Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 7-10

ఇశ్శాఖారు సంతతివారు

ఇశ్శాఖారుకు నలుగురు కుమారులు. తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అని వారి పేర్లు.

తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు అనేవారు. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారు, వారి సంతతివారు వీర సైనికులు. దావీదు రాజుగా ఉన్న కాలంలో వీరి సంఖ్య ఇరవై రెండువేల ఆరువందలు.

ఉజ్జా కుమారుడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా అనేవారు. వీరైదుగురు కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది ఆరువేల మంది యుద్ధ సన్నద్ధులైన సైనికులున్నట్లు తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ల వారికి సంతానం ఎక్కువై కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.

ఇశ్శాఖారు వంశంలో ఎనభై ఏడువేల మంది బలిష్టులైన సైనికులున్నట్లు వారి వంశ చరిత్ర తెలియజేస్తుంది.

బెన్యామీను సంతతివారు

బెన్యామీనుకు ముగ్గురు కుమారులు. బెల, బేకరు, యెదీయవేలు అని వారి పేర్లు.

బెలకు ఐదుగురు కుమారులు. ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు మరియు ఈరీ అని వారి పేర్లు. వారి కుటుంబాలకు వారు పెద్దలు. వారిలో ఇరవై రెండువేల రెండువందల మంది సైనికులున్నట్లు వారివంశ చరిత్ర తెలుపుతుంది.

బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయేజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవారు. ఇది బేకరు సంతానం. వీరి వంశ చరిత్ర వారి పెద్దలను విశదపరుస్తుంది. వారిలో ఇరవైవేల రెండు వందల మంది సైనికులున్నట్లు వారి చరిత్ర తెలియజేస్తుంది.

10 యెదీయవేలు కుమారుడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహరు అనువారు. 11 యెదీయవేలు కుమారులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారిలో పదిహేడువేల రెండువందల మంది యుద్ధవీరులున్నారు.

12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము.

నఫ్తాలి సంతతివారు

13 నఫ్తాలి కుమారులు యహసయేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవారు.

వీరందరూ బిల్హా[a] సంతతిగా ఎంచబడిరి.

మనష్షే సంతతివారు

14 మనష్షే సంతతివారు ఎవరనగా: మనష్షే కుమారుని పేరు అశ్రీయేలు. మనష్షే దాసియగు అరాము (సిరియా) దేశపు స్త్రీకి అశ్రీయేలు జన్మించాడు. ఆమెకు మాకీరు అనే మరొక కుమారుడు కలిగాడు. మాకీరు కుమారుడు గిలాదు. 15 హుప్పీయుల, షుప్పీయుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి పేరు కూడ మయకా. ఈ సోదరి మయకాకు సెలోపెహాదు అని మరో పేరు వుంది. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలే. 16 మాకీరు భార్య మయకా ఒక కుమారుని కన్నది. మయకా ఈ కుమారునికి పెరెషు అని పేరు పెట్టింది. పెరెషు సోదరుని పేరు షెరెషు. షెరెషు కుమారుల పేర్లు ఊలాము, రాకెము.

17 ఊలాము కుమారుని పేరు బెదాను. గిలాదు సంతతి వారెవరనగా: గిలాదు తండ్రి పేరు మాకీరు. మాకీరు తండ్రి పేరు మనష్షే. 18 మాకీరు సోదరియగు హమ్మోలెకెతునకు ఇషోదు, అబీయెజెరు, మహలా అనేవారు జన్మించారు.

19 షెమీదా కుమారుల పేర్లు అహోయాను, షెకెము, లికీ, అనీయాము.

ఎఫ్రాయిము సంతతివారు

20 ఎఫ్రాయిము సంతతివారి పేర్లు ఏవనగా: ఎఫ్రాయిము కుమారుని పేరు షూతలహు. షూతలహు కుమారుడు బెరెదు. బెరెదు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఎలాదా. 21 ఎలాదా కుమారుడు తాహతు. తాహతు కుమారుడు జాబాదు. జాబాదు కుమారుడు షూతలహు.

గాతు నగర నివాసులు కొందరు ఏజెరెను, ఎల్యాదును చంపివేసారు. ఏజెరు, ఎల్యాదులిద్దరూ గాతు ప్రజల ఆవులను, గొర్రెలను దొంగిలించటానికి వెళ్లిన కారణంగా వారిని ప్రజలు చంపివేసారు. 22 ఎజెరు, ఎల్యాదు లిరువురూ ఎఫ్రాయిము కుమారులే. ఏజెరు, ఎల్యాదు చనిపోయినందుకు ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. ఎఫ్రాయిము బంధువులంతా వచ్చి అతనిని ఓదార్చారు. 23 పిమ్మట ఎఫ్రాయిము తన భార్యతో కలియగా ఆమె గర్భవతి అయ్యింది. ఆమె ఒక కుమారుని కన్నది. ఎఫ్రాయిము అతనికి బెరీయా[b] అని పేరు పెట్టాడు. ఎందువల్లననగా అతని కుటుంబానికి అప్పుడు కొంత కీడు జరిగింది. 24 ఎఫ్రాయిము కుమార్తె పేరు షెయెరా. షెయెరా దిగువ బేత్‌హోరోను, ఎగువ బేత్‌హోరోను, దిగువ ఉజ్జెన్‌షెయెరా, ఎగువ ఉజ్జెన్‌షెయెరా అనే పట్టణాలను కట్టించింది.

25 ఎఫ్రాయిము కుమారుని పేరు రెపహు. రెపహు కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. 26 తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. 27 ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ.

28 ఎఫ్రాయిము సంతతి వారు నివసించిన నగరాలు, ప్రదేశాలు ఏవనగా: బేతేలు, దాని పరిసర గ్రామాలు; తూర్పున నహరాను, పడమట గెజెరు, దాని సమీప గ్రామాలు; షెకెము, దాని పరిసర గ్రామాలు మరియు అయ్యా వరకుగల గ్రామాలు. 29 మనష్షే రాజ్య సరిహద్దుల్లో బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టణాలు మరియు వాటి పరిసర గ్రామాలు వున్నాయి. ఈ పట్టణాలలో యోసేపు సంతతి వారు నివసించారు. యోసేపు తండ్రి పేరు ఇశ్రాయేలు.

ఆషేరు సంతతివారు

30 ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బేరీయా అనువారు. వారి సోదరి పేరు శెరహు.

31 బెరీయా కుమారులు హెబెరు మరియు మల్కీయేలు. మల్కీయేలు కుమారుడు బిర్జాయీతు.

32 హెబెరు కుమారులు యప్లేటు, షోమేరు, హోతాము అనువారు. షూయా వారి సహోదరి.

33 యప్లేటు కుమారులు పాసకు, బింహాలు, అష్వాతు అనేవారు. వీరంతా యప్లేటు సంతానం.

34 షోమేరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, అరాము.

35 షోమేరు సోదరుని పేరు హేలెము. హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.

36 జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా, 37 బేసెరు, హాదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేర.

38 ఎతెరు కుమారులు యెపున్నె, పిస్పా, అరా.

39 ఉల్లాము కుమారులు ఆరహు, హన్నియేలు, రిజెయా.

40 వీరంతా ఆషేరు సంతతివారు. వారివారి కుటుంబాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర ప్రకారం వారిలో యుద్ధానికి పనికివచ్చే ఇరవై ఆరువేల మంది సైనికులున్నారు.

సౌలు రాజు కుటుంబ చరిత్ర

బెన్యామీను పెద్ద కుమారుని పేరు బెల. బెన్యామీను రెండవ కుమారుని పేరు అష్బేలు. అతని మూడవ కుమారుడు అహరహు. బెన్యామీను నాల్గవ కుమారుడు నోహా. అయిదవవాడు రాపా.

3-5 బెల కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషూవ, నయమాను, అహోయాహు, గెరా, షెపూపాను, హూరాము అనువారు.

6-7 ఏహూదు సంతతి వారు గెబలో వారి వారి కుటుంబాలకు పెద్దలు. వారు బలవంతంగా ఇండ్లు విడిచి మనహతుకు పోయేలా చేయబడ్డారు. ఏహూదు సంతతి వారు నయమాను, అహీయా, గెరా అనేవారు. గెరా వారిని బలవంతంగా ఇండ్లు వదిలిపోయేలా చేసాడు. గెరా కుమారులు ఉజ్జా, అహీహూదు.

మోయాబు దేశంలో షహరయీము తన భార్యలగు హూషీము, బయరాలకు విడాకులిచ్చాడు. ఇది జరిగిన పిమ్మట మరో భార్య ద్వారా అతనికి పిల్లలు కలిగారు. 9-10 షహరయీముకు యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, యోవూజును, షాక్యా, మిర్మా అనే కుమారులు తన భార్యయగు హోదెషు వలన కలిగారు. వారంతా షహరయీము సంతానం. వారు కుటుంబ పెద్దలయ్యారు. 11 షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు.

12-13 ఎల్పయల కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు, బెరీయా, షెమ అనువారు. ఓనో పట్టణాన్ని, లోదును, దాని చుట్టూ వున్న గ్రామాలను షెమెదు నిర్మించాడు. బెరీయా, షెమ అనువారిద్దరూ అయ్యాలోనులో నివసించే వారి కుటుంబ పెద్దలు. వారు గాతులో నివసిస్తున్న వారిని వెళ్లగొట్టారు.

14 బెరీయా కుమారులు షాషకు, యెరేమోతు, 15 జెబద్యా, అరాదు, ఏదెరు, 16 మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు. 17 ఎల్పయలు కుమారులు జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, 18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు.

19 షిమీ కుమారులు యాకీము, జిక్రీ, జబ్ది, 20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, 21 అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు.

22 షాషకు కుమారులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, 23 అబ్దోను, జిఖ్రి, హానాను, 24 హనన్యా, ఏలాము, అంతోతీయా, 25 ఇపెదయా, పెనూయేలు అనేవారు.

26 యెరోహాము కుమారులు షంషెరై, షెహర్యా, అతల్యా, 27 యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ అనేవారు.

28 వీరంతా కుటుంబ పెద్దలు. వారు తమ వంశ చరిత్రలో నాయకులుగా పేర్కొనబడ్డారు. వారు యెరూషలేములో నివసించారు.

29 యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా. 30 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని ఇతర కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 31 గెదోరు, అహ్యో, జెకెరు, మరియు మిక్లోతు. 32 మిక్లోతు కుమారుని పేరు షిమ్యా. ఈ కుమారులు కూడ వారి బంధువులకు దగ్గరగనే యెరూషలేములో నివసించారు.

33 నేరు కుమారుడు కీషు. కీషు కుమారుడు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, మరియు ఎష్బయలు.

34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.

35 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు అనేవారు.

36 ఆహాజు కుమారుడు యెహోయాదా. యెహోయాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ అనేవారు. జిమ్రీ కుమారుడు మెజా. 37 మెజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రాపా. రాపా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.

38 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు.

39 ఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీకులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమారుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, మూడవ కుమారుడు ఎలీపేలెటు. 40 ఊలాము కుమారులు ధనుర్బాణాలు పట్టగల నేర్పరులు, బలమైన సైనికులు. వారికి చాలా మంది కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మనుమలు అంతా నూట ఏబది మంది ఉన్నారు.

వీరంతా బెన్యామీను సంతతివారు.

ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి.

యెరూషలేము ప్రజలు

యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబులోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది. మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు.

యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా:

అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు.

యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు.

యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు.

మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు. యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు. యెరూషలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యామీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. వీరంతా ఆయా కుటుంబ పెద్దలు.

10 యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను, 11 మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి. 12 యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.

13 యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే.

14 యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజ్రీకాము. అజ్రీకాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు. 15 బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు. 16 ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.

17 యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు. 18 తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు. 19 షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు[c] చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు. 20 గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది. 21 పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు.

22 పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు. 23 యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది. 24 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి. 25 పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు.

26 ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు. 27 వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే.

28 దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినపుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు. 29 మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు. 30 కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది.

31 నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు. 32 విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు.

33 లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు.

34 ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.

సౌలు రాజు కుటుంబ చరిత్ర

35 గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా. 36 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 37 గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు. 38 మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు.

39 నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.

40 యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.

41 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ మరియు ఆహాజు. 42 ఆహాజు యెహోయద్దాకు తండ్రి. యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమారుల పేర్లు ఆలెమెతు, అజ్మావెతు మరియు జిమ్రీ. జిమ్రీ కుమారుడు మోజా, 43 మోజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.

44 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు.

సౌలు రాజు మరణం

10 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు. సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు.

అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో[d] సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు[e] వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.”

కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు. సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు. ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు.

లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు.

శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు. ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు. 10 సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను[f] గుడిలో వేలాడదీసారు.

11 యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు. 12 యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు క్రింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు.

13 సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు. 14 యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International