Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 15:1-24

యూదాకు అబీయాము రాజగుట

15 నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలును పాలిస్తూ వుండెను. అతని పాలనలో పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీయాము యూదాకు రాజు అయ్యాడు. అబీయాము మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కుమార్తె.

పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభువైన యెహోవాకు యథార్థుడై వున్నట్లు, అబీయాము యెహోవాకు విశ్వాసపాత్రుడై వుండలేదు. యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు. యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదా పాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.

రెహబాము, యరొబాము ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే వున్నారు.[a] అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో వ్రాయబడ్డాయి.

అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది. అబీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమారుని పేరు ఆసా. అబీయాము స్థానంలో ఆసా రాజయ్యాడు.

యూదా రాజుగా ఆసా

యరొబాము పాలన మొదలై ఇరవైయవ సంవత్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు. 10 ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. మయకా అబ్షాలోము కుమార్తె.

11 ఆసా తన పూర్వికుడైన దావీదువలె యెహావా దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు. 12 ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు. 13 తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు. 14 కాని ఆసా ఉన్నత స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా ఆసా యెహోవాకు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు. 15 ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.

16 యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధాలు కొనసాగించాడు. 17 బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. ఆసా రాజ్యమైన యూదాకు ప్రజల రాకపోకలను నిలిపివేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామానగరాన్ని అతడు చాలా పటిష్ఠపర్చినాడు. 18 దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు. 19 అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”

20 రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు. 21 ఈ దండయాత్రలను గురించి బయెషా విన్నాడు. దానితో అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్సాకు తిరిగి వెళ్లాడు. 22 అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు. 23 ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది. 24 ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో రాజు అయ్యాడు.

2 దినవృత్తాంతములు 13-16

యూదా రాజుగా అబీయా

13 ఇశ్రాయేలు రాజుగా యరొబాము[a] పద్దెనిమిదవ సంవత్సరంలో కొనసాగుతూ వుండగా, అబీయా యూదాకు కొత్తగా రాజయ్యాడు. అబీయా యెరూషలేములో మూడేండ్లు పాలించాడు. అబీయా తల్లి పేరు మయకా.[b] మయకా తండ్రి పేరు ఊరియేలు. ఊరియేలు గిబియా పట్టణంవాడు. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయాకు నాలుగు లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయా ఆ సైన్యాన్ని యుద్ధానికి నడిపించాడు. యరొబాముకు ఎనిమిది లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయాతో యుద్ధానికి యరొబాము సిద్ధమయ్యాడు.

అప్పుడు అబీయా కొండల దేశమైన ఎఫ్రాయిములో వున్న సెమరాయిము పర్వతం మీద నిలబడి యీలా అన్నాడు: “యరొబామూ, ఇశ్రాయేలీయులందరూ నేను చెప్పేది వినండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుకు, అతని కుమారులకు శాశ్వతంగా ఇశ్రాయేలు రాజులు కావటానికి హక్కు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి. ఉప్పు ఒడంబడిక[c] ద్వారా దావీదుకు దేవుడు ఈ హక్కు యిచ్చాడు. కాని యరొబాము యెహోవాకు వ్యతిరేకి అయ్యాడు! యరొబాము నెబాతు కుమారుడు. నెబాతు దావీదు కుమారుడైన సొలొమోను అధికారులలో ఒకడు. అయితే పనికి మాలిన, దుష్టవ్యక్తులు యరొబాముకు స్నేహితులయ్యారు. యరొబాము, ఆ చెడ్డ మనుష్యులే రెహబాముకు ఎదురు తిరిగారు అప్పుడు రెహబాము చిన్నవాడు. అనుభవంలేనివాడు. అందువల్ల యరొబామును, అతని చెడు స్నేహితులను రెహబాము అదుపులో పెట్టలేకపోయాడు.

“ఓ యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు. మీరు యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టారు. యాజకులు అహరోను సంతతివారు. మీ స్వంత యాజకులను మీరు ఎంపిక చేసుకున్నారు. ఇది పరదేశీయులు చేసే పద్ధతి. ఒక గిత్తను గాని, ఏడు గొర్రె పొట్టేళ్లనుగాని తీసుకొని తనను పరిశుద్ధునిగా చేసుకోవటానికి ఎవడు వచ్చినా అతడు దేవుళ్ళుకాని విగ్రహాలకు యాజకులు కావచ్చు.

10 “కాని, మా విషయానికి వస్తే యెహోవాయే మా దేవుడు. యూదా ప్రజలమైన మేము దేవునిపట్ల భయభక్తులు కలిగియున్నాము. మేము ఆయనను వదిలిపెట్టలేదు! యెహోవాను సేవించే యాజకులు అహరోను సంతతివారే. యెహోవా సేవలో యాజకులకు లేవీయులు తోడ్పడతారు. 11 వారు దహనబలులు, సుగంధద్రవ్యాలతో ధూపం నిత్యం ఉదయ సాయంకాలాల్లో సమర్పిస్తారు. ఆలయంలో ప్రత్యేకమైన బల్లమీద నైవేద్యపు రొట్టెలను వారు వరుసలలో పెడతారు. వారు ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభం నిలిపి ప్రమిదలు వెలిగిస్తారు. మన దేవుడైన యెహోవా ఆజ్ఞను మేము అనుసరిస్తాము. కాని యరొబామూ, నీవు మరియు నీతోవున్న ఇశ్రాయేలీయులూ యెహోవాను లక్ష్యపెట్టడంలేదు. మీరు ఆయనను వదిలి పెట్టారు. 12 దేవుడే మాకు తోడై వున్నాడు. ఆయనే మా అధిపతి. ఆయన యాజకులు మాతో వున్నారు. మీపై యుద్ధానికి యెహోవా యాజకులు బూరలు ఊది మమ్మల్ని పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడగు యెహోవా మీదికి యుద్ధానికి పోకండి. ఎందువల్లనంటే, మీరు విజయం పొందలేరు!”

13 కాని యరొబాము కొంతమంది సైనికులను అబీయా సైన్యం వెనుక చాటుగా పొంచి వుండటానికి పంపాడు. యరొబాము సైన్యం అబీయా సైన్యానికి ఎదురుగా వుంది. యరొబాము సైన్యం నుండి రహస్యంగా వెళ్లిన సైనికులు అబీయా సైన్యానికి వెనకగా వున్నారు. 14 యూదాకు చెందిన అబీయా సైన్యంలోని భటులు వెనుదిరిగి చూచినప్పుడు యరొబాము సైన్యం తమను ముందు నుండి, వెనుక నుండి ఎదుర్కొంటున్నట్లు భావించారు. యూదా సైనికులు యెహోవాను పిలిచారు. యాజకులు బూరలు ఊదారు. 15 పిమ్మట అబీయా సైన్యం కేకలు పెట్టింది. యూదా సైనికులు యుద్ధ నినాదాలు చేసినప్పుడు, దేవుడు యరొబాము సైన్యాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు నుండి వచ్చిన యరొబాము సైన్యాన్ని యూదా నుంచి వచ్చిన అబీయా సైన్యం ఓడించింది. 16 యూదా సైనికుల నుండి ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేలా దేవుడు యూదా సైన్యానికి తోడ్పడ్డాడు. 17 అబీయా సైన్యం ఇశ్రాయేలు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఐదులక్షల మంది ఇశ్రాయేలు యోధులు చనిపోయారు. 18 ఆ విధంగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడ్డారు; యూదా ప్రజలు గెలిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా మీద వారు ఆధారపడిన కారణంగా యూదా సైన్యం విజయం సాధించింది.

19 అబీయా సైన్యం యరొబాము సైన్యాన్ని తరిమి కొట్టింది. అబీయా సైన్యం యరొబాముకు చెందిన బేతేలు, యెషానా, ఎఫ్రోను పట్టణాలను పట్టుకుంది. వారు ఆ పట్టణాలతో పాటు వాటి పరిసర గ్రామాలను కూడా వశపర్చుకున్నారు.

20 అబీయా నివసించియున్నంత కాలం యరొబాము బలమైన రాజు కాలేకపోయాడు. యెహోవా యరొబామును చంపేశాడు. 21 అబీయా మిక్కిలి బలవంతుడైన రాజయ్యాడు అతడు పదునల్గురు స్త్రీలను వివాహమాడాడు. అతడు ఇరువై యిద్దరు కుమారులకు, పదహారుగురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. 22 అబీయా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయగు ఇద్దో రచనల్లో పొందుపర్చబడ్డాయి.

14 అబీయా తన పూర్వీకులతో నిద్రంచాడు. దావీదు నగరంలో ప్రజలు అతనిని సమాధి చేశారు. పిమ్మట అబీయా కుమారుడు ఆసా అతని స్థానంలో కొత్తగా రాజయ్యాడు. ఆసా పరిపాలనా కాలంలో పది సంవత్సరాలపాటు దేశంలో శాంతి నెలకొన్నది.

యూదా రాజుగా ఆసా

తన దేవుడైన యెహోవా దృష్టకి మంచివైన, న్యాయమైన పనులు ఆసా చేశాడు. విగ్రహాలను ఆరాధించటానికి వినియోగించిన వింత బలిపీఠాలను ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి, స్మారక శిలలను[d] పగులగొట్టాడు. అషేరా దేవతా స్తంభాలను[e] కూడా ఆసా విరుగగొట్టాడు. యూదా ప్రజలను దేవుడైన యెహోవాను అనుసరించమని ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరాధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు. యూదా పట్టణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను, ధూప పీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా వున్న కాలంలో రాజ్యంలో శాంతి నెలకొన్నది. యూదాలో శాంతి విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మించాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించటంతో ఆసాకు ఆ కాలంలో యుద్ధాలు లేవు.

ఆసా యూదా ప్రజలతో యిలా చెప్పాడు: “మనమీ పట్టణాలను నిర్మించి, వాటిచుట్టూ ప్రాకారాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలను, ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాము. ఈ దేశంలో ఇంకను నివసిస్తూండగానే మనమీ పనులు చేద్దాము. ఈ దేశం మనది. ఎందువల్లననగా మన ప్రభువైన దేవుని మనం అనుసరించాము. మనచుట్టూ ఆయన మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు.” పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం సాధించారు.

ఆసాకు మూడు లక్షలమంది యూదా వంశాల వారున్న సైన్యం; రెండు లక్షల ఎనబై వేలమంది బెన్యామీను కుటుంబాలకు చెందిన వారు సైన్యం వున్నాయి. యూదా సైనికులు పెద్ద పెద్ద డాళ్లను, ఈటెలను ధరించారు. బెన్యామీను సైనికులు చిన్న డాళ్లను ధరించి, ధనుస్సులతో బాణాలు వేయగల నేర్పరులు. వారంతా బలమైన, ధైర్యంగల సైనికులు.

పిమ్మట జెరహు అనేవాడు ఆసా మీదికి దండెత్తాడు. జెరహు ఇథియోపియావాడు.[f] జెరహు సైన్యంలో పదిలక్షలమంది సైనికులు, మూడు వందల రథాలు వున్నాయి. జెరహు సైన్యం మారేషా వరకు చొచ్చుకు వచ్చింది. 10 జెరహును ఎదుర్కోవటానికి ఆసా బయలుదేరి వెళ్లాడు. మారేషా వద్ద జెపాతా లోయలో ఆసా సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యింది.

11 ఆసా తన దేవుడైన యెహోవాకు యిలా ప్రార్థన చేశాడు “ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను రక్షించేవాడవు నీ వొక్కడివే! ఓ ప్రభూ, మా దైవమా మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి యున్నాము. ఈ మహా సైన్యాన్ని నీ పేరుతో మేము ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర నీయకుము!”

12 పిమ్మట యెహోవా ఆసా వద్దవున్న యూదా సైన్యాన్ని ఇథియోపియా (కూషు) సైన్యాన్ని ఓడించటానికి వినియోగించాడు. ఇథియోపియా సైన్యం పారిపోయింది. 13 ఆసా సైన్యం ఇథియోపియా సైన్యాన్ని గెరారు పట్టణం వరకు తరుముకుంటూ పోయింది. ఇథియోపియా సైనికులు అనేకమంది చనిపోవటంతో యుద్ధం చేయటానికి మళ్లీ వారు ఒక సైన్యంగా కూడ గట్టుకోలేకపోయారు. యెహోవా చేత, ఆయన సైన్యం చేత వారు అణచివేయబడ్డారు. శత్రుసైన్యం నుండి ఆసా, మరియు అతని సైనికులు అనేక విలువైన వస్తువులను దోచుకున్నారు. 14 ఆసా మరియు అతని సైన్యం గెరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను ఓడించారు. ఆ పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. ఆ పట్టణాలలో విలువైన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. ఆ విలువైన వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది. 15 ఆసా సైన్యం గొర్రెల కాపరులు నివసించే ప్రాంతాల మీద కూడా దాడి చేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటెలను పట్టుకుపోయారు. తరువాత ఆసా సైన్యం యెరూషలేముకు వెళ్లిపోయింది.

ఆసా చేసిన మార్పులు

15 దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా ఓబేదు కుమారుడు. ఆసాను కలుసుకోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా నేను చేప్పేది వినండి! మీరు యెహోవాను నమ్మకొని ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు. చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండి పోయారు. కాని ఇశ్రాయేలు ప్రజలకు కష్టంవచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయనను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు. ఆ కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రయామాణం చేయగలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఒక రాజ్యం మరో రాజ్యాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా ఆ పరిణామాలు వచ్చాయి. కావున ఆసా, నీవు మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంతులై యుండండి. బలహీనులు కావద్దు. అధైర్యపడవద్దు. ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం దొరుకుతుంది!”

ప్రవక్త ఓబేదు మాటలు, వర్తమానం విన్న ఆసాకు చాలా ధైర్యం వచ్చింది. తరువాత అతడు యూదా, బెన్యామీను ప్రాంతాలన్నిటిలో వున్న అసహ్యకరమైన విగ్రహాలను తొలగించాడు. తానువశపర్చుకున్న ఎఫ్రాయిము కొండల ప్రాంతంలోని పట్టణాలలో వున్న హేయమైన విగ్రహాలను కూడా ఆసా తొలగించాడు. ఆలయ ముఖమండపంలో వున్న దేవుని బలిపీఠాన్ని కూడా అతడు బాగు చేయించాడు.

పిమ్మట యూదా, బెన్యామీను ప్రజలందరినీ ఆసా సమావేశపర్చాడు. అంతేగాక ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమ్యోను కుటుంబాల వారిని కూడా పిలిచాడు. వీరు ఇశ్రాయేలునుండి వలసపోయి యూదాలో స్థిరపడినవారు. వారిలో చాలామంది యూదాకు వచ్చిన కారణమేమంటే, ఆసా దేవుడైన యెహోవా ఆసా పక్షాన వున్నట్లు వారు గమనించారు.

10 ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి మూడవనెల గడుస్తూవుండగా ఆసా, అతని ప్రజలూ యెరూషలేములో సమావేశమయ్యారు. 11 ఆ సమయంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల గొర్రెలను, మేకలను యెహోవాకు బలి యిచ్చారు. ఆ జంతువులను, ఇతర విలువైన వస్తువులను ఆసా సైన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు. 12 తరువాత వారు తమ పూర్ణ హృదయంతోను, తమ ఆత్మసాక్షితోను యెహోవాను సేవించటానికి ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆయన వారి పూర్వీకులు సేవించిన దేవుడు. 13 ఎవ్వరైనా దేవాధి దేవుని పూజించటానికి నిరాకరిస్తే అతడు చంపబడాలి. అట్టి మనిషి ఉన్నతుడేగాని, అల్పుడేగాని, పురుషుడే గాని, స్త్రీయేగాని ఎవ్వరైనా విచారణ లేకుండా చంపబడవలసినదే. 14 అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు ఒక ప్రమాణం చేశారు. వారు ఏకగ్రీవంగా పెద్దగా అరిచారు. వారు బూరలు, పొట్టేలు కొమ్ములు వూదారు. 15 యూదా ప్రజలంతా వారు చేసిన ప్రమాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు. గనుక వారికా సంతోషం. పూర్ణ హృదయంతో వారు దేవుని అనుసరించారు. వారు దేవుని కొరకు వెదకి, ఆయనను దర్శించారు. కావున యెహోవా వారికి దేశమంతా శాంతియుత వాతవరణం నెలకొనేలా చేశాడు.

16 ఆసా తన తల్లియైన మయకాను రాజమాత పదవినుండి తొలగించాడు. అషేరా దేవతా స్తంభాన్ని[g] నెలకొల్పటం ద్వారా ఆమె చేయించిన హేయమైన కార్యానికి అతడాపని చేశాడు. అషేరా స్తంభాన్ని ఆసా నరికించి చిన్న చిన్న ముక్కలు చేశాడు. తరువాత అతడా ముక్కలను కిద్రోను లోయలో తగులబెట్టాడు. 17 అయితే యూదాలో వున్న ఉన్నత స్థలాలు తొలగింపబడలేదు. అయినప్పటికి ఆసా హృదయం అతని జీవితాంతం యెహోవాకు విశ్వాసపాత్రంగా వుంది.

18 ఆసా తానూ, తన తండ్రీ దేవునికి సమర్పించిన కానుకలను, ఇతర విలువైన వస్తువులను ఆలయంలో వుంచాడు. ఆ వస్తువులన్నీ వెండి, బంగారాలతో చేయించినవి. 19 ఆసా పాలనలో ముప్పైయైదవ సంవత్సరం[h] వరకు యుద్ధాలు ఏ మాత్రం జరగలేదు.

ఆసా కడపటి సంవత్సరాలు

16 ఆసా పాలనలో ముప్పై ఆరవ సంవత్సరంలో యూదా రాజ్యం మీదికి బయెషా దండెత్తాడు. బయెషా ఇశ్రాయేలు రాజు. అతడు రామా పట్టణానికి వెళ్లి దానిని కోటలా మర్చాడు. రామా పట్టణాన్ని బయెషా ఒక కీలక స్థానంగా వినియోగించి యూదా రాజు ఆసా వద్దకు వెళ్లటానికిగాని, అతని వద్ద నుండి బయటకు రావటానికి గాని ప్రజలకు ఆస్కారం లేకుండా చేశాడు. ఆలయం ఖజానాలో వున్న వెండి, బంగారు నిల్వలను ఆసా తీశాడు. రాజగృహంలో వున్న వెండి, బంగారాలను కూడా అతడు తీశాడు. తరువాత ఆసా తన దూతలను బెన్హదదు వద్దకు పంపాడు. బెన్హదదు అరాము (సిరియా) రాజు. అతడు దమస్కు (డెమాస్కస్) పట్టణంలో నివసిస్తున్నాడు. ఆసా పంపిన వర్తమానం యీలా వుంది. “బెన్హదదూ, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక కొనసాగేలా చూడు. అది నీ తండ్రికి, నా తండ్రికి మధ్య కొనసాగిన ఒడంబడికలా వుండాలి. చూడండి, మీకు నేను వెండి బంగారాలు పంపిస్తున్నాను. కనుక నీవిప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒడంబడికను రద్దు చేసుకోవాలి. తద్వారా అతడు నామీదకు రాకుండా, నన్ను ఒంటరిగా వదిలి, నన్ను బాధపెట్టడు.”

రాజైన ఆసా వర్తమానాన్ని బెన్హదదు అంగీకరించాడు. బెన్హదదు తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాలపై దాడులు జరపమని పంపాడు. ఆ అధిపతులు ఈయోను, దాను ఆబేల్మాయీము పట్టణాలపై దాడి చేశారు. నఫ్తాలి ప్రాంతంలోవున్న పట్టణాలను కూడ వారు ఎదుర్కొన్నారు. ఈ పట్టణాలలో ధనాగారాలు వున్నాయి. ఇశ్రాయేలు పట్టణాలపై దాడులను గూర్చి బయెషా విన్నాడు. అది విని రామా పట్టణాన్ని దుర్గంగా మార్చే పనిని బయెషా విరమించుకున్నాడు. పనిని మధ్యలో ఆపివేశాడు. ఆ తరువాత రాజైన ఆసా యూదా ప్రజలను సమావేశపర్చాడు. వారంతా రామా పట్టణానికి వెళ్లి బయెషా కోట కట్టించటానికి తెప్పించిన రాళ్లను, కలపను పట్టుకుపోయారు. ఆసా, యూదా ప్రజలు ఆ రాళ్లను, కలపను గెబ, మిస్పా పట్టణాలను బలంగా కట్టడానికి వినియోగించారు.

ఆ సమయంలో దీర్ఝదర్శియైన హనానీ యూదా రాజైన ఆసా వద్దకు వచ్చాడు. హనానీ యీలా అన్నాడు: “ఆసా, నీకు సహాయం చేయటానికి నీవు అరాము (సిరియా) రాజుమీద ఆధారపడ్డావు గాని, దేవుడైన యెహోవాపై ఆధారపడలేదు. నీవు దేవుని మీద ఆధారపడవలసింది. నీవు సహాయానికి యెహోవాపై ఆధారపడలేదు గనుక, అరాము రాజు సైన్యం నీ అధీనం నుండి తప్పించుకున్నది. ఇథియోపియనులు లూబీయులు (లిబియావారు) చాలా శక్తివంతమైన పెద్ద సైన్యాలను కలిగియున్నారు. వారికి అనేక రథాలున్నాయి, రథసారధులు వున్నారు. కాని ఆసా, అంత పెద్ద సైన్యాన్ని ఓడించటానికి నీవు యెహోవాను నమ్ముకొని, ఆయన మీద ఆధారపడ్డావు. నీవు వారిని ఓడించేలా యెహోవా నీకు సహాయపడ్డాడు. యెహోవా కండ్లు భూమి నలుమూలలా పరిశీలించి తన పట్ల భక్తి విశ్వాసాలున్న వారిని చూస్తాయి. యెహోవా వారిని బలపర్చి రక్షిస్తాడు. ఆసా, నీవొక బుద్ధిలేని పని చేశావు. అందువల్ల ఇప్పటి నుండి నీవు యుద్ధాలు చేయవలసి వస్తుంది.”

10 అతడు చెప్పిన దానికి హనానీపై ఆసాకు కోపం వచ్చింది. ఆసాకు ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే అతడు హనానీని చెరసాలలో పెట్టించాడు. అదే సమయంలో ఆసా కొంతమంది మనుష్యులతో చాలా సంకుచితంగా, కఠినంగా ప్రవర్తించాడు.

11 మొదటి నుండి చివరి వరకు ఆసా చేసిన కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 12 ఆసా రాజుగా కొనసాగిన ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో[i] అతని పాదాలకు జబ్బు చేసింది. అతని జబ్బు చాలా ప్రమాదంగా వున్నప్పటికీ, ఆసా యెహోవా నుండి సహాయం కోరలేదు. ఆసా వైద్యుల నుండి వైద్య సహాయంకొరకు చూశాడు. 13 ఆసా తన పరిపాలనలో నలబై ఒకటవ సంవత్సరంలో చనిపోయాడు. ఆ విధంగా ఆసా తన పూర్వీకులతో నిద్రించాడు. 14 దావీదు నగరంలో తనకై తాను సిద్ధపర్చుకున్న సమాధిలోనే ప్రజలు ఆసాను వుంచారు. ఆసాకు గౌరవ సూచకంగా సుగంధ దినుసులతోను, పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు వుంచి, అతనిని దహించారు.[j]

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International