Chronological
సౌలు మరణం గురించి దావీదు వినటం
1 దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత అతను సిక్లగుకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది. 2 మూడవ రోజున సిక్లగుకు ఒక యువసైనికుడు వచ్చాడు. ఇతడు సౌలు శిబిరము నుండి వచ్చాడు. వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి పడివుంది. అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు.
3 “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు వానిని అడిగాడు.
“నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించుకొని వచ్చాను” అని దావీదుకు సమాధాన మిచ్చాడు.
4 “దయచేసి యుద్ధంలో ఎవరు గెల్చారో చెప్పు” అని దావీదు అడిగాడు.
“జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక మంది హతులయ్యారు. సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా వ్యక్తి.
5 దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు.
6 అందుకు యువసైనికుడు, ఇలా చెప్పాడు: “నేను ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం జరిగింది. సౌలు తన ఈటెపై ఆనుకొని వుండటం నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల మీద సౌలుకు చేరువగా వస్తూవున్నారు. 7 సౌలు వెనుదిరిగి నన్ను చూశాడు. అతను నన్ను పిలవగా, ‘నన్నేమి చేయమంటారు?’ అంటూ వెళ్లాను. 8 ‘నీవెవడవు’ అని సౌలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని చెప్పాను. 9 సౌలు నాతో, ‘దయచేసి కొంచెం ఆగి నన్ను చంపివేయి. నేను తీవ్రంగా గాయపడ్డాను. నేను ఇంచుమించు చనిపోయినట్లే’ అని చెప్పాడు. 10 అందువల్ల నేను ఆగి, అతన్ని చంపాను. అతను ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. అప్పుడు నేనతని కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, వాటిని నా యజమానివైన నీ యొద్దకు తెచ్చాను.”
11 తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యులందరూ అలానే చేశారు. 12 వారు మిక్కిలి దుఃఖించారు. సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించినందుకు వారు విలపించారు. మరణించిన ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని మనుష్యులు దుఃఖించారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో నరకబడి చంపబడినందుకు వారు విలపించారు.
అమాలేకీయుని చంపమని దావీదు ఆజ్ఞ
13 సౌలు మరణవార్త తెచ్చిన ఆ యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు.
“నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని ఆ యువసైనికుడు అన్నాడు.
14 “యెహోవాచే ప్రతిష్ఠింపబడిన రాజును చంపటానికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని అడిగాడు.
15-16 తరువాత దావీదు తన యువభటులలో ఒకనిని పిలిచి ఆ అమాలేకీయుని చంపుమని చెప్పాడు. యువకుడైన ఇశ్రాయేలు సైనికుడు అమాలేకీయుని చంపివేశాడు. “నీ చావుకు నీవే కారకుడవు. నీకు వ్యతిరేకంగా నీవే మాట్లాడావు![a] ‘దేవునిచే ఎంపిక చేయబడిన రాజును నేనే చంపానని’ నీవే అన్నావు,” అని దావీదు ఆ అమాలేకీయునుద్దేశించి అన్నాడు.
సౌలు, యోనాతానులను గూర్చిన దావీదు ప్రలాప గీతిక
17 సౌలు, అతని కుమారుడు యోనాతానులను గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు. 18 యూదా ప్రజలకు ఈ పాట నేర్పుమని దావీదు తన మనుష్యులకు చెప్పాడు. ఈ పాట “ధనుర్గీతిక” అని పిలవబడింది: ఈ పాట యాషారు గ్రంథంలో ఇలా వ్రాయబడింది.
19 ఓహో! “ఇశ్రాయేలూ నీ సౌందర్యం ఉన్నత స్థలాలపై ధ్వంసం చేయబడింది!
బలాఢ్యులు పడిపోయారు!
20 ఈ విషయం గాతులో చెప్పవద్దు,
అష్కెలోను[b] వీధులలో ప్రకటించ వద్దు!
ఏలయనగా ఫిలిష్తీయుల ఆడపడుచులు సంతసించ వచ్చు,
సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు!
21 “గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని
వాన చినుకులు గాని పడకుండుగాక!
ఆ పొలాలు బీడులైపోవుగాక!
యోధులైన వారి డాళ్లు అక్కడ మలినమైనాయి
అభిషిక్తుడైన సౌలు డాలు నూనెతో మెరుగు పెట్టబడలేదు.
22 యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారంచేసింది.
సౌలు కత్తి దానివంతు శత్రువులను తుత్తునియలు చేసింది
అవి శత్రురక్తాన్ని చిందించాయి యోధుల,
కొవ్వును స్పృశించాయి.
23 “సౌలును, యోనాతానును మేము ప్రేమించాము;
వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును అనుభవించాము!
మరణంలో సైతం సౌలు, యోనాతాను ఎడబాటు ఎరుగరు!
వారు పక్షి రాజుల కంటె వేగం గలవారు,
వారు సింహాల కంటె బలంగలవారు!
24 ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు కొరకు ఏడ్వండి!
సౌలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల దుస్తులతో అలంకరించియున్నాడు;
మీ దుస్తులపై బంగారు నగలు పెట్టాడు.
25 “యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు!
యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు.
26 యోనాతానూ, సహోదరుడా! నీ కొరకై విలపిస్తున్నాను.
నీ స్నేహపు మాధుర్యాన్ని చవిచూశాను;
నా పట్ల నీ ప్రేమ అద్భతం,
అది స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనది!
27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు!
వారి ఆయుధాలు నాశనమయ్యాయి.”
దావీదు తన మనుష్యులతో హెబ్రోనుకు వెళ్లటం
2 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు.
“వెళ్లు” అన్నాడు యెహోవా.
“ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే,
“హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.
2 కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి. 3 దావీదు తన మనుష్యులందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర ప్రాంతాలలో తమ నివాసాలను ఏర్పరచుకున్నారు.
4 యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.
5 యాబేష్గిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు ఈ విధంగా చెప్పారు: “మీ రాజైన సౌలు అస్థికలను[c] మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునాశీర్వదించు గాక! 6 దేవుడు ఇప్పుడు మీపట్ల దయగలవాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి వుంటాను. 7 మీ రాజైన సౌలు చనిపోయాడు. కనుక ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెలగండి.”
ఇష్బోషెతు రాజవటం
8 నేరు కుమారుడైన అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును మహనయీమునకు తీసుకొని వెళ్లాడు. 9 అక్కడ అబ్నేరు అతనిని గిలాదు, ఆషేరి, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను వారిమీద రాజుగా నియమించాడు. అనగా ఇష్బోషెతు ఇశ్రాయేలుకు రాజయ్యాడు.
10 ఇష్బోషెతు సౌలు కుమారుడు. అతడు ఇశ్రాయేలుకు రాజై పాలించేనాటికి నలుబది ఏండ్ల వయస్సువాడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని యూదా వంశంవారు దావీదును అనుసరించారు. 11 హెబ్రోనులో యూదా వంశవారికి దావీదు ఏడు సంవత్సరాల ఆరునెలలు రాజుగా ఉన్నాడు.
ఇష్బోషెతు, దావీదు రాజులుగా పోటి
12 నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్బోషెతు నౌకరులు మహనయీము వదిలి పయనమైపోయారు. వారు గిబియోను చేరారు. 13 సెరూయా కుమారుడుగు యోవాబు, దావీదు సేవకులు కూడా గిబియోనుకు వెళ్లారు. గిబియోను మడుగువద్ద వారు అబ్నేరును, ఇష్బోషెతు సేవకులను కలిసారు. అబ్నేరు తరపువారంతా కొలనుకు ఒక పక్క కూర్చున్నారు. యోవాబు పక్షం వారు మరొక ప్రక్క కూర్చున్నారు.
14 యోవాబుతో అబ్నేరు, “మన ఇరుపక్షాల యువకులనూ ప్రోత్సహించి వారి మధ్య బలప్రదర్శన ఇక్కడ జరుపుదాము” అన్నాడు.
పోటీ నిర్వహించటానికి యోవాబు ఒప్పుకున్నాడు.
15 అప్పుడు యువసైనికులు లేచారు. ఇరుపక్షాల వారూ వారి వారి యువసైనికులను పోటీకి లెక్కపెట్టారు. ఇష్బోషెతు పక్షాన బెన్యామీను వంశీయులు, దావీదు పక్షాన అతని అనుచరులు పన్నెండు మంది చొప్పున ఎంపిక చేయబడ్డారు. 16 ప్రతి ఒక్కడూ తన ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్కలలో పోడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున నేలకొరిగారు. అందువల్ల ఆ ప్రదేశం “చురకత్తుల క్షేత్రం”[d] అని పిలవబడింది. ఆ ప్రదేశం గిబియోనులో ఉంది. 17 ఆ రోజు పోటీ ఒక భయంకర పోరాటంగా మారింది. దావీదు సైనికులు అబ్నేరును, ఇశ్రాయేలీయులను ఓడించారు.
అబ్నేరు అశాహేలును చంపటం
18 యోవాబు, అబీషై, అశాహేలు అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశాహేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా వేగంగా పరుగు తీయగలవాడు. 19 అశాహేలు అబ్నేరును తరుముకుంటూ పోయాడు. అశాహేలు తిన్నగా అబ్నేరును అనుసరించి తరిమాడు. 20 అబ్నేరు వెనుదిరిగి చూసి, “నీవు అశాహేలువా?” అని అడిగాడు.
“అవును నేనే” అన్నాడు అశాహేలు.
21 “(అబ్నేరు అశాహేలును గాయ పరచేందుకు ఇష్టపడలేదు) అయితే నీవు కుడి పక్కకు గాని, ఎడమ పక్కకు తిరిగి అక్కడ వున్న యువకులలో ఒకడిని పట్టుకుని వాని కవచం నీ కొరకు తీసుకో” అన్నాడు అబ్నేరు. కాని అశాహేలు అబ్నేరును వెంటాడటం మానటానికి ఒప్పుకోలేదు.
22 అబ్నేరు మళ్లీ అశాహేలుతో ఇలా అన్నాడు: “నన్ను తరమటం ఆపివేయుము. నీవు ఆపకపోతే నేను నిన్ను చంపుతాను. నేను నిన్ను చంపిన పక్షంలో నీ సోదరుడైన యోవాబు ముఖం మళ్లీ నేను చూడ లేను!”
23 కాని అశాహేలు అబ్నేరును తరమటం మానలేదు. దానితో అబ్నేరు తన ఈటె వెనుక భాగంతో అశాహేలు పొట్టలో పొడిచాడు. ఈటె మడం ఎంత తీవ్రంగా దిగబడిందంటే అది పొట్టలో నుండి వీపు ద్వారా బయటికి వచ్చింది. అశాహేలు అక్కడికక్కడే మరణించాడు.
యోవాబు, అబీషైలు అబ్నేరును వెంటాడటం
అశాహేలు శవం నేలమీద పడివుంది. అతని మనుష్యులందరూ అక్కడికి వచ్చి ఆగారు. (అశాహేలును చూసేందుకు) 24 కాని యోవాబు, అబీషై[e] లిరువురూ అబ్నేరును వెంటాడసాగారు. వారు అమ్మా కొండ చేరేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. గిబియోను ఎడారిమార్గంలో గీహ ఎదురుగా అమ్మా కొండవుంది. 25 బెన్యామీనీయులంతా అబ్నేరు వద్దకు వచ్చి కొండ మీద కూడారు.
26 అబ్నేరు యోవాబును పిలిచి, “కత్తివుంటే అది ఎల్లప్పుడూ చంపటానికేనా? నీకు తెలుసు; నిజానికి ఇది విషాదాంతమవుతుంది! తమ సోదరులనే వెంటాడటం మానివేయమని ఆ మనుష్యులకు చెప్పు” అని అన్నాడు.
27 “నీవామాట అన్నావు, మంచిదే. దేవుని జీవంతోడుగా చెబుతున్నాను. నీవు ఇప్పుడు మాట్లాడకుండా వుండివుంటే ఈ జనం వారి సోదరులను తెల్లవారేవరకు తరుముకుంటూ పోయేవారు” అని యోవాబు అన్నాడు. 28 అప్పుడు యోవాబు ఒక బూర వూదాడు. దానితో అతని మనుష్యులు ఇశ్రాయేలీయులను తరమటం మానివేశారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని వారు ఎంతమాత్రం ప్రయత్నం చేయలేదు.
29 అబ్నేరు, అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబహు మైదానం గుండా ప్రయాణం చేసి యొర్దాను నదిని దాటారు. మరునాటి పగలంతా వారు ప్రయాణం చేసి మహనయీముకు చేరారు.
30 యోవాబు అబ్నేరును తరుముట మాని, తిరిగి వచ్చాడు, యోవాబు తన జనాన్ని సమావేశ పర్చినప్పుడు దావీదు అనుచరులలో పందొమ్మిది మంది తప్పియున్నారు. అశాహేలు కూడా లేడు. 31 అబ్నేరు అనుచరులలో మూడువందల అరువది మంది బెన్యామీనీయులను దావీదు సేవకులు వధించారు. 32 దావీదు మనుష్యులు అశాహేలు శవాన్ని బేత్లెహేముకు తీసుకొని వెళ్లి, అక్కడ ఉన్న అతని తండ్రి సమాధిలోనే పాతి పెట్టారు.
యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా పయనించారు. వారు హెబ్రోను చేరేసరికి సూర్యోదయమయ్యింది.
ఇశ్రాయేలు, యూదా మధ్య యుద్ధం
3 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి[f] మధ్య దీర్ఘకాలిక యుద్ధం కొనసాగింది. దావీదు రాను రాను బాగా బలపడ్డాడు. సౌలు కుటుంబం నానాటికీ బలహీనమయింది.
హెబ్రోనులో దావీదుకు ఆరుగురు కుమారులు కలగటం
2 హెబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది.
మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెజ్రె యేలీయురాలగు అహీనోయము.
3 రెండవ కుమారుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు.
మూడవ కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము తల్లి గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకా.
4 నాల్గవ కుమారుడు అదోనీయా. అదోనీయా తల్లి హగ్గీతు.
ఐదవ కుమారుడు షెఫట్య. షెఫట్య తల్లి అబీటలు.
5 ఆరవ కుమారుడు ఇత్రెయాము. ఇత్రెయాము తల్లి దావీదు భార్యయగు ఎగ్లా.
ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో దావీదుకు కలిగారు.
అబ్నేరు దావీదుతో చేరేందుకు నిశ్చయించటం
6 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిన కాలంలో అబ్నేరు సౌలు సైన్యంలో బలాన్ని పుంజుకున్నాడు. 7 సౌలుకు రిస్పా అనే ఒక దాసి వుండేది. ఆమె సౌలుకు ఇంచుమించు భార్యవలె వుండేది. రిస్పా అయ్యా అనువాని కుమార్తె. ఇష్బోషెతు ఒకనాడు అబ్నేరును పిలిచి, “నా తండ్రి పనిగత్తెతో నీవు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు?” అని అడిగాడు.
8 ఇష్బోషెతు అన్న మాటకు అబ్నేరుకు ఎక్కడా లేని కోపం వచ్చింది. అబ్నేరు ఇలా అన్నాడు, “నేను సౌలుకు, అతని కుటుంబానికి చాలా విధేయుడనై వున్నాను! నేను నిన్ను దావీదుకు అప్పగించలేదు; (పైగా అతడు నిన్ను ఓడించేలా చేయనూ లేదు.) యూదావారి తరపున పనిచేస్తూ ఒక రాజద్రోహిగా[g] నేను ఎన్నడూ మెలగలేదు. కాని నీవిప్పుడు నేనొక నీచకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు! 9-10 నేనిప్పుడు నిశ్చియంగా చెబుతున్నాను. దేవుడు చెప్పిన విషయాలు ఇప్పుడు జరిగేలా నేను తప్పక ప్రయత్నం చేస్తాను! సౌలు వంశంనుండి రాజ్యాన్ని తీసుకొని దావీదుకు ఇస్తానని యోహోవా చెప్పాడు. దావీదును యూదా రాజ్యానికి, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా చేస్తాడు. దాను నుండి బెయేర్షబా వరకు దావీదు పరిపాలిస్తాడు! ఈ పనులన్నీ నెరవేరేలా నేను సహాయ పడకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక!” 11 ఇష్బోషెతు అబ్నేరుతో ఇంకేమీ చెప్పలేక పోయాడు. ఇష్బోషెతు అతనంటే విపరీతంగా భయపడిపోయాడు.
12 అబ్నేరు దావీదు వద్దకు దూతలను పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను నీకు సహాయపడతాను.”
13 అందుకు దావీదు, “మంచిది! నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుంటాను. కాని నిన్నొకటి అడుగుతాను; నీవు సౌలు కుమార్తె మీకాలును తీసుకొని వచ్చేవరకు నేను నిన్ను కలవను” అని చెప్పమన్నాడు.
14 సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దావీదు దూతలను పంపాడు. “నా భార్య మీకాలును తిరిగి నాకు తెచ్చి ఇవ్వు. ఆమె నాకు ప్రధానం చేయబడింది. ఆమెను వివాహమాడటానికి నేను వందమంది ఫిలిష్తియులను చంపియున్నాను”[h] అని చెప్పి పంపాడు.
15 లాయీషు కుమారుడైన పల్తీయేలు అనే వాని నుండి మీకాలును తీసుకొని రమ్మని సౌలు కుమారుడు ఇష్బోషెతు తన మనుష్యులను పంపాడు. 16 మీకాలు భర్త పల్తీయేలు మీకాలుతో కూడా వచ్చాడు. మీకాలును అనుసరించి పల్తీయేలు బహూరీము వరకు ఏడుస్తూవచ్చాడు. కాని అబ్నేరు పల్తీయేలుతో, “ఇంటికి తిరిగి పొమ్మని” చెప్పాడు. అప్పుడు పల్తీయేలు ఇంటికి వెళ్లి పోయాడు.
17 అబ్నేరు ఇశ్రాయేలు నాయకులకు యిలా వర్తమానం పంపించాడు: “మీరు దావీదును మీ రాజుగా చేసుకోవాలని చాలా కాలంగా కోరుకుంటూ వున్నారు. 18 ఆ పని ఇప్పుడు చేయండి! ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలందరినీ ఫిలిష్తీయుల నుండి, వారి తదితర శత్రువుల నుండి రక్షిస్తాననీ; ఈ పని నా సేవకుడైన దావీదు ద్వారా నెరవేరుస్తాననీ’ యెహోవా పలికినప్పుడు ఆయన ఈ దావీదును గురించే చెప్పాడు.”
19 అబ్నేరు ఈ విషయాలన్నీ దావీదుతో హెబ్రోనులో చెప్పాడు. ఈ విషయాలు బెన్యామీనీయులందరికీ కూడ చెప్పాడు. అబ్నేరు చెప్పిన విషయాలు బెన్యామీను వంశంవారికీ, ఇశ్రాయేలీయుందరికీ మంచివిగా తోచాయి.
20 అప్పుడు అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చాడు. అబ్నేరు అతనితో ఇరువది మంది మనుష్యులను తీసుకొని వచ్చాడు. అబ్నేరుకు, అతనితో వచ్చిన మనుష్యులకు దావీదు విందు ఇచ్చాడు.
21 అబ్నేరు దావీదుతో ఇలా అన్నాడు, “ప్రభువైన నా రాజా! నేను ఇశ్రాయేలీయులందరినీ నీ వద్దకు తీసుకొని వస్తాను. అప్పుడు వారంతా నీతో ఒక ఒడంబడిక చేసుకొంటారు. తరువాత నీకు నచ్చిన విధంగా ఇశ్రాయేలును పరిపాలించవచ్చు!”
తరువాత దావీదు అబ్నేరును వెళ్లమని చెప్పగా, అబ్నేరు ప్రశాంతంగా వెళ్లిపోయాడు.
అబ్నేరు మరణం
22 యోవాబు, దావీదు అధికారులు యుద్ధం నుండి తిరిగి వచ్చారు. వారు శత్రువుల నుండి ఎన్నో విలువైన వస్తువులను కొల్లగొట్టుకొచ్చారు. దావీదు అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు. అందువల్ల హెబ్రోనులో దావీదు వద్ద అబ్నేరు లేడు. 23 యోవాబు, అతని సైనికులంతా హెబ్రోనుకు చేరారు. సైన్యం యోవాబుతో, “నేరు కుమారుడైన అబ్నేరు దావీదు రాజు వద్దకు రాగా, ఆయన అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు” అని అన్నది.
24 యోవాబు రాజు వద్దకు వచ్చి, “ఏమిటి నీవు చేసిన పని? అబ్నేరు నీ వద్దకు వస్తే, అతనికి ఏ హాని చేయకుండా ఎందుకు పంపించివేశావు! 25 నేరు కుమారుడైన అబ్నేరును నీవెరుగుదువు! అతడు నిన్ను మోసగించటానికి వచ్చాడు! నీవు చేస్తున్నదంతా సమగ్రంగా తెలుసుకోవాలనే తలంపుతో వచ్చాడు!” అని అన్నాడు.
26 యోవాబు దావీదు వద్ద నుండి వెళ్లి, సిరా అనుబావి వద్దకు అబ్నేరు కొరకు తన దూతలను పంపాడు. దూతలు అబ్నేరును వెనుకకు తీసుకొని వచ్చారు. కాని ఇదంతా దావీదుకు తెలియదు. 27 అబ్నేరు హెబ్రోనుకు రాగానే, యోవాబు అతనిని సింహద్వారం మధ్యలో ఏదో రహస్యంగా మాట్లాడాలని ఒక పక్కకు తీసుకొని వెళ్లాడు. కాని యోవాబు తన కత్తితో అబ్నేరు పొట్టలో పొడిచాడు. అబ్నేరు చనిపోయాడు. గతంలో యోవాబు సోదరుడైన అశాహేలును అబ్నేరు చంపాడు. కావున యోవాబు అబ్నేరును చంపివేశాడు.
దావీదు అబ్నేరు కొరకు దుఃఖించటం
28 తరువాత ఈ వార్త దావీదు విన్నాడు. దావీదు ఇలా అన్నాడు; “నేను, నా రాజ్యం నేరు కుమారుడైన అబ్నేరు హత్య విషయంలో నిర్దోషులం. యెహోవాకి ఇది తెలుసు. 29 యోవాబు, అతని కుటుంబం దీనంతటికీ బాధ్యులు. అతని కుటుంబమంతా నిందితులే. యోవాబు కుటుంబానికి అనేక కష్టాలు ఎదురవుతాయని నేను నమ్ముతున్నాను. అతని కుటుంబంలో ఎప్పుడూ ఎవరో ఒకరు కుష్టువ్యాధి పీడితుడో, అంగవైకల్యంతో కర్ర పట్టుకు నడిచే వాడో, యుద్ధంలో హతుడయ్యేవాడో, లేదా ఆహారము లేనివాడో వుంటాడని కూడ నేను నమ్ముతున్నాను.”
30 యోవాబు, అతని సోదరుడు అబీషైలిరువురూ అబ్నేరును చంపిన కారణమేమనగా అబ్నేరు వారి సహోదరుడైన అశాహేలును గిబియోను వద్ద యుద్ధంలో చంపాడు.
31-32 యోవాబుతోను, అతనితో ఉన్న మనుష్యులతోను దావీదు “తమ బట్టలను చింపుకొని,[i] విషాద సూచకంగా వేరే వస్త్రాలు వేసుకోమనీ, అబ్నేరు కొరకు విలపించుమనీ” చెప్పాడు. వారు అబ్నేరును హెబ్రోనులో సమాధి చేశారు. అంత్యక్రియలకు దావీదు హాజరయ్యాడు. దావీదు రాజు, ప్రజలు అబ్నేరు సమాధి వద్ద దుఃఖించారు.
33 దావీదు రాజు అబ్నేరుపై ఈ విషాద గీతిక పాడాడు:
“అబ్నేరు ఒక అవివేకిలా హతుడాయెనా?
34 అతని చేతులకు బంధాలులేవు,
పాదాలకు గొలుసులు వేయలేదు!
అయినా క్రూరుల ముందు నీవు నేలకొరిగావు. ఒరిగి మరణించావు.”
అప్పుడు ప్రజలంతా మళ్లీ అబ్నేరు కొరకు విలపించారు. 35 ఆ రోజు ఇంకా పొద్దువుండగానే దావీదును ఆహారం తీసుకోమని కోరటానికి ప్రజలు వచ్చారు. కాని దావీదు ఒక ప్రత్యేకమైన ప్రమాణం చేశాడు. “నేను రొట్టెగాని, తదితరమైన ఆహారంగాని సూర్యాస్తమయం గాకుండా తింటే దేవుడు నన్ను శిక్షించుగాక! నాకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టుగాక!” అని అన్నాడు. 36 అసలు అక్కడ ఏమి జరిగిందో ప్రజలంతా చూశారు, కనుక దావీదు రాజు చేసేవాటన్నిటినీ ప్రజలు ఒప్పుకున్నారు. 37 నేరు కుమారుడైన అబ్నేరును చంపినది దావీదు రాజు కాదని యూదా ప్రజలకీ, ఇశ్రాయేలీయులందరికీ ఆ రోజు అర్థమయ్యింది.
38 దావీదు రాజు తన సేవకులతో ఇలా అన్నాడు: “మీకు తెలుసు; ఇశ్రాయేలులో ఈ రోజు ఒక ప్రముఖ నాయకుడు చనిపోయాడు. 39 పైగా ఇదే రోజున నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఈ సెరూయా కుమారులు నాకు మిక్కిలి దుఃఖాన్ని కలుగజేశారు. యెహోవా వారికి అర్హమైన శిక్ష విధించుగాక!”
సౌలు కుటుంబానికి కష్టాలు రావటం
4 హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, అతని ప్రజలు చాలా గాభరా చెందారు. 2 సౌలు సైన్యంలో దళాధిపతులైన ఇరువురు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో ఒకని పేరు బయనా, మరియొకని పేరు రేకాబు. బయానా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు బెన్యామీను వంశానికి[j] చెందిన వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెందినది. 3 కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు.
4 సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారిక్రిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.
5 రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు. 6-7 రేకాబు, బయనా గోధుమలు తీసుకొని వెళ్లాలనే నెపంతో నట్టింట్లోకి వచ్చారు. ఇష్బోషెతు తన పడకగదిలో పక్కమీద పడుకున్నాడు. రేకాబు, బయనాలిద్దరూ ఇష్బోషెతును పొడిచి చంపారు. వారు అతని తల నరికి దానిని వారితో తీసుకొనిపోయారు. రాత్రంతా ప్రయాణం చేసి, 8 హెబ్రోనుకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదుకు ఇచ్చారు.
రేకాబు, బయనాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!”
9 రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు. 10 ఒకానొకడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. వాడు వచ్చి, ‘సౌలు చచ్చిపోయాడు!’ అని చెప్పాడు. ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితోషికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని సిక్లగు వద్ద చంపివేశాను. 11 కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్కమీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!”
12 దావీదు కొందరు యువకులను పిలిచి రేకాబు, బయనాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు రేకాబు, బయనాల కాళ్లు, చేతులు నరికి, హెబ్రోను మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధి వద్ద పాతి పెట్టారు.
© 1997 Bible League International