాలి. ప్రతి కాపలాదారుడు తన ఆయుధాన్ని చేత ధరించి వుండాలి. మీకు మరీ దగ్గరగా వచ్చే ఎవనినైనా మీరు హతమార్చాలి” అని అన్నాడు.

యెహోయాదా యాజకుడు ఆజ్ఞాపించిన అన్నిటినీ అధిపతులు పాటించారు. ప్రతి అధిపతి తన మనుష్యులను తీసుకున్నాడు. ఒక బృందమేమో శనివారంనాడు రాజుకు కాపలాగా ఉండాలి. వారం మిగిలిన రోజుల్లో ఇతర బృందాలు రాజుకు కాపలాగా వుండాలి. యెహోయాదా యాజకుని వద్దకు ఆ మనుష్యులందరు వెళ్లారు. 10 మరియు యాజకుడు బల్లెములు, కవచములు అధిపతులకు ఇచ్చాడు. ఆ బల్లెములు కవచములు యెహోవా ఆలయంలో దావీదు ఉంచినవి. 11 ఈ కాపలాదార్లు ఆయుధములు ధరించి ఆలయం కుడి మూలనుంచి మరియు ఆలయం ఎడమ మూలవరకు నిలబడ్డారు. వారు బలిపీఠం, ఆలయం చుట్టూ నిలబడ్డారు. వారు దేవాలయంలో రాజును కాపాడడానికి అతని చుట్టూ నిలబడ్డారు. 12 ఈ మనుష్యులు యోవాషును బయటకు తీసుకొని వచ్చి, అతని తల మీద వారు కిరీటం ఉంచారు. దేవునికీ రాజుకూ మధ్య జరిగిన ఒడంబడికను రాజుకి ఇచ్చారు. తర్వాత వారు అతనిని అభిషేకించి కొత్త రాజుగా చేశారు. “రాజు వర్ధిల్లుగాక!” అని వారు కరతాళ ధ్వనులు చేశారు; నినాదాలు చేశారు.

13 రాణి అతల్యా కాపలాదారులు మరియు ప్రజల నుండి శబ్ధం విన్నది. అందువల్ల ఆమె యెహోవా ఆలయం వద్దనున్న ప్రజల దగ్గరకు వెళ్లింది. 14 అతల్యా మామూలుగా రాజు నిలబడే స్తంభం వద్ద రాజుని చూసింది. రాజుకోసం బాకాలూదే నాయకులను ప్రజలను కూడా ఆమె చూసింది. అందరు మనుష్యులు చాలా సంతోషంగా వున్నట్లు ఆమె చూసింది. బూరలు మ్రోగాయి. ఆమె తలక్రిందులయినట్లుగా తెలుపడానికి తన వస్త్రములు చింపుకొన్నది. తర్వాత అతల్యా, “రాజ ద్రోహం, రాజద్రోహం” అని అరిచింది.

15 సైనికులు అధికారులుగానున్న అధిపతులకు యాజకుడు అయిన యెహోయాదా ఒక ఆజ్ఞ విధించాడు. “ఆలయం వెలుపలికి అతల్యాను తీసుకొని వెళ్లండి. ఆమెనూ, అనుచరులనూ చంపండి. కాని యెహోవా ఆలయంలో వారిని చంపకండి” అని యెహోయాదా వారికి చెప్పాడు.

16 అందువల్ల సైనికులు అతల్యాను లాగివేశారు. అంతఃపురానికి గుర్రాలు వెళ్లే ప్రవేశంగుండా ఆమె వెళ్లేటప్పుడు ఆమెను చంపివేశారు.

17 తర్వాత యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడిక రాజు, ప్రజలు యెహోవాకి చెందిన వారని తెలుపుతుంది. యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య కూడా ఒక ఒడంబడిక చేశాడు. ప్రజలకు రాజు ఏమి చేయాలో ఈ ఒడంబడిక తెలుపుతుంది. ప్రజలు విధేయులై రాజుని అనుసరిస్తారని ఈ ఒడంబడిక తెలుపుతుంది.

18 తర్వాత మనుష్యులు అందరు అసత్య దేవత బయలు ఆలయానికి వెళ్లారు. ఆ మనుష్యులు బయలు విగ్రహాన్ని, అతని బలిపీఠాలను ధ్వంసం చేశారు. వాటిని వారు ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ మనుష్యులు బయలు యొక్క యాజకుడు మత్తానును బలిపీఠముల వద్ద చంపివేశారు.

అందువల్ల యాజకుడు అయిన యెహోయాదా యెహోవా ఆలయాన్ని ఆ మనుష్యుల అధికారమున నిర్వహణార్థం ఉంచాడు. 19 యాజకుడు మనుష్యులందరిని నడిపించాడు. వారు యెహోవా ఆలయంనుండి రాజు ఇంటివరకు వెళ్లారు. రాజు ప్రత్యేక కాపలాదార్లు, అధిపతులు రాజుతోపాటు వెళ్లారు. మరియు మనుష్యులందరూ వారిని అనుసరించారు. వారు రాజభవన ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లారు. యెవాషు రాజు సింహాసనం మీద ఉన్నాడు. 20 మనుష్యులు అందరు చాలా సంతోషంగా వున్నారు. నగరం శాంతంగా ఉంది. మరియు రాణి అతల్యా రాజభవనం వద్ద కత్తితో చంపబడింది. 21 యోవాషు రాజయినప్పుడు, అతను ఏడేండ్లవాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International