Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 5:11-6:23

11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు. 12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.

13 దావీదు యెరూషలేము నుండి పెక్కు మంది దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమార్తెలు కలిగారు. 14 యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల పేర్లు: షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా మరియు ఎలీపేలెటు.

ఫిలిష్తీయుల పైకి దావీదు యుద్దానికి పోవటం

17 ఇశ్రాయేలీయులు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలిష్తీయులంతా దావీదును చంపాలని వెదకటం మొదలు పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక కోటలోకి వెళ్లాడు. 18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగారు.

19 దావీదు ప్రార్థన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దానికి వెళ్లనా? ఫిలిష్తీయులను ఓడించటంలో నాకు సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు.

“వెళ్లు. ఫిలిష్తీయులను ఓడించటంలో నీకు నేను తప్పక సహాయం చేస్తాను” అని యెహోవా చెప్పాడు.

20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి, ఫిలిష్తీయులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించినట్లు, యెహోవా నా శత్రువులను నాముందు చెల్లాచెదురై పారిపోయేలా చేసాడు,” అని అనుకున్నాడు దావీదు. ఆ కారణం చేత దావీదు ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[a] అని పేరుపెట్టాడు. 21 ఫిలిష్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని మనుష్యులు ఆ విగ్రహాలన్నిటినీ తీసుకొని వెళ్లారు.

22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.

23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో. 24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”

25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుముకుంటూ పోయి చంపాడు.

దేవుని పవిత్ర పెట్టెను యెరూషలెముకు తరలించుట

దావీదు మరల ప్రత్యేకంగా ఉత్తములైన ముప్పదివేల మంది ఇశ్రాయేలు యోధులను సమకూర్చుకొన్నాడు. దావీదు వారిని తీసుకొని యూదాలో ఉన్న బాలాకు[b] ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెట్టె తీసుకొని, దానిని యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర పెట్టె సైన్యములకు అధిపతియైన యెహోవా పరమ పవిత్ర నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్టె పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైయున్నాడు. దావీదు మనుష్యులు యెహోవా పవిత్ర పెట్టెను ఒక కొత్త బండిపై ఉంచారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి వారా పెట్టెను తెచ్చారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహ్యో అనువారు ఆ బండిని తోలారు.

కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి ఉజ్జా, అహ్యోలిరువురూ ఆ బండిని బయలుదేరదీశారు. బండిపై దేవుని పవిత్ర పెట్టె వున్నది. అహ్యో బండిముందు నడుస్తూ ఉన్నాడు. దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి. దావీదు మనుష్యులు నాకోను నూర్పిడి కళ్లం దగ్గరకు రాగానే ఎద్దులు తూలి పడబోయాయి. దానితో బండి మీదవున్న దేవుని ఒడంబడిక పెట్టె ఒరిగి క్రింద పడబోయింది. వెంటనే ఉజ్జా పవిత్ర పెట్టెను పట్టుకున్నాడు. యెహోవాకు ఉజ్జాపై కోపం వచ్చి చంపివేశాడు.[c] దేవుని పవిత్ర పెట్టెను తాకినప్పుడు ఉజ్జా దేవుని గౌరవించినట్లు గాదు. దేవుని పవిత్ర పెట్టెవలన ఉజ్జా చంపబడ్డాడు. ఉజ్జాను యెహోవా చంపినందుకు దావీదు కలత చెందాడు. దావీదు ఆ స్థలానికి “పెరెజ్‌ – ఉజ్జా”[d] అని పేరు పెట్టాడు. ఆ ప్రదేశం ఈనాటికీ పెరెజ్‌ – ఉజ్జా అనే పిలవబడుతూ వుంది.

ఆ రోజు దావీదు యెహోవా అంటే భయపడిపోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర పెట్టె నా వద్దకు ఎలా వస్తుంది?” అని అడిగాడు. 10 దావీదు పురములోనికి తనకై తాను దేవుని పవిత్ర పెట్టెను దావీదు తీసుకొని పోవుటకు సుముఖత చూపలేదు. గాతువాడైన ఓబేదెదోము[e] ఇంటిలో పవిత్ర పెట్టెను దావీదు వుంచాడు. బాటమీద నుంచి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటివరకు పవిత్ర పెట్టెను దావీదు మోసాడు. 11 ఓబేదెదోము ఇంటి వద్ద యెహోవా పవిత్ర పెట్టె మూడు నెలలపాటు వుండెను. కాబట్టి ఓబేదెదోమును, అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు.

12 ప్రజలు దావీదు వద్దకు వచ్చి, “దేవుని పవిత్ర పెట్టె అక్కడున్న కారణాన యెహోవా ఓబేదెదోము కుటుంబాన్ని, అతని వస్తువాహనాలను ఆశీర్వదించాడు” అని చెప్పారు. దానితో దావీదు ఓబేదెదోము ఇంటి నుండి దేవుని ఒడంబడిక పెట్టెను ఆనందోత్సాహాలతో తేవటానికి వెళ్లాడు. 13 యెహోవా పవిత్ర పెట్టెను మోసేవారు ఆరడుగులు నడిచి ఆగగా, దావీదు ఒక ఎద్దును, ఒక బలిసిన దూడను బలియిచ్చాడు. 14 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని ధరించాడు.

15 యెహోవా పవిత్ర పెట్టెను నగరంలోకి తెస్తూవుండగా దావీదు, ఇశ్రాయేలీయులంతా సంతోషంతో కేకలు వేశారు. బూరలు ఊదారు. 16 సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది.

17 పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు.

18 దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు. 19 నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.

మీకాలు దావీదును అవమానించటం

20 దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి వెళ్లాడు. కాని సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు.[f] సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది.

21 అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ తండ్రనీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయకునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను. 22 బహుశః నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!”

23 ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలుగానే చనిపోయింది.

1 దినవృత్తాంతములు 13-16

ఒడంబడిక పెట్టెను తిరిగి తీసుకొని రావటం

13 దావీదు తన సైన్యంలోని సేనాధిపతులతో మాట్లాడాడడు. అతడు శతదళాధిపతులతోను, సహస్రదళాధిపతులతోను మాట్లాడాడు. పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి. ఒడంబడిక పెట్టెను మనం యెరూషలేముకు తీసుకొనివద్దాము. సౌలు రాజుగా వున్నన్నాళ్ళూ ఒడంబడిక పెట్టెను మనం అశ్రద్ధ చేశాము.” దావీదు చెప్పిన విషయం సరియైనదని గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలంతా అతని సూచనను అంగీకరించారు.

కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబోహమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయులందరినీ దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా ఒక చోటికి పిలవబడ్డారు. దావీదు మరియు అతనితో వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు మరో పేరు.) ఒడంబడిక పెట్టెను బయటకు తేవటానికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెట్టె అనేది యెహోవా దేవుని పవిత్రపెట్టె. యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టె యెహోవా పేరుతో పిలవబడుతుంది.

ఒడంబడిక పెట్టెను ప్రజలు అబీనాదాబు ఇంటి నుండి బయటకు తీసారు. వారు దానిని ఒక కొత్త బండిమీద పెట్టారు. ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు.

దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబుర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు.

వారు కీదోను నూర్పిడి కళ్ళం వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడబడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టె ఇంచుమించు క్రిందపడినంత పని అయ్యింది. అప్పుడు ఉజ్జా తనచేయి చాపి పెట్టెను పట్టుకోబోయాడు. 10 ఉజ్జా పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఉజ్జా పెట్టెను ముట్టుకున్న నేరానికి దేవుడు అతనిని చంపివేసాడు. ఉజ్జా దేవుని ముందే పడి చనిపోయాడు. 11 ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం “పెరెజ్ ఉజ్జా”[a] అని పిలవబడుతూ వుంది.

12 ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు. “ఒడంబడిక పెట్టెను నా వద్దకు ఏ విధంగా తీసుకొని వెళ్లగలను?” అని అనుకున్నాడు. 13 కావున దావీదు ఒడంబడిక పెట్టెను తనతో దావీదు నగరానికి తీసుకొని వెళ్లలేదు. ఒడంబడిక పెట్టెను ఓబేదెదోము ఇంటివద్ద వదిలిపెట్టాడు. ఓబేదెదోము గాతు నగరంవాడు. 14 మూడు నెలల పాటు ఒడంబడిక పెట్టె ఓబేదెదోము ఇంటిలో అతని ఇంటివారి సంరక్షణలో వుంది. యెహోవా ఓబేదెదోము కుటుంబం వారిని, అతను కలిగివున్న ప్రతి దానిని దీవించాడు.

దావీదు రాజ్య విస్తరణ

14 తూరు నగర రాజు పేరు హీరాము. దావీదు వద్దకు హీరాము దూతలను పంపాడు. హీరాము దేవదారు కలపను, రాళ్లు చెక్కే వాస్తు శిల్పులను, వడ్రంగులను దావీదు వద్దకు పంపాడు. దావీదుకు ఒక భవనం నిర్మించటానికి హీరాము వారిని పంపాడు. యెహోవా నిజంగానే తనను ఇశ్రాయేలుకు రాజుగా చేసినట్లు దావీదు అప్పుడు గుర్తించాడు. యెహోవా దావీదును, ఇశ్రాయేలు ప్రజలను బాగా ప్రేమించాడు. అందువల్ల దేవుడు దావీదు రాజ్యాన్ని విస్తరించి, బలమైన రాజ్యంగా రూపొందించాడు.

యెరూషలేము నగరంలో దావీదు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. అతనికి చాలామంది కొడుకులు, కూతుళ్లు కలిగారు. యెరూషలోములో దావీదుకు పుట్టిన పిల్లల పేర్లు ఏవనగా: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇభారు, ఎలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయ, ఎలీషామా, బెయెల్యెదా మరియు ఎలీపెలెటు.

దావీదు ఫిలిష్తీయులను ఓడించటం

దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుడయినట్లు ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిష్తీయులంతా దావీదును వెదుక్కుంటూ పోయారు. ఆ విషయం దావీదు విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు. ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో నివసిస్తున్న వారిపై దాడిచేసి, వారిని దోచుకున్నారు. 10 అప్పుడు దావీదు దేవుని ప్రార్థించి, “దేవా, నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా? వారిని ఓడించేలా నీవు నాకు సహాయం చేస్తావా?” అని అడిగాడు.

యెహోవా అందుకు సమాధానంగా, “వెళ్లు, ఫిలిష్తీయులను నీవు ఓడించేలా నేను చేస్తాను” అని చెప్పాడు.

11 తరువాత దావీదు, అతని మనుష్యులు బయల్పెరాజీము పట్టణానికి వెళ్లారు. అక్కడ వారు ఫిలిష్తీయులను ఓడించారు. అప్పుడు దావీదు, “తెగిన ఆనకట్టలో నుండి నీరు ఉరుకులు పరుగులతో ప్రవహించి పోయేలా, దేవుడు నా శత్రువులను నానుండి చెల్లా చెదురు చేశాడు! దేవుడు ఈ కార్యం నాచేత చేయించాడు” అని అన్నాడు. అందువల్లనే ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[b] అని పేరు పెట్టబడింది. 12 ఫిలిష్తీయులు వారి విగ్రహాలను బయల్పెరాజీములో వదిలి పెట్టిపోయారు. ఆ విగ్రహాలన్నిటినీ తగులబెట్టమని దావీదు తన ప్రజలకు ఆజ్ఞయిచ్చాడు.

ఫిలిష్తీయులపై మరో విజయం

13 రెఫాయీము లోయలో నివసిస్తున్న ప్రజలపై ఫిలిష్తీయులు మళ్ళీ దాడి చేశారు. 14 దావీదు మరల దేవుని ప్రార్థించాడు. దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. యెహోవా ఇలా అన్నాడు: “దావీదూ, నీవు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నప్పుడు కొండమీద నీవు వారి ముందుకు పోవద్దు. దానికి బదులు నీవు వారిని చుట్టుముట్టి వెళ్లు. కంబళి చెట్లు వున్న చోటున దాగివుండు. 15 ఒక కాపలాదారుని చెట్ల మీద కూర్చుండబెట్టు. ఆ చెట్ల క్రింద నుండి వాళ్లు నడిచివెళ్లే అడుగుల చప్పుడు అతడు వినగానే నీవు ఫిలిష్తీయులను ఎదిరించు. నేను నీకు ముందుగా వెళ్లి ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడిస్తాను!” 16 దేవుడు చెప్పిన రీతిగా దావీదు చేసాడు. ఆ విధంగా దావీదు, అతని మనుష్యులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడించారు. గిబియోను పట్టణం నుండి గాజెరు వరకు వారు ఫిలిష్తీయుల సైనికులను చంపివేసారు. 17 అప్పుడు దావీదు అన్ని దేశాలలోను పేరు పొందాడు. వివిధ రాజ్యాల వారు దావీదును చూచి భయపడేలా దేవుడు చేశాడు.

ఒడంబడిక పెట్టె యెరూషలేముకు తేబడుట

15 దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టెను పెట్టటానికి అతడొక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడక్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు. “ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను సేవించడానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.

తాను ఏర్పాటు చేసిన స్థలానికి ఒడంబడిక పెట్టెను తేవటానికి యెరూషలేము ప్రజలందరినీ దావీదు సమావేశపర్చాడు. అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు.

కహాతు సంతతివారు నూట ఇరవై మంది వున్నారు. వారి నాయకుని పేరు ఊరియేలు.

మెరారి వంశీయులు రెండు వందల ఇరవై మంది వున్నారు. అశాయా వారికి పెద్ద.

గెర్షోను కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. యోవేలు వారి అధిపతి.

ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు.

హెబ్రోను సంతతివారు ఎనుబది మంది. ఎలీయేలు వారి నాయకుడు.

10 ఉజ్జీయేలు కుటుంబం వారు నూట పన్నెండు మంది. అమ్మీనాదాబు వారి పెద్ద.

దావీదు యాజకులతో, లేవీయులతో సంప్రదించటం

11 యాజకులైన సాదోకును, అబ్యాతారును తన వద్దకు రమ్మని దావీదు కబురు పంపాడు. మరియు లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని కూడ దావీదు తన వద్దకు రమ్మని కబురు పంపాడు. 12 దావీదు వారితో ఇలా అన్నాడు: “మీరంతా లేవి సంతతి వారికి నాయకులు. మీరు, మీతోటి వారైన ఇతర లేవీయులు పవిత్రంగా వుండి, ఒడంబడిక పెట్టెను నేను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొనిరండి. 13 కిందటి సారి ఒడంబడిక పెట్టెను ఎలా తీసుకొని రావాలి అనే విషయం మనం యెహోవాను అడుగలేదు. లేవీయులైన మీరు ఒడంబడిక పెట్టెను మోయలేదు. అందువల్ల యెహోవా మనల్ని శిక్షించాడు.”

14 పిమ్మట ఇశ్రాయేలు దేవుని ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి యాజకులు, లేవీయులు శుద్ధియైనారు. 15 ఒడంబడిక పెట్టెను మోషే ఆజ్ఞాపించిన విధంగా వారి భుజాలపై మోయటానికి లేవీయులు ప్రత్యేకమైన కర్రలను వినియోగించారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారమే వారు ఆ ఒడంబడిక పెట్టెను మోసారు.

గాయకులు

16 వారి సోదరులైన గాయకులను తీసుకొని రమ్మని దావీదు లేవీయులతో చెప్పాడు. గాయకులంతా వీణలు, తంబూరాలు, సితారలు, తాళాలు వాయిస్తూ ఆనందంతో హాయిగా పాడాలి.

17 అప్పుడు లేవీయులు హేమానును, అతని సోదరులను, ఆసాపును, ఏతానును తీసుకొని వచ్చారు. హేమాను తండ్రి పేరు యోవేలు. ఆసాపు తండ్రి పేరు బెరెక్యా. ఏతాను తండ్రి పేరు కూషాయాహు. వీరంతా మెరారి సంతతివారు. 18 లేవీయులో రెండవ వర్గం వారు కూడ వున్నారు. వారు జెకర్యా, యహాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు. వీరంతా లేవీయులకు చెందిన ద్వారపాలకులు.

19 గాయకులైన హేమాను, ఆసాపు, ఏతాను కంచు తాళాలు వాయించేందుకు నియమితులయ్యారు. 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా హెచ్చు స్థాయి వీణలు వాయించాలి. 21 మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు మరియు అజజ్యాహు తగ్గుస్థాయి వీణలు వాయించటానికి నియమింప బడ్డారు. శాశ్వతంగా అది వారిపని. 22 లేవీయుల నాయకుడు కెనన్యా సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ గాయకుడు కావటమే.

23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు. 24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా మరియు ఎలీయెజెరు ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదారు. ఓబేదెదోము, యెహీయాలిరువురూ కూడ ఒడంబడిక మందసానికి కాపలాదార్లు.

25 దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, వెయ్యిమంది సైనికులు గల దళాలకు నాయకులు ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి వెళ్లారు. వారు దానిని ఓబేదెదోము ఇంటినుండి బయటకు తెచ్చినప్పుడు చాలా ఆనందంగా వున్నారు. 26 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులకు దేవుడు సహాయపడ్డాడు. వారు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను బలియిచ్చారు. 27 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులంతా సన్నని నారబట్టలు ధరించారు. భజన సంకీర్తన నిర్వాహకుడుగా వున్న కెనన్యా, ఇతర గాయకులు సన్నని నారబట్టలు ధరించారు. దావీదు కూడ సన్నని నారబట్టలు ధరించాడు. సన్నని నారతో నేసిన ఏఫోదు అనబడే ఒక అంగీని కూడా దావీదు ధరించాడు.

28 ఇశ్రాయేలు ప్రజలు జయజయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్ములు, బాకాలు వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు వాయిస్తూ ఒడంబడిక పెట్టెను తీసుకొని వచ్చారు.

29 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు నగరం చేరినప్పుడు మీకాలు కిటికీ గుండా చూసింది. మీకాలు సౌలు కుమార్తె. రాజైన దావీదు చిందులేస్తూ పాటలు పాడటం ఆమె చూసింది. అతనినొక మూర్ఖునిగా భావించడంతో దావీదు పట్ల ఆమెకున్న గౌరవం పోయింది.

16 దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు. దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు. అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.

ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు. వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణ, సితార వాద్యాలను వాయించేవారు. యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు. అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.

దావీదు కృతజ్ఞతా స్తోత్ర గీతం

యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి.
    యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.
యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి.
    యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!
10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి;
    యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖసంతోషాలు పొందెదరు గాక!
11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి.
    ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.
13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డలారా,
    యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.
14 యెహోవాయే మన దేవుడు
    ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది!
15 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు.
    ఆయన మాట వేయితరాల పంట!
16 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక.
    అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం
17 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు.
    అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక.
18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను.
    వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!”
    అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు.
19 దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే.
    వారు ఆ రాజ్యంలో పరాయి వారు.
20 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు.
    వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు.
21 కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు.
    యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.
22 “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు;
    నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!”
    అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు.
23 భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి!
    యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి!
24 యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి.
    దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!
25 యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి
    అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి.
26 ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే!
    కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.
27 యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు.
    యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు!
28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!
29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి!
    మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి
    యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!
30 భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి.
    కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు.
31 భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక!
    “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!
32 సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక!
    పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబుచ్చుగాక!
33 అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి!
    ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు.
34 ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు!
    యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది.
35 “మా సంరక్షకుడవగు ఓ దేవా!
    మమ్ములను రక్షింపుము!
మమ్ములను ఒక దగ్గరికి చేర్చి
    మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము.
అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము.
    మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.
36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
    సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక!

అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!

37 పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు. 38 ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెడ్రి పేరు యెదూతూను.

39 యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు. 40 దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు. 41 హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక. 42 హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.

43 పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International