Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 1-4

దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించేందుకు యెహోషువను ఎన్నుకొనటం

యెహోవా సేవకుడు మోషే. నూను కుమారుడైన యెహోషువ, మోషేకు సహాయకుడు. మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు: “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ఈ ప్రజలు వెళ్లి, యొర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి. ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను. హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే ఎడారి, లెబానోను మొదలుకొని మహానది (యూఫ్రటీసు) వరకునున్న దేశమంతా మీదే. మరియు ఇక్కడ నుండి పశ్చిమాన (అది సూర్యాస్తమయ దిశ) మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దు. నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను ఎడబాయను.

“యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ఈ ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది. అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది. ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు. నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే, నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.”

యెహోషువ తన కార్యాన్ని నిర్వహించటం

10 కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు: 11 “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యొర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.’”

12 తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగభాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యెహోషువ చెప్పాడు: 13 “యెహోవా సేవకుడు మోషే మీతో ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాంతి కోసం మీ దేవుడైన యెహోవా మీకు ఒక స్థలం ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యెహోవా మీకు యిస్తాడు. 14 ఇప్పుడు యొర్దాను నదికి తూర్పున ఉన్న ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివసించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా మీ సోదరులతో కలిసి యొర్దాను నది దాటాలి. మీరు యుద్ధానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సహాయపడాలి. 15 విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యొర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.”

16 అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, మేము అలా చేస్తాము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తాము. 17 మేము మోషేకు పూర్తిగా విధేయులం అయ్యాము. అలాగే, నీవు చెప్పే ప్రతిదానికీ మేము విధేయులవుతాము. ఒక్క విషయం మాత్రమే మేము యెహోవాను అడుగుతాము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకునూ తోడుగా ఉండాలని అడుగుతాము. 18 తర్వాత, ఎవరైనా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, లేక ఎవరైనా నీమీద తిరుగుబాటు చేసినా అలాంటివాడు చావాల్సిందే. బలంగా, ధైర్యంగా ఉండు!”

యెరికో పట్టణంలో గూఢచారులు

నూను కుమారుడైన యెహోషువ, ప్రజలంతా ఆకాషియా దగ్గర గుడారాలు వేసుకున్నారు. యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. వీళ్లను యెహోషువ పంపినట్టు మరెవ్వరికీ తెలియదు. “మీరు వెళ్లి ఆ దేశాన్ని చూడండి. ముఖ్యంగా యెరికో పట్టణాన్ని దగ్గరగా చూడండి” అని యెహోషువ ఆ మనుష్యులతో చెప్పాడు.

కనుక ఆ మనుష్యులు యెరికో పట్టణం వెళ్లారు. వాళ్లు ఒక వేశ్య ఇంటికి వెళ్లి, అక్కడ వుండిరి. ఆ స్త్రీ పేరు రాహాబు.

“మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు.

కనుక యెరికో రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చిదాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టకు. వాళ్లను బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు.”

ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు. సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.” అయితే నిజానికి వాళ్లను అటక[a] మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.

కనుక రాజుగారి మనుష్యులు ఇశ్రాయేలు వాళ్లిద్దరి కోసం వెదుక్కుంటూ వెళ్లిపోయారు. యొర్దాను నది రేవుల దగ్గరకు వారు వెళ్లారు. రాజుగారి మనుష్యులు పట్టణం నుండి బయటకు వెళ్లిన ఆ సమయంలోనే పట్టణ ద్వారాలు మూసివేయబడ్డాయి.

ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది. రాహాబు ఇలా అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే. 10 యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యొర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము. 11 ఆ సంగతులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు మా వాళ్లెవరికీ మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందుచేతనంటే పైన ఆకాశాన్ని క్రింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక. 12 ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి. 13 నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.”

14 ఆ మనుష్యలు ఒప్పుకున్నారు. “మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తున్న పని గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు చెప్పారు.

15 ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడమీద కట్టబడింది. అది గోడలో ఒక భాగంగా ఉంది. కనుక ఆమె ఒక తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ క్రిందికి దించింది. 16 అప్పుడు ఆమె వాళ్లతో ఇలా అంది: “పొరబాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడకుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.”

17 ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో ఇలా అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులం కాదు. 18 మేము తప్పించుకోనేందుకు నీవు ఈ ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి. 19 ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లెవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. 20 ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనైనా చెప్పావంటే మేము ఈ ఒడంబడికకు కట్టుబడి ఉండనక్కర్లేదు.”

21 “ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.

22 ఆ మనుష్యులు ఆమె ఇల్లు విడిచి, కొండల్లోకి వెళ్లిపోయారు. మూడు రోజులు వాళ్లు అక్కడే ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా వెదికారు. మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు. 23 అప్పుడు ఆ మనుష్యులు ఇద్దరూ యెహోషువ దగ్గరకు ప్రయాణం మొదలుబెట్టారు. వాళ్లు కొండలు విడిచి, నది దాటారు. నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వారు వెళ్లారు. వారు తెలుసుకొన్న సమాచారం అంతా వాళ్లు యెహోషువకు చెప్పారు. 24 వారు యెహోషువతో, “నిజంగా ఆ దేశం అంతా యెహోవా మనకు ఇచ్చాడు. ఆ దేశ ప్రజలందరికీ మనమంటే భయంగా ఉంది” అని చెప్పారు.

యొర్దాను నదిలో అద్భుత కార్యం

మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి, షిత్తీము విడిచి పెట్టారు. యొర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యొర్దాను నది దగ్గర గుడారాలు వేసారు. మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు. నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను[b] యాజకులు, లేవీయులు[c] మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి. కాని, మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1,000 గజాలు[d] వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు.

అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు.

తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసుకొనిపోయారు.

అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు. యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యొర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి.’”

అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి. 10 జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు. 11 ఇదే ఋజువు. మీరు యొర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది. 12 ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి. 13 సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యొర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యొర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్ట వేసినట్టు నిలిచిపోతాయి.”

14 యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యొర్దాను నది దాటడం ప్రారంభించారు. 15 (కోతకాలంలో యొర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు. 16 సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు. 17 ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యొర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.

ప్రజలకు జ్ఞాపకాన్నిచ్చే రాళ్లు

ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి. నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.”

కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. యెహోషువ వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి. ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు. యొర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”

కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యొర్దాను నది మధ్యలోనుండి పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయిఉంది. యెహోషువకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని ఉంచారు. (యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యొర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోటకూడ యెహోషువ పన్నెండు రాళ్లు ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.)

10 ప్రజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. 11 ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకొని వెళ్లారు.

12 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు, మిగిలిన ప్రజలకు సహాయం చేయటానికి వీరు వెళ్తున్నారు. 13 యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా ఎదుట సాగిపోయారు. యెరికో మైదానాల దిశగా వారు సాగిపోయారు.

14 ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువను ఒక మహామనిషిగా యెహోవా చేసాడు. అప్పట్నుంచి ప్రజలు యెహోషువను గౌరవించారు. మోషేను వారు గౌరవించినట్టే యెహోషువను కూడ వారు జీవితకాలమంతా గౌరవించారు.

15 ఆ పెట్టెను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో నిలబడి ఉండగానే, 16 “యాజకులను నదిలోనుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించు” అంటూ యెహోవా, యెహోషువతో చెప్పాడు.

17 కనుక యెహోషువ యాజకులకు, “యొర్దాను నదిలోనుండి బయటకు రండి” అని ఆజ్ఞాపించాడు.

18 యాజకులు యెహోషువకు విధేయులయ్యారు. వారు ఆ పెట్టెను మోసుకొని, నదిలో నుండి బయటకు వచ్చారు. యాజకుల పాదాలు, నది ఆవలి ఒడ్డున నేలను తాకగానే, నదిలో నీరు మరల ప్రవహించటం మొదలయింది. ప్రజలు నదిని దాటి వెళ్లక ముందులాగే నీరు గట్ల మీద పొర్లి పారుతున్నాయి.

19 మొదటి నెల పదో రోజున ప్రజలు యొర్దాను నది దాటారు. యెరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేసారు 20 యొర్దాను నదిలోనుంచి తీసుకొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలువ బెట్టాడు. 21 అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పాడు: “‘ఈ రాళ్లు ఏమిటి?’ అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు 22 ‘ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని ఆరిన నేలమీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్లు తోడ్పడుతాయి’ అని పిల్లలతో మీరు చెప్పాలి. 23 మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేసాడు. ప్రజలు దానిని దాటిపోయేంతవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలకు యెహోవా ఏమి చేసాడో, యొర్దాను నది దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి. 24 యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International