Chronological
19 అబద్ధాలు చెప్పి, మోసం చేసే బుద్ధిహీనునిగా ఉండుటకంటే, నిజాయితీగల పేదవానిగా ఉండుట మేలు.
2 దేనిగూర్చిగాని ఉద్వేగం పడిపోవటం మాత్రం చాలదు. నీవు చేస్తోంది ఏమిటో కూడా నీకు తెలిసి ఉండాలి. నీవు తొందరపడి ఏదీ చేయకూడదు. లేకపోతే నీవు తప్పు చేస్తావు.
3 ఒక మనిషి యొక్క బుద్ధిహీనత అతని జీవితాన్ని పాడు చేస్తుంది. కాని అతడు యెహోవాను నిందిస్తాడు.
4 ఒకడు ధనవంతుడైతే అతని ఐశ్వర్యం అతనికి అనేకమంది మిత్రులను తెచ్చి పెడ్తుంది. కాని ఒకడు పేదవాడైతే అతని స్నేహితులంతా అతనిని విడిచి పెట్టేస్తారు.
5 మరొకనికి విరోధంగా అబద్ధం చెప్పేవాడు శిక్షించబడుతాడు. అబద్ధాలు చెప్పేవాడు క్షేమంగా ఉండడు.
6 అధికారులతో అనేకమంది స్నేహంగా ఉండాలని కోరుకొంటారు, కానుకలు ఇచ్చే వానితో ప్రతి ఒక్కరూ స్నేహంగా ఉండాలని కోరుకొంటారు.
7 ఒక మనిషి పేదవాడైతే, అతని కుటుంబం కూడా అతనికి విరోధంగా ఉంటుంది. అతని స్నేహితులంతా అతని దగ్గరనుండి వెళ్లిపోతారు. ఆ పేదవాడు సహాయం కోసం వారిని భిక్షం అడగవచ్చు. కాని వారు అతని దగ్గరకు కూడా వెళ్లరు.
8 తెలివిని సంపాదించుకొనుటకు ప్రయత్నించే మనిషి తనను తాను ప్రేమిస్తున్నట్టు సూచిస్తాడు. జ్ఞానమును ప్రేమించేవాడు లాభం పొందుతాడు.
9 అబద్ధాలు చెప్పేవాడు శిక్షించబడతాడు. అబద్ధాలు చెబుతూనే ఉండేవాడు నాశనం చేయబడతాడు.
10 బుద్ధిహీనుడు ధనవంతునిగా ఉండకూడదు. అది రాజకుమారుల మీద బానిస పరిపాలన చేసినట్టుగా ఉంటుంది.
11 ఒక మనిషి జ్ఞానము గలవాడైతే, ఆ జ్ఞానము అతనికి సహనాన్ని ఇస్తుంది. అతని యెడల తప్పు చేసిన వారిని అతడు క్షమించటం అతనికి ఘనతగా ఉంటుంది.
12 ఒక రాజు కోపంగా ఉన్నప్పుడు అది సింహగర్జనలా ఉంటుంది. కాని అతడు నీతో సంతోషంగా ఉంటే అది మృదువైన వర్షంలా ఉంటుంది.
13 తెలివి తక్కువ కుమారుడు తన తండ్రిని నాశనం చేయగలడు. వాదులాడే భార్య ఎడతెగక కారే నీటి చుక్కల మాదిరి విసుగు కలిగించేదిగా ఉంటుంది.
14 మనుష్యులు ఇండ్లు, ధనం వారి తలిదండ్రులనుండి పొందుతారు. అయితే మంచి భార్య యెహోవా నుండి దొరికే వరం.
15 సోమరివానికి నిద్ర చాలా ఎక్కువ వస్తుంది. కాని అతడు చాలా ఆకలిగా కూడా ఉంటాడు.
16 దైవాజ్ఞకు విధేయునిగా ఉండేవాడు తన ఆత్మను క్షేమంగా ఉంచుకొంటాడు. కాని దైవాజ్ఞను వినుటకు నిరాకరించేవాడు మరణిస్తాడు.
17 పేద ప్రజలకు డబ్బులిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అతడు చేసే పనుల కోసం యెహోవా అతనికి బహుమానం ఇస్తాడు.
18 నీ కుమారునికి బోధించి, వాడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు. అదొక్కటే ఆశ. అలా చేయటానికి తిరస్కరిస్తే తనను తానే నాశనం చేసుకొనుటకు నీవు అతనికి సహాయం చేస్తున్నావు.
19 ఒకడు తేలికగా కోపం తెచ్చుకొంటే అతడు దాని విలువ చెల్లించాలి. అతడు కష్టంలో నుండి బయట పడుటకు నీవు అతనికి సహాయం చేస్తే అతడు తిరిగి నీకూ అలానే చేస్తాడు.
20 సలహా విని నేర్చుకో. అప్పుడు నీవు జ్ఞానముగలవాడవు అవుతావు.
21 మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.
22 నిజాయితీ, మరియు విశ్వసనీయత మనిషిలో కోరదగ్గవి. విశ్వసనీయత కోల్పోవడం కంటే బీదవాడుగా ఉండటం మేలు.
23 యెహోవా యెడల గౌరవం నిజమైన జీవానికి నడిపిస్తుంది. అప్పుడు మనిషికి శాంతి ఉంటుంది. కష్టంలో క్షేమంగా ఉంటాడు.
24 సోమరి తనను పోషించుకొనేందుకు తాను చేయాల్సిన పనులు కూడ చేయడు. తన పళ్లెంలోని భోజనం తన నోటి వద్దకు ఎత్తుకోటానికి కూడా అతనికి బద్ధకమే.
25 దేనికీ గౌరవం చూపనివారు శిక్షించబడాలి. అప్పుడు బుద్ధిహీనులు ఒక పాఠం నేర్చుకొంటారు. జ్ఞానముగల మనిషి విమర్శించ బడినప్పుడు నేర్చుకొంటాడు.
26 ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర దొంగతనం చేసి తన తల్లిని బలవంతంగా వెళ్లగొడితే, అతడు చాలా దుర్మార్గుడు. అతడు తనకు తానే సిగ్గు, అవమానం తెచ్చుకొంటాడు.
27 నేర్చుకొనేందుకు నీవు నిరాకరిస్తే, అప్పటికే నీకు తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మరచిపోతావు.
28 సాక్షి నమ్మకంగా లేకపోతే అప్పుడు తీర్పు న్యాయంగా ఉండదు. దుర్మార్గులు చెప్పే విషయాలు మరింత దుర్మార్గం తెచ్చి పెడతాయి.
29 ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొనే మనిషి శిక్షించబడతాడు. బుద్ధిహీనుడు తనకోసం దాచబడిన శిక్షను పొందుతాడు.
20 ద్రాక్షారసం నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. మద్యము కొట్లాటలు పుట్టిస్తుంది. విపరీతమైన తాగుబోతు బుద్ధిహీనుడు.
2 ఒక రాజు కోపం సింహగర్జనలా ఉంటుంది. నీవు రాజుకు కోపం పుట్టిస్తే నీ ప్రాణం పోగొట్టుకుంటావు.
3 ఏ బుద్ధిహీనుడైనా ఒక వివాదం మొదలు పెట్టగలడు. కనుక వివాదాలకు దూరంగా ఉండే మనిషిని గౌరవించాల్సిందే.
4 సోమరి మనిషికి విత్తనాలు చల్లటానికి కూడా బద్ధకమే. అందుచేత కోత సమయంలో అతడు భోజనం కోసం చూస్తాడు, కాని ఏమీ దొరకదు.
5 ఒక మనిషి ఆలోచనలను నీవు చూడలేవు. అవి లోతైన నీళ్లలాంటివి. అయితే జ్ఞానముగలవాడు, ఒకరు ఏమి తలస్తున్నారో గ్రహించగలడు.
6 చాలామంది మనుష్యులు నమ్మకంగా ఉన్నామని, నిండు ప్రేమతో ఉన్నామని చెబుతారు, కాని నిజంగా అలా ఉన్నవారిని కనుగొనడం చాలా కష్టం.
7 ఒక మంచి మనిషి మంచి జీవితం జీవిస్తాడు. మరియు అతని పిల్లలు ఆశీర్వదించబడతారు.
8 రాజు కూర్చొని ప్రజలకు తీర్పు చెప్పేటప్పుడు దుర్మార్గాన్ని అతని స్వంత కళ్లతో చూడగలడు.
9 ఒక మనిషి ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దానినే చేస్తానని నిజంగా చెప్పగలడా? తనలో పాపం లేదని ఎవరైనా నిజంగా చెప్పగలరా? లేదు!
10 అన్యాయపు తూనిక రాళ్లు, కొలతలు ఉపయోగించి ఇతరులను మోసం చేసే వాళ్లంటే యెహోవాకు అసహ్యం.
11 ఒక బిడ్డ తాను చేసే పనుల మూలంగా తన మంచి లేక చెడు చూపిస్తుంది. ఆ బిడ్డను నీవు గమనించి నిజాయితీ, మంచితనం ఆ బిడ్డకు ఉన్నాయో లేదో నీవు తెలిసికోవచ్చు.
12 మనకు చూసేందుకు కళ్లు, వినేందుకు చెవులు ఉన్నాయి. వాటిని మన కోసం యెహోవా చేశాడు!
13 నీవు నిద్రను ప్రేమిస్తే, నీవు నిరుపేదవు అవుతావు. పనిచేసేందుకు నీ సమయాన్ని ఉపయోగించు. అప్పుడు నీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.
14 “నీవద్ద ఏదైనా కొనే మనిషి, ఇది బాగాలేదు! దాని ఖరీదు ఎక్కువ!” అని చెబుతాడు. తరువాత అతడు వెళ్లిపోయి, తాను ఒక మంచి వ్యవహారం చేసినట్టుగా ఇతరులతో చెప్పుకొంటాడు.
15 జ్ఞానముగల విషయాలు చెప్పటం బంగారం కంటే, ముత్యాలకంటే చాలా ఎక్కువ విలువగలది.
16 మరో మనిషి అప్పులకు నీవు బాధ్యత వహిస్తే నీవు నీ చొక్కా పోగొట్టుకొంటావు.
17 దగాచేసి సంపాదించిన ఆహారము ఒక మనుష్యునికి తీపిగా వుంటుంది. కాని తర్వాత అతని నోరు మట్టితో నిండుతుంది. మోసం చేసి నీవు ఏదైనా సంపాదిస్తే అది మంచిదానిలా కనబడవచ్చు. కాని చివరికి దాని విలువ శూన్యం.
18 నీవు పథకాలు వేయకముందు మంచి సలహా తీసికో. నీవు గనుక ఒక యుద్ధం ప్రారంభిస్తూంటే నిన్ను నడిపించేందుకు మంచి మనుష్యులను చూసుకో.
19 ఇతరులను గూర్చి చెప్పుడు మాటలు చెప్పే మనిషి నమ్మదగిన వాడు కాడు. కనుక అధిక ప్రసంగం చేసే మనిషితో స్నేహంగా ఉండవద్దు.
20 ఒక వ్యక్తి తన తల్లికిగాని తండ్రికిగాని విరోధముగా మాట్లాడితే, అప్పుడు ఆ వ్యక్తి చీకటిగా మారిపోతున్న వెలుగులా ఉంటాడు.
21 నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, అది నీకు ఎక్కువ విలువగలది కాదు.
22 ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా చేస్తే, నీ అంతట నీవే అతన్ని శిక్షించటానికి ప్రయత్నించకు. యెహోవా కోసం వేచి ఉండు. అంతంలో ఆయన నీకే విజయం ఇస్తాడు.
23 అన్యాయపు త్రాసులు, తూనికలు ఉపయోగించి ఇతరులను మోసం చేసేవాళ్లంటే యెహోవాకు అసహ్యం. అవి ఆయన్ని సంతోషవరచవు.
24 ప్రతి మనిషికీ ఏమి జరుగుతుంది. అనే విషయం నిర్ణయించేది యెహోవా, అలాంటప్పుడు ఎవరైనా సరే వారి జీవితంలో ఏమి జరుగుతుందో ఎలా గ్రహించగలరు?
25 దేవునికి నీవు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేయక ముందే జాగ్రత్తగా ఆలోచించుకో, తర్వాత అలాంటి వాగ్దానం చేసి ఉండకపోతే మంచిది అనిపించవచ్చు.
26 జ్ఞానముగల రాజు ఏ మనుష్యులు దుర్మార్గులో నిర్ణయిస్తాడు. మరియు ఆ ప్రజలను ఆ రాజు శిక్షిస్తాడు.
27 ఒక మనిషి అంతరంగంలో ఉండే విషయాలు తెలిసికొనే సమర్ధుడు యెహోవా.
28 ఒక రాజు న్యాయంగా, నిజాయితీగా ఉంటే, అతడు తన అధికారాన్ని ఉంచుకోగలుగుతాడు. ప్రజలు అతన్ని ప్రేమిస్తే, అతడు తన పరిపాలన కొనసాగిస్తాడు.
29 ఒక యువకుని బలాన్ని బట్టి మనం అతణ్ణి మెచ్చుకొంటాం. కాని నెరసిన తలను చూచి ఒక వృద్ధుణ్ణి మనం గౌరవిస్తాం. అతడు పూర్ణ జీవితం జీవించినట్టు అది సూచిస్తుంది.
30 మనం శిక్షించబడితే, మనం తప్పు చేయటం మానివేస్తాం. నొప్పి ఒక మనిషిని మార్చగలదు.
21 (రైతులు తమ పొలాలకు నీళ్లు పెట్టటానికి చిన్న చిన్న కాలువలు త్రవ్వుతారు. ఒక కాలువను మూసి ఇంకొక కాలువకు నీళ్లు మళ్లిస్తారు) నీరు ప్రవహించు కాలువలాగ రాజు హృదయము యెహోవా చేతిలో వున్నది. ఆయన తన ఇష్టము వచ్చిన వైపుకు తిప్పుతాడు.
2 ఒక మనిషి తాను చేసేది అంతా సరైనదే అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికి అసలైన కారణాలను యెహోవా చెబుతాడు.
3 సరైనవి, న్యాయమైనవి చేయుము. బలులకంటె వాటిని యెహోవా ఎక్కువ ప్రేమిస్తాడు.
4 ఇతరులు పనికిమాలిన వాళ్లు అన్నట్టు కళ్లతోను, హృదయ నేత్రాలతోను చూచేవారు పాపులు. ఇతరుల కంటె మేము మంచివాళ్లం అని నమ్మే హృదయం పాప భూయిష్టం.
5 జాగ్రత్తగల ఏర్పాటులు లాభం తెచ్చిపెడ్తాయి. కాని నీవు జాగ్రత్త లేకుండా, మరీ తొందరపడి పనులు చేస్తే, నీవు దరిద్రుడివి అవుతావు.
6 ఐశ్వర్యవంతుడివి కావాలని నీవు మోసం చేస్తే, నీ ఐశ్వర్యం త్వరలోనే పోతుంది. మరియు నీ ఐశ్వర్యాలు నీ మరణానికి దారి తీస్తాయి.
7 దుర్మార్గులు చేసే దుష్ట కార్యాలు వారినే నాశనం చేస్తాయి. సరైనది చేయటానికి వారు నిరాకరిస్తారు.
8 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేయాలని ప్రయత్నిస్తారు. కాని మంచి వాళ్లు నిజాయితీగా న్యాయంగా ఉంటారు.
9 వివాదం పెట్టాలని కోరుకునే భార్యతో కలసి ఒక ఇంటిలో ఉండటం కంటే, ఇంటి కప్పు మీద నివసించటం మేలు.
10 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ దుర్మార్గం చేయాలని కోరుతూంటారు. ఆ మనుష్యులు వారి చుట్టూరా ఉండే వారి మీద ఎలాంటి దయ చూపించరు.
11 ఒక వ్యక్తి ఇతరులకంటే తానే మంచివాడిని అని తలచినప్పటికి, అతడు శిక్షించబడితే ప్రతి ఒక్కరూ ఒక పాఠం నేర్చుకొంటారు. జరిగే సంగతుల మూలంగా జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ నేర్చుకొంటాడు. ఆ వ్యక్తి ఇంకా, ఇంకా ఎక్కువ తెలివి సంపాదిస్తాడు.
12 దేవుడు మంచివాడు. దేవునికి దుర్మార్గులు ఎవరో తెలుసు, ఆయన వారిని శిక్షిస్తాడు.
13 పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఒక వ్యక్తి తృణీకరిస్తే తర్వాత అతనికి అవసరమైనప్పుడు ఏ సహాయమూ దొరకదు.
14 ఒక వ్యక్తికి నీ మీద కోపం ఉంటే అతనికి రహస్యంగా ఒక కానుక ఇవ్వు. రహస్యంగా ఇచ్చిన కానుక గొప్ప కోపాన్ని వారించగలదు.
15 న్యాయమైన తీర్పు మంచి మనుష్యులను సంతోషింపజేస్తుంది. కాని దుర్మార్గులను అది భయపెడుతుంది.
16 ఒక మనిషి జ్ఞానమార్గాన్ని విసర్జిస్తే అతడు నాశనానికే పోతున్నాడు.
17 ఒక మనిషికి సరదా మాత్రమే అతి ముఖ్యం అయితే ఆ మనిషి దరిద్రుడు అవుతాడు. ఒకవేళ అతడు ద్రాక్షారస, భోజన ప్రియుడు అయితే అతడు ఎన్నటికీ ధనికుడు కాలేడు.
18 మంచి మనుష్యులకు దుర్మార్గులు చేసే దుర్మార్గపు పనులన్నిటికీ తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నిజాయితీ లేని మనుష్యులు నిజాయితీగల వాళ్లకు చేసే వాటన్నింటికీ శిక్ష చెల్లించాల్సి ఉంటుంది.
19 వివాదం అంటే మక్కువ పడే కోపిష్టి భార్యతో ఉండటంకంటే ఎడారిలో నివసించటం మేలు.
20 జ్ఞానము గలవాడు తనకు అవసరమైన వాటిని భద్రం చేసికొంటాడు. కాని తెలివి తక్కువవాడు దొరికిన దాన్ని దొరికినంత త్వరగానే వాడేస్తాడు.
21 ఎల్లప్పుడూ ప్రేమ, దయ చూపించాలని ప్రయత్నించే మనిషి మంచి జీవితం, ఐశ్వర్యం, ఘనత కలిగి ఉంటాడు.
22 జ్ఞానముగలవాడు దాదాపు ఏదైనా చేయగలడు. బలంగల మనుష్యులు కాపలా కాస్తున్న పట్టణంపై అతడు దాడి చేయగలడు. వారిని కాపాడుతాయని నమ్ముకొన్న గోడలను అతడు నాశనం చేయగలడు.
23 ఒక మనిషి అతడు చేప్పే విషయాలలో జాగ్రత్తగా ఉంటే అతడు కష్టం నుండి తనను తాను తప్పించుకోగలడు.
24 ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే వాడు గర్విష్ఠి. తాను చేసే పనుల ద్వారా అతడు తను దుర్మార్గుడని చూపిస్తాడు.
25-26 సోమరి తను ఇంకా ఇంకా కావాలని కోరినప్పుడు తనను తానే నాశనం చేసికొంటాడు. అతడు వాటికోసం పనిచేసేందుకు నిరాకరిస్తాడు గనుక, తనను తానే నాశనం చేసికొంటాడు. కాని మంచి మనిషికి పుష్కలంగా ఉంటుంది గనుక అతడు యివ్వగలడు.
27 దుర్మార్గులు బలులు అర్పించినప్పుడు, ముఖ్యంగా ఆ దుర్మార్గులు యెహోవా దగ్గర నుండి ఏదైనా సంపాదించాలని ప్రయత్నించినప్పుడు ఆయన సంతోషించడు.
28 అబద్ధాలు చేప్పేవాడు నాశనం చేయబడతాడు. ఆయితే ఆ అబద్ధాలు వినే వ్యక్తి అతనితో పాటు నాశనం చేయబడతాడు.
29 మంచివాడు తాను చేస్తున్నది సరైనది అని ఎల్లప్పుడూ తెలిసే ఉంటాడు. కాని దుర్మార్గుడు నటించాల్సి ఉంటుంది.
30 ఒక పథకానికి యెహోవా విరోధంగా ఉంటే దానిని విజయవంతం చేయగలిగినంత జ్ఞానముగలవాడు ఎవడూ లేడు.
31 మనుష్యులు గుర్రాలను, సమస్తాన్ని యుద్ధం కోసం సిద్ధం చేయవచ్చు, కాని యెహోవా వారికి విజయం ఇస్తేనే తప్ప వారు జయించలేరు.
© 1997 Bible League International