Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 8-9

దావీదు అనేక యుద్ధాలను గెలవటం

తరువాత దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు. వారి రాజధాని నగరాన్ని స్వాధీన పర్చుకున్నాడు. దావీదు మోయాబీయులను కూడ ఓడించాడు. పట్టుబడిన వారందరినీ నేల మీద పరుండేలా చేసి, వారి పొడుగు కొలవటానికి ఒక తాడు తీసుకున్నాడు. రెండు కొలతల పొడవున్న వారందరినీ చంపించాడు. ఒక కొలత పొడవున్న వారందరినీ వదిలిపెట్టాడు. దానితో మోయాబీయులంతా దావీదుకు సేవకులయ్యారు. వారంతా ఆయనకు కప్పము[a] చెల్లించారు.

సోబారాజు రెహోబు కుమారుడైన హదదెజరును దావీదు ఓడించాడు. యూఫ్రటీసు నదీ తీరానగల తన ఆధిపత్యాన్ని దావీదు తిరిగి చేజిక్కించుకున్నాడు. హదదెజరు నుండి పదిహేడు వందల మంది గుర్రపు దళము వారిని, ఇరవై వేలమంది కాల్బలము వారిని దావీదు పట్టుకున్నాడు. ఒక వంద మంచి గుర్రాలు మినహా మిగిలిన గుర్రాలన్నిటినీ దావీదు కుంటివాటినిగా చేసాడు. ఆ వంద గుర్రాలను రథాలను లాగేందుకు రక్షించాడు.

సోబా రాజగు హదదెజరుకు సహయం చేయటానికి దమస్కునుండి సిరియనులు వచ్చిరి. కాని దావీదు ఇరువది రెండువేల మంది సిరియనులను ఓడించాడు. తరువాత దమస్కు అధీనంలోనున్న సిరియా దేశమందు దావీదు రక్షక దళాలను నియమించాడు. సిరియనులు వచ్చి దావీదుకు కప్పము చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయ పరంపర సమకూర్చి పెట్టాడు.

హదదెజరు సైనికుల బంగారు డాళ్లను (రక్షకఫలకాలు) దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. బెతహు, బేరోతైలనుండి దావీదు లెక్కకు మించి ఇత్తడి సామగ్రి పట్టుకొనిపోయాడు. (బెతహు, బేరోతై అను రెండు నగరాలూ హదదెజరుకు చెందినవి).

హదదెజరు సైన్యాన్ని దావీదు ఓడించినట్లు హమాతు రాజైన తోయి విన్నాడు. 10 తోయి తన కుమారుడైన యోరామును దావీదు రాజువద్దకు పంపాడు. యోరాము వచ్చి దావీదును పలకరించి, హదదెజరుతో పోరాడి ఓడించినందుకు అతన్ని అభినందించాడు. (తోయిపై హదదెజరు గతంలో దండెత్తి యుద్ధాలు చేశాడు). యోరాము దావీదు వద్దకు వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా తెచ్చాడు. 11 దావీదు వాటిని తీసుకొని యెహోవాకి సమర్పించాడు. తాను ఇతర దేశములను ఓడించి తెచ్చి యెహోవాకి సమర్పించిన వెండి బంగారు వస్తువులతో పాటు ఈ సామగ్రిని కూడ ఉంచాడు. 12 తాను జయించిన దేశాలలో సిరియ, మోయాబు, అమ్నోను, ఫిలిష్తీయ, అమాలేకు ఉన్నాయి. సోబా రాజైన రెహోబు కుమారుడు హదదెజరును కూడ దావీదు ఓడించాడు. 13 దావీదు పద్దెనిమిది వేల సిరియనులను ఉప్పులోయలో ఓడించాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి మిక్కిలి కీర్తి గడించాడు. 14 ఎదోములో దావీదు సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహో వా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు.

దావీదు పరిపాలన

15 ఇశ్రాయేలంతటినీ దావీదు పరిపాలించాడు. దావీదు తీసుకున్న నిర్ణయాలు తన ప్రజలందరికీ నిష్పక్ష పాతంగా వుండి ఆమోదయోగ్యంగా వుండేవి. 16 సెరూయా కుమారుడైన యోవాబు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడు పత్రలేఖకుడుగా నియమితుడయ్యాడు. 17 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా ఉన్నారు. శెరాయా అనునతను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. 18 యెహోయాదా కుమారుడు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు[b] అధిపతి అయ్యాడు. దావీదు కుమారులు రాజకీయ సలహాదారులైన ప్రముఖ వ్యక్తులుగా[c] నియమితులయ్యారు.

సౌలు కుటుంబానికి దావీదు కనికరము చూపటం

“సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.

సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు.

“అవును, నీ సేవకుడనైన సీబానే” అని అన్నాడు సీబా.

“అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా జీవించివున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు రాజుతో సీబా యిలా అన్నాడు:

“యోనాతాను కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని రెండు కాళ్లూ అవిటివి.”

“ఈ కుమారుడెక్కడున్నాడని” రాజు సీబాను అడిగాడు.

“లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్నాడని” రాజుకు చెప్పాడు సీబా.

అప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబారుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని రమ్మని చెప్పాడు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు.

“మెఫిబోషెతూ” అని పిలిచాడు దావీదు.

“అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు.

మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయపడకు. నేను నీ పట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రియైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి ఇచ్చివేస్తాను. నీవు ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద భోజనం చేస్తావు.”

మెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్కరించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ సేవకుడనైన నా పట్ల చాలా దయగలిగియున్నారు! పైగా నేను చచ్చిన కుక్కకంటె హీనమైన వాడిని!”

పిమ్మట దావీదు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిచి, “సౌలుకు, సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి పాస్తులన్నీ నీ యజమాని మనుమడైన మెఫీబోషెతుకు ఇచ్చాను. 10 మెఫీబోషెతు కొరకు ఆ భూమిని నీవు సాగుచేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ యజమాని మనుమడు మెఫిబోషెతుకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు నా బల్లవద్ద తింటూ వుంటాడు.”

సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువైమంది సేవకులు వున్నారు. 11 దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అంతా చేస్తాను.”

ఆ ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ కుమారులలో ఒకనిగా భోజనం చేస్తాడు. 12 మెఫీబోషెతుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. సీబా కుటుంబంలోని వారంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు. 13 మెఫీబోషెతు రెండు కాళ్లూ కుంటివే. మెఫీబోషెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతిరోజూ మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు.

1 దినవృత్తాంతములు 18

దావీదు వివిధ రాజ్యాలను జయించుట

18 తరువాత దావీదు ఫిలిష్తీయులపైకి దండెత్తి వారిని ఓడించాడు. ఫిలిష్తీయులనుండి గాతు నగరాన్ని, దాని చుట్టు ప్రక్కలనున్న పట్టణాలను వశపర్చుకున్నాడు.

పిమ్మట దావీదు మోయాబు దేశాన్ని ఓడించాడు. మోయాబీయులు దావీదుకు దాసులయ్యారు. వారు బంగారం, ఇతర కానుకలను దావీదుకు కప్పంగా చెల్లించారు.

హదదెజెరు సైన్యంతో కూడ దావీదు యుద్ధం చేశాడు. సోబా రాజు హదదెజెరు. ఆ సైన్యంలో దావీదు హమాతు పట్టణం వరకు యుద్ధం నిర్వహించాడు. దావీదు అలా ఎందుకు యుద్ధం చేశాడనగా హదదెజెరు తన సామ్రాజ్యాన్ని యూఫ్రటీసు నదివరకు విస్తరింపచేయటానికి ప్రయత్నించాడు. హదదెజెరుకు చెందిన వెయ్యి రథాలను, ఏడువేల రథసారధులను, ఇరవైవేల మంది కాల్బలాన్ని దావీదు వశపర్చుకున్నాడు. హదదెజెరుకు చెందిన రథాల గుర్రాలలో చాలా వాటి కాళ్లను దావీదు విరుగగొట్టాడు. కాని వందరథాలను లాగటానికి కావలసినన్ని మంచి గుర్రాలను మాత్రం దావీదు రక్షించాడు.

దమస్కు నగరంలోని అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయపడే నిమిత్తం వచ్చారు. హదదెజెరు సోబాకు రాజు. కాని దావీదు వారిని ఓడించి ఇరవై రెండు వేల సిరియను సైనికులను చంపివేశాడు. తరువాత దావీదు అరాము దేశంలోగల దమస్కు నగరంలో తన సైనిక స్థావరాలు నెలకొల్పాడు. అరామీయులు దావీదుకు సేవకులై కప్పం చెల్లించారు. ఆ విధంగా దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయాన్ని చేకూర్చాడు.

హదదెజెరు సైన్యాధికారుల నుండి బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. తెబహు (టిబ్హతు), కూను పట్టణాల నుండి దావీదు చాలా కంచును పట్టుకువచ్చాడు. ఈ పట్టణాలు హదదెజెరుకు చెందినవి. తరువాత కాలంలో లోహాన్నే సొలొమోను ఆలయానికి, కంచు సముద్రం, కంచు స్తంభాలు, ఇతర వస్తు సామగ్రి చేయటానికి వినియోగించాడు.

హమాతు రాజు పేరు తోహూ. సోబారాజు పేరు హదదెజెరు. హదదెజెరు సైన్యాన్నంతా దావీదు ఓడించాడని తోహూ విన్నాడు. 10 తోహూ తన కుమారుడైన హదోరమును రాజైన దావీదు వద్దకు తాను శాంతి కోరుతున్నట్లు, తనను దీవించమని అడగటానికి పంపాడు. హదదెజెరుతో దావీదు యుద్ధం చేసి అతనిని ఓడించిన సందర్భంగా తోహూ ఇది చేసాడు. ఇంతకు ముందు తోహూ కూడ హదదెజెరుతో యుద్ధం చేసియున్నాడు. హదోరము తనతో వెండి, బంగారం, కంచు లోహాలతో చేసిన రకరకాల వస్తువులు దావీదుకు కానుకలుగా తీసుకొని వెళ్లి ఇచ్చాడు. 11 రాజైన దావీదు ఆ వస్తువులన్నిటినీ పవిత్రపరచి యెహోవాకు సమర్పించాడు. పైగా ఎదోము, మోయాబుల నుండి, అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయులనుండి, అమాలేకీయుల నుండి తెచ్చిన వెండి బంగారాలను కూడ దావీదు యెహోవాకి సమర్పించాడు.

12 సెరూయా కుమారుడైన అబీషై “ఉప్పులోయ” అని పిలవబడే స్థలంలో పద్దెనిమిదివేల ఎదోమీయులను చంపివేసాడు. 13 ఎదోములో అబీషై సైనిక స్థావరాలు కూడ ఏర్పాటు చేసాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.

దావీదు ముఖ్య అధికారులు

14 ఇశ్రాయేలంతటికీ దావీదు రాజు. ప్రతి పౌరునికీ ఏది మంచిదో, న్యాయమైనదో దావీదు వారికి అది చేశాడు. 15 సెరూయా కుమారుడు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దావీదు చేసిన విషయాలన్నీ గ్రంథ రూపంలో రాశాడు. 16 సాదోకు, అబీమెలెకు యాజకులు. సాదోకు తండ్రి పేరు అహీటూబు. అబీమెలెకు తండ్రి అబ్యాతారు. షవ్షా లేఖకుడు. 17 కెరేతీయులకు, పెలేతీయులకు (రాజు అంగరక్షకులు) నాయకుడుగా బెనాయా నియమితుడయ్యాడు. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. దావీదు కుమారులు ముఖ్యవ్యక్తులై దావీదు రాజుకు సహాయకులుగా వున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International