Chronological
దావీదు మరియు మూర్ఖుడైన నాబాలు
25 సమూయేలు చనిపోయాడు. సభచేరిన ఇశ్రాయేలీయులు సమూయేలు మృతికి తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. రామాలో వున్న ఇతని ఇంటివద్దనే సమూయేలు భౌతిక కాయాన్ని వారు సమాధి చేశారు.
అప్పుడు దావీదు పారాను అరణ్యానికి తరలిపోయాడు. 2 మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు. 3 అతని పేరు నాబాలు.[a] అతని భార్య పేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది, మంచి అందగత్తె, కానీ నాబాలు క్రూరుడు, నీచుడు, కాలేబు సంతతివాడు.
4 దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన గొర్రెలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు. 5 దావీదు పదిమంది యువకులను పిలిచి, “కర్మెలులో వున్న నాబాలు వద్దకు వెళ్లి అతనిని తన పక్షంగా పలుకరించమని” చెప్పాడు. 6 “నీవూ, నీ కుటుంబం బాగున్నారని ఆశిస్తున్నాను! నీకు ఉన్నదంతా క్షేమం అని కూడ నేను భావిస్తున్నాను, 7 నీవు నీ గొర్రెల నుండి ఉన్ని తీస్తున్నట్లు నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు కొద్ది రోజులు మా వద్ద ఉన్నారు. అప్పుడు వారికి మేము ఏ హానీ చేయలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలం మేము వారినుండి ఏమి తీసుకోలేదు. 8 నీవు వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. అందుచేత ఈ యువకుల పట్ల నీవు కనికరం చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. నీ స్నేహితుడనైన[b] దావీదు కోసం ఇది చేయి” అని చెప్పమన్నాడు దావీదు.
9 దావీదు మనుష్యులు నాబాలు దగ్గరకు వెళ్లారు. దావీదు సందేశాన్ని వారు నాబాలుకు అందజేశారు. 10 కాని నాబాలు చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన దావీదు సేవకులతో, “ఎవడీ దావీదు? ఎవడీ యెష్షయి కొడుకు? ఇటీవల చాలా మంది బానిసలు తమ యజమానులనుండి పారిపోతున్నారు! 11 నావద్ద రొట్టె, నీళ్లూ ఉన్నాయి. అవి, నావద్ద ఉన్న మాంసం, ఉన్ని తీసే నా సేవకులకు కావాలి. నాకు తెలియని వాళ్లెవరికీ నేను దాన్ని ఇవ్వను,” అని కసురుకున్నాడు నాబాలు.
12 నాబాలు అన్నదంతా దావీదు మనుష్యులు తిరిగి వెళ్లి దావీదుకు చెప్పారు. 13 ఇది విన్న దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు వందల మంది దావీదుతో వెళ్లారు. రెండువందల మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు.
అబీగయీలు ఆపదను తప్పించుట
14 నాబాలు నౌకర్లలో ఒకడు తన యజమాని భార్య అబీగయీలు వద్దకు వెళ్లి, “దావీదు అరణ్యం నుండి కొందరు దూతలను మా యజమాని నాబాలును పలకరించేందుకు పంపాడు. అయితే నాబాలు వారితో నీచంగా ప్రవర్తించాడు అని చెప్పాడు. 15 దావీదు మనుష్యులు మనపట్ల చాలా మర్యాదగా ఉన్నారు. మనకు ఏ అపకారమూ చేయలేదు. మేము గొర్రెలను పొలాలకు తోలుకు వెళ్లినప్పుడు వారు మాతోనే ఉన్నారు. వారు ఎప్పుడూ ఏమీ దొంగిలించలేదు. 16 రాత్రింబగళ్లు దావీదు మనుష్యులు మమ్మల్ని కాపాడారు. మేము గొర్రెలను మేపుతున్న రోజుల్లో వారు మాకు పెట్టని కోటలా ఉండి మమ్మల్ని కాపాడారు. 17 ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని చెప్పాడు.
18 అబీగయీలు వెంటనే రెండువందల రొట్టెలు, రెండు నిండు ద్రాక్షారసపు తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, సుమారు ఐదు మానికల వండిన ఆహారం, ఒక మూట ఎండు ద్రాక్ష, ఎండిన అంజూరపు పండ్ల అడలు రెండు వందలు, కొన్ని గాడిదల మీద ఎత్తించింది. 19 తరువాత అబీగయీలు తన నౌకర్లతో, “వాటిని తీసుకుని వెళ్లమని, వారి వెనుక తను బయలు దేరి వస్తానని చెప్పింది.” కానీ ఆమె ఇదంతా తన భర్తకు చెప్పలేదు.
20 అబీగయీలు తన గాడిద మీద ఎక్కి పర్వతం అవతలి వైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న దావీదును, అతని మనుష్యులను ఆమె కలుసుకున్నది.
21 అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయించాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు. 22 రేపటి ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా నన్ను శిక్షించును గాక!” అన్నాడు.
23 అయితే అబీగయీలు దావీదును చూడగానే వెంటనే గాడిద మీదనుంచి దిగి, దావీదుకు సాగిలపడి అభివందనం చేసింది. 24 అబీగయీలు దావీదు పాదాల మీద పడి, “అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి. నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నేనిందించు. 25 నీవు పంపిన మనుష్యుల్ని నేను చూడలేదు. ఈ పనికిమాలిన మనిషి నాబాలును నీవు లక్ష్యపెట్టకు. అతను తన పేరుకు తగినట్టే ఉన్నాడు. అతని పేరుకు ‘బుద్ధిహీనుడని’ అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు. 26 నిర్దోషులను చంపకుండా, యెహోవాయే నిన్ను దూరంగా ఉంచాడు. యెహోవా జీవిస్తున్నాడు నిజంగా, నీవు జీవిస్తున్నావు నిజంగా నీ శత్రువులంతా, మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలువలె అవుదురు గాక! 27 నీ కోసం నేను ఈ కానుకలు తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుష్యులకు ఈ కానుకలనివ్వు. 28 తప్పు చేసినందుకు నన్ను క్షమించు. యెహోవా నీ కుటుంబాన్ని బలపరచి నీ కుటుంబంలో అనేక మంది రాజులు పుట్టేలా చేస్తాడని నాకు తెలుసు. నీవు ఆయన తరపున యుద్ధాలు చేస్తున్నావు గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించియున్నంత కాలం ప్రజలకు నీలో ఏ తప్పూ కనబడదు. 29 ఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా, నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఒడిసెలలో పెట్టి విసరిన రాయిలా యెహోవా నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు. 30 నీకు అనేక మంచి వాటిని చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. కనుక యెహోవా వాటన్నింటినీ నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలుకు నాయకునిగా చేస్తాడు. 31 అప్పుడు నీవు ఈ బోనులోపడవు. దుర్మార్గాలు చేసిన దోషం నీకు ఉండదు. నిర్దోషులను చంపావనే దోషం నీ మీద ఉండదు. ఆ మహా గొప్ప విజయం నీకు యెహోవా చేకూర్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నది.
32 దావీదు అబీగయీలుకు సమాధానమిస్తూ, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. నన్ను కలుసుకునేందుకు దేవుడే నిన్ను పంపించాడు. 33 నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు. 34 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవు గనుక ఇంత త్వరగా ఈరోజు నన్ను కలుసుకొనేందుకు రాకపోతే రేపటి ఉదయం లోపల నాబాలు వంశంలో ఒక్క మగవాడు కూడా మిగిలే వాడు కాదు” అని చెప్పాడు దావీదు.
35 అప్పుడు దావీదు అబీగయీలు తెచ్చిన కానుకలు స్వీకరించి, “శాంతితో ఇంటికి వెళ్లు. నీ మాటలు నేను విన్నాను, నీవు కోరినట్టు నేను చేస్తాను” అని దావీదు ఆమెతో చెప్పాడు.
నాబాలు మరణము
36 అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు. 37 మరుసటి ఉదయం నాబాలు మామూలుగా ఉన్నాడు. కనుక అతని భార్య జరిగినదంతా అతనితో చెప్పింది. అది వినగానే అతనికి గుండెపోటు వచ్చి, రాయిలా బిగుసుకుపోయాడు. 38 ఆ తరువాత పదిరోజులకు నాబాలు చచ్చేటట్టుగా చేసాడు యెహోవా.
39 నాబాలు మరణ వార్త విన్న దావీదు, “యెహోవాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. నాబాలు తప్పు చేసాడు గనుక యెహోవా వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు.
అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం పంపాడు. ఆమె తనకు భార్య కావాలని దావీదు అడిగాడు. 40 దావీదు సేవకులు కర్మెలుకు వెళ్లి అబీగయీలును కలిసి, “దావీదు నిన్ను తీసుకుని రమ్మని మమ్ములను పంపించాడు. నీవు అతని భార్యవు కావాలని దావీదు కోరిక” అని చెప్పారు. 41 అబీగయీలు సాగిలపడి సమస్కరించి, “నేను మీ దాసిని. మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. నేను నా యజమానియైన దావీదు సేవకుల పాదప్రక్షాళనం[c] చేయటానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.
42 అబీగయీలు వెంటనే ఒక గాడిద మీద ఎక్కి, దావీదు పంపిన సేవకులతో కలిసి వెళ్లింది. ఆమెతో అయిదుగురు పనిగత్తెలను కూడ తీసుకుని వెళ్లింది. అబీగయీలు దావీదు భార్య అయింది. 43 యెజ్రెయేలీ వాసి అహీనోయమును కూడ దావీదు వివాహము చేసుకున్నాడు. అహీనోయము, అబీగయీలు ఇద్దరూ దావీదుకు భార్యలయ్యారు. 44 సౌలు కుమార్తె మీకాలు కూడ దావీదుకు భార్యయే గాని, సౌలు ఆమెను గల్లీముకు చెందిన లాయీషు అనే వాని కుమారుడు పల్తీయేలుకు ఇచ్చి మళ్లీ పెళ్లి చేశాడు.
దావీదు, అబీషై సౌలు గుడారంలోకి ప్రవేశించుట
26 జీపు ప్రజలు సౌలును చూడటానికి గిబియాకు వెళ్లారు. “హకీలా కొండల్లో దావీదు దాగి ఉంటున్నాడు. ఈ కొండ యెషీమోనుకు ఎదురుగా ఉంది” అని వారు సౌలుతో చెప్పారు.
2 జీపు అరణ్యంలోకి సౌలు వెళ్లాడు. ఇశ్రాయేలు అంతటిలో తాను ఎంపిక చేసుకొన్న మూడువేల మంది సైనికులను సౌలు తన వెంట తీసుకుని వెళ్లాడు. సౌలు, అతని మనుష్యులు దావీదును వెదుక్కుంటూ జీపు అరణ్యంలోకి వెళ్లారు. 3 సౌలు హకీలా కొండపై గుడారాలు సిద్ధపరచుకొనెను. యెషీమోనుకు ఎదురుగా బాటపక్కలో ఈ స్థలం వుంది.
దావీదు అరణ్యంలోనే వుండి, సౌలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు విన్నాడు. 4 దావీదు తన వేగుల వారిని పంపి, సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు. 5 సౌలు గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, అబ్నేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు చూశాడు. (నేరు కుమారుడు అబ్నేరు సౌలు సైన్యాలకు సేనాని.) గుడారం మధ్యలో సౌలు నిద్రిస్తూవున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది.
6 హిత్తీయుడైన అహీమెలెకుతోను, సెరూయా కుమారుడయిన అబీషైతోను దావీదు మాట్లాడి, “సౌలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” అడిగాడు.
(అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). “నీతో నేను వస్తా” అని అబీషై చెప్పాడు.
7 చీకటి పడ్డాక దావీదు, అబీషై కలిసి సౌలు మజిలీలోకి వెళ్లారు. సౌలు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి దిగవేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, ప్రక్కగా అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు. 8 “నీ శత్రువును ఓడించటానికి దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఒక్క వేటుతో, అతని ఈటెతోనే సౌలును భూమిలోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీషై దావీదుతో.
9 కానీ దావీదు అబీషైతో ఇలా అన్నాడు, “సౌలును చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు హాని చేసినవాడు శిక్షించబడాలి. 10 యెహోవా జీవిస్తున్నంత నిజంగా యెహోవా తానే సౌలును శిక్షిస్తాడు. ఒకవేళ సౌలు సహజంగానే చనిపోవచ్చు. లేదా యుద్ధంలో అతడు చంపబడవచ్చు. 11 కానీ యెహోవా చేత అభిషేకించబడిన రాజును నేను మాత్రం చంపకుండా ఉండేటట్టు చేయమని యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. కనుక సౌలు తలవద్ద ఉన్న ఈటెను, మంచినీటి కూజాను తీసుకోండి. మనము వెళ్లి పోదాము.”
12 కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి కూజాను తీసుకుని దావీదు, అబీషై సౌలు గుడారంనుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఒక్క మనిషికూడ కనీసం మేల్కోలేదు! యెహోవా సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో వారంతా అలా నిద్రపోయారు.
దావీదు మరల సౌలును అవమానించుట
13 దావీదు ఆవలివైపుకు వెళ్లిపోయాడు. సౌలు గుడారాలకు దూరంగా లోయ అవతల ఉన్న పర్వతం మీద దావీదు నిలబడ్డాడు. అంటే వీరిద్దరి గుడారాలు ఒకదాని కొకటి చాలా దూరంగా ఉన్నాయి. 14 నేరు కుమారుడైన అబ్నేరును, సైన్యాన్ని ఉద్దేశించి దావీదు కేకవేసి “అబ్నేరూ, నాకు జవాబు చెప్పు” అన్నాడు.
“రాజును పిలుస్తోన్న నీవు ఎవరివి?” అని అబ్నేరు అడిగాడు.
15 అందుకు దావీదు, “నీవు మగాడివి కదూ! నీవు ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యాజమానియైన రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారంలోనికి వచ్చాడు! 16 నీవు గొప్ప పొరపాటు చేసావు. యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవూ నీ సైనికులూ చావాలి. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడ్డ నా యజమానియైన రాజును కాపాడలేదు. నీవు సౌలు తలవద్ద వుంచబడిన ఈటె, నీళ్ల కూజా ఏమయ్యాయో చూడు. అవి ఏవి?” అని ఎదురు ప్రశ్నవేశాడు.
17 సౌలుకు దావీదు స్వరం తెలుసు. “నా కుమారుడా దావీదూ, అది నీ స్వరమే కదూ?” అన్నాడు సౌలు దావీదుతో.
“అవును నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే” అన్నాడు దావీదు. 18 దావీదు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, నీవు నన్నెందుకు ఇలా తరుముతున్నావు? నేను చేసిన నేరం ఏమిటి? దేని విషయంలో నేను దోషిని? 19 రాజా, నా యజమానీ, నా మాట విను! యెహోవా గనుక నీకు నాపై కోపం వచ్చినట్లు చేసి ఉంటె ఆయనకు బలి సమర్పణ చేద్దాము. కానీ మనుష్యుల ప్రేరణవల్ల నామీద నీకు కోపం వచ్చివుంటే యెహోవా వారిని కష్టనష్టాలకు గురిచేస్తాడు. యెహోవా నాకిచ్చిన భూమిని నేను వదిలిపోయేలా మనుష్యులు చేశారు. వెళ్లి ఇతర దేవుళ్లను కొలవమని, 20 పరదేశీయులతో ఉండమని మనుష్యులు నాకు చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురుగును చంపటానికి వెతుక్కుంటూ బయటకి వచ్చాడు! కొండల్లో కౌజు పిట్టను[d] వేటాడటానికి వచ్చినవానిలా ఉన్నావు నీవు!”
21 అప్పుడు సౌలు, “నేను పాపం చేసాను. నా కుమారుడా దావీదూ, నా దగ్గరకు తిరిగి వచ్చేయి. నా ప్రాణం నీకు ముఖ్యం అని ఈ రోజు నీవు నాకు చూపించావు. అందుచేత నేను నీకు హాని చేసేందుకు ప్రయత్నించను. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. నేను ఒక పెద్ద తప్పుచేశాను” అన్నాడు.
22 “ఇదిగో రాజు ఈటె. మీలో ఒక యువకుడు వచ్చి దీనిని తీసుకోవచ్చు. 23 మంచి చేసిన ప్రతి వానికీ యెహోవా ప్రతిఫలం ఇప్పిస్తాడు. కీడు చేసిన వానిని ఆయన శిక్షిస్తాడు. ఈ వేళ యెహోవా నేను నిన్ను ఓడించేటట్టు చేసాడు. అయినా యెహోవా చేత అభిషేకించబడిన రాజుకు నేను హాని చేయను. 24 నీ ప్రాణం నాకు ముఖ్యం అని ఈ వేళ నేను నీకు చూపించాను. యెహోవాకు నా ప్రాణం ముఖ్యం అని యెహోవా నీకు చూపిస్తాడు. ప్రతి కష్టంనుంచీ యెహోవా నన్ను రక్షిస్తాడు” అని చెప్పాడు దావీదు.
25 సౌలు, “నా కుమారుడా దావీదూ, దేవుడు నిన్నాశీర్వదించును గాక! నీవు చాలా ఉన్నతమైన కార్యాలు చేస్తావు. నీవు విజయం సాధిస్తావు” అని దావీదుతో చెప్పాడు.
దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు. సౌలు తన ఇంటికి తిరిగి వెళ్లాడు.
దావీదు తన మనుష్యులతో ఫిలిష్తీయుల రాజ్యానికి వెళ్లుట
27 తరువాత దావీదు, “ఏదో ఒకరోజు సౌలు నన్ను పట్టుకుంటాడు. ఈ పరిస్థితిలో నేను ఫిలిష్తీయుల రాజ్యానికి తప్పించుకోవటం ఒక్కటే ఉత్తమ మార్గం. అప్పుడు సౌలు నా కోసం ఇశ్రాయేలు రాజ్యంలో వెదకటం మానేస్తాడు. ఆ విధంగా నేను సౌలునుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
2 అందుచేత దావీదు, తన ఆరు వందలమంది అనుచరులతో ఇశ్రాయేలును వదిలి వెళ్లాడు. వారు మాయోకుమారుడైన ఆకీషు వద్దకు వెళ్లారు. ఆకీషు గాతుకు రాజు. 3 దావీదు, అతని మనుష్యులు వారి కుటుంబాలతో సహా ఆకీషు రాజుతో పాటు గాతులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలీ వాసి అహీనోయము, మరియు, కర్మెలు నివాసి, నాబాలు భార్య విధవరాలునైన అబీగయీలు అతనితో ఉన్నారు. 4 దావీదు గాతుకు పారిపోయాడని ప్రజలు సౌలుతో చెప్పగానే సౌలు అతని కొరకు వెదకటం మానేశాడు.
5 ఆకీషును దావీదు కలసి, “నా విషయమై నీవు సంతోషిస్తే బయట పట్టణంలో ఒక ఊరిలో స్థానమిస్తే అక్కడ ఉంటాను. నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే. రాజధానిలో నీతో నేను ఉండుటకంటె నేను అక్కడే ఉండటం మంచిది” అని చెప్పాడు.
6 సిక్లగు అనే ఊరిని అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున అప్పటి నుండి సిక్లగు యూదా రాజులకు చెందినదిగా ఉండిపోయింది. 7 ఫిలిష్తీయుల రాజ్యంలో దావీదు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
దావీదు ఆకీషు రాజును మోసగించుట
8 దావీదు, అతని మనుష్యులు కలిసి అమాలేకీయులతోనూ, గెషూరులో నివసిస్తున్న ప్రజలతోనూ యుద్ధానికి వెళ్లారు. దావీదు మనుష్యులు వారిని ఓడించి వారి ఆస్తులను దోచుకున్నారు. ఆ ప్రజలంతా షూరు పట్టణం దగ్గర తెలెమునుండి మొత్తం ఈజిప్టువరకు నివసిస్తూ ఉన్నారు. 9 ఆ ప్రాంతంలో దావీదు వారితో పోరాడి వారిని ఓడించాడు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఒంటెలను, దుస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటిని ఆకీషుకు ఇచ్చాడు.
10 దావీదు ఇలా చాలాసార్లు చేసాడు. ప్రతిసారీ దావీదు ఎక్కడ యుద్ధం చేసి, సంపద అంతా తెస్తున్నాడు అనే విషయం ఆకీషు అడిగేవాడు. “యూదాకు దక్షిణ ప్రాంతంలో యుద్ధం చేసాననీ యెరహ్మెయేలుకు దక్షిణ భాగాన పోరాడాననీ, కేనీయుల దేశానికి దక్షిణాన పోరాడాను” అనీ ప్రతిసారీ ఒక పేరు చెపుతూ ఉండేవాడు దావీదు. 11 బతికి వున్న ఒక స్త్రీని గాని, పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అనుకున్నాడు.”
ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అన్ని రోజులూ దావీదు ఇలాగే చేసాడు. 12 ఆకీషు మాత్రం దావీదును నమ్మటం మొదలు పెట్టాడు. “ఇప్పుడు దావీదు యొక్క స్వంత వాళ్లే అతనిని ద్వేషిస్తున్నారు. ఇశ్రాయేలీయులు దావీదును బాగా అసహ్యించుకుంటున్నారు. అందువల్ల దావీదు శాశ్వతంగా నాకు సేవచేస్తాడు” అని ఆకీషు తనలో తాను అనుకున్నాడు.
© 1997 Bible League International