Chronological
13 ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కాని గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్మడు.
2 మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు.
3 తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కాని ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు.
4 బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కాని అతడు వాటిని ఎన్నటికీ పొందలేడు. కాని కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు.
5 మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు.
6 మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కాని పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది.
7 కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కాని వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కాని వాస్తవానికి వారు ధనికులు.
8 ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కాని పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు.
9 ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కాని దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు.
10 ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు.
11 డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు.
12 నిరీక్షణ లేకపోతే హృదయానికి దు: ఖం. నీవు కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు.
13 ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే, అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవించేవాడు బహుమానం పొందుతాడు.
14 జ్ఞానముగల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పించుకొనుటకు సహాయం చేస్తాయి.
15 తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కాని ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది.
16 జ్ఞానముగల మనిషి ఏదైనా చేయకముందే అతడు ఆలోచిస్తాడు. అయితే బుద్దిహీనుడు చేసే బుద్దిహీనత వలన అతడు మూర్ఖుడౌతాడు.
17 ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే, అప్పుడు అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నమ్మదగిన వాడైతే శాంతి ఉంటుంది.
18 ఒక వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చుకొనేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు పేదవాడై, సిగ్గుపడతాడు. కాని ఒక మనిషి విమర్శించడినప్పుడు, శిక్షించబడినప్పుడు వినిపించుకొంటే లాభం పొందుతాడు.
19 ఒక మనిషి ఏదైనా కోరుకొని దానిని పొందితే, అతనికి చాలా సంతోషం. కాని మూర్ఖులు కీడునే కోరుకొంటారు. వారు మారుటకు అంగీకరించరు.
20 జ్ఞానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కాని బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు.
21 పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుముతుంది. కాని మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి.
22 మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవలకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డవాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్ల పాలవుతాయి.
23 ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల మంచి భూమి ఉండవచ్చును. కాని అతడు చెడు నిర్ణయాలు చేసి, ఆకలితో ఉంటాడు.
24 ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తే, వారు తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. నీవు నీ కుమారుణ్ణి ప్రేమిస్తే, అతనికి సరైన మార్గం నేర్పించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు.
25 మంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి ఉంటాయి. కాని దుర్మార్గునికి అవసరత కలిగివుంటుంది.
14 జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయోగిస్తుంది. కాని బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసుకొంటుంది.
2 సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. కాని నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు.
3 బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడతాయి. కాని జ్ఞానముగలవాని మాటలు అతణ్ణి కాపాడతాయి.
4 పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మనుష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు.
5 సత్యవంతుడు అబద్ధం చెప్పడు. అతడు మంచి సాక్షి. కాని నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు. అతడు చెడ్డ సాక్షి.
6 ఇతరులకంటె తాను మంచివాడను అని తలంచే గర్విష్ఠుడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలి అనుకోవచ్చు. కాని ఆ గర్విష్ఠుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. అయితే నిజంగా జ్ఞానముగల వానికి (దేవుని నమ్మినవానికి) తెలివి సులభంగా అబ్బుతుంది.
7 తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి తక్కువ మనిషి నీకు నేర్పించగలది ఏమీ లేదు.
8 తెలివిగల మనుష్యులు వారు చేసే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు, గనుక వారు జ్ఞానము గలవారు. కాని బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు. అనుకొంటారు గనుక వారు తెలివితక్కువ వారు.
9 తెలివి తక్కువ వాడు, తాను చేసిన చెడు విషయాలకు శిక్ష పొందాలి అనే మాటను గూర్చి నవ్వేస్తాడు. కాని మంచి మనుష్యులు క్షమాపణ పొందటానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తారు.
10 ఒక మనిషి విచారంగా ఉంటే దాని ప్రభావం అతను ఒక్కడే అనుభవిస్తాడు. అదే విధంగా ఒక మనిషి సంతోషంగా ఉంటే అతను ఒక్కడు మాత్రమే ఆ ఆనందం అనుభవిస్తాడు.
11 దుర్మార్గుని ఇల్లు నాశనం చేయబడుతుంది. కాని మంచివాని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది.
12 సరిగ్గా ఉంది అని మనుష్యులు తలంచే ఒక మార్గం ఉంది. కాని ఆ మార్గం మరణానికి మాత్రమే దారి తీస్తుంది.
13 ఒక మనిషి నవ్వుతూ ఉన్నా, అతడు విచారంగానే ఉండవచ్చు. నవ్వటం అయిపొయ్యాకగూడ ఆ విచారం అలాగే ఉంటుంది.
14 దుర్మార్గులు చేసే చెడుపనులకు వారికి పూర్తిగా చెల్లించబడుతుంది (శిక్షించబడుతారు). మరియు మంచివాళ్లు చేసే మంచి పనులకు పూర్తిగా బహుమానం పొందుతారు.
15 బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కాని జ్ఞానము గలవాడు ప్రతిదాని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తాడు.
16 జ్ఞానముగలవాడు యెహోవాను గౌరవిస్తాడు, దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కాని బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా పనులు చేస్తాడు జాగ్రత్తగా ఉండడు.
17 త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కలిగి ఉంటాడు.
18 తెలివితక్కువ వారు తమ తెలివితక్కువ తనాన్ని బట్టి శిక్షించబడుతారు. కాని జ్ఞానముగలవారికి తెలివి బహుమానంగా ఇవ్వబడుతుంది.
19 చివరికి చెడ్డవారిమీద మంచి వాళ్లు గెలుస్తారు. చెడ్డవాళ్లు మంచివాళ్లకు నేవ చేయుటకు బలవంతం చేయబడుతారు.
20 పేదవానికి స్నేహితులు ఎవ్వరూ ఉండరు. అతనికి పొరుగువారు కూడ ఉండరు. కాని ధనికులకు చాలా మంది స్నేహితులు ఉంటారు.
21 ఇతరులకంటే నీవే మంచివాడవని తలచటం తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి యెడల దయ కలిగి ఉండు.
22 దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవరైనా సరే అతడు తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి ప్రయత్నించే వ్యక్తికి, అతన్ని ప్రేమించి అతన్ని నమ్ముకొనే స్నేహితులు ఉంటారు.
23 నీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని ఏమి చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు.
24 జ్ఞానముగలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా పొందుతారు. కాని బుద్ధిహీనులు తెలివితక్కువ తనాన్ని బహుమానంగా పొందుతారు.
25 సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు.
26 యెహోవాను గౌరవించే మనిషి క్షేమంగా ఉంటాడు. మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు.
27 యెహోవా యెడల భక్తి నిజమైన జీవాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణవు ఉచ్చునుండి రక్షిస్తుంది.
28 ఒక రాజు అనేకమంది ప్రజలను పాలిస్తే అతడు గొప్పవాడు. కాని ప్రజలు ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఆ రాజు యొక్క విలువ శూన్యం.
29 సహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరచుకుంటాడు.
30 ఒక మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాని అసూయ శరీరంలో వ్యాధి కలిగిస్తుంది.
31 పేద ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి గౌరవించటం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే చేశాడు. కాని ఒక మనిషి పేద ప్రజల యెడల దయ కలిగి ఉంటే, అప్పుడు అతడు దేవుణ్ణి గౌరవిస్తాడు.
32 కష్టకాలంలో దుర్మార్గులు ఓడించబడతారు. కాని మంచివాళ్లు మరణ సమయంలో కూడా విజయం పొందుతారు.
33 జ్ఞానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహీనునికి జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు.
34 మంచితనం ఒక దేశాన్ని గొప్పగా చేస్తుంది. కాని పాపం వలన ఏ ప్రజలకైనా అవమానమే కలుగుతుంది.
35 ఒక రాజుకు జ్ఞానముగల నాయకులు ఉంటే అతడు సంతోషిస్తాడు. కాని తెలివితక్కువ నాయకుల విషయమై రాజుకు కోపం.
15 శాంతియుతమైన జవాబు కోపాన్ని పోగొడ్తుంది. కాని దురుసు జవాబు కోపాన్ని పెంచుతుంది.
2 జ్ఞానముగల మనిషి మాట్లాడినప్పుడు ఇతరులు వినాలని ఆశిస్తారు. కాని బుద్ధిహీనుడు మాట్లాడేది తెలివితక్కువ తనమే అవుతుంది.
3 అన్నిచోట్లా జరిగేవాటన్నింటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను, మంచి వాళ్లను యెహోవా గమనిస్తాడు.
4 దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి.
5 తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు అతనికి నేర్పించటానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు.
6 మంచి మనుష్యులు అనేక విషయాలలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కాని ఒక దుర్మార్గునికి ఉన్నవి అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి.
7 జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞానముతో మాట్లాడుతాడు. కాని బుద్ధిహీనులు వినదగినది ఏమీ చెప్పరు.
8 దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం.
9 దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
10 ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.
11 మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుష్యుల హృదయాల్లో, మనస్సుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు.
12 బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానముగల వారిని సలహా అడగటానికి నిరాకరిస్తాడు.
13 ఒక వ్వక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో ఆ దు: ఖం వ్యక్తం అవుతుంది.
14 జ్ఞానముగలవాడు ఇంకా ఎక్కువ తెలివి సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. కాని బుద్ధిహీనునికి ఇంకా ఎక్కువ బుద్ధిహీనత కావాలి.
15 కొంతమంది పేదవాళ్లు ఎంతసేపూ విచారంగానే ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషంగల పేదవాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది.
16 ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు.
17 ద్వేషం ఉన్నచోట విస్తారంగా భోజనం చేయటంకంటే, ప్రేమగల చోట కొద్దిగా భోజనం చేయటం మేలు.
18 త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కాని సహనంగల మనిషి శాంతిని కలిగిస్తాడు.
19 బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కాని నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది.
20 జ్ఞానముగల కుమారుడు తన తండ్రికి సంతోషం కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం తెస్తాడు.
21 తెలివితక్కువ వానికి తెలివితక్కువ తనమే ఆనందం. కాని జ్ఞానముగలవాడు సరైన వాటినే చేయటానికి జాగ్రత్తపడతాడు.
22 ఒక వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే, అతని తలంపులు విఫలమవుతాయి. అయితే ఒక వ్యక్తి జ్ఞానముగలవారు తనకు చెప్పే విషయాలు వింటే విజయం పొందగలడు.
23 ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు సంతోషిస్తాడు. మరియు సరైన సమయంలో సరైన మాట చెప్పటం చాలా మంచిది.
24 జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి.
25 గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు.
26 చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కాని దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు.
27 ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి పెడ్తాడు. కాని లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు.
28 మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్ఠం కలిగిస్తుంది.
29 యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కాని మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు.
30 నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.
31 ఒక మనిషి తాను తప్పు చేసినప్పుడు, దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానముగలవాడు.
32 ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు.
33 యెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించేముందు, వినమ్రుడవ్వాలి.
© 1997 Bible League International