Chronological
సీబా దావీదును కలవటం
16 ఒలీవల పర్వతం మీద దావీదు కొంతవరకు వెళ్లాడు. అక్కడ మెఫీబోషెతు సేవకుడైన సీబా దావీదును కలిశాడు. సీబా వెంట గంతలు కట్టిన రెండు గాడిదలున్నాయి. గాడిదల మీద రెండు వందల రొట్టెలు, ఒక వంద ఎండు ద్రాక్షాగుత్తులు, ఒక వంద అంజూరపు పండ్లు, ఒక ద్రాక్షారసపు తిత్తివున్నాయి. 2 రాజు (దావీదు) సీబాతో, “ఇవన్నీ ఎందుకు?” అని అన్నాడు.
“ఈ గాడిదలు రాజకుటుంబంవారు ఎక్కటానికి. ఈ రొట్టెలు, పండ్లు సేవకులు తినటానికి. ఎడారిలో ఎవరైనా అలసిపోతే ఈ ద్రాక్షారసం త్రాగి సేద తీర్చుకోవచ్చు” అని సీబా అన్నాడు.
3 “మెఫీబోషెతు[a] ఎక్కడ? అని రాజు అడిగాడు.
“మెఫీబోషెతు యెరూషలేములోనే వుంటున్నాడు. ఎందువల్లనంటే ఈ రోజు ఇశ్రాయేలీయులు తన తాత[b]! రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చి వేస్తారని ఆశిస్తూవున్నాడు!” అని రాజుకు సీబా సమాధానం చెప్పాడు.
4 “సరే, మంచిది. మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నేను నీకు ఇస్తాను” అని రాజు సీబాతో చెప్పాడు.
అది విని సీబా, “మీకు నేను నమస్కరిస్తున్నాను. మీకు నేనిలా సదా సంతృప్తిని చేకూర్చగలనని ఆశిస్తున్నాను” అని అన్నాడు.
దావీదును షిమీ శపించటం
5 దావీదు బహూరీముకు వచ్చాడు. బహూరీమునుండి సౌలు కుటుంబానికి చెందిన వాడొకడు బయటికి వచ్చాడు. వాని పేరు షిమీ. అతను గెరా అనువాని కుమారుడు. దావీదును గురించి చెడు మాటలు మాట్లాడుతూ వాడు బయటికి వచ్చాడు. అతడలా పదే పదే నిందిస్తూ వచ్చాడు.
6 దావీదు మీదికి, అతని సేవకుల మీదికి రాళ్లు విసరటం మొదలు పెట్టాడు. కాని దావీదుతో వున్న మనుష్యులు, సైనికులు దావీదు చుట్టూ చేరారు. చూట్టూ చేరి రక్షణ కల్పించారు. 7 షిమీ దావీదును తిట్టాడు. “బయటికి పో! బయటికి పో! నీవు మంచివాడవు కావు. హంతకుడవు!”[c] అంటూ తిట్టాడు. 8 “యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువలననగా నీవు సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన సౌలు స్థానాన్ని నీవు సంగ్రహించావు![d] కాని యెహోవా ఇప్పుడు రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా నీవొక హంతకుడవు!”
9 సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి, షిమీ తల నరికివేయనీయండి!” అని అన్నాడు.
10 అందుకు రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా, నేనేమి చేయగలను! నిజానికి షిమీ నన్ను దూషిస్తున్నాడు! కాని యెహోవా వాని చేత నన్ను శపిస్తున్నాడు!”
11 దావీదు తన సేవకులతోను, అబీషైతోను ఇంకా ఈ విధంగా అన్నాడు, “చూడండి, నా స్వంత కుమారుడే నన్ను చంపజూస్తున్నాడు! బెన్యామీనీయుడైన ఈ మనుష్యుడు (షిమీ) నన్ను చంపటానికి ఇంకా ఎక్కువ హక్కు కలిగి వున్నాడు! అతనిని అలా వదిలి వేయండి. నన్ను గురించి చెడ్డ మాటలు వానిని చెప్పనీయండి. యెహోవాయే ఇవన్నీ వానిచేత పలికిస్తున్నాడు. 12 బహుశః యెహోవా నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా గమనిస్తూ వుండవచ్చు. బహుశః యెహోవాయే నాకు మేలు చేయవచ్చు. ఈ రోజు షిమీ చెప్పే చెడ్డ మాటలన్నిటికీ భిన్నంగా ఏదో ఒక మంచి నాకు జరుగువచ్చు!”
13 కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన దారిన వెళ్లిపోయాడు. కాని షిమీ దావీదును అనుసరిస్తూనే ఉన్నాడు. కొండ ప్రక్కగా దారికి ఆవలివైపున నడుస్తూ ఉన్నాడు. దారి పొడవునా షిమీ దావీదును దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే వున్నాడు.
14 రాజైన దావీదు, అతని అనుచరులు బహూరీము అను చోటికి చేరారు. వారంతా బాగా అలసిపోయారు. వారు బహూరీము వద్ద విశ్రమించారు.
15 అబ్షాలోము, అహీతోపెలు, తదితర ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వచ్చారు. 16 అర్కీయుడు, దావీదు స్నేహితుడు అయిన హూషై అబ్షాలోము వద్దకు వచ్చి “రాజు వర్ధిల్లు గాక! రాజు వర్ధిల్లుగాక!” అని అన్నాడు.
17 “నీ స్నేహితుడు దావీదుపట్ల నీవు ఎందుకు రాజభక్తి కలిగియుండలేదు? నీ స్నేహితునితో కలిసి యెరూషలేమును విడిచి ఎందుకు పోలేదు?” అని అబ్షాలోము అడిగాడు.
18 హూషై ఇలా అన్నాడు: “యెహోవా ఎవరిని ఎన్నుకుంటాడో నేను ఆయన మనిషిని. ఈ మనుష్యులు, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎంపికచేశారు. నేను నీతోనేవుంటాను. 19 గతంలో నేను నీ తండ్రికి సేవచేశాను. సరే, ఇప్పుడు నేను ఎవరికి సేవ చేయాలి? దావీదు కుమారునికి! అందువల్ల నేను నీకు సేవ చేస్తాను.”
అబ్షాలోము అహీతోపెలును సలహా అడగటం
20 “దయచేసి ఇప్పుడు మనం ఏమి చేయాలో చెప్పు” అని అబ్షాలోము అహీతోపెలును అడిగాడు.
21 అబ్షాలోముతో అహీతోపెలు ఇలా అన్నాడు: “నీ తండ్రి తన యొక్క దాసీలను కొంత మందిని ఇల్లు చూస్తూ ఉండమని వదిలి వెళ్లాడు. నీవు వెళ్లి వారితో సాంగత్యము చేయి. దానితో ఇశ్రాయేలీయులందరూ నీ తండ్రి నిన్నసహ్యించు టున్నాడని వింటారు. అప్పుడు నీకు మద్దతు యివ్వటానికి నీ ప్రజలందరికీ తగిన ప్రోత్సాహం దొరుకుతుంది.”
22 తరువాత అబ్షాలోము కొరకు మిద్దె మీద ఒకడేరా వేశారు. అక్కడ తన తండ్రి దాసీలతో అబ్షాలోము సంగమించాడు. ఇశ్రాయేలీయులంతా ఇది చూశారు. 23 ఆ కాలంలో అహీతోపెలు సలహా దావీదు, అబ్షాలోము లిరువురూ చాలా ముఖ్యమైనదిగా భావించేవారు. ఒక వ్యక్తికి దేవుని మాట ఎంత ముఖ్యమో, అహీతోపెలు సలహా కూడా అంత విలువగలదిగా ఉండేది.
దావీదు విషయంలో అహీతోపెలు సలబహా
17 అహీతోపెలు అబ్షాలోముతో ఇంకా యిలా అన్నాడు: “ఇప్పుడు నన్ను పన్నెండు వేలమంది సైనికులను ఎంపిక చేసుకోనీయ్యి. ఈ రాత్రికి నేను దావీదును వెంటాడతాను. 2 అతడు బాగా అలసిపోయి బలహీన పడ్డాక నేనతనిని పట్టుకుంటాను. అతనిని బెదరగొడతాను. దానితో అతనితో ఉన్న వారంతా పారిపోతారు. నేను రాజైన దావీదును మాత్రమే చంపుతాను. 3 తరువాత ప్రజలందరినీ నేను నీ వద్దకు తీసుకొని వస్తాను. నీవు వెదకుతున్న వ్యక్తి (దావీదు) గనుక చనిపోతే, మిగిలిన ప్రజలంతా శాంతంగా తిరిగి వస్తారు.”
4 ఈ పథకం అబ్షాలోముకు, మిగిలిన ఇశ్రాయేలు నాయకులకు మంచిదనిపించింది. 5 అయినా అబ్షాలోము, “అర్కీయుడైన హూషైని పిలవండి. అతడేమి చెపుతాడో కూడా నేను వినదలిచాను” అని అన్నాడు.
అహీతోపెలు సలహాను హూషై వమ్ము చేయటం
6 అబ్షాలోము వద్దకు హూషై వచ్చాడు. అహీతోపెలు సలహాను హూషైకు అబ్షాలోము వివరించాడు. దానిని అనుసరించవచ్చా? లేదా? తెలియజెప్ప మన్నాడు.
7 హూషై ఈ విధంగా చెప్పాడు, “అహీతోపెలు ఇచ్చిన సలహా ఈ సమయంలో మంచిది కాదు.” 8 నీ తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పొగొట్టుకున్న ఎలుగు బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి బహు నేర్పరియైన యోధుడు. అతను రాత్రంతా తన మనుష్యులతో కలిసి వుండడు. 9 బహుశః ఈ పాటికి ఆయన ఏ గుహలోనో, మరొక చోటనో దాగి వుండవచ్చు. నీ తండ్రి గనుక నా మనుష్యులను ముందుగా ఎదుర్కొంటే, ప్రజలందరికీ ఆ వార్త తెలిసిపోతుంది. అబ్షాలోము అనుచరులు ఓడి పోతున్నారని వారంతా అనుకుంటారు! 10 సింహాల్లా ధైర్యంగా వుండే నీ మనుష్యులు కూడ చెదరిపోయే అవకాశం వుంది. ఎందువల్లననగా ఇశ్రాయేలీయులంతా నీ తండ్రి బలవంతుడైన యోధుడనీ, ఆయన మనుష్యులు మంచి ధైర్యవంతులనీ ఎరుగుదురు!
11 “నేను చెప్పేదేమంటే ఇప్పుడు నీవు దానునుండి బెయేర్షెబా[e] వరకు వున్న ఇశ్రాయేలీయులనందరినీ చేరదియ్యి. సముద్ర తీరాన ఇసుక రేణువుల్లా నీ వద్ద అనేక మంది ప్రజలు వుంటారు. అప్పుడు నీకై నీవే యుద్ధానికి వెళ్ల వచ్చు. 12 అతను దాగివున్న చోటులోనే మనం దావీదును పట్టుకోవచ్చు. భూమి మీదకు మంచు పడినట్లు మనం దావీదు మీద పడవచ్చు. దావీదును, అతని మనుష్యులందరినీ మనం చంపవచ్చు. వారిలో ఏ ఒక్కడూ వదిలిపెట్టబడడు. 13 ఒకవేళ దావీదు నగరంలోకి తప్పించుకుంటే, ఇశ్రాయేలీయులంతా తాళ్లు పట్టుకు వస్తారు. ఆ నగరాన్నంతా మనం లోయలోకి లాగి వేద్దాం ఇక ఆ నగరంలో ఒక్క చిన్న రాయి కూడ మిగలదు!”
14 “అర్కీయుడైన హూషై ఇచ్చిన సలహా అహీతోపెలు సలహాకంటె చాలా బాగుందని,” అబ్షాలోము, ఇతర ఇశ్రాయేలీయులంతా అన్నారు. ఇదంతా యెహోవా ఏర్పాటు గావున, వారంతా అలా చెప్పారు. యెహోవా అహీతోపెలు ఇచ్చిన మంచి సలహాను వ్యర్థంచేయ సంకల్పించాడు. ఆ విధంగా అబ్షాలోమును శిక్షింప జూశాడు.
హూషై దావీదుకు హెచ్చరిక పంపటం
15 హూషై ఈ విషయాలన్నీ యాజకులైన సాదోకు మరియు అబ్యాతారుకు చెప్పాడు. అబ్షాలోముకు, ఇశ్రాయేలు నాయకులకు అహీతోపెలు యిచ్చిన సలహాను కూడ హూషై వారికి చెప్పాడు. అంతే గాకుండా తను ఏ సలహా ఇచ్చినది కూడా సాదోకు, అబ్యాతారులకు హూషై వివరించాడు. హూషై ఇలా అన్నాడు: 16 “త్వరగా దావీదుకు ఒక వర్తమానం పంపండి. ప్రజలు ఎక్కడెక్కడైతే ఎడారిలోకి ప్రవేశిస్తారో ఆయా ప్రాంతాలలో దావీదును ఈ రాత్రికి వుండవద్దని చెప్పండి. కాని యొర్దాను నదిని తక్షణమే దాటి వెళ్లమనండి. వారు నదిని గనుక దాటినట్లయితే రాజు, ఆయన అనుచరులు పట్టుబడరు.”
17 యాజకుల కుమారులైన యోనాతాను మరియు అహిమయస్సు కలిసి ఏన్ రోగేలు దగ్గర వేచివున్నారు. వాళ్లు నగరంలోకి వెళ్తున్నట్లు ఎవరూ చూడ కూడదనుకున్నారు. కావున ఒక పనిపిల్ల వారి వద్దకు వచ్చింది. ఆమె వారికి ఒక సమాచారం అందజేసింది. తరువాత యోనాతాను, అహీమయస్సులు ఇరువురూ రాజైన దావీదు వద్దకు వెళ్లి అన్ని విషయాలూ చెప్పారు.
18 అయినా ఒక బాలుడు యోనాతానును, అహిమయస్సును చూశాడు. వాడు అబ్షాలోముకు చెప్పటానికి పరుగున పోయాడు. ఇది గమనించిన యోనాతాను, అహిమయస్సు వెంటనే పారిపోయారు. వారు బహురీములో ఒకని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటివాని ఆవరణలో[f] ఒక బావి వున్నది. యోనాతాను, అహిమయస్సు ఆ బావిలోకి దిగారు. 19 ఇంటివాని భార్య బావి మీద ఒక దుప్పటి కప్పి వేసింది. ఆమె మళ్లీ దాని మీద ధాన్యం పోసింది. అప్పుడా బావి ఒక ధాన్యపు రాశిలా కన్పించింది. అందువల్ల యోనాతాను, అహిమయస్సు అందులో దాగి వున్నారని ఎవరూ అనుకోరు. 20 అబ్షాలోము సైనికులు ఆ ఇంటి యజమానురాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ వున్నారు?” అని అడిగారు.
“వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ అబ్షాలోము మనుష్యులకు చెప్పింది.
అబ్షాలోము మనుష్యులు యోనాతాను, అహిమయస్సులను వెదుక్కుంటూపోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొనలేదు. అందుచే అబ్షాలోము సైనికులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు.
21 అబ్షాలోము మనుష్యులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చారు. జరిగినదంతా రాజైన దావీదుకు వారు చెప్పారు. వారు దావీదుతో, “త్వరపడండి. నదిని దాటి వెళ్లండి! మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఇవన్నీ చేస్తున్నాడు” అని అన్నారు.
22 దావీదు, అతని మనుష్యులు యొర్దాను నదిని దాటి వెళ్లారు. సూర్యోదయానికి ముందే దావీదు, అతని అనుచరులు యొర్దాను నదిని దాటారు.
అహీతోపెలు ఆత్మహత్య చేసుకోవటం
23 ఇశ్రాయేలీయులు తన సలహా పాటించలేదని అహీతోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపై గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబపోషణకు తగిన ఏర్పాట్లు చేసి అహీతోపెలు ఉరిపోసుకొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని శవాన్ని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు.
అబ్షాలోము యొర్దాను నదిని దాటటం
24 దావీదు మహనయీముకు చేరాడు. అబ్షాలోము, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటారు. 25 అబ్షాలోము తన సైన్యాధికారిగా అమాశాను నియమించాడు. అంటే యోవాబు స్థానాన్ని అమాశా ఆక్రమించాడు.[g] ఇత్రా అనేవాని కుమారుడు అమాశా. ఇత్రా ఇష్మాయేలీయుడు[h] అమాశా తల్లి పేరు అబీగయీలు. ఈమె సెరూయా[i] సోదరియగు నాహాషు కుమార్తె. (సెరూయా యోవాబు తల్లి) 26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు రాజ్యంలో గుడారాలు వేసుకున్నారు.
షోబీ, మాకీరు, బర్జిల్లయి
27 దావీదు మహనయీముకు చేరాడు. షోబీ, మాకీరు మరియు బర్జిల్లయి అక్కడ వున్నారు. (నాహాషు కుమారుడైన షోబీ అమ్మోనీయుల రాజధానియగు రబ్బాకు చెందినవాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు లోదెబారుకు చెందినవాడు. బర్జిల్లయి అనువాడు గిలాదులోని రోగెలీము పట్టణవాసి) 28-29 “ఎడారిలోవున్న ప్రజలు అలసిపోయి ఆకలిదప్పులు గొనియున్నారు” అని వారు చెప్పినారు. అందువల్ల దావీదు, అతని మనుష్యులు తినటానికి వారు అనేక పదార్థాలు పట్టుకువచ్చారు. వారు పరుపులు, పాత్రలు, కుండలు తెచ్చారు. వారింకా గోధుమలు, యవలు, పిండి, వేపిన ధాన్యం, కాయగూరలు, ఎండబెట్టిన గింజలు, తేనె, వెన్న, గొర్రెలు, ఆవుపాల మీగడ మొదలైనవన్నీ తెచ్చారు.
దావీదు యుద్ద సన్నాహం
18 దావీదు తన మనుష్యులను లెక్కబెట్టాడు. సహస్ర దళాధిపతులను, శత దళాధిపతులను తన సైన్యాన్ని నడిపేందుకు ఎంపిక చేశాడు. 2 దావీదు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. తరువాత దావీదు వారిని బయలుదేరదీశాడు. మూడోవంతు సైన్యాన్ని యోవాబు నడిపించాడు. యోవాబు సోదరుడైన సెరూయా కుమారుడగు అబీషై రెండవ గుంపును, గాతువాడైన ఇత్తయి మూడవ దళాన్ని నడిపించారు.
“నేను కూడ మీతో వస్తాను” అని రాజైన దావీదు ఆ జనంతో అన్నాడు.
3 కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారిపోతే, అబ్షాలోము మనుష్యులు ఏమీ లెక్క చేయరు. మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు” అని అన్నారు.
4 “సరే, మీరు ఏది మంచిదని తలిస్తే నేనది చేస్తాను” అని రాజు ప్రజలతో అన్నాడు.
తరువాత రాజు నగర ద్వారం ప్రక్కన నిలబడ్డాడు. సైన్యం బయటికి వెళ్లింది. వారంతా వందేసి, వెయ్యేసి మంది జట్లుగా బయటికి వెళ్లారు.
5 యోవాబు, అబీషై మరియు ఇత్తయికి రాజు, “నాకొరకు ఈ పని చేయండి. యువకుడైన అబ్షాలోము పట్ల ఉదారంగా ప్రవర్తించండి!” అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యాధిపతులకు రాజు యిచ్చిన ఆజ్ఞలను ఆ ప్రజలంతా విన్నారు.
దావీదు సైన్యం అబ్షాలోము సైన్యాన్ని ఓడించటం
6 అబ్షాలోము తరపున వచ్చిన ఇశ్రాయేలీయుల పైకి దావీదు సైన్యం రణరంగంలోకి ప్రవేశించింది. ఎఫ్రాయిము అరణ్యంలో వారు పోరాడారు. 7 దావీదు సైన్యం ఇశ్రాయేలీయులను ఓడించింది. ఆ రోజు ఇరవై వేలమంది చనిపోయారు. 8 యుద్ధం దేశవ్యాప్తంగా జరిగింది. ఆ రోజు కత్తివేటుకు చచ్చిన వారికంటే అడవిలో చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
9 అబ్షాలోము దావీదు సేవకులను కలవటం జరిగింది. అబ్షాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచరగాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర వృక్షం కొమ్మల క్రిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన క్రిందనుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్షాలోము భూమికి పైగా[j] వేలాడుచున్నాడు.
10 ఇది జరగటం ఒక వ్యక్తి చూశాడు. అతడు పోయి యోవాబుతో, “అబ్షాలోము సింధూర వృక్షం కొమ్మల్లో చిక్కుకొని వేలాడటం నేను చూశాను!” అని చెప్పాడు.
11 “మరి నీవతనిని ఎందుకు చంపిక్రిందపడేలా చేయలేదు? నీకు నేను ఒక నడికట్టును మరియు పది తులముల వెండి ఇచ్చివుండేవాడిని!” అని యోవాబు అన్నాడు.
12 యోవాబుతో అతడిలా అన్నాడు: “నీవు వెయ్యితులముల వెండి ఇచ్చినా నేను రాజకుమారుడిని గాయపర్చేవాడినికాను. ఎందుకనగా, రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి యిచ్చిన ఆజ్ఞ మేమంతా విన్నాము. ‘చిన్నవాడైన అబ్షాలోమును గాయపర్చకుండా ఉదారంగా ప్రవర్తించండి’ అని రాజు అన్నాడు. 13 నేను గనుక అబ్షాలోమును చంపితే రాజు ఎలాగో తెలుసుకుంటాడు. మళ్లీ నీవే నన్ను శిక్షిస్తావు!”
14 “ఈ విధంగా నేను ఇక్కడ నీతో కాలం వృధాచేయను” అని యోవాబు అన్నాడు.
అబ్షాలోము ఇంకా చెట్టుకు వేలాడుతూ బ్రతికేవున్నాడు. యోవాబు మూడు ఈటెలను తీసుకున్నాడు. ఆ ఈటెలను అబ్షాలోము మీదికి విసిరాడు. ఆ ఈటెలు అబ్షాలోము గుండెను చీల్చుకుంటూ దూసుకు పోయాయి. 15 యోవాబుకు యుద్ధంలో సహాయపడుతూ అతని వెంట పది మంది యువ సైనికులున్నారు. ఆ పదిమంది అబ్షాలోము చుట్టూచేరి అతనిని చంపివేశారు.
16 యోవాబు బూర ఊది, ప్రజలను పిలిచి అబ్షాలోముతో వున్న ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమన్నాడు. 17 యోవాబు మనుష్యులు అబ్షాలోము శవాన్నీ తీసి అరణ్యంలో ఒక పెద్ద గోతిలో పడవేశారు. ఆ పెద్ద గోతిని రాళ్లు వేసి పూడ్చి వేశారు.
అబ్షాలోము అనుచరులైన ఇశ్రాయేలీయులంతా భయపడి ఇండ్లకు పారిపోయారు.
18 అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో రాజు లోయలో, ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది.
యోవాబు దావీదుకు వార్తను పంపటం
19 సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “నన్ను పరుగున పోయి ఈ వార్తను రాజైన దావీదుకు చెప్పనీయండి. నీ కొరకు శత్రువును యెహోవా నాశనం చేశాడు” అని చెపుతానన్నాడు.
20 అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”
21 తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.”
కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.
22 కాని సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరుగెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు.
“కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవాలనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు అన్నాడు.
23 “ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా వెళతాను,” అన్నాడు అహిమయస్సు.
“అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ యస్సుతో.
అప్పుడు యొర్దాను లోయగుండా అహిమయస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు.
దావీదు వార్త వినటం
24 నగర రెండు ద్వారాల మధ్య దావీదు కూర్చుని వున్నాడు. కావలివాడు ద్వారం మీద వున్న గోడపైకి వెళ్లి పరిశీలించాడు. దూరాన ఒకడు ఒంటరిగా పరుగెత్తుకు రావటం చూశాడు. 25 ఈ విషయం చెప్పటానికి కావలివాడు రాజును పిలిచాడు.
“ఒక్కడే గనుక వస్తూవుంటే, వాడు ఏదో వార్త తెస్తూ వున్నాడన్నమాట!” అని దావీదు రాజు అన్నాడు.
ఆ వ్యక్తి క్రమేపీ నగరాన్ని సమీపించాడు. 26 కావలివాడు ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు.
“అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని అన్నాడు రాజు.
27 “మొదటి వ్యక్తి సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెత్తుతున్నాడని నేను అనుకుంటున్నాను” అని కావాలివాడన్నాడు.
“అహిమయస్సు మంచి వ్యక్తి. అతడేదో మంచి వార్త తెస్తూ వుండవచ్చు!” అని రాజు అన్నాడు.
28 అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగున్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. “నీ ప్రభువైన దేవునికి స్తోత్రము. నా ఏలినవాడవైన రాజుకు వ్యతిరేకంగా వున్న వారిని యెహోవా ఓడించాడు,” అని అహిమయస్సు చెప్పాడు.
29 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు.
“యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు.
30 “ఇటు పైకి వచ్చి, ఇక్కడ వుండు” అన్నాడు రాజు. అహిమయస్సు పైకి వెళ్లి ప్రక్కన నిలబడి వేచి వున్నాడు.
31 తరువాత కూషీయుడు వచ్చాడు. “నా ఏలినవాడవైన రాజుకు ఒక వార్త! నీకు వ్యతిరేకులైన ప్రజలను యెహోవా ఈ రోజు శిక్షించాడు” అని చెప్పాడు.
32 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు.
“నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.
33 దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.
© 1997 Bible League International