Chronological
6 తరువాత సొలొమోను యిలా అన్నాడు:
“యెహోవా, నల్లని మేఘంలో
నివసిస్తానని అన్నాడు.
2 ఓ ప్రభూ, నీ కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాను. అది ఒక ఉన్నతమైన ఆలయం.
శాశ్వతంగా నీవు నివసించటానికి అది నిలయం!”
సొలొమోను ప్రసంగం
3 సొలొమోను వెనుదిరిగి తన ముందు నిలబడిఉన్న ప్రజలందరనీ దీవించాడు. 4 సొలొమోను యీలా అన్నాడు:
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి! నా తండ్రి దావీదుకు తానేమి చేస్తానని వాగ్దానం చేశాడో, యెహోవా అదంతా నెరవేర్చినాడు. యెహోవా దేవుడు యిలా చెప్పియున్నాడు: 5 ‘నా ప్రజలను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పటినుండి ఇశ్రాయేలు వంశాలవారున్న ఏ నగరాన్నీ నాకు ఒక ఆలయాన్ని కట్టించటానికి నేను కోరుకోలేదు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నేను ఏ వ్యక్తినీ నాయకునిగా ఎంపిక చేయలేదు. 6 కాని ఇప్పుడు నా పేరు మీద యెరూషలేమును ఎన్నుకున్నాను. పైగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి దావీదును ఎంపిక చేశాను.’
7 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు నా తండ్రియగు దావీదు ఒక ఆలయాన్ని నిర్మింప గోరాడు. 8 కాని. యెహోవా నా తండ్రితో, ‘దావీదూ, నీవు నా పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మింప తలంచటం బాగానే వుంది. 9 కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు’ అని చెప్పాడు. 10 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో ఇప్పుడది చేశాడు. నా తండ్రి స్థానంలో నేను కొత్త రాజును. దావీదు నా తండ్రి. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజును. అదే యెహోవా చేసిన వాగ్దానం. మరి నేను ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు ఒక ఆలయాన్ని నిర్మించాను. 11 ఒడంబడిక పెట్టెను ఆలయంలో వుంచాను! ఈ ఒడంబడిక పెట్టెలోనే దేవుని పది ఆజ్ఞల రాతిపలకలు వుంచబడినవి. దేవుడు ఈ ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలతో చేసు కొన్నాడు.”
సొలొమోను ప్రార్థన
12 సొలొమోను యెహోవా బలిపీఠానికి ఎదురుగా నిలబడ్డాడు. సమావేశమైన ఇశ్రాయేలు ప్రజల కెదురుగా అతడు నిలబడ్డాడు. పిమ్మట సొలొమోను తన రెండు చేతులూ చాచాడు. 13 సొలొమోను కంచుతో ఒక ఎత్తైన వేదిక నిర్మించాడు. దాని పొడవు ఏడున్నర అడుగులు; వెడల్పు ఏడున్నర ఆడుగులు; ఎత్తు ఎడున్నర అడుగులు అతడు దానిని బయట ఆవరణలో మధ్యగా వుంచాడు. అతడు దానిమీదకు ఎక్కి, సమావేశమైన ఇశ్రాయేలు ప్రజానీకం ముందు మోకరించాడు. సొలొమోను తన చేతులను ఆకాశంవైపుకు ఎత్తాడు. 14 పిమ్మట సొలొమోను యిలా ప్రార్థన చేశాడు:
“ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీవంటి దేవుడు భూమిమీదగాని, ఆకాశంలోగాని మరొక్కడు లేడు. ప్రేమ, కరుణతో కూడిన నీ ఒడంబడికను నీవు నిలబెట్టుకున్నావు. నీ ప్రజలంతా పూర్ణహృదయంతో సన్మార్గులై, నిన్ను అనుసరిస్తే నీ ఒడంబడిక కొనసాగిస్తావు. 15 నీ సేవకుడైన దావీదుకు నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు. దావీదు నా తండ్రి. స్వయంగా నీ నోటితో ఆ వాగ్దానం చేశావు. ఈనాడు ఆ వాగ్దానాన్ని స్వయంగా నీ చేతులతో నిజమయ్యేలా చేశావు. 16 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, ఇప్పుడు నీవు నీ సేవకుడైన దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుము. నీవిలా మాట యిచ్చావు: ‘దావీదూ, నా సన్నిధిలో ఇశ్రాయేలు సింహాసనంపై నీ కుటుంబంలో ఒకడు తప్పక కొనసాగుతాడు. నీ కుమారులు వారు చేసే కార్యాలలో తగిన జాగ్రత్త వహిస్తేనే ఇది జరుగుతుంది. నా ధర్మాశాస్త్రాన్ని నీవు అనుసరించిన రీతిలో, నీ కుమారులు కూడ నా ధర్మాశాస్త్రాన్ని పాటించాలి.’ 17 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీ వాగ్దానం నిజమగుగాక! ఈ వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు యిచ్చాయున్నావు.
18 “ఓ దేవా, నీవు నిజంగా మానవులతో కలిసి భూమి మీద నివసించవని మాకు తెలుసు. ఆకాశాలు గాని, మహా ఆకాశాలు గాని నిన్ను నిలుపజాలవు! అటువంటప్పుడు నేను నిర్మించిన ఈ చిన్న ఆలయం నిన్ను భరింపలేదని కూడా మాకు తెలుసు! 19 కానీ నీ కరుణ కొరకు నేను చేయు ప్రార్థనను, అభ్యర్థనను ఆలకించు. నా దేవుడైన ప్రభూ, నా మొరాలకించుము! నీ కొరకు నా ప్రార్థనయందు శ్రద్ధ వహించుము. నేను నీ సేవకుడను. 20 ఈ ఆలయాన్ని నీవు కన్నులార రాత్రింబవళ్లు చూడాలని నా ప్రార్థన. ఈ స్థలంలో నీ పేరును ప్రతిష్ఠిస్తావని నీవు చెప్పియున్నావు. ఈ ఆలయాన్ని చూస్తూ నేను చేసే నా ప్రార్థనను నీవు విందువుగాక! 21 నేను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేయు ప్రార్థనలను ఆలకించుము. ఈ ఆలయాన్ని చూస్తూ మేము చేయు ప్రార్థనలయందు లక్ష్యముంచుము. ఆకాశంలో నీవున్న చోటు నుంచే మా ప్రార్థన వినుము. నీవు మా ప్రార్థనలను విన్నప్పుడు మమ్మల్ని మన్నించుము.
22 “ఒక మనిషి వేరొక మనిషిపట్ల అపచారం చేసిన నేరానికి పాల్పడవచ్చు. అది జరిగినప్పుడు నిందితుడు నీపేరు మీద ఒక ప్రమాణం చేయాలి. ఆలయంలోని నీ బలిపీఠం ముందు అతడు ప్రమాణం చేయటానికి వచ్చినప్పుడు 23 నీవు ఆకాశంలోని నీ నివాసము నుండి వినుము. అప్పుడు నీ సేవకులను విచారించి చర్య తీసుకొనుము. దుష్టుని శిక్షించుము. అతడు ఇతరులను బాధ పెట్టిన విధంగా తానుకూడా ఆ బాధను అనుభవించేలా చేయుము. మంచి కార్యములు చేసిన వాని నిర్దోషిత్వాన్ని నిరూపింపుము.
24 “నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీపట్ల పాపం చేసిన కారణంగా ఒక శత్రువు వారిని ఓడించవచ్చు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి నీ నామస్మరణ చేసి నిన్నాశ్రయించి ఈ ఆలయంలో నిన్ను ప్రార్థస్తూ వేడుకుంటే, 25 ఆకాశంలో వుండి నీ ఇశ్రాయేలీయుల రోదన విని వారిని క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వీకులకు ఇచ్చిన రాజ్యానికి వారిని తిరిగి తీసుకొని రమ్ము.
26 “వర్షాలు లేకుండ ఆకాశం కుంచుకుపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు నీపట్ల పాపం చేసినట్లయితే ఇది జరుగుతుంది. కాని ఇశ్రాయేలీయులు నీ శిక్షకు గురియై తమ తప్పు తెలిసికొని పశ్చాత్తాపము పొంది, ఆలయం వైపు తిరిగి నీ నామస్మరణ చేసి ప్రార్థిస్తే, 27 నీవు ఆకాశంలో నుండి వారి మొరాలకించుము. వారి విన్నపము ఆలకించి వారి పాపాలను క్షమించుము. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు. వారు జీవించవలసిన సన్మార్గాన్ని వారికి బోధించుము. నీ రాజ్యంలో వర్షాలు కురిపించుము. నీవు ఈ రాజ్యాన్ని నీ ప్రజలకు ఇచ్చావు.
28 “ఈ రాజ్యంలో కరువు రావచ్చు. వ్యాధులు వ్యాపించవచ్చు. పంటలకు తెగుళ్లు సోకవచ్చు. తోటలకు తేనెమంచు వ్యాధుల, మిడతల, పురుగుల పీడ సంభవించవచ్చు. ఇశ్రాయేలీయుల నగరాలపై శత్రుదాడులు జరిగినప్పుడుగాని, ఇశ్రాయేలులో ఏ రకమైన వ్యాధులు ప్రబలినా, 29 ఇశ్రాయేలు ప్రజలు తమ బాధలు గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే, ఏ బాధితుడేగాని ఈ ఆలయాన్ని చూస్తూ చేతులెత్తి ప్రార్థిస్తే, 30 నీ నివాస స్థలమైన ఆకాశంనుండి వారి అభ్యర్థన ఆలకించుము. వారి మొరాలకించి, వారిని క్షమించుము. ప్రతి వ్యక్తికి వానికి అర్హమైన దాని నివ్వుము. ఎందువల్లననగా ప్రతివాని హృదయం నీకు తెలుసు. మానవ హృదయాలను తెలుసుకొనే శక్తి నీ వొక్కనికే వుంది. 31 అప్పుడు మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో ప్రజలు నివసించినంత కాలం నీపట్ల భయభక్తులు కలిగి వుంటారు. 32 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెందని పరదేశీయుడెవడైనా తన సుదూరదేశం నుండి ఇక్కడికి రావచ్చును. అతడు నీ మహోన్నత నామం వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే, 33 నీ ఆకాశ నివాసం నుండి వాని ప్రార్థన ఆలకించుము. ఆ పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులవలె నీ పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు మీద పిలువ బడుతూ వుందని తెలుసుకుంటారు.
34 “నీవు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవైపు, నేను నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి నిన్ను తలంచి ప్రార్థన చేసిన పక్షంలో 35 వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము.
36 “ప్రజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామాన్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వారిపై కోపం రావటం సహజం. ఒకానొక శత్రువు వచ్చి వారిని ఓడించి బందీలుగా దూరదేశానికో, దగ్గర దేశానికో తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు. 37 కాని వారు బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో పరివర్తన వచ్చి నిన్ను ప్రాధేయపడవచ్చు. ‘మేము పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మార్గంగా ప్రవర్తించాము,’ అని వారు పరితపించవచ్చు. 38 పరితపించి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు యిచ్చిన దేశంవైపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవైపు చూస్తూ నిన్ను ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి ప్రార్థించవచ్చు. 39 ఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల పాపం చేసిన నీ ప్రజలైన వారి ప్రార్థన, వారి మనవి ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము. 40 ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.
41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో
నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము.
నీ యాజకులు రక్షణ పొందుదురు గాక!
ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
42 ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు.
నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపకముంచు కొనుము!”
ఆలయాన్ని దేవునికి అంకింతం చేయటం
7 సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. 2 యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. 3 ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించి వుండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యిలా అన్నారు:
“ప్రభువు ఉత్తముడు,
ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.”
4 పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు. 5 రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి. 6 యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు.
7 ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్ఠించాడు. అక్కడే సొలొమోను దహనబలులు,[a] సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు.
8 సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు రోజులపాటు పండుగ చేశారు. సొలొమోనుతో చాలా మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి ఈజిప్టు సెలయేటి వరకు వున్న ప్రాంత మంతటి నుండి జనసమూహాలు వచ్చాయి. 9 ఏడు రోజుల పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు పవిత్రం (శుద్ధి) చేశారు. దానిని దైవారాధనలోనే వినియోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరించారు. 10 ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ రోజు సొలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్ల ఎంతో ఉదారంగా వున్నందుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి హృదయాలు ఆనందమయమయ్యాయి.
యెహోవా సొలొమోను వద్దకు రావటం
11 సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు. 12 ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు:
“సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను. 13 వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని, 14 నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. 15 నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి. 16 ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి. 17 సొలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే, నా ఆజ్ఞలన్నీ పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే, 18 నిన్నొక శక్తి గల రాజుగా చేస్తాను. నీ రాజ్యాన్ని సుస్థిరమైనదిగా చేస్తాను. నీ తండ్రియైన దావీదుతో అదే ఒడంబడిక చేశాను. ‘దావీదూ, ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొనసాగుతాడు’ అని నేను చెప్పియున్నాను.
19 “కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిరసావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్పడితే, 20 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన రాజ్యం నుండి బయటకు త్రోసివేస్తాను. నా నామముతో పవిత్రపర్చబడిన ఈ ఆలయాన్ని నేను వదలి వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ ఆలయమును మార్చివేస్తాను. 21 అత్యున్నతంగా గౌరవింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఈ ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు. 22 పిమ్మట వారు ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: ‘వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిప్టు నుండి విముక్తి చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను కొలిచారు. అందువల్లనే యెహోవా ఈ భయంకర పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అనుకుంటారు.’”
136 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి!
ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.
3 యెహోవా దేవున్ని స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
4 ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.
5 జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.
6 దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
7 దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
8 దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
9 దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రున్న్, నక్షత్రాలను చేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నడిపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచివేశాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
16 దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
19 దేవుడు అమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
20 దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
26 పరలోకపు దేవుణ్ణి స్తుతించండి!
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
© 1997 Bible League International