Chronological
జ్ఞానము గూర్చి తండ్రి సలహా
4 కుమారులారా, “మీ తండ్రి ఉపదేశములు వినండి.” మీరు గ్రహించగలుగునట్లు గమనించండి. 2 ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు ప్రాముఖ్యమైనవి, మంచివి. అందుచేత నా ఉపదేశములు ఎన్నడూ మరువవద్దు.
3 నేను నా తండ్రికి పసివాడను. నేను నా తల్లికి ఒకే కూమారుణ్ణి. 4 నా తండ్రి నాకు నేర్పిస్తూ నాతో ఇలా చెప్పాడు: “నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీవు నా ఆజ్ఞలకు విధేయుడవైతే జీవిస్తావు. 5 జ్ఞానము, వివేకం సంపాదించు! నా మాటలు మరువకు. నా ఉపదేశాలు ఎల్లప్పుడూ పాటించు. 6 జ్ఞానమునుండి తొలగిపోవద్దు. అప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది.
7 “జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. 8 జ్ఞానాన్ని ప్రేమించు. జ్ఞానం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జ్ఞానాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చి పెడుతుంది. 9 ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీతల మీద ఉంచుతుంది. సోగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.”
10 కనుక నా మాట విను. నేను చెప్పే సంగతులను జరిగించు. అప్పుడు నీవు ఎక్కువ కాలం జీవిస్తావు. 11 జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను. నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. 12 ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు. 13 ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం!
14 దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. 15 దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో. 16 చెడ్డవాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు మరో వ్యక్తిని బాధించేటంతవరకు నిద్రపోలేరు. 17 ఆ మనుష్యులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు.
18 మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది. 19 చెడు మనుష్యులు చీకటి రాత్రివలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూవుంటారు.
20 నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. 21 నా మాటలు నిన్ను విడిచి పోనియ్యకు. నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో. 22 నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యంలాంటివి. 23 నీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. నీ తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి.
24 సత్యమును వక్రం చేయవద్దు, సరికాని మాటలు చేప్పవద్దు. అబద్ధాలు చెప్పకు. 25 నీ యెదుట ఉన్న జ్ఞానముగల మంచి ఆశయాలనుండి నిన్ను నీవు తిరిగి పోనివ్వకు. 26 సరైన విధంగా జీవించుటకు చాలా జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీకు స్థిరమైన మంచిజీవితం ఉంటుంది. 27 తిన్నని మార్గం విడిచిపెట్టకు అది మంచిది, సరైనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ తిరిగిపొమ్ము.
వ్యభిచారము చేయకుండుటను గూర్చిన జ్ఞానము
5 నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము గల నా మాటలు గమనించు. 2 అప్పుడు జీవించుటకు సరైన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు జ్ఞానివి అని నీ మాటలు తెలియజేస్తాయి. 3 మరొకరి భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు. 4 కాని అంతలో కక్ష, బాధ, మాత్రమే ఆమె తెచ్చి పెడుతుంది. ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను ఉంటుంది. 5 ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి. ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది. 6 ఆమెను వెంబడించవద్దు! ఆమె సరైన మార్గాలలో నుంచి తప్పిపోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! జీవమార్గాన్ని వెంబడించు!
7 నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరచిపోవద్దు. 8 వేశ్యకు దూరంగా ఉండండి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు కూడ వెళ్లవద్దు. 9 ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు. 10 నీకు తెలియని ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసుకుంటారు. నీ కష్టార్జితం ఇతరుల పాలవుతుంది. 11 నీ జీవితాంతం కూడా నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది. 12-13 అప్పుడు నీవు, “నా తల్లిదండ్రుల మాటలు నేనెందుకు వినలేదు? నా ఉపదేశకుల మాటలు నేనెందుకు వినలేదు? క్రమ శిక్షణతో ఉండుటకు నేను నిరాకరించాను, సరిదిద్దబడుటకు నేను నిరాకరించాను. 14 ఇప్పుడు అంతంలో, నా జీవితం వ్యర్ధం అయిపోయినట్లు నేను చూస్తున్నాను. మనుష్యులంతా నా అవమానం చూస్తున్నారు” అని నీవు అంటావు.
15-16 నీ స్వంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే త్రాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు). 17 నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు. 18 అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు. 19 ఆమె అందమైన లేడి వంటిది, అందమైన దుప్పిలాంటిది. ఆమె ప్రేమ నిన్ను పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది. 20 మరొకని భార్య నిన్ను అదే విధానాల్లో బంధించనియ్యకు. మరొకత్తె ప్రేమ నీకు అవసరం లేదు.
21 ప్రతి మనిషి చేసే ప్రతిది యెహోవా తేటగా చూస్తాడు. మనుష్యులు చేసే ప్రతిదాన్ని యెహోవా క్షుణ్ణంగా చూస్తాడు. 22 దుర్మార్గుని పాపాలు వానినే పట్టుకొంటాయి. అతని పాపాలు అతణ్ణి బంధించే పాశాల్లా ఉంటాయి. 23 ఈ మనిషి క్రమశిక్షణలో ఉంచేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు తన స్వంత బుద్దిహీనమైన కోరికల వల్లనే పట్టు బడతాడు.
అప్పు ప్రమాదాలు
6 నా కుమారుడా, ఇంకొకని అప్పుకు బాధ్యునిగా ఉండకు. ఆ వ్యక్తి తన అప్పు చెల్లించలేనని చెబితే, అది నీవే చెల్లిస్తానని వాగ్దానం చేశావా? మరో మనిషి అప్పులకు నిన్ను నీవే బాధ్యునిగా చేసుకొన్నావా? 2 అలాగైతే నీవు పట్టుబడ్డట్టే! నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేశాయి! 3 నీవు ఆ మనిషి శక్తి కింద ఉన్నావు. కనుక అతని దగ్గరకు వెళ్లి, నిన్ను నీవే విముక్తుని చేసుకో. అతని బాకీ నుండి నిన్ను విడిపించమని నీవు అతణ్ణి బ్రతిమాలు. 4 నిద్రపోయి, విశ్రాంతి తీసుకోనేంతవరకు వేచి ఉండవద్దు. 5 వేటగాని బారినుండి పారిపోతున్న లేడివలె ఆ ఉచ్చు నుండి తప్పించుకో. ఉచ్చులో నుండి పారిపోతున్న పక్షివలె, నిన్ను నీవే నిడుదల చేసుకో.
సోమరిగా ఉండుటవల్ల అపాయాలు
6 సోమరీ, నీవు చీమల దగ్గరకు వెళ్లి చీమలు ఏమి చేస్తుంటాయో చూడు. చీమ దగ్గర నేర్చుకో. 7 చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. 8 కాని చీమ, దాని ఆహారాన్ని వేసవిలో కూర్చుకొంటుంది. చీమ, దాని ఆహారాన్ని దాచుకొంటుంది. చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది.
9 సోమరీ, ఇంకెంతనేపు నీవు అక్కడ పండుకొంటావు. నీ విశ్రాంతి నుండి నీవు యింకెప్పుడు లేస్తావు? 10 “నాకు ఇంకొంచెం నిద్ర కావాలి. యింకాకొంచెంసేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను” అని సోమరి చెబుతాడు. 11 కాని అతడు నిద్రపోతాడు, మళ్లీ నిద్రపోతాడు; అతడు అతి దరిద్రుడవుతాడు. త్వరలోనే అతనికి ఏమీ ఉండదు. ఒక దొంగవాడు వచ్చి సమస్తం దోచుకున్నట్టు ఉంటుంది.
సమస్య కారకులు
12 దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్ధాలు చెబుతాడు. చెడ్డ సంగతులే చెబుతాడు. 13 అతడు కన్నుగీటి, సూచనలు చేసి మనుష్యులను మోసం చేస్తాడు. 14 ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపూ అతడు దుర్మార్గపు పథకాలే వేస్తాడు. అన్నిచోట్లా అతడు చిక్కులు పెడుతుంటాడు. 15 కాని అతడు శిక్షించబడతాడు. కష్టం అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం చేయరు.
యెహోవా అసహ్యించుకొనే ఏడు సంగతులు
16 ఈ ఆరు విషయాలను యెహోవా అసహ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన అసహ్యించుకొంటాడు.
17 ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే మనిషి. అబద్దాలు చెప్పే మనిషి. నిర్దోషులను చంపే మనిషి.
18 చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. దుర్మార్గం చేయాలని కోరే మనిషి.
19 అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి. వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి.
వ్యభిచారముకు విరోధంగా హెచ్చరిక
20 నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. మరియు నీ తల్లి ఉపదేశాలు మరువకు. 21 వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. వారి ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకో. 22 నీవు ఎక్కడికి వెళ్లినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకొని ఉంటాయి. మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి.
23 నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరైన దారి చూపించే వెలుగులా ఉంటాయి. నీవు జీవమార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది, నీకు శిక్షణ ఇస్తాయి. 24 నీవు చెడు స్త్రీ దగ్గరకు వెళ్లకుండా వారి ఉపదేశము నిన్ను వారిస్తుంది. తన భర్తను విడిచిపెట్టేసిన భార్య మెత్తటి మాటల నుండి వారి మాటలు నిన్ను కాపాడుతాయి. 25 ఆ స్త్రీ అందమైనది కావచ్చు. కాని ఆ అందం నీలో నిన్ను మండింపచేసి శోధించ నీయకు. ఆమె కండ్లను నిన్ను బంధించనియ్యకు. 26 ఒక వేశ్య ఖర్చు ఒక రొట్టె ముక్క కావచ్చు. కాని మరో పురుషుని భార్య నీ జీవితమంతా ఖర్చు చేయవచ్చు. 27 ఒకడు తన మీద నిప్పువేసుకుంటే అతని బట్టలు కూడా కాలిపోతాయి. 28 ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది. 29 మరొకడి భార్యతో పండుకొనే ఏ మనిషి విషయమైనా ఇంతే. ఆ మనిషి నష్టపోతాడు.
30-31 ఒకడు ఆకలితో ఉండి తినుటకు భోజనం దొంగిలించవచ్చు. ఒకవేళ అతడు పట్టుబడితే అతడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు అదనంగా చెల్లించాలి. అతనికి ఉన్న సమస్తం దీని మూలంగా ఖర్చు కావచ్చును. కాని ఇతరులు గ్రహిస్తారు. అతని మీద వారికి గల గౌరవం అంతా పోదు. 32 అయితే, వ్యభిచారం చేసే పురుషుడు బుద్ధిహీనుడు. అతడు తనకు తానే నాశనం చేసుకుంటాడు. తన నాశనానికి తానే కారణం అవుతాడు. 33 ప్రజలకు అతని మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. మరియు ఆ అవమానాన్ని అతడు ఎన్నటికీ మరచిపోడు. 34 ఆ స్త్రీ యొక్క భర్తకు రోషం వస్తుంది. ఆ భర్తకు చాలా కోపం వస్తుంది. అవతలి వాడిని శిక్షించేందుకు ఇతడు చేయగలిగింది ఏదైనా చేసేస్తాడు. 35 ఏ విధంగా చెల్లించినా ఎంత డబ్బు చెల్లించినా అతని కోపాన్ని ఆపేందుకు చాలదు!
© 1997 Bible League International