Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 14-16

ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు

14 “మీరు మీ దేవుడైన యెహోవా పిల్లలు. ఎవరైనా చనిపోయినప్పుడు మీ విచారం వ్యక్తం చేయటానికి మిమ్మల్ని మీరు కోసుకోకూడదు. మీ తలలు గుండు గీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇతరులకు వ్యత్యాసంగా ఉన్నారు. మీరు యెహోవాకు ప్రత్యేకమైన ప్రజలు. ప్రపంచంలోని ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొన్నాడు.

ఇశ్రాయేలీయులకు అనుమతించబడిన భోజనం

“తినకూడని చెడ్డది అని యెహోవా చెప్పినది ఏదీ తినవద్దు. మీరు ఈ జంతువులను తినవచ్చును: ఆవులు, గొర్రెలు, మేకలు, జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి గొర్రెలు, అడవి మేకలు, లేడి. కొండ గొర్రెలు. గిట్టలు రెండుగా చీలి ఉండి, నెమరు వేసే ఏ జంతువునైనామీరు తినచ్చును. కానీ ఒంటెలను, కుందేళ్లను, పాట్టి కుందేళ్లను తినవద్దు. ఈ జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. కనుక ఈ జంతువులు మీకు పవిత్ర ఆహారం కాదు. మరియు మీరు పందుల్ని తినకూడదు. వాటి గిట్టలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అందుచేత పందులు మీకు పవిత్ర ఆహారం కాదు. పందిమాంసం ఏమీ తినవద్దు, చచ్చిన పందిని ముట్టుకోవద్దు.

“రెక్కలు, పొలుసులు ఉన్న ఎలాంటి చేపనైనా తినవచ్చు. 10 కానీ రెక్కలు పొలుసులు లేకుండా నీళ్లలో జీవించే దేనినీ మీరు తినవద్దు. అది మీకు పవిత్ర ఆహారం కాదు.

11 “పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును. 12-18 ఆయితే మీరు తినకూడని పక్షులు ఏవంటే: పక్షిరాజు, ఏ రకమైన రాబందు, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, కాకులు, నిప్పుకోళ్లు, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, ఏ విధమైన గుడ్లగూబ, హంస, గూడ బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకు బాతు, సారస పక్షి, సంకుబుడి కొంగ, ఏ విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.

19 “రెక్కలుగల అపవిత్ర పురుగులను దేనినీ తినవద్దు. 20 అయితే పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును.

21 “దానంతట అదే చచ్చిన ఏ జంతువునూ తినవద్దు. చచ్చిన జంతువును మీ ఊళ్లో ఉన్న విదేశీయునికి మీరు ఇవ్వవచ్చు, అతడు దాన్ని తినవచ్చు. లేక చచ్చిన జంతువును విదేశీయునికి మీరు అమ్మవచ్చు. కానీ మీ మట్టుకు మీరు చచ్చిన జంతువును తినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు చెందిన వారు గనుక. మీరు ఆయనకు ప్రత్యేక ప్రజలు.

“గొర్రెపిల్లను దాని తల్లి పాలతో వండవద్దు.

పదోవంతు ఇవ్వటం

22 “ప్రతి సంవత్సరం మీ పొలాలలో పండే పంటల్లో పదవ వంతు మీరు జాగ్రత్తగా దాచిపెట్టాలి. 23 తర్వాత యెహోవా తనకు ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొన్న స్థలానికి మీరు వెళ్లాలి. అక్కడ మీ పంటల్లో పదోవంతు, మీ ధాన్యంలో పదోవంతు, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె, మీ పశువుల మందలో, గొర్రెల మందలో, మొట్టమొదట పుట్టిన వాటిని మీ దేవుడైన యెహోవాతో కలిసి మీరు తినాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాను మీరు ఎల్లప్పుడూ గౌరవించటం జ్ఞాపకం ఉంచుకొంటారు. 24 అయితే మీరు ప్రయాణం చేయటానికి ఆ స్థలం మీకు చాలా దూరం కావచ్చును. ఒకవేళ మీకు యెహోవా అనుగ్రహించిన పంటలన్నింటిలోని దశమ భాగాలు మీరు మోసుకొని పోలేకపోవచ్చును. ఆలాగనుక జరిగితే యిలా చేయండి: 25 మీ పంటలోని ఆ భాగం అమ్మివేయండి. ఆ ధనం మీతోకూడ తీసుకొని, యెహోవా నిర్ణయించిన ఆ ప్రత్యేక స్థలానికి వెళ్లండి. 26 మీకు యిష్టం వచ్చింది ఏదైనా– ఆవులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం లేక మీరు కోరినది ఏ భోజనంగాని యింకేదైనాసరే కొనేందుకు ఆ ధనం వినియోగించండి. తర్వాత మీరు, మీ కుటుంబం మీ దేవుడైన యెహోవాతో కలిసి ఆ స్థలంలో భోజనంచేసి ఆనందించండి. 27 అయితే మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే మీవలే వారికి భూమిలో భాగం లేదు.

28 “ప్రతి మూడేళ్ల చివరలో, మీ దశమ భాగాలన్నీ ఆ సంవత్సరానికి మీరు తీసుకొని రావాలి. మీ పట్టణంలో ఇతరులు దీనిని వినియోగించుకోగలిగిన ఒక స్థలంలో ఈ ఆహారాన్ని ఉంచాలి. 29 లేవీయులకు వారి స్వంత భూమి లేదు గనుక ఈ ఆహారం వారికోసం ఉంటుంది. మీ పట్టణంలో భోజనం లేని వారికి, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు కూడా ఈ భోజనం ఉంటుంది. ఇలా గనుక మీరు చేస్తే మీరు చేసే ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

అప్పులు రద్దు చేసే ప్రత్యేక సంవత్సరం

15 “ప్రతి ఏడు సంవత్సరాల అంతంలో, మీరు అప్పులన్నీ రద్దుచేయాలి. మీరు మీ అప్పులను రద్దు చేయాల్సిన పద్ధతి యిది; మరో ఇశ్రాయేలు మనిషికి అప్పు యిచ్చిన ప్రతి ఇశ్రాయేలు వ్యక్తీ తన అప్పును రద్దుచేయాలి. ఆతడు ఒక సోదరుణ్ణి (ఇశ్రాయేలీయుని) అప్పు తిరిగి చెల్లించమని అడగ కూడదు. ఎందుకంటే ఆ సంవత్సంరలో అప్పులన్నీ రద్దు అయిపొయాయని యెహోవా ప్రకటించాడు గనుక. ఒక విదేశీయుడ్ని మీరు తిరిగి చెల్లించమని అడగవచ్చు. కానీ మరో ఇశ్రాయేలు మనిషి చెల్లించాల్సిన ఏ బాకీనైనా మీరు రద్దుచేయాలి. ఆయితే మీ మధ్య బీద ప్రజలు ఎవరూ ఉండరు. ఎందుకంటే మీరు నివసించుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు పూర్తిగా విధేయులైతేనే ఇది జరుగుతుంది. ఈ వేళ నేను మీకు చెప్పిన ప్రతి ఆజ్ఞకూ మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి. మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరియు మీరు అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీకు ఉంటుంది. కాని మీరు మాత్రం ఇతరుల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు అనేక రాజ్యలను పాలిస్తారు. కానీ ఆ రాజ్యాల్లో ఏదీ మిమ్మల్ని పాలించదు.

“మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు నివసించేటప్పుడు మీ ప్రజల మధ్య ఎవరైనా పేదవారు ఒకరు ఉండవచ్చును. మీరు స్వార్థపరులుగా ఉండకూడదు. ఆ పేద మనిషికి సహాయం చేసేందుకు మీరు నిరాకరించకూడదు. మీరు అతనికి భాగం పంచిపెట్టేందుకు యిష్టపడాలి. ఆ వ్యక్తికి అవసరమైనవి అన్నీ అతనికి అప్పుగా ఇచ్చేందుకు మీరు ఇష్టపడాలి.

“ఏడవ సంవత్సరం అంటే అప్పులు రద్దుచేసే సంవత్సరం దగ్గర్లో ఉందని చెప్పి ఎవరికైనా అప్పు ఇచ్చేందుకు ఎన్నడూ తిరస్కరించవద్దు. అలాంటి చెడుతలంపు మీ మనసులో కలుగనియ్యవద్దు. సహాయం కావాల్సిన ఆ వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడూ చెడుగా తలంచవద్దు. నీవు అతనికి సహాయం చేసేందుకు నిరాకరించకూడదు. ఆ పేదవానికి నీవు ఏమీ ఇవ్వకపోతే అతడు నీ మీద యెహోవాకు ఆరోపణ చేస్తాడు. మరియు యెహోవా నిన్ను పాపం చేసిన నేరస్థునిగా చూస్తాడు.

10 “పేదవానికి నీవు ఇవ్వగలిగినదంతా ఇవ్వు. అతనికి యిచ్చే విషయంలో చెడుగా భావించకు. ఎందుకంటే ఈ మంచి పని చేసినందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కార్యాలన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ, నిన్ను ఆశీర్వాదిస్తాడు. 11 దేశంలో పేద ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే మీ ప్రజలకు మీ దేశంలో అక్కరలో ఉండే పేద ప్రజలకు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు ఆజ్ఞ యిస్తున్నాను.

బానిసలను స్వేచ్ఛగా పోనివ్వటం

12 “మీ ప్రజల్లో ఒకరు – ఒక హెబ్రీ పురుషుడు లేక స్త్రీ మీకు అమ్మబడితే అప్పుడు ఆ వ్యక్తి ఆరు సంవత్సరాలు మీకు సేవ చేయాలి. అప్పుడు ఏడవ సంవత్సరం ఆ వ్యక్తిని నీ దగ్గర్నుండి నీవు స్వేచ్ఛగా పోనివ్వాలి. 13 అయితే నీవు నీ బానిసను స్వేచ్ఛగా పోనిచ్చినప్పుడు, ఏమీ లేకుండానే ఆ వ్యక్తిని పోనివ్వ కూడదు. 14 మీ మందలోనుండి, మీ ధాన్యపుకళ్లములోనుండి, మీ ద్రాక్ష గానుగలోనుండి ఆ వ్యక్తికి మీరు పెద్ద వాటా ఇవ్వాలి. మీ దేవుడైన యెహోవా మీకు మంచివాటిని సమృద్ధిగా యిచ్చి ఆశీర్వదించాడు. అదే విధంగా మీరు కూడా మీ బానిసకు సమృద్ధిగా ఇవ్వాలి. 15 మీరు ఈజిప్టులో బానిసలు అని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించాడు. అందుచేత మీరు ఇలా చేయాలని నేడు నేను మీతో చెబుతున్నాను.

16 “అయితే మీ బానిసల్లో ఒకరు, ‘నిన్ను నేను విడువను’ అంటారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అతడు ప్రేమించటం చేత, మీ దగ్గర అతడు బాగా బ్రతికినందుచేత అతడు యిలా చెప్పవచ్చును. 17 ఈ సేవకుడు మీ తలుపుకు అతని చెవి ఆనించునట్లు ఉంచి, ఒక పనిముట్టును ఉపయోగించి అతని చెవిమీద రంధ్రం చేయాలి. అప్పుడు అతడు శాశ్వతంగా మీకు బానిస అవుతాడు. మీ దగ్గరే ఉండిపోవాలి అనుకొనే బానిస స్త్రీలకు కూడ యిలాగే చేయాలి.

18 “మీరు మీ బానిసలను స్వేచ్ఛగా వెళ్లిపోనిచ్చినప్పుడు అది చెడ్ఢ పని అని మీరు తలంచకూడదు. ఒక జీతగానికి నీవు చెల్లించేదానిలో సగం డబ్బుకే అతడు ఆరు సంవత్సరాలు నీ దగ్గర పనిచేసాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు చేసే ప్రతిదానిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.

మొదట పుట్టిన జంతువుల్ని గురించి నియమాలు

19 “నీ గోవులలోగాని, గొర్రెలలోగాని మొదట పుట్టిన మగవాటన్నింటినీ నీవు యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఈ జంతువుల్లో దేనినీ నీ పనికి ఉపయోగించవద్దు. ఈ గొర్రెల్లో దేనినుండీ ఉన్ని కత్తిరించవద్దు. 20 ప్రతి సంవత్సరం నీ గోవుల్లో, గొర్రెల్లో మొట్ట మొదట పుట్టిన జంతువును తీసుకొని, మీ దేవుడైన యెహోవా ఏర్పరచే స్థలంలో దానిని తినండి. యెహోవా మీతో ఉండే ఆ స్థలంలో మీరూ మీ కుటుంబం దానిని తినాలి.

21 “అయితే ఆ జంతువు కుంటిదిగాని, గుడ్డిదిగాని, లేక ఇంకేదైనా దోషంగాని ఉన్నదైతే, ఆ జంతువును మీ దేవుడైన యెహోవాకు మీరు బలిగా అర్పించకూడదు. 22 అయితే మీరు నివసించే స్థలంలో మీరు దాని మాంసం తినవచ్చును. పవిత్రమైన వాళ్లు, అపవిత్రమైన వాళ్లు ఎవరైనాసరే దానిని తినవచ్చును. దీనిని గూర్చిన నియమాలు దుప్పి, జింక మాంసం గూర్చిన లాంటివే. 23 కానీ ఆ జంతువు రక్తం మాత్రం మీరు తినకూడదు. ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.

పస్కా పండుగ

16 “అబీబు[a] నెలలో మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్టునుంటి బయటకు రప్పించాడు. యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు, పస్కా పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు బలి యివ్వాలి. ఈ బలితోపాటు పొంగినది ఏదీ తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఇది “బాధరొట్టె అని పిలువబడుతుంది.” ఈజిప్టు దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాలి. దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు ఎక్కడా ఎవరి యింటిలో పులిసిన రొట్టెలు ఉండకూడదు. మరియు మొదటి రోజు సాయంత్రం మీరు బలి అర్పించే మాంసం అంతా తెల్లవారక ముందే తినటం అయిపోవాలి.

“మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాలు దేనిలోనైనా పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించకూడదు. మీ దేవుడైన యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో మాత్రమే పస్కా పండుగ జంతువును మీరు బలిగా అర్పించాలి. అక్కడ సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించాలి. యెహోవా మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొనివచ్చిన సందర్భము ఇది. మరియు మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే పస్కా పండుగ మాంసం మీరు వండుకొని తినాలి. అప్పుడు ఉదయాన్నే మీరు తిరిగి మీ గుడారాలకు వెళ్లిపోవాలి. పులియని రొట్టెలను ఆరు రోజులు మీరు తినాలి. ఏడో రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఆ రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు.

వారాల పండుగ (పెంతెకొస్తు)

“మీరు పంట కోయటం మొదలు పెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్క కట్టాలి. 10 అప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగను మీరు జరుపుకోవాలి. ఒక స్వేచ్ఛార్పణ తీసుకొని రావటంతో దీనిని జరుపుకోండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఆలోచించి, మీరు ఎంత యివ్వాలి అనేది నిర్ణయించండి. 11 యెహోవా తన ప్రత్యేక ఆలయంగా ఏర్పచుకొనే చోటుకు వెళ్లండి. అక్కడ మీరూ, మీ ప్రజలూ కలిసి అక్కడ మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా గడపండి. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ సేవకులు, మీ ప్రజలందరినీ మీతో బాటు తీసుకొని వెళ్లండి. అంతే కాదు, మీ పట్టణాలలో నివసించే లేవీయులను, విదేశీయులను, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవలను కూడ తీసుకొని వెళ్లండి. 12 మీరు ఈజిప్టులో బానిసలు అని మరచిపోవద్దు. ఈ ఆజ్ఞలకు మీరు తప్పక విధేయులు కావాలి.

పర్ణశాలల పండుగ

13 “మీ ధాన్యపు కళ్లమునుండి, మీద్రాక్ష గానుగ నుండి మీరు మీ పంటను కూర్చుకొనే ఏడు రోజులకు పర్ణశాలల పండుగ మీరు జరుపుకోవాలి. 14 మీరూ, మీ కుమారులు, మీ కుమారైలు, మీ సేవకులందరూ, మీ పట్టణల్లో నివసించే లేవీయులు, విదేశీయులు, తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవలు ఈ పండుగలో సంతోషంగా గడపండి. 15 యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఏడు రోజులపాటు ఈ పండుగను మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు దీనిని చేయండి. మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటినీ, మీరు చేసిన పని అంతటినీ ఆశీర్వదించాడు గనుక బాగా సంతోషించండి.

16 “మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకొనేందుకు సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులంతా రావాలి. ఇది పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, పర్ణశాలల పండుగలప్పుడు సంభవిస్తుంది. యెహోవాను కలుసుకొనేందుకు వచ్చే ప్రతి వ్యక్తీ ఒక కానుక తీసుకొని రావాలి. 17 ప్రతి మనిషీ ఇవ్వగలిగినంత ఇవ్వాలి. యెహోవా తనకి ఎంత ఇచ్చాడో అనేది గ్రహించి, తాను ఎంత ఇవ్వాలో నిర్ణయించాలి.

ప్రజల కోసం అధికారులు, న్యాయమూర్తులు

18 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ వంశాలలో న్యాయమూర్తులను, అధికారులను మీరు నియమించాలి. ఈ న్యాయమూర్తులు, అధికారులు న్యాయంగా సక్రమంగా ప్రజలకు తీర్పు తీర్చాలి. 19 న్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది. 20 మీరు బ్రతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం ఉండే తీర్పులనే మీరు ఇవ్వాలి.

విగ్రహాలు దేవునికి అసహ్యం

21 “మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం నిలబెట్టినప్పుడు, అషెరా[b] దేవతను ఘనపర్చే చెక్క స్తంభాలు ఏవీ బలిపీఠం పక్కగా మీరు నిలబెట్టకూడదు. 22 మరియు తప్పుడు దేవుళ్లను పూజించేందుకోసం ప్రత్యేకమైన రాయిని మీరు నిలబెట్టకూడదు. మీ దేవుడైన యెహోవా విగ్రహాలను విగ్రహారాధనను అసహ్యించుకుంటాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International