Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 1-3

పరిచయం

ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు. ప్రజలు జ్ఞానము కలిగి, సరైన వాటిని చేయటం తెలుసుకొనేందుకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి. ప్రజలు జీవించేందుకు శ్రేష్ఠమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి. నీతి, నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు. జ్ఞానమును నేర్చుకోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చుకొంటారు. ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానముగలవారు కూడ జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ నేర్చుకొని, ఇంకా జ్ఞానముగల వారు అవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవటంలో నిపుణతగల వారు యింకా ఎక్కువ అవగాహన సంపాదిస్తారు. అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు కథలు మనుష్యులు గ్రహించగలుగుతారు. జ్ఞానముగల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు.

ఒక వ్యక్తి యెహోవాను గౌరవించి, ఆయనకు విధేయత చూపించటమే, నిజమైన తెలివికి మూలము. కాని పాపాన్ని ప్రేమించే మనుష్యులు జ్ఞానాన్ని, సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు.

సొలొమోను మనకు ఇచ్చిన సలహా

నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడవు కావాలి. మరియు నీ తల్లి ఉపదేశాలు కూడ నీవు పాటించాలి. నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి.

10 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడ పాపాన్ని చేయించటానికి పయత్నిస్తారు. నీవు వారిని అనుసరించకూడదు. 11 ఆ పాపులు ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చేయి! మనం దాక్కొని, ఎవరినైనా అమాయకుణ్ణి చంపటానికి కనిపెడదాం. 12 ఎవరైనా ఒక నిర్దోషిమీద మనం దాడి చేద్దాం. మనం అతణ్ణి చంపుదాం. ఆ మనిషిని పితృ లోకానికి మనం పంపిద్దాం. అతణ్ణి మనం నాశనం చేసి, సమాధికి పంపిద్దాం. 13 చాలా ధనం, విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం మన గృహాలు నింపుకొందాం. 14 కనుక మాతో వచ్చి, వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు దొరికే వస్తువులన్నింటినీ మనం అందరం పంచుకొందాం.”

15 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే మనుష్యులను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు. 16 ఆ చెడ్డ మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని ఆశిస్తూంటారు.

17 ఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు. జాగ్రత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు. 18 కాని నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకొంటారు. వారి స్వంత ఉచ్చుతో వారే నాశనం చేయబడుతారు. 19 ఇవి దురాశపరుల పద్ధతులు అలాంటి దురాశ అది కలిగివున్నవారికి ప్రాణాంతక మవుతుంది.

మంచి స్త్రీ—జ్ఞానము

20 ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. 21 రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది:

22 “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? 23 మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని.

24 “కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 26 అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. 27 గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.

28 “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. 29 మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. 30 నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. 31 కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు.

32 “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. 33 కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”

జ్ఞానం చెప్పేది వినండి

నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. జ్ఞానం చెప్పేది విని, గ్రహించటానికి నీ శక్తి కొలది ప్రయత్నించు. జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, అవగాహన కోసం గట్టిగా అడుగు. వెండికోసం వెదకినట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం వెదకినట్టు దానికోసం వెదకు. వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చుకొంటావు. నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకొంటావు.

యెహోవా జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము, అవగాహన ఆయన నోటి నుండి వస్తాయి. ఆయన నిజాయితీ పరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకొనేవారికి కవచం లాంటివాడు. ఇతరుల యెడల న్యాయంగా ఉండేవాళ్లను ఆయన కాపాడతాడు. ఆయన తన పవిత్ర ప్రజలను కాపాడతాడు.

కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. అప్పుడు మంచివి, న్యాయమైనవి మరియు సరియైనవి నీవు గ్రహిస్తావు. 10 నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది.

11 జ్ఞానం నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది. 12 దుర్మార్గులు జీవించే చెడు మార్గంలో జీవించకుండ జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. ఆ మనుష్యులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మార్గులు 13 వారు మంచితనం విడిచి పెట్టి, ఇప్పుడు చీకట్లో (పాపంలో) జీవిస్తున్నారు. 14 వారు తప్పుచేసి సంతోషిస్తూ, దుర్మార్గపు చెడు మార్గాలలో ఆనందిస్తున్నారు. 15 ఆ మనుష్యులు నమ్మదగిన వారు కారు, వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కాని మీ జ్ఞానం, వివేచన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.

16 మరో దేశపు స్త్రీ ఎవరైనా నీవు ఆమెతో పాపము చేసేందుకు నిన్ను ఒప్పించేందుకని, దుర్మార్గులు తియ్యటి మాటలు ప్రయోగించవచ్చు. 17 ఆమె చిన్నదిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది కాని ఆమె తన భర్తను విడిచి పెట్టింది. ఆమె తన వివాహ ప్రమాణాన్ని నిలుపుకోవటం లేదు. ఆమె తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. కాని లేదు అని ఆమెతో చెప్పేందుకు జ్ఞానం నీకు సహాయం చేస్తుంది. 18 నీవు బలహీనుడవై ఆమె ఇంట ప్రవేశిస్తే నాశనం (మరణం) వైపు మొదటి మెట్టు మీద నడచినట్టే. నీవు ఆమెను అలానే వెంబడిస్తే ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది. 19 ఆమె ఒక సమాధిలా ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే, అతడు ఎన్నటికీ తిరిగి రాడు. ఆ మనిషి జీవితం మరలా ఎన్నటికి మొదటిలా ఉండదు.

20 కనుక నీవు మంచి మనుష్యుల అడుగుజాడలను అనుసరించేలా, మంచి మనుష్యులు జీవించే విధంగా జీవించునట్లు జ్ఞానం సహాయం చేస్తుంది. 21 సరిగ్గా జీవించే ప్రజలు దేశాన్ని తామే స్వంతంగా కలిగి ఉంటారు. మంచిని జరిగించే మనుష్యులు వారి భూమిలో జీవిస్తారు. 22 కాని దుర్మార్గులు వారి భూమిని పోగొట్టుకొంటారు. ఆ దుర్మార్గులు దేశం నుండి తొలగించి వేయబడతారు.

జ్ఞానపు దీవెన

నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి.

ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు.

పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు. నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు. నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది.

నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము. 10 అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది.

11 నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు. 12 ఎందుకంటే, యెహోవా తాను ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రిలాంటివాడు దేవుడు.

13 జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు అతడు ధన్యుడు. 14 జ్ఞానము మూలంగా వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా వచ్చే లాభం మంచి బంగారం కంటే మేలు. 15 జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది కాదు!

16 జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాల్ని, ఘనతలను నీకు ఇస్తుంది. 17 జ్ఞానముగల మనుష్యులు శాంతి, సంతోషం, కలిగి జీవిస్తారు. 18 జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతోషంగా ఉంటారు.

19 భూమిని చేయుటకు యెహోవా తన తెలివిని ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యెహోవా తెలివి ఉపయోగించాడు. 20 నీళ్లను చేయుటకు యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము ద్యారా ఆకాశాలు వర్షాన్ని కురిపిస్తాయి.

21 నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు. 22 జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. 23 అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా ఉంటావు. 24 నీవు పండుకొనునప్పుడు నీవు భయపడవు. నీవు విశ్రాంతి తీసుకొనునప్పుడు నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. 25-26 నీకు ఆకస్మికంగా సంభవించబోయేవాటిని గూర్చి భయపడకు. ఎందుకంటే యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుష్యులకే సంభవిస్తాయి.

27 మేలు చేయుట నీచేతనైనప్పుడు దాన్ని పొందదగినవారికి చేయకుండా వెనుదీయకుము. 28 నీ పొరుగు వాడు అతని స్వంత వస్తువులను తిరిగి ఇచ్చి వేయుమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయుము. “తిరిగి రేపు రమ్మని” అతనితో చెప్పవద్దు.

29 నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు.

30 మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు.

31 కొంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు. 32 ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు. కాని సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు.

33 దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు.

34 ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి, అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు యెహోవా సహాయం చేస్తాడు.

35 జ్ఞానముగల మనుష్యులు దేవుణ్ణి వెంబడిస్తారు. జ్ఞానముగల మనుష్యులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్దిహీనులు దేవుణ్ణి వెంబడించరు. బుద్దిహీనులు అవమానించబడతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International