Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 27-29

27 భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు.

నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనివ్వు.

మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహీనుని కోపము మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి కంటే సహించడం కష్టం.

కోపం క్రూరమైంది. నీచమైంది. అది నాశనం కలిగిస్తుంది. కాని అసూయ మరీ దౌర్భాగ్యం.

దాచబడిన ప్రేమకంటె బహిరంగ విమర్శ మేలు.

ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు.

నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా తినలేవు. కాని ఆకలిగా ఉంటే ఏదైనా తినేస్తావు దాని రుచి బాగులేకున్నా సరే.

తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు.

పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోష పెడ్తాయి. కాని ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. అదే రీతిగా స్నేహితుని హృదయం నుండి వచ్చే మధురమైన హితవు వుంటుంది.

10 నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం మంచిది.

11 నా కుమారుడా జ్ఞానము కలిగివుండు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే వారికి ఎవరికైనా సరే నేను జవాబు చెప్పగలను.

12 జ్ఞానముగల వారు కష్టం రావడం గమనించి, దాని దారిలో నుండి తప్పుకుంటారు. కాని బుద్ధిహీనుడు సూటిగా చిక్కులోకి వెళ్లి దాని మూలంగా శ్రమపడతాడు.

13 మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత వహిస్తే, నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు.

14 “శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు.

15 ఎప్పుడూ వివాదం పెట్టుకోవాలని చూచే భార్య వర్షపు రోజున ఆగకుండా కురిసే చినుకుల్లాంటిది. 16 ఆ స్త్రీని వారించటం పెను గాలిని వారించ ప్రయత్నించినట్టే ఉంటుంది. అది నీ చేతితో నూనె పిండేందుకు ప్రయత్నించినట్టు ఉంటుంది.

17 ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని ఒకరు పదును చేస్తారు.

18 అంజూరపు చెట్ల విషయం శ్రద్ధగలవాడు దాని ఫలాలు తినగలుగుతాడు. అదే విధంగా తన యజమానుని విషయమై శ్రద్ధగలవాడు ప్రతిఫలం పొందుతాడు. అతని యజమాని అతని గూర్చి శ్రద్ధ పుచ్చుకుంటాడు.

19 ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో తెలియచేస్తుంది.

20 మరణస్థానం మరియు నాశన స్థలము ఎన్నటికీ తృప్తిపడవు. మానవుని కన్నులు కూడ ఎన్నటికీ తృప్తినొందవు.

21 బంగారాన్ని, వెండిని శుద్ధి చేయటానికి మనుష్యులు అగ్నిని ఉపయోగిస్తారు. అదే విధంగా ఒక మనిషికి ప్రజలు ఇచ్చే మెప్పుద్వారా అతడు పరీక్షించబడతాడు.

22 ఒక బుద్ధిహీనుని నీవు పొడుంగా నూర్చినా అతనిలోని తెలివి తక్కువ తనాన్ని నీవు బయటకు నెట్టివేయలేవు.

23 నీ గొర్రెలను, పశువులను జాగ్రత్తగా చూసుకో, నీకు చేతనైనంత బాగా వాటిని గూర్చి శ్రద్ధ తీసికో. 24 ఐశ్వర్యం శాశ్వతంగా ఉండదు. రాజ్యాలు కూడా శాశ్వతంగా ఉండవు. 25 మనుష్యులు ఎండుగడ్డి కోస్తే కొత్త గడ్డి పెరగటం మొదలవుతుంది. తరువాత కొండల మీద వెరుగుతున్న ఆ గడ్డిని వారు కోస్తారు. 26 (అందుచేత నీకు ఉన్న దానితో సంతృప్తిగా ఉండు.) నీ గొర్రెపిల్లల బొచ్చు నుండి నీవు బట్టలు చేసికోవచ్చు. నీ మేకలు అమ్మగా వచ్చిన డబ్బుతో నీవు భూమి కొనవచ్చును. 27 మిగిలిన నీ మేకలు సమృద్ధిగా పాలు ఇస్తాయి. కనుక నీకు, నీ కుటుంబానికి కూడా సరిపడినంత ఆహారం ఉంటుంది. నీ దాసీలను ఆరోగ్యవంతులుగా చేస్తుంది.

28 దుర్మార్గులకు ప్రతిదానిగూర్చీ భయమే. అయితే మంచి మనిషి సింహం అంత ధైర్యంగా ఉంటాడు.

ఒక దేశంలో పాపాలు చాలా ఉంటే, ఆ దేశాన్ని అనేక మంది నాయకులు పాలించటానికి ప్రయత్నిస్తారు. అయితే బలమైన రాజ్యానికి చాలాకాలం దాన్ని పాలించగల మంచి జ్ఞానముగల ఒకే నాయకుడు ఉంటాడు.

ఒక అధికారి తన బీద ప్రజలకు కష్టం కలిగిస్తే, అతడు పంటలను పాడు చేసే భారీ వర్షంలా ఉంటాడు.

న్యాయచట్టానికి లోబడేందుకు నీవు తిరస్కరిస్తే, నీవు దుర్మార్గుల పక్షాన ఉన్నట్టే. కాని నీవు న్యాయచట్టానికి లోబడితే, నీవు వారికి విరోధంగా ఉన్నట్టే.

దుర్మార్గులు న్యాయాన్ని అర్థం చేసికోరు. యెహోవాను ప్రేమించే వారు దానిని అర్థం చేసుకొంటారు.

ధనికుడై దుర్మార్గునిగా ఉండటంకంటె, దరిద్రుడై నిజాయితీగా ఉండటం మేలు.

న్యాయచట్టానికి విధేయుడయ్యే మనిషి తెలివి గలవాడు. కాని పనికిమాలిన వాళ్లతో స్నేహం చేసే వ్యక్తి తన తండ్రికి అవమానం తెస్తాడు.

పేద ప్రజలను మోసం చేసి మరి వారిపై ఎక్కువ వడ్డీ వేసి నీవు ధనికుడవైతే నీ ధనం పోగొట్టుకొంటావు. వారి యెడల దయగల మరో మనిషికి అది చెందుతుంది.

ఒక మనిషి దేవుని ఉపదేశాలు వినేందుకు తిరస్కరిస్తే, అప్పుడు దేవుడు అతని ప్రార్థనలు వినేందుకు తిరస్కరిస్తాడు.

10 ఒక చెడ్డ మనిషి ఒక మంచి మనిషికి హాని చేసేందుకు పథకాలు వేయవచ్చు. కాని ఆ చెడ్డ మనిషి తన గోతిలో తానే పడిపోతాడు. మరియు మంచి మనిషికి మంచి సంగతులే సంభవిస్తాయి.

11 ధనికులు జ్ఞానముగల వారమని ఎల్లప్పుడూ తలస్తారు. అయితే జ్ఞానముగల పేదవాడు సత్యమును చూడగలడు.

12 మంచి మనుష్యులు నాయకులైనప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అయితే ఒక దుర్మార్గుడు ఎన్నుకోబడినప్పుడు ప్రజలంతా వెళ్లిపోయి దాక్కుంటారు.

13 తన పాపాలు దాచిపెట్టడానికి ప్రయత్నించే మనిషి ఎన్నటికీ విజయం పొందడు. కాని ఒక మనిషి తాను తప్పులు చేశానని ఒప్పుకొని మరియు తన పాపాలు విడిచినట్లయితే దేవుడు మరియు ప్రతి ఒక్కరూ అతని యెడల దయ చూపిస్తారు.

14 ఒక మనిషి గనుక ఎల్లప్పుడూ యెహోవాను గౌరవిస్తే ఆ మనిషి ఆశీర్వదించబడతాడు. కాని ఒక మనిషి మొండిగా ఉండి, యెహోవాను గౌరవించేదుకు తిరస్కరిస్తే అతనికి కష్టం వస్తుంది.

15 ఒక దుర్మార్గుడు బలహీనుల మీద పరిపాలన చేస్తే అతడు కోపంగా ఉన్న ఒక సింహంలా గాని, పోట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఒక ఎలుగుబంటిలా గాని ఉంటాడు.

16 ఒక అధికారి జ్ఞానము లేనివాడైతే అతడు తన క్రిందనున్న ప్రజలను బాధిస్తాడు. కాని నిజాయితీ గలిగి, మోసాన్ని అసహ్యించుకొనే అధికారి చాలాకాలం పరిపాలిస్తాడు.

17 ఒక మనిషి మరో మనిషిని చంపి నేరస్తుడైతే ఆ మనిషికి ఎన్నటికీ శాంతి ఉండదు. ఆ మనిషిని బలపరచవద్దు.

18 ఒక మనిషి సరిగ్గా జీవిస్తూ ఉంటే అప్పుడు అతడు క్షేమంగా ఉంటాడు. కాని ఒక మనిషి దుర్మార్గుడైతే అతడు తన అధికారాన్ని పోగొట్టుకుంటాడు.

19 కష్టపడి పనిచేసే వాడికి తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. కాని కలలు కంటూ తన సమయాన్ని వ్యర్థం చేసే మనిషి ఎల్లప్పుడూ పేదవానిగా ఉంటాడు.

20 దేవుణ్ణి వెంబడించే మనిషిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే కేవలం ధనికుడు కావాలని మాత్రమే ప్రయత్నించే మనిషి శిక్షించబడతాడు.

21 ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. కేవలం ఒక వ్యక్తి తనకు తెలిసిన వాడైనంత మాత్రాన అతడు వానిని బలపరచ కూడదు. అయితే కొందరు న్యాయమూర్తులు కొద్దిపాటి డబ్బు చెల్లింపునకే వారి నిర్ణయాలు మార్చివేస్తారు.

22 ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు.

23 ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని అతనితో చెప్పటం ద్వారా నీవు సహాయం చేస్తే, తర్వాత అతడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. ఎల్లప్పుడూ పొగిడే మనుష్యుల కంటే అది చాలా మంచిది.

24 కొందరు మనుష్యులు వారి తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేస్తారు. “అదేమీ తప్పుకాదు” అని వారు అంటారు. కాని ఒక వ్యక్తి ఇంటిలోపలకు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాటన్నిటినీ పగలకొట్టడం ఎంత చెడ్డదో, అదీ అంత చెడ్డదే.

25 ఒక స్వార్థపరుడు కష్టం కలిగిస్తాడు. కాని యెహోవాను సమ్ముకునేవాడు ప్రతిఫలం పొందుతాడు.

26 ఒక మనిషి తనను తానే నమ్ముకొంటే అతడు బుద్ధిహీనుడు. కాని ఒక మనిషి జ్ఞానముగలవాడైతే అతడు నాశనాన్ని తప్పించు కొంటాడు.

27 ఒక మనిషి పేద ప్రజలకు ఇచ్చినట్లయితే అప్పుడు అతనికి అవసరమైనవన్నీ ఉంటాయి. కాని ఒక వ్యక్తి పేద ప్రజలకు సహాయం చేసేందుకు నిరాకరిస్తే అప్పుడు అతనికి చాలా చిక్కు కలుగుతుంది.

28 ఒక దుర్మార్గుడు పాలించేందుకు ఎన్నుకోబడితే అప్పుడు ప్రజలంతా దాక్కుంటారు. కాని ఆ దుర్మార్గుడు ఓడించబడితే అప్పుడు మరలా మంచివారు పాలన చేస్తారు.

29 ఒక మనిషి మొండివాడై, అతడు చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆకస్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు.

పాలించేవాడు మంచి మనిషి అయితే ప్రజలంతా సంతోషిస్తారు. కాని ఒక దుర్మార్గుడు పాలన చేస్తే అప్పుడు ప్రజలంతా నిట్టూర్చి ఆరోపణ చేస్తారు.

ఒక మనిషి జ్ఞానమును ప్రేమిస్తే అప్పుడు అతని తండ్రికి చాలా సంతోషం. కాని ఒక మనిషి తన డబ్బును వేశ్యల కోసం వ్యర్థం చేస్తే అప్పుడు అతడు తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొంటాడు.

ఒక రాజు న్యాయంగా ఉంటే, అప్పుడు ఆ రాజ్యం బలంగా ఉంటుంది. కాని రాజు స్వార్థపరుడై ప్రజల కోసం చేసే పనులన్నిటికి వారు అతనికి డబ్బు చెల్లించాల్సి వస్తే, అప్పుడు ఆ దేశం బలహీనంగా ఉంటుంది.

ఒక వ్యక్తి మనుష్యులకు చక్కని మాటలు చెప్పి తాను కోరింది సంపాదించాలని ప్రయత్నిస్తే, అప్పుడు అతడు తనకు తానే ఒక ఉచ్చు పెట్టుకుంటున్నట్టు అవుతుంది.

దుర్మార్గులు వారి స్వంత పాపం మూలంగానే ఓడించబడతారు. కాని ఒక మంచి మనిషి పాడుతూ సంతోషంగా ఉండగలడు.

మంచి మనుష్యులు పేద ప్రజలకోసం సరైనదానిని చేయాలని కోరుతారు. కాని చేడ్డవాళ్లు ఏమీ పట్టించుకోరు.

ఇతరులకంటే మేమే మంచివాళ్లం అనుకొనే మనుష్యులు చాలా చిక్కులు కలిగిస్తారు. వారు మొత్తం పట్టణాలనే గందరగోళం చేయగలరు. కాని జ్ఞానముగల మనుష్యులు శాంతి కలిగిస్తారు.

జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడుతాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు.

10 నరహంతకులు నిజాయితీగల మనుష్యులను ఎల్లప్పుడూ ద్వేషిస్తారు. ఆ దుర్మార్గులు నిజాయితీగల మంచి మనుష్యులను చంపాలని అనుకొంటారు.

11 తెలివితక్కువ వానికి త్వరగా కోపం వస్తుంది. కాని జ్ఞానముగల మనిషి సహనం కలిగి తనను తాను సంబాళించుకొంటాడు.

12 ఒక పాలకుడు అబద్ధాలు వింటే అప్పుడు అతని అధికారులంతా దుర్మార్గులు అవుతారు.

13 ఒక పేద మనిషి, పేదవాని దగ్గర దొంగిలించే మనిషి ఒక విధంగా ఇద్దరూ ఒకటే. వారిద్దరినీ యెహోవా చేశాడు.

14 ఒక రాజు పేదవారి యెడల న్యాయంగా ఉంటే అతడు చాలా కాలం పరిపాలిస్తాడు.

15 దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయనిస్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని వస్తాడు.

16 దుర్మార్గులు గనుక దేశాన్ని పాలిస్తూంటే, అప్పుడు ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. కాని చివరికి మంచి మనుష్యులు జయిస్తారు.

17 నీ కుమారుడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు, అప్పుడు వాడిని గూర్చి నీవు ఎల్లప్పుడూ అతిశయిస్తావు. వాడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు.

18 ఒక దేశం గనుక దేవునిచే నడిపించబడకపోతే అప్పుడు ఆ దేశంలో శాంతి ఉండదు. కాని దేవుని న్యాయచట్టానికి లోబడే దేశం సంతోషంగా ఉంటుంది.

19 ఒక సేవకునితో నీవు ఊరక మాటలే చెబితే అతడు పాఠం నేర్చుకోడు. ఆ సేవకుడు నీ మాటలు గ్రహించవచ్చుగాని అతడు లోబడడు.

20 ఒక మనిషి ఆలోచన లేకుండా మాట్లాడితే వానికి ఆశ లేదు. ఆలోచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంటే ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది.

21 నీ సేవకునికి కావలసినవి అన్నీ నీవు ఎల్లప్పుడూ ఇస్తూఉంటే చివరికి వాడు మంచి సేవకునిగా ఉండడు.

22 కోపంగల మనిషి చిక్కు కలిగిస్తాడు. మరియు కోపపడే మనిషి అనేక పాపాలతో దోషిగా ఉంటాడు.

23 ఒక మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక మనిషి వినమ్రంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని గౌరవిస్తారు.

24 కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు సత్యం చేప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం చేయబడితే మాట్లాడేందుకు కూడ అతడు ఎంతో భయపడతాడు.

25 భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు.

26 చాలా మంది మనుష్యులు ఒక అధికారికి స్నేహితులుగా ఉండాలని కోరుకొంటారు. కాని ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేవాడు యెహోవా మాత్రమే.

27 నిజాయితీ లేని మనుష్యులను మంచి మనుష్యులు అసహ్యించుకొంటారు. మరియు దుర్మార్గులు నిజాయితీగల మనుష్యులను అసహ్యించుకొంటారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International