Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 19-21

దావీదును యోవాబు మందలించటం

19 ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు. ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు.

ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు. రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు.

యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను – అందరినీ కాపాడారు. నీ సేవకులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బ్రతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదమయింది! లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవనుభవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్వాన్నమవుతుంది.”

అప్పుడు రాజు నగరద్వారం[a] వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు.

దావీదు మరల రాజవటం

అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు. ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు. 10 మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.”

11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు. 12 మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి. 13 అమాశాతో, ‘నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.”

14 దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.

15 అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు.

దావీదును షిమీ క్షమాభిక్ష కోరటం

16 గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు. 17 వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు.

18 రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ అతని వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు. 19 రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు. 20 పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో[b] నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.”

21 కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.”

22 దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును – నాకును ఏమి పొందిక! ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.

23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.[c]

దావీదు దర్శనానికి మెఫీబోషెతు వెళ్లటం

24 సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు. 25 మెఫీబోషెతు రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూషలేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో రాలేదు?” అని అడిగాడు.

26 అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా) నన్ను మోసం చేశాడు! నేను అవిటివాడిని గనుక నా సేవకుడైన సీబాను పిలిచి, ‘ఒక గాడిదపై గంత కట్టి సిద్ధం చేయమన్నాను. దానిపై రాజుతో వెళతానన్నాను.’ 27 కాని నా సేవకుడు నన్ను మోసగించాడు. నా గురించి నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్రభువైన రాజు దేవ దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది చేయుము. 28 నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!”

29 “ఇక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను, అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు.

30 “సీబానే భూమినంతా తీసుకోనిమ్ము! ఎందువల్లనంటే నా ప్రభువైన రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని మెఫీబోషెతు రాజుతో అన్నాడు.

బర్జిల్లయిని తనతో యెరూషలేముకు రమ్మని దావీదు అడగటం

31 గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు. 32 బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు. 33 దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”

34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా? 35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు? 36 నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను. 37 తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లిదండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో.”

38 “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు.

దావీదు ఇంటికి తిరిగి వెళ్లటం

39 రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు.

40 గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు.

ఇశ్రాయేలీయులు యూదా వారితో వాదించటం

41 ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు.

42 యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”

43 అప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి.[d] కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!”

కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి.

షెబ ఇశ్రాయేలీయులను దావీదుకు వ్యతిరేకంగా చేయటం

20 బిక్రి కుమారుడైన షెబ అనే పనికిమాలిన వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బూర వూది,

“దావీదులో మనకు భాగం లేదు.
    యెష్షయి కుమారునితో మనకేమీ సంబంధం లేదు!
కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా మన గుడారాలకు పోదాం పదండి”

అని చెప్పాడు.

దానితో ఇశ్రాయేలీయులు దావీదును వదిలి, బిక్రి కుమారుడైన షెబను అనుసరించారు. కాని యూదా ప్రజలు మాత్రం యొర్దాను నది వద్ద నుండి యెరూషలేముకు వచ్చేవరకు దారి పొడవునా వారి రాజైన దావీదుతోనే వున్నారు.

దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. గతంలో దావీదు తన ఉపపత్నులను[e] పది మందిని ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు ఈ స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ ఇంటికి సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ స్త్రీలు విధవరాండ్రవలె జీవించారు.

రాజు అమాశాను పిలిచి, “యూదా ప్రజలను మూడు రోజులలో నన్ను కలవమని చెప్పు. నీవు కూడా ఇక్కడ వుండాలి” అని అన్నాడు.

యూదా ప్రజలందరినీ పిలిచి కూడగట్టుకు రావటానికి అమాశా వెళ్లాడు. కాని రాజు పెట్టిన గడువుకంటె అమాశా ఎక్కువ కాలాన్ని తీసుకున్నాడు.

అబీషైతో షెబను చంపమని దావీదు చెప్పటం

దావీదు అబీషైని పిలిచి, “బిక్రి కుమారుడైన షెబ మనకు అబ్షాలోముకంటె ఎక్కువ ప్రమాద కరమైన మనిషి. కావున నా సైనికులను తీసుకొని షెబను వెంటాడు. షెబ ప్రాకారాలున్న నగరాలలోనికి తప్పించుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక ప్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు మననుండి తప్పించుకున్నట్లే,” అని అన్నాడు.

కనుక యోవాబు మనుష్యులు, కెరేతీయులు, పెలేతీయులు, తదితర సైనికులు యెరూషలేము నుండి బయలుదేరి వెళ్లారు. బిక్రి కుమారుడైన షెబను వారు వెంటాడారు.

యోవాబు అమాశాను చంపటం

గిబియోను గుట్ట వద్దకు యోవాబు తన సైనికులతో వచ్చినప్పుడు అమాశా వారిని కలవటానికి ఎదురేగాడు. యోవాబు తన సైనిక దుస్తుల్లో వున్నాడు నడికట్టు కట్టుకున్నాడు. అతని ఒరలో కత్తి వున్నది. అమాశాను కలవటానికి యోవాబు ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన ఒరలోని కత్తి జారి క్రిందపడింది. యోవాబు ఆ కత్తిని తీసి చేతితో పట్టుకున్నాడు. “సోదరా, నీవు క్షేమమేనా?” అని యోవాబు అమాశాను అడిగినాడు. యోవాబు తన కుడిచేతితో అమాశాను ముద్దు పెట్టుకునేందుకా అన్నట్టు గడ్డం పట్టుకున్నాడు. 10 యోవాబు చేతిలో వున్న కత్తిని అమాశా గమనించలేదు. యోవాబు తన కత్తితో అమాశా పొట్టలో పొడిచాడు. అమాశా పేగులన్నీ బైటకు వచ్చాయి. యోవాబు మళ్లీ పొడిచే అవసరం లేకుండా పోయింది – అమాశా అప్పుడే చనిపోయాడు.

దావీదు మనుష్యులు ఇంకా షెబను వెదకుట

యోవాబు, అతని సోదరుడు అబీషై కలిసి బిక్రి కుమారుడు షెబను తరమటం కొనసాగించారు. 11 యోవాబు సైనికులలో యువకుడైన వాడొకడు అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన వారి నుద్దేశించి, “మీలో యోవాబును, దావీదును బలపర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. షెబను వెంటాడటంలో అతనికి సహాయం చేయండి!” అని అన్నాడు.

12 మార్గం మధ్యలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు. 13 అమాశా శవం బాట మీద నుంచి తీసివేయబడిన పిమ్మట జనమంతా యోవాబును అనుసరించారు. బిక్రి కుమారుడు షెబను తరిమేందుకు వారు యోవాబుతో కలిసి వెళ్లారు.

ఆబేలు బేత్మయకాకు షెబ తప్పించుకు పోవటం

14 బిక్రి కుమారుడు షెబ ఇశ్రాయేలు వంశపు వారు నివసించే ప్రాంతాల గుండా పోయి ఆబేలు బేత్మయకా నగరాన్ని చేరాడు. బెరీయులందరూ కూడి షెబను అనుసరించారు.

15 యోవాబు, అతని మనుష్యులు ఆబేలు బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్టూవున్న గోడకు వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్ల గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు దానిని పగులగొట్టటం మొదలుపెట్టారు.

16 ఇంతలో ఒక వివేకం గల స్త్రీ నగరంలో నుండి కేకలు పెట్టింది. “నే చెప్పేది వినండి. యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనితో నేను మాట్లాడదలిచాను!” అని అరిచింది.

17 ఆ స్త్రీ తో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా వచ్చాడు. “యోవాబువు నీవేనా?” అని ఆమె అడిగింది.

“అవును. నేనే” అని యోవాబు సమాధానం చెప్పాడు.

“అయితే నేను చెప్పేది విను!” అని ఆ స్త్రీ యోవాబుతో అన్నది.

“వింటున్నాను” అని యోవాబు అన్నాడు.

18 ఆ స్త్రీ ఇలా అన్నది, “పూర్వం ప్రజలు ‘సలహా కొరకు ఆబేలులో అడగమని అనే వారు. అప్పుడు వారి సమస్య తీరిపోయేది.’ 19 శాంతిని కోరే వారిలో, ఇశ్రాయేలు పట్ల విశ్వాసముగల వారిలో నేనొక దానిని. ఇశ్రాయేలులో ఒక ముఖ్యనగరాన్ని నీవు నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నావు. యెహోవాకి చెందిన దానిని నీవెందుకు నాశనం చేయ సంకల్పించావు?”

20 “లేదు! లేదు! నేను దేనినీ నాశనం చేయదల్చలేదు[f] మీ పట్టణాన్ని నిర్మూలించను. 21 కాని ఎఫ్రాయిము కొండ ప్రాంతపు వాడొకడున్నాడు. వాని పేరు షెబ. అతడు బిక్రి యొక్క కుమారుడు. వాడు దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. నీవు గనుక వానిని నా కప్పగించితే, నేను నగరాన్ని వదిలి పెడతాను,” అని యోవాబు అన్నాడు.

“అయితే సరే! అతని తల గోడ మీది నుంచి మీకు విసరివేయబడుతుంది” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.

22 తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా యుక్తిగా మాట్లాడింది. అది విని ఆ నగరవాసులు బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా యోవాబుకు విసరివేశారు.

అప్పుడు యోవాబు బూర వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతివాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూషలేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు.

దావీదు కొలువులో ముఖ్యమైన ఉద్యోగులు

23 ఇశ్రాయేలు రాజ్యంలో యోవాబు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. కాని కెరేతీయులకును, పెలేతీయులకును యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి. 24 వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసే దండుకు అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడుగా నియమితుడయ్యాడు. 25 షెవా ప్రధాన కార్యదర్శిగాను; సాదోకు, అబ్యాతారు యాజకులుగాను; 26 మరియు యాయీరీయుడగు ఈరా రాజుకు ప్రధానాచార్యుడుగను వున్నారు.

గిబియోనీయులు సౌలు కుటుంబాన్ని శిక్షించమని కోరటం

21 దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం[g] ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.” (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు[h] ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు)

దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు. “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను[i] దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు.

“సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు.

“అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.

అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు. సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.”

రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద” నని అన్నాడు. కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం[j] చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు. అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు[k] రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు) దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.

రిస్పా తన కుమారుల శవాలకు కాపలా వుండటం

10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ[l] మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.

11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు. 12 అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు) 13 దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చినాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు. 14 బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు.

ఫీలిష్తీయులతో యుద్ధం

15 దావీదుతో ఫిలిష్తీయులు మరల యుద్ధానికి దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి తరలివెళ్లాడు. కాని దావీదు బాగా అలసిపోయి బలహీనపడిపోయాడు. 16 ఇష్బిబే నోబ అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బిబే నోబ ఈటె మూడు వందల షెకెలుల[m] ఇత్తడి ప్రమాణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు దావీదును చంపయత్నించాడు. 17 కాని సెరూయా కుమారుడైన అబీషై ఆ ఫిలిష్తీయుని చంపి, దావీదు ప్రాణం కాపాడాడు.

అప్పుడు దావీదు మనుష్యులు అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు యుద్ధాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ వెళితేమాత్రం నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు ఒక మహానాయకుని[n] కోల్పోతుంది,” అని చెప్పారు.

18 తరువాత గోబు వద్ద ఫిలిష్తీయులతో మరో యుద్ధం జరిగింది. అందులో హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతివాడగు సపును చంపాడు. సపు భయంకరాకారుడు.

19 ఫిలిష్తీయులతో గోబువద్ద మరో యుద్ధం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీయుడైన గొల్యాతును[o] సంహరించాడు. ఎల్హానాను బేత్లెహేము వాడైన యహరేయోరెగీము అనువాని కుమారుడు. గొల్యాతు ఈటె నేతగాని దోనెవలె మందంగా, పొడవుగావుంది.

20 గాతువద్ద మళ్లీ యుద్ధం జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసి వ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారులగు రెఫాయీముల సంతతివాడు. 21 ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి కాలుదువ్వాడు. దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు యోనాతాను వానిని చంపివేశాడు.

22 ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరులైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International