Chronological
అమ్నోను తామారును మోహించుట
13 దావీదుకు అబ్షాలోము అను కుమారుడొకడున్నాడు. అబ్షాలోముకు ఒక సోదరివుంది. ఆమె పేరు తామారు. ఆమె బహుసౌందర్యవతి. దావీదు యొక్క మరో కుమారుడైన అమ్నోను[a] తామారును మోహించాడు. 2 తామారు కన్యక. అందువల్ల ఆమెను తన కామవంఛ తీర్చుకోవటానికి అమ్నోను ఆమెను ఏమీ చేయలేకపోయాడు. కాని అమ్నోను ఆమెను మిక్కిలిగా మోహించాడు. ఆమెను పొందలేక ఆమె ధ్యాసతో అమ్నోను విరక్తితో నీరసించిపోయాడు.
3 అమ్నోనుకు యెహోనాదాబు అనే స్నేహితుడొకడున్నాడు. అతడు షిమ్యా కుమారుడు. షిమ్యా దావీదు సోదరుడు. యెహోనాదాబు యుక్తిగల వాడు. 4 యెహోనాదాబు అమ్నోనుతో, “రోజు రోజుకీ నీవు చిక్కిపోతున్నావు! నీవు రాజ కుమారుడవు! తినటానికి కావలసినంత ఉంది. కాని ఎందుకిలా చిక్కి శల్యమై పోతున్నావు? నాతో చెప్పు” అన్నాడు.
“నేను తామారును ప్రేమిస్తున్నాను. కాని ఆమె నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి” అన్నాడు అమ్నోను.
5 యెహోనాదాబు అమ్నోనుకు ఇలా సలహాయిచ్చాడు: “నీవు పోయి పడుకో, జబ్బు పడిన వానిలా నటించు. అప్పుడు నీ తండ్రి నిన్ను చూసేందుకు వస్తాడు. నీవాయనతో నీ చెల్లెలైన తామారును నీకు ఆహారాన్నిచ్చి సేవ చేయటానికి పంపమను. ఆమె నీ ఎదుట ఆహారం నీవు చూస్తూవుండగా తయారు చేసి ఆమె నీకు పెడుతుందని కూడా చెప్పు.”
6 ఆ సలహా మేరకు అమ్నోను పక్క మీద పడుకుని జబ్బు పడిన వానిలా నటించాడు. అమ్నోనును చూడటానికి దావీదు రాజు వచ్చాడు. “దయచేసి చెల్లెలు తామారును పంపించు. నేను చూస్తూవుండగా ఆమె రెండు ప్రత్యెకమైన రొట్టెలు చేసి పెడుతుంది. ఆమె చేతిమీదుగా తింటాను” అని దావీదుతో అమ్నోను చెప్పాడు.
7 దావీదు తామారు ఇంటికి దూతలను పంపాడు. వారు తామారుతో ఆమె సోదరుడు, “అమ్నోను ఇంటికి వెళ్లి అతనికి కొంత ఆహారం చేసిపెట్టమని చెప్పారు.”
8 తన సోదరుడైన అమ్నోను ఇంటికి తామారు వెళ్లింది. అమ్నోను మంచంపై ఉన్నాడు తామారు కొంత పిండి తీసుకొని, దానిని ఆమె స్వయంగా కలిపింది. అమ్నోను చూస్తూవుండగా ఆమె కొన్ని రొట్టెలు చేసింది. తరువాత ఆమె రొట్టెలను కాల్చింది. 9 తామారు రొట్టెలను కాల్చిన పిమ్మట పెనంలో వాటిని తీసుకొని వెళ్లి అమ్నోను ముందు పళ్లెంలో వేసింది. కాని అమ్నోను తినటానికి అంగీకరించలేదు. అమ్నోను తన సేవకులందరినీ, “అతనిని ఒంటరిగా వదిలి వెళ్లి పొమ్మన్నాడు” అమ్నోను గదినుండి సేవకులంతా బయటికి పోయారు.
అమ్నోను తామారును చెరచుట
10 అమ్నోను తామారుతో, “రొట్టెలను లోపలి గది లోనికి తీసుకొనిరా. అప్పుడు నీ చేతిమీదుగా వాటిని తింటాను” అని అన్నాడు.
తామారు లోపలి గదిలో వున్న తన సోదరుడైన అమ్నోను వద్దకు వెళ్లింది. ఆమె చేసిన రొట్టెలను తీసుకొని వెళ్లింది. 11 తన చేతుల మీదుగా తింటాడని ఆమె అమ్మోను వద్దకు వెళ్లింది. కాని అమ్నోను తామారును పట్టుకున్నాడు. “చెల్లీ, రా! నాతో కలిసి పడుకో!” అని అన్నాడు.
12 అందుకు తామారు అమ్నెనుతో ఇలా ప్రాధేయపడింది: “వద్దు, సోదరా! నన్ను బలవంతం చేయకు! ఇశ్రాయేలులో ఇలా ఎన్నటికీ జరుగకూడదు! ఈ అవమానకరమైన పని చేయకు! 13 నా కళంకాన్ని నేనెన్నడూ మాపుకోలేను. ఇశ్రాయేలీయులలో నీచకార్యాలు చేసే మూర్ఖులలో నీవొకడివై పోతావు. దయచేసి రాజుతో మాట్లాడు. నన్ను వివాహం చేసికోటానికి ఆయన నీకు అనుమతిస్తాడు.”
14 కాని అమ్నోను తామారు చెప్పే దానిని వినటానికి నిరాకరించాడు. అతడు తామారుకంటె బలవంతుడు. అతడామెను బలాత్కరించి సంగమించాడు. 15 దాని తరువాత అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. ముందు అతనామెనెంతగా ప్రేమించాడో, అంతకు మించి ఇప్పుడు అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. అమ్నోను తామారుతో, “మంచం మీది నుంచి లేచి బయటికి పొమ్మన్నాడు.”
16 అందుకు తామారు అమ్నోనుతో, “కాదు! నీవిప్పుడు మునుపటికంటె ఇంకా ఘోరమైన తప్పు చేస్తున్నావు. నీవు నన్ను పంపివేయటానికి ప్రయత్నిస్తున్నావు!” అనిఅన్నది.
కాని అమ్నోను తామారు చెప్పేది వినలేదు. 17 అమ్నోను తన సేవకుణ్ణి లోనికి పిలిచి, “ఇప్పుడే ఈ పిల్లను గదినుండి బయటికి పంపించు! బయటకు నెట్టి తలుపుకు తాళం వేయి” అని చెప్పాడు.
18 అమ్నోను సేవకుడు తామారును బయటికి గెంటి గదికి తాళం పెట్టాడు.
తామారు ఒక రంగురంగుల పొడవైన చేతులు, చాలా వదులుగా వుండే అంగీని వేసుకున్నది. ఆ రకమైన అంగీలను పెండ్లికాని రాజ కుమార్తెలు మాత్రమే వేసుకునేవారు. 19 తామారు కొద్దిగా బూడిద తీసుకొని తన నెత్తి మీద పోసుకున్నది. తన రంగురంగుల అంగీని చింపుకొన్నది. తన చేయి నెత్తిమీద పెట్టుకుని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోయింది.[b]
20 తామారు సోదరుడు అబ్షాలోము తామారుతో, “నీ సోదరుడు అమ్నోను నిన్ను చెరిచినాడుగా?”[c] అన్నాడు. “అమ్నోను నీ సోదరుడు. కావున చెల్లీ, ప్రస్తుతానికి నీవు మాట్లాడక వుండు. ఇది నిన్ను విపరీతంగా సంక్షోభపెట్టకుండా[d] చూసుకో!” అది విన్న తామారు ఇక ఏమీ మట్లాడ లేదు. నాశనమైన స్త్రీలా, అమె అబ్షాలోము ఇంటి వద్దనే ఉండసాగింది.
21 ఈ వార్త దావీదు రాజు విన్నాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. 22 అబ్షాలోము అమ్నోనును అసహ్యించుకున్నాడు. అబ్షాలోము అమ్నోను నుద్దేశించి మంచిగా గాని, చెడ్డగా గాని ఏమీ అనలేదు. తన సోదరి తామారును చెరచినందుకు అమ్నోనును అసహ్యించుకున్నాడు.
అబ్షాలోము పగ తీర్చుకొనటం
23 రెండు సంవత్సరాల తరువాత అబ్షాలోము కొందరు మనుష్యులను తన గొర్రెల నుండి ఉన్ని తీయటానికి బయల్దాసోరుకు రావించాడు. ఈ కార్యక్రమం చూడటానికి రాజకుమారులందరినీ అబ్షాలోము ఆహ్వానించాడు. 24 అబ్షాలోము రాజు వద్దకు వెళ్లి, “నా గొర్రెల నుండి ఉన్ని తీయటానికి మనుష్యులను పిలిచాను. దయచేసి నీ సేవకులతో వచ్చి ఆ కార్యక్రమం తిలకించ” మని అడిగాడు.
25 “వద్దు, కుమారుడా! మేము రాము. మేమంతా వస్తే అది నీకు చాల శ్రమ అవుతుంది” అని దావీదు రాజు అబ్షాలోముతో అన్నాడు.
దావీదును రమ్మని అబ్షాలోము ప్రాధేయపడ్డాడు. దావీదు వెళ్లలేదు గాని, అతని పనిని ఆశీర్వదించాడు.
26 “నీవు రాకుంటే, దయచేసి నా సోదరుడు అమ్నోనును నాతో పంపించు” మని అబ్షాలోము అడిగాడు.
“అతడు నీతో ఎందుకు రావాలి?” అని దావీదు రాజు అడిగాడు.
27 అయినా అబ్షాలోము వినిపించుకోకుండా అదే పనిగా ప్రాధేయపడి అడిగాడు. చివరికి అమ్నోను, మిగిలిన రాజకుమారులు అబ్షాలోముతో వెళ్లటానికి ఒప్పుకున్నారు.
అమ్నోను హత్య చేయబడటం
28 అబ్షాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “అమ్నోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు బాగా తాగిన పిమ్మట ‘అమ్నోనును చంపండి’ అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయపడకండి నేను మీకు అజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, ధైర్యంగా వుండండి” అని అబ్షాలోము సేవకులతో అన్నాడు.
29 అబ్షాలోము ఆజ్ఞ మేరకు అతని యువసేవకులు అమ్నోనును చంపివేశారు. కాని దావీదు మిగిలిన కుమారులంతా తప్పించుకున్నారు. వారిలో ప్రతి ఒక్కడూ తన కంచర గాడిదపై ఎక్కి తప్పించుకు పోయాడు.
అమ్నోను మరణవార్తను దావీదు వినటం
30 రాజకుమారులంతా మార్గంమధ్యలో వుండగానే, ఈ వార్త దావీదుకు చేరింది. “అబ్షాలోము రాజ కుమారులందరినీ చంపివేశాడనీ, ఒక్కడు కూడా మిగల లేదనీ” ఆయనకు వర్తమానం వచ్చింది.
31 దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు.
32 దావీదు సోదరుడగు షిమ్యా కుమారుడు యెహోనాదాబు దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “రాజకుమారులంతా చనిపోయారని అనుకోవద్దు. చనిపోయినది అమ్నోను ఒక్కడు మాత్రమే! అబ్షాలోము ఇదంతా జరిపించాడు. 33 కారణమేమనగా అమ్నోను అబ్షాలోము చెల్లెలు తామారును చెరిచాడు. కాబట్టి అమ్నోను మాత్రము చంపబడ్డాడు.”
34 అబ్షాలోము పరారైనాడు.
నగర ప్రహరీ గోడమీద ఒక కావలివాడు నిలబడి వున్నాడు. కొండకు అవతలి ప్రక్కనుండి చాలా మంది రావటం చూశాడు. 35 అది చూసి యెహోనాదాబు దావీదు రాజుతో, “చూడండి, నేను చెప్పింది నిజమైనది. రాజ కుమారులంతా వస్తున్నారు!” అన్నాడు.
36 యెహోనాదాబు ఈ మాటలు అంటూ వుండగానే రాజకుమారులు వచ్చారు. వారు గగ్గోలు పడి ఏడుస్తూవున్నారు. దావీదు, అతని సేవకులందరూ కూడ విలపించసాగారు. వారంతా విపరీతంగా దుఃఖించారు. 37 దావీదు తన కుమారుడైన అమ్నోను కొరకు ప్రతి రోజూ దుఃఖించాడు.
అబ్షాలోము గెషూరుకు తప్పించుకు పోవటం
అబ్షాలోము తల్మయి రాజు[e] వద్దకు పారిపోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి పేరు అమీహూదు. 38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. 39 అమ్నోను మరణం గూర్చి దావీదురాజు క్రమేపీ ఓడార్చబడ్డాడు. కాని అతడు అబ్షాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడసాగాడు.
యోవాబు నేర్పరియైన స్త్రీని దావీదు వద్దకు పంపటం
14 అబ్షాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి బెంగపెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు. 2 యోవాబు తన దూతలను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్పరియైన స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో ఉన్నట్లు నటించు. విషాదసూ చకమైన బట్టలు వేసుకో, అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు ప్రియమైన ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రవర్తించు. 3 నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను నీవు రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల స్త్రీ తో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో యోవాబు ఆమెకు వివరించాడు.
4 తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు వెళ్లి మాట్లాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, “రాజా, నాకు సహాయం చేయండి!” అని ప్రాధేయ పడింది.
5 “ఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు ప్రశ్నించాడు.
ఆ స్త్రీ యిలా చెప్పింది: “నేనొక విధవ స్త్రీని! నా భర్త చనిపోయాడు. 6 నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపివేశాడు. 7 ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంపనిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడైన వాడు లేకుండా పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుకణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపోబోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, ఆస్తి నేలపాలవుతాయి.”
8 ఇది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని ఆమెతో అన్నాడు.
9 తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే పరిణామాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం ఈ విషయంలో ఏదోషమూ ఎరుగరు!” అని చెప్పింది.
10 “నిన్ను గురుంచి ఎవరైనా దీనిగూర్చి నిన్నేమైన అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు.
11 అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: “దయచేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా కుమారునికి కీడుచేయకుండా దేవుడు నివారించగలందులకు ఆయనను ప్రార్థించు.”
దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు: “యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక కూడా క్రింద రాలదు.”
12 ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని విషయాలు చెప్పనీయండి” అని అన్నది.
చెప్పమన్నాడు రాజు.
13 ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు![f] ఎందువల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమారుని తిరిగి తీసుకొని రాలేదు. 14 మనమంతా ఏదో ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. కాని దేవుడు ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్లనుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండి బలవంతంగా దూరం చేయబడలేదు! 15 నా ప్రభువైన రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్లాడనీయమన్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని అన్నాను. 16 రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను. 17 నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”
18 అది విని ఆశ్చర్యపడిన రాజైన దావీదు, “నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధనం చెప్పాలి” అన్నాడు.
ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న అడగండి!” అన్నది.
19 “విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు.
ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు. 20 యోవాబు ఇలా ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్తమైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగేదంతా నీకు తెలుసు.”
అబ్షాలోము యెరూషలేముకు తిరిగి రావటం
21 రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడు. నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యువకుడైన అబ్షాలోమును దయచేసి తీసుకొని రా.”
22 యోవాబు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, “ఈ రోజు నాపట్ల మీరు ప్రసన్నులైయున్నారని నాకు తెలుసు! ఎందువల్లనంటే నేను అడిగినదంతా నీవు చేశావు!” అని అన్నాడు.
23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. 24 అయితే దావీదు రాజు మాత్రం, “అబ్షాలోము తప్పక తన స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి రాకూడదు” అని అన్నాడు. కావున అబ్షాలోము తన స్వంత ఇంటికి వెళ్లిపోయాడు. అబ్షాలోము రాజును చూడటానికి వెళ్లలేక పోయాడు.
25 అబ్షాలోము అందంలో అందరి ప్రశంసలూ పొందిన వాడు. అబ్షాలోమంత అందగాడు ఇశ్రాయేలంతటిలో మరొకడు లేడు. అరికాలు నుండి నడినెత్తివరకు అతనిలో రవ్వంత కూడా లోపం లేదు. 26 ప్రతి సంవత్సరాంతానా అబ్షాలోము తన తల వెండ్రుకలు కత్తిరించి తూచేవాడు. తూకం ప్రకారం రెండు వందల తులముల[g] బరువు ఉండేవి. 27 అబ్షాలోముకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తామారు. తామారు సౌందర్యవతి.
తనను వచ్చి చూడమని యోవాబుపై అబ్షాలోము వత్తిడి
28 అబ్షాలోము యెరూషలేములో రెండు సంవత్సరాలున్నాడు. అయినా అతనికి రాజదర్శనం నిరాకరింపబడింది. 29 యోవాబు వద్దకు అబ్షాలోము దూతలను పంపాడు. ఈ దూతలు అబ్షాలోమును రాజు వద్దకు పంపమని అడిగారు. కాని యోవాబు అబ్షాలోము వద్దకు రాకపోయెను. రెండవసారి మరొక దూతను అబ్షాలోము పంపాడు. అయినా యోవాబు రావటానికి నిరాకరించాడు.
30 దానితో అబ్షాలోము తన సేవకులను పిలిచి ఇలా అన్నాడు: “చూడండి; యోవాబు పొలం నా పొలానికి ప్రక్కనే వున్నది. తన పొలంలో యవల ధాన్యం పండివుంది. వెళ్లి ఆ యవల ధాన్యాన్ని తగుల బెట్టండి.”
ఆ మాట మీద అబ్షాలోము సేవకులు వెళ్లి యోవాబు పొలంలో పంటకు నిప్పుపెట్టారు. 31 యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవకులు నా పంటను ఎందుకు తగులబెట్టారు” అని అడిగాడు.
32 యోవాబుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “నీకు నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అనుకున్నాను గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో నేను గెషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!”
అబ్షాలోము దావీదును దర్శించటం
33 అప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్షాలోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్షాలోమును పిలిపించగా, అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.
అబ్షాలోము అనేకులను స్నేహితులుగా చేసుకోవటం
15 ఇదంతా ఆయిన పిమ్మట అబ్షాలోము తనకై ప్రత్యేకంగా ఒక రథాన్ని మరియు గుర్రములను సమకూర్చుకున్నాడు. తన రథం సాగుతూ వుండగా ముందు వెళ్లటానికి ఏబది మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు. 2 అబ్షాలోము ఉదయం పెందలకడలేచి నగర ద్వారం[h] వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవరైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు రాజు కొరకు వస్తే, అబ్షాలోము వారిని పిలిచేవాడు. వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. “ఇశ్రాయేలు వంశాలలో ఒకడినని” ఆ వచ్చినవాడు చెప్పేవాడు. 3 అందుకు అబ్షాలోము “చూడు, నీవు నిజమే చెబుతున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేది వినడు” అని అనేవాడు.
4 అబ్షాలోము ఇంకా ఇలా అనేవాడు, “ఓహో, ఈ రాజ్యంలో నన్నెవరైనా న్యాయాధిపతిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. న్యాయం కోరుతూ ఎవరు ఏ సమస్యతో వచ్చినా వారికి తగిన న్యాయం నేనప్పుడు చేయగలుగుతాను. వచ్చిన వాని సమస్యకు తగిన పరిష్కారం కనుగొని సహాయం చేయగలుగుతాను.”
5 ఎవరైనా అబ్షాలోము వద్దకు వచ్చి ప్రణమిల్లి నమస్కరించబోతే, అతను వాని కొరకు ముందుకు వెళ్లి, అతనిని ఆదరంగా తన వద్దకు తీసుకొనేవాడు. తరువాత ఆ వచ్చిన వానిని అతను స్నేహపూర్వకంగా ముద్దు పెట్టుకొనేవాడు. 6 దావీదు రాజు వద్దకు న్యాయం కోసం ఇశ్రాయేలు నుండి ఎవరు వచ్చినా అబ్షాలోము అలా చేసేవాడు. ఈ రకంగా ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలనూ అబ్షాలోము గెలిచాడు.
దావీదు రాజ్యాన్ని కైవశం చేసుకోవటానికి అబ్షాలోము పథకం
7 నాలుగేండ్ల[i] తరువాత దావీదు రాజుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “హెబ్రోనులో నేను వుండగా యెహోవాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి. 8 గతంలో నేను సిరియ దేశమందలి గెషూరులో వుండగా మొక్కాను. నన్ను యెహోవా మరల యెరూషలేముకు తీసుకొని వస్తే యెహోవాను ఆరాధించెదనని మొక్కుకున్నాను.”
9 “ప్రశాంతంగా వెళ్లిరా!” అని దావీదు రాజు అన్నాడు.
అబ్షాలోము హెబ్రోనుకు వెళ్లాడు. 10 కాని అబ్షాలోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు.!” అని కేకలు పెట్టమన్నాడు.
11 అబ్షాలోము తనతో వెళ్లటానికి రెండువందల మందిని ఆహ్వానించాడు. యెరూషలేము నుండి వారంతా అతనితో వెళ్లారు. కాని అతడు ఏమి యుక్తి పన్నుతున్నాడో వారికి తెలియదు.
12 అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. అహీతోపెలు గీలో పట్టణవాసి, అబ్షాలోము బలులు సమర్పించేటప్పుడు అతడు అహీతోపెలును గీలో పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్షాలోము పన్నినయుక్తులన్నీ సక్రమంగా సాగుతున్నాయి. ప్రజలు అబ్షాలోమును అధిక సంఖ్యలో బలపర్చ నారంభించారు.
అబ్షాలోము పథకాన్ని దావీదు వినటం
13 ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు.
14 అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే అబ్షాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్షాలోము మనల్ని పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనందరినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను కత్తితో నరికి చంపుతాడు.”
15 “మీరు ఏమి చేయాలని మాకు చెబుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు.
దావీదు, అతని మనుష్యులు తప్పించుకోవటం
16 రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి పెట్టాడు. 17 తన ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి వెళ్లాడు. వారు చివరి ఇంటివద్ద ఆగారు. 18 సేవకులంతా రాజు ముందునుంచి వెళ్లారు. కెరేతీయులు, పెలేతీయులు మరియు గిత్తీయులు (ఆరు వందల మంది గాతువారు) అందరూ రాజు ముందు నుంచి నడిచి వెళ్లారు.
19 గిత్తీయుడైన ఇత్తయిని చూచి రాజు, “నీవెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి, కొత్త రాజుతో (అబ్షాలోము) వుండిపో. నీవు పరదేశీయుడవు. ఇది నీ స్వదేశం కాదు. 20 నిన్న మాత్రమే నీవు నన్ను కలియటానికి వచ్చావు. ఇప్పుడు నీవు నాతో కలిసి వివిధ ప్రాంతాలు తిరిగే అవసరం వుందా? లేదు. తిరిగి వెళ్లిపో నీ సోదరులను కూడ నీతో తీసుకొని వెళ్లు. దయ, విశ్వాసం నీకు అండగా వుండుగాక!” అని అన్నాడు.
21 కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, “యెహోవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా నేను నీతోనే వుంటాను! చావుబ్రతుకుల్లో కూడ నేను నీతోనే వుంటాను!” అని అన్నాడు.
22 “అయితే మనం కిద్రోను వాగు దాటుదాము,” అన్నాడు రాజు ఇత్తయితో.
అప్పుడు గిత్తీయుడైన ఇత్తయి తన వారితోను, వారి పిల్లలతోను కిద్రోను వాగు దాటాడు. 23 ప్రజలంతా[j] బిగ్గరగా ఏడ్వసాగారు. రాజు (దావీదు) కిద్రోనువాగు దాటాడు. అప్పుడు వారంతా ఎడారివైపు ప్రయాణం సాగించారు. 24 సాదోకు, తనతో వున్న తదితర లేవీయులందరూ దేవుని ఒడంబడిక పెట్టెను మోసుకొని వస్తూవున్నారు. వారు దేవుని పెట్టెను దించారు. ప్రజలంతా యెరూషలేము నగరం నుండి వెళ్లిపోయే వరకు అబ్యాతారు ప్రార్థన[k] చేస్తూవున్నాడు.
25 సాదోకుతో రాజు (దావీదు) ఈ విధంగా చెప్పాడు: “దేవుని పవిత్ర పెట్టెను యెరూషలేముకు తిరిగి తీసుకొని వెళ్లు. ఒక వేళ యెహోవా నన్ననుగ్రహించితే, ఆయన నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తాడు. యెహోవా మరల నన్ను యెరూషలేమును, ఆయన దేవాలయమును చూసేలా చేస్తాడు. 26 కాని దేవుడు నేనంటే ఇష్టంలేదని చెప్పితే ఆయన నాకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగలడు.”
27 యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి.[l] నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు. 28 ప్రజలు ఎడారిలోకి ప్రవేశించే స్థలంలో నేను మీనుండి మళ్లీ సమాచారం వచ్చేవరకు వేచి వుంటాను.”
29 కావున సాదోకు, అబ్యాతారు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ వుండి పోయారు.
అహీతోపెలుకు వ్యతిరేకంగా దావీదు ప్రార్థించుట
30 దావీదు ఒలీవల పర్వతం మీదికి వెళ్లాడు. అతడు ఏడుస్తూవున్నాడు. తలమీద ముసుగు వేసికొని, చెప్పులు కూడ లేకుండా వెళ్లాడు. దావీదుతో వున్న మనుష్యులంతా కూడ తలపై ముసుగు వేసుకున్నారు. వారు ఏడుస్తూ దావీదు వెంట వెళ్లారు.
31 ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి, “అబ్షాలోముతో కలిసి పథకం వేసిన వారిలో అహీతోపెలు ఒకడు” అని చెప్పాడు. అది విని దావీదు యెహోవాకు “అహీతోపెలు సలహా నిరుపయోగమయ్యేలా చేయమని నిన్ను వేడుకుంటున్నాను” అని ప్రార్థన చేశాడు. 32 దావీదు పర్వతం పైకి వెళ్లాడు. తరుచూ అతను అక్కడ దేవుని ఆరాధించేవాడు. ఆ సమయంలో అర్కీయుడైన హూషై అనువాడు దావీదు వద్దకు వచ్చాడు. హూషై చొక్కా చిరిగివుంది. వాని తలపై దుమ్ము[m] వుంది.
33 దావీదు హూషైతో ఇలా అన్నాడు: “నీవు నాతో వస్తే నేను శ్రద్ద తీసుకోవలసిన వారిలో నీవొకడివవుతావు. 34 కాని నీవు యెరూషలేము నగరానికి వెళితే, అహీతోపెలు సలహాను ఎందుకూ కొరగానిదిగా నీవు చేయగలవు. అబ్షాలోముతో: ఓ రాజా, నేను నీ సేవకుడను. నేను నీ తండ్రిని సేవించాను. కాని ఇప్పుడు నిన్ను సేవింపవచ్చాను, అని చెప్పు. 35 యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు తోడుగా వుంటారు. రాజ గృహంలో నీవు విన్నదంతా వారికి తప్పక చెప్పాలి. 36 సాదోకు కుమారుడు అహిమయస్సు, అబ్యాతారు కుమారుడు యోనాతాను వారికి తోడుగా వుంటారు. నీవు విన్నదంతా వారికి చెప్పి పంపితే, వారు వచ్చి నాకు తెలియజేస్తారు.”
37 అప్పుడు దావీదు స్నేహితుడు హూషై నగరానికి వెళ్లాడు. అబ్షాలోము కూడ నగరానికి చేరియున్నాడు.
© 1997 Bible League International