Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-88

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

దాలెత్

25 నేను త్వరలోనే చనిపోతాను.
    యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
    ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
    ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము,
    నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
    జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
    నన్ను నిరాశ పరచవద్దు.
32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
    యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.

హే

33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
    నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
    నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
    నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
    నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
    నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
    నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
    జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
    నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

తేత్

65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
    నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
    నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
    కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
    కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
    నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
    నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
    వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.

యోద్

73 యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు.
    నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
74 యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు.
    నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
75 యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు.
    నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
76 ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
77 యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము.
    నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
78 నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు.
    యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను.
79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
    నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము.
    అందుచేత నేను అవమానించబడను.

కఫ్

81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
    కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
    యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
83 నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
    నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
84 నేను ఎంత కాలం జీవిస్తాను?
    యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
    మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
    అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
87 ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
    నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
    నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International