Chronological
బలులకు మంచి జంతువులనే ఉపయోగించాలి
17 “ఏదైనా దోషం ఉన్న ఆవునుగాని, గొర్రెనుగాని మీరు మీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించకూడదు. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యం.
విగ్రహాలను ఆరాధించినందుకు శిక్ష
2 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో ఒకదానిలో జరిగిన ఒక చెడు విషయాన్ని గూర్చి మీరు వినవచ్చును. మీలో ఒక పురుషడు లేక ఒక స్త్రీ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు మీరు వినవచ్చును. వారు యెహోవా ఒడంబడికను తప్పిపోయినట్టు 3 వారు ఇతర దేవుళ్లను పూజించినట్టు మీరు వినవచ్చును. లేదా వాళ్లు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పూజించినట్టు మీరు వినవచ్చును. అది యెహోవానైన నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధం. 4 ఇలాంటి దుర్వార్త మీరు వింటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులలో ఈ దారుణ సంఘటన నిజంగా జరిగింది వాస్తవమా అనేది మీరు తెలసుకోవాలి. అది వాస్తవమని మీకు ఋజువైతే 5 ఆ చెడు కార్యం చేసిన మనిషిని మీరు శిక్షించాలి. ఆ పురుషుని లేక స్త్రీని మీరు మీ పట్టణ ద్వారము దగ్గరకు తీసుకొనివెళ్లి రాళ్ళతో కొట్టి వారిని చంపాలి. 6 ఆయితే ఆ వ్యక్తి చెడుకార్యం చేసాడని ఒక్కరు మాత్రమే సాక్ష్యము చెబితే ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదు. ఆయితే అది సత్యం అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెబితే, అప్పుడు ఆ వ్యక్తిని చంపివేయాలి. 7 ఆ వ్యక్తిని చంపటానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్యనుండి ఆ చెడును నిర్మూలించాలి.
కష్టతరమైన న్యాయస్థానాల నిర్ణయాలు
8 “మీ న్యాయస్థానాలు తీర్పు చెప్పలేనంత కష్టతరమైన సమస్యలు కొన్ని ఉండవచ్చును. అది ఒక హత్యానేరం కావచ్చు లేక ఇద్దరి మధ్య వివాదం కావచ్చును. లేక యిద్దరి మధ్య ఘర్షణలో ఒకరికి హాని కలిగిన విషయం కావచ్చు. మీ పట్టణాల్లో ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చినప్పుడు, ఏది నిజం అనే విషయాన్ని మీ న్యాయమూర్తులు నిర్ధారణ చేయలేక పోవచ్చును. అప్పుడు మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలానికి మీరు వెళ్లాలి. 9 లేవీ వంశానికి చెందిన యాజకుల దగ్గరకు, అప్పటికి పదవిలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు మీరు వెళ్లాలి. ఆ సమస్యను గూర్చి ఏమి చేయాలో వారు నిర్ణయిస్తారు. 10 అక్కడ యెహోవా ప్రత్యేక స్థలంలో వారు వారి తీర్మానాన్ని మీకు తెలియజేస్తారు. మీరు చేయాలని వారు మీకు చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి. 11 మీరు వారి తీర్మానాన్ని అంగీకరించి, వారి హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయాలని వారు చెప్పేదానికి ఏదీ మీరు వ్యతిరేకంగా చేయకూడదు.
12 “ఆ సమయంలో అక్కడ మీ దేవుడైన యెహోవాను సేవిస్తున్న న్యాయమూర్తికి లేక యాజకునికి విధేయులయ్యేందుకు నిరాకరించిన వ్యక్తిని మీరు శిక్షించాలి. ఆ వ్యక్తి చావాల్సిందే. ఇశ్రాయేలులో ఈ చెడుగును మీరు అరికట్టాలి. 13 ఈ శిక్షనుగూర్చి ప్రజలంతా విని భయం తెచ్చుకొంటారు. వారు ఇకమీదట మొండిగా ఉండరు.
రాజును ఎన్నుకోవడం ఎలా?
14 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశాన్ని స్వాధినం చేసుకొని దానిలో మీరు నివసిస్తారు. అప్పుడు మీరు ‘మా చుట్టూ ఉన్న రాజ్యాలలాగే మాకూ ఒక రాజును మేము నియమించుకొంటాము’ అంటారు. 15 అలా జరిగినప్పుడు యెహోవా ఏర్పాటు చేసిన రాజునే మీరూ ఏర్పరచుకోవాలి. మీ మీద వుండే రాజు మీ ప్రజల్లో ఒకడై ఉండాలి. ఒక విదేశీయుణ్ణి మీరు రాజుగా చేయకూడదు. 16 రాజు తనకోసం మరీ ఎక్కువ గుర్రాలను సంపాదించుకోకూడదు. ఇంకా గుర్రాలు తీసుకొని వచ్చేందుకు అతడు ఈజిప్టుకు మనుష్యులను పంపకూడదు. ఎందుకంటే ‘మీరు ఎప్పుడూ తిరిగి ఆ మార్గాన వెళ్లకూడదు’అని యెహోవా మీతో చెప్పాడు గనుక. 17 మరియు రాజుకు ఎక్కువమంది భార్యలు ఉండకూడదు. ఎందుకంటే అది అతణ్ణి యెహోవానుండి మళ్లింపచేస్తుంది గనుక. మరియు రాజు వెండి బంగారాలతో తనను తాను ఐశ్వర్యవంతునిగా చేసుకోకూడదు.
18 “ఆ రాజు పరిపాలన ప్రారంభించినప్పుడు, ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల గ్రంథాలనుండి అతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి. 19 రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. అతడు తన జీవితం అంతా ఆ గ్రంథం చదవాలి. ఎందుకంటే అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదానికీ పూర్తి విధేయత చూపటం కూడ అతడు నేర్చుకొంటాడు. 20 అప్పుడు రాజు తన ప్రజలందరికంటే తానే గొప్పవాడ్ని అని తలంచడు. అతడు ధర్మశాస్త్రానికి దూరంగా తిరిగి పోకుండా, ఖచ్చితంగా దానిని పాటిస్తాడు. అప్పుడు ఆ రాజు, అతని సంతతివారు ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తారు.
యాజకులను, లేవీయులను బలపరచటం
18 “ఇశ్రాయేలు దేశంలో లేవీ వంశపువారికి భూమిలో ఎలాంటి వాటా దొరకదు. ఆ ప్రజలు యాజకుల సేవ చేస్తారు. నిప్పుమీద వంటచేసి, యెహోవాకు అర్పించబడిన బలులు తింటూ వారు బ్రదుకుతారు. లేవీ వంశపు ప్రజల వాటా అదే. 2 ఇతర వంశాల వారిలా ఆ లేవీ ప్రజలకు భూమిలో వాటా ఏమీ ఉండదు. యెహోవాయే లేవీయుల వాటా, యెహోవా ఇది వారికి వాగ్దానం చేసాడు.
3 “మీరు ఒక ఆవును, ఎద్దును, లేక గొర్రెను బలిగా చంపినప్పుడు, జబ్బ, రెండు దవడలు, పొట్ట మీరు యాజకులకు ఇవ్వాలి. 4 మీ మొదటి పంటలోనుండి మీ ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, నూనె మీరు యాజకులకు ఇవ్వాలి. మీ గొర్రెలనుండి కత్తిరించిన మొదటి ఉన్ని మీరు లేవీయులకు ఇవ్వాలి. 5 ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ వంశాలన్నింటినీ చూసి, శాశ్వతంగా తనకు యాజకులుగా ఉండేందుకు లేవీయుని, అతని సంతతివారిని ఏర్పరచుకొన్నాడు.
6 “ఇశ్రాయేలులోని ఏ పట్టణం నుండియైనా లేవీయుడు యెహోవా నియమించిన స్థలానికి తన ఇష్ట మున్నప్పుడెల్ల రావచ్చు. 7 అప్పుడు ఈ లేవీయుడు తన దేవుడైన యెహోవా పేరుమీద పరిచర్య చేయవచ్చు. అతడు విధి నిర్వహిస్తున్న తన సోదర లేవీయులందరిలాగే యెహోవా ప్రత్యేక ఆలయంలో పరిచర్య చేయాలి. 8 ఆ లేవీయుడికి సామాన్యంగా తన కుటుంబానికి వచ్చే వాటా కాకుండా, మిగిలిన లేవీయులతోను సమానంగా వాటా వస్తుంది.
ఇశ్రాయేలీయులు ఇతర జనాంగములను అనుసరించకూడదు
9 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే ఇతర రాజ్యాల ప్రజలు చేసే దారుణమైన పనులు చేయటం నేర్చు కోవద్దు. 10 మీ బలిసీఠాల అగ్నిమీద మీ కుమారులను గాని మీ కుమార్తెలను గాని బలి ఇవ్వవద్దు. జ్యోతిష్యం చెప్పేవానితోగాని, మాంత్రికుని దగ్గర గాని, భూతవైద్యుని దగ్గర గాని సోదెచెప్పేవారి దగ్గరగాని మాట్లాడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలిసికొనేందుకు ప్రయత్నించవద్దు. 11 ఎవరినీ యితరుల మీద మంత్ర ప్రభావంతో బంధించనీయవద్దు. మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా గాని, సోదె చెప్పే వాడుగాగాని, ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయినవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. 12 అలాంటివి చేసే వాళ్లంటే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. అందుకే ఆ ఇతర రాజ్యాల వాళ్లను మీ ఎదుట నుండి ఆయన వెళ్లగొట్టేస్తాడు. 13 మీ దేవుడైన యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి.
యెహోవాయొక్క ప్రత్యేక ప్రవక్త
14 “మీరు ఆ ఇతర జనాంగాలను మీ దేశంలోనుండి వెళ్లగొట్టాలి. ఆ జనాంగాలు సోదెగాండ్ర మరియు శకునాలు చెప్పువారి మాంత్రికుల మాటలు వింటారు. అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలాంటి పనులు చేయనియ్యడు. 15 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరకు ఒక ప్రవక్తను[a] పంపిస్తాడు. ఈ ప్రవక్త మీ స్వంత ప్రజల్లోనుండి వస్తాడు. అతడు నాలాగే ఉంటాడు. మీరు ఈ ప్రవక్త మాట వినాలి. 16 దేవుడే మీకు ఈ ప్రవక్తను పంపిస్తాడు, ఎందుకంటే మీరు ఆయనను అడిగింది అదే. మీరు హోరేబు (సీనాయి) కొండ దగ్గర సమావేశమైనప్పుడు దేవుని స్వరం విని, కొండమీద మహా అగ్నిని చూచి మీరు భయపడ్డారు. అందుచేత ‘మా దేవుడైన యెహోవా స్వరం మరోసారి మమ్మల్ని విననీయవద్దు. ఆ మహా గొప్ప అగ్నిని మాకు కనబడనీయవద్దు, మేము చస్తాము’ అని మీరు అన్నారు.
17 “యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘వారు అడుగుతోంది మంచిదే. 18 నీవంటి ఒక ప్రవక్తను నేను వారికోసం పంపిస్తాను. ఈ ప్రవక్త వారి స్వంత ప్రజల్లో ఒకడే. అతడు చెప్పాల్సిన విషయాలను నేను అతనికి చెబుతాను. నేను ఆజ్ఞాపించేవి అన్నీ అతడు ప్రజలకు చెబుతాడు. 19 ఈ ప్రవక్త నా పక్షంగా మాట్లాడతాడు అతడు నా పక్షంగా మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే నా ఆజ్ఞలు వినటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తిని నేను శిక్షిస్తాను.’
బూటకపు ప్రవక్తలను తెలుసుకోవటం ఎలా?
20 “అయితే ఒక ప్రవక్త చెప్పాల్సిందిగా నేను చెప్పని దానిని చెప్పవచ్చు. అతడు నా పక్షంగా మాట్లాడుతున్నానని ప్రజలతో చప్పవచ్చును. ఇలా జరిగితే ఆ ప్రవక్త చంపబడాల్సిందే. లేక ఇతర దేవుళ్ల పక్షంగా ఒక ప్రవక్త మాట్లాడవచ్చు. ఆ ప్రవక్త కూడా చంపబడాల్సిందే. 21 ‘ప్రవక్త చెబుతోన్న విషయం యెహోవా చెప్పింది కాదు అని మనం ఎలా తెలుసు కోగలము’ అని మీరు తలుస్తూ ఉండవచ్చు. 22 ప్రవక్త యెహోవా పక్షంగా మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు, ఆ విషయం జరగకపోతే, అది యెహోవా చెప్పింది కాదు అని అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ ప్రవక్త తన స్వంత ఆలోచనలనే చెబుతున్నాడని మీకు తెలుస్తుంది. అతని గూర్చి మీరు భయపడాల్సిన పనిలేదు.
భద్రతా పట్టణాలు
19 “ఇతర రాజ్యాలకు చెందిన దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆ రాజ్యాలను యెహోవా నాశనం చేస్తాడు. ఆ ప్రజలు నివసించిన చోట మీరు నివపిస్తారు. వారి పట్టణాలు, ఇండ్లు మీరు స్వాధీనం చేసుకొంటారు. అది జరిగినప్పుడు, 2-3 దేశాన్ని మీరు మూడు భాగాలు చేయాలి. తర్వాత ఒక్కో ప్రాంతంలో ఉండే ప్రజలందరకి దగ్గరగా ఉండేటట్టు ఆ భాగంలో ఒక పట్టణాన్ని మీరు ఏర్పరచుకోవాలి. ఆ పట్టణాలకు మీరు త్రోవలు వేయాలి. ఒక వ్యక్తిని చంపిన ఏ వ్యక్తిగాని అక్కడికి పారిపోవచ్చును.
4 “ఎవరినైనా చంపేసి భద్రతకోసం ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయే మనిషికి నియమాలు ఇవి, అతడు ప్రమాదవశాత్తు మరొకరిని చంపినవాడై ఉండాలి. అతడు తాను చంపిన వ్యక్తిని ద్వేషించిన వాడు కాకూడదు. 5 ఒక ఉదాహరణ: ఒక మనిషి మరొక వ్యక్తితో కలసి కట్టెలు కొట్టుకొనేందుకు అడవికి వెళ్లవచ్చును. ఒక చెట్టును నరకడానికి అతడు తన గొడ్డలిని విసురుతాడు కాని ఆ గొడ్డలి దాని పిడినుండి ఊడి పోతుంది. ఆ గొడ్డలి ఊడి వెళ్లి అవతల మనిషికి తగుల్తుంది, అతడు చనిపోతాడు. అప్పుడు ఆ గొడ్డలి విసరిన మనిషి ఆ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి భద్రంగా ఉండవచ్చును. 6 అయితే ఆ పట్టణం చాలా దూరంగా ఉంటే అతడు కావాల్సినంత వేగంగా పరుగెత్తలేక పోవచ్చును. అతను చంపిన మనిషి బంధువు ఎవరైన అతణ్ణి తరిమి, అతడు ఆ పట్టణం చేరక ముందే పట్టుకోవచ్చును. ఆ దగ్గర బంధువు చాలా కోపంతో అతణ్ణి చంపివేయ వచ్చును. కానీ ఆ మనిషి మరణ పాత్రుడుకాడు. అతడు చంపినవాణ్ణి అతడు ద్వేషించలేదు. 7 కనుక ఈ పనికోసం మూడు పట్టణాలను నిర్ణయించు కోవాల్సిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
8 “మీ దేవుడైన యెహోవా మీ దేశాన్ని విస్తరింపచేస్తానని మీ తండ్రులకు వాగ్దానం చేసాడు. మీ పూర్వీకులకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశం ఆయన మీకు ఇస్తాడు. 9 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలకు మీరు పూర్తిగా విధేయులై, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి, ఎల్లప్పుడూ ఆయన మార్గాలలో జీవిస్తే, ఆయన దీనిని చేస్తాడు. తర్వాత యెహోవా మీ దేశాన్ని విస్తృతపరచినప్పుడు భద్రత కోసం యింకా మూడు పట్టణాలను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అవి మొదటి మూడు పట్టణాలకు చేర్చ బడాలి. 10 అప్పుడు మీ స్వంతంగా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అమాయక ప్రజలు చంపబడరు. మరియు ఏ మరణం విషయంలోనూ మీరు దోషులుగా ఉండరు.
11 “అయితే ఒకడు మరొకడ్ని ద్వేషించాడను కోండి. అతడు దాగుకొని, తాను ద్వేషించే మనిషిని చంపేందుకు వేచి ఉంటాడు. అతడు ఆ వ్యక్తిని చంపేసి భద్రతకోసం ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోతాడు. 12 అలా జరిగితే అతని స్వగ్రామంలోని పెద్దలు ఎవరినైనా పంపి అతణ్ణి పట్టుకొని ఆశ్రయపురంనుండి తీసుకొని వెళ్లిపోవాలి. అతణ్ణి శిక్షించాల్సిన బాధ్యత గల బంధువులకు ఆ పెద్దలు అప్పగించాలి. ఆ హంతకుడు మరణించాలి. 13 అతని కోసం మీరు విచారించకూడదు. నిర్దోషులను చంపిన పాపంనుండి ఇశ్రాయేలీయులను మీరు తప్పించాలి. అప్పుడు మీకు అంతా మేలు అవుతుంది.
ఆస్తుల సరిహద్దులు
14 “నీవు నీ పొరుగువాని సరిహద్దు రాళ్లు తీసివేయకూడదు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో పూర్వీకులు ఈ సరిహద్దు రాళ్లను పెట్టారు.
సాక్ష్యాలు
15 “ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్టు నేరారోపణ ఉంటే, ఆ వ్యక్తి దోషి అని నిర్దారణ చేయటానికి ఒక్క సాక్ష్యం చాలదు. ఆ వ్యక్తి నిజంగా తప్పు చేసాడని నిరూపించటానికి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అవసరం.
16 “ఒక సాక్షి మరో వ్యక్తి తప్పు చేసాడని, అతని మీద అబద్ధం చెప్పి, అతనికి హాని చేయాలని చూడవచ్చును. 17 అప్పుడు ఒకరితో ఒకరు వాదించుకొంటున్న ఆ ఇద్దరు వ్యక్తులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి వెళ్లి, అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, న్యాయమూర్తులచే తీర్పు పొందాలి. 18 న్యాయ మూర్తులు జాగ్రత్తగా ప్రశ్నలు వేయాలి. సాక్షి అవతలి వ్యక్తిమీద అబద్ధాలు చెప్పినట్టు వారు తెలుసుకోవచ్చు. ఒకవేళ సాక్షి అబద్ధం చెప్పి ఉంటే 19 మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. ఈ విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి. 20 మిగిలిన ప్రజలంతా ఇది విని భయపడతారు. మళ్లీ అలాంటి చెడు కార్యం ఇంకెవ్వరూ ఎన్నడూ చేయరు.
21 “తప్పు చేసిన వాడ్ని మీరు శిక్షించినప్పుడు మీరు విచారించకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు తీసివేయాలి. (నేరస్థునికి శిక్ష విధించినట్టుగానే).
యుద్ధ నియమాలు
20 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు, మీకంటె ఎక్కువ గుర్రాలు, రథాలు, మనుష్యులు కనబడితే మీరు వారిని గూర్చి భయపడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొని వచ్చాడు.
2 “యుద్ధానికి మీరు దగ్గరగా వెళ్లినప్పుడు యాజకుడు సైనికుల దగ్గరకు వెళ్లి, వారితో మాట్లాడాలి. 3 యాజకుడు ఇలా చెప్పాలి, ‘ఇశ్రాయేలు మనుష్యులారా నా మాట వినండి. ఈవేళ మీరు మీ శ్రతువులతో యుద్ధానికి వెళ్తున్నారు. మీ ధైర్యం విడువవద్దు. కలవరపడవద్దు. శత్రువునుగూర్చి భయపడవద్దు. 4 ఎందుకంటే మీ పక్షంగా మీ శత్రువులతో పోరాడేందుకు మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీరు విజయం పొందేటట్లు సహాయం చేస్తాడు.’
5 “లేవీ అధికారులు సైనికులతో ఇలా చెప్పాలి: ‘కొత్త ఇల్లు కట్టుకొని దానిని ఇంకా ప్రతిష్ఠించనివారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటివాడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలి. అతడు యుద్ధంలో చంపబడతాడేమో. అలాంటప్పుడు మరో మనిషి అతని ఇంటిని ప్రతిష్ఠిస్తాడు. 6 ద్రాక్షాతోటను నాటి, ఇంకా ద్రాక్షాపండ్లు కూర్చుకొననివాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. ఆ మనిషి యుద్ధంలో మరణిస్తే, అప్పుడు అతని పొలంలోని ఫలాలను మరొకడు అనుభవిస్తాడు. 7 వివాహం కోసం ప్రధానం జరిగినవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. యుద్ధంలో అతడు మరణిస్తే, అతనికి ప్రధానం చేయబడిన స్త్రీని మరొకడు వివాహం చేసుకొంటాడు.’
8 “ఆ లేవీ అధికారులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ధైర్యం పోయి, భయపడ్తున్నవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అతడు తిరిగి ఇంటికి వెళ్లాలి. అప్పుడు అతడు మిగిలిన సైనికులుకూడా ధైర్యం కోల్పోయేటట్టు చేయకుండా ఉంటాడు.’ 9 తర్వాత అధికారులు సైన్యంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత, సైన్యాన్ని నడిపించేందుకు సేనాధిపతులను వారు నియమించాలి.
10 “మీరు ఒక పట్టణం మీద దాడి చేయక ముందు అక్కడి ప్రజలకు మీరు శాంతి రాయబారం పంపించాలి. 11 మీ రాయబారాన్ని వారు అంగీకరించి, వారి గుమ్మాలు తెరచినట్లయితే ఆ పట్టణంలోని ప్రజలంతా మీకు కప్పం కట్టేవాళ్లవుతారు. మీకు బానిసలై మీకు పని చేయవలసివస్తారు. 12 అయితే ఆ పట్టణం మీతో సమాధానపడేందుకు నిరాకరించి మీతో పోరాడితే అప్పుడు మీరు ఆ పట్టణాన్ని చుట్టుముట్టాలి. 13 మరియు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆ పట్టణం స్వాధీనం చేసుకోనిచ్చినప్పుడు, మీరు దానిలోని పురుషులందరినీ చంపివేయాలి. 14 ఆయితే ఆ పట్టణంలోని స్త్రీలను, పిల్లలను, పశువులను, మిగిలిన సమస్తం మీరు తీసుకోవచ్చును. మీ దేవుడైన యెహోవా వీటిని మీకు ఇచ్చాడు. 15 మీరు నివసించబోయే దేశంలోగాక, మీకు దూరంగా ఉన్న పట్టణాలన్నింటికీ మీరు అలాగే చేయాలి.
16 “ఆయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని పట్టణాలను మీరు స్వాధీనం చేసుకొన్నప్పుడు ప్రతి ఒక్కరినీ మీరు చంపేయాలి. 17 హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, మొత్తం ప్రజలందరినీ పూర్తిగా మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించాడు. 18 ఎందుకంటే అలా చేస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయమని వారు మీకు నేర్పించజాలరు. వారు వారి దేవుళ్లను పూజించేటప్పుడు చేసే భయంకర పనులు ఏవీ వారు మీకు నేర్పించరు.
19 “మీరు ఒక పట్టణం మీద యుద్ధం చేస్తుంటే, చాలా కాలంవరకు మీరు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేసి ఉండవచ్చు. ఆ పట్టణం చుట్టూ ఉండే ఫలవృక్షాలను మీరు నరికి వేయకూడదు. ఆ చెట్ల ఫలాలు మీరు తినవచ్చును గాని ఆ చెట్లను నరికి వేయకూడదు. ఈ చెట్లు మీ శత్రువులు కాదు, అందుచేత వాటితో యుద్ధం చేయవద్దు. 20 ఆయితే ఫలాలు ఇవ్వని చెట్లు అని మీకు తెలిసిన వాటిని మీరు నరికివేయ వచ్చును. ఆ పట్టణం మీద యుద్ధం చేయటానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసేందుకు ఈ చెట్లను మీరు ఉపయోగించ వచ్చును. ఆ పట్టణం పతనం ఆయ్యేంత వరకు మీరు వాటిని ఉపయోగించవచ్చును.
© 1997 Bible League International