Chronological
లేవీ వారి పట్టణాలు
35 యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు: ఇది మోయాబులో యొర్దాను లోయలో, యొర్దాను నది దగ్గర, యెరికో అవతల జరిగింది. యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలు వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను లేవీ వారికి ఇవ్వవలెనని వారితో చెప్పుము. ఆ పట్టణాలను, వాటి చుట్టూ ఉండే పచ్చిక బయళ్లను ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారికి ఇవ్వవలెను. 3 లేవీయులు ఆ పట్టణాల్లో నివసించగలుగుతారు. వారి పశువులు, వారికి ఉన్న జంతువులు అన్నీ ఆ పట్టణాల చుట్టూ ఉండే పచ్చిక బయళ్లలో మేత మేయగలుగుతాయి. 4 మీ భూమిలో ఎంతభాగం మీరు లేవీయులకు ఇవ్వవలెను? పట్టణాల ప్రాకారాలనుండి 1,500 అడుగుల వరకు భూమి లేవీయులకే చెందుతుంది. 5 మరియు పట్టణానికి తూర్పున 3,000 అడుగులు, పట్టణానికి దక్షిణాన 3,000 అడుగులు, పట్టణానికి పశ్చిమాన 3,000 అడుగులు, పట్టణానికి ఉత్తరాన 3,000 అడుగులు మొత్తం లేవీయులకు చెందుతాయి. ఆ భూమి అంతటికీ మధ్యలో పట్టణం ఉంటుంది, 6 ఆ పట్టణాల్లో ఆరు ఆశ్రయ పురాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రమాద వశాత్తూ మరొకర్ని చంపేస్తే, అప్పుడు అతడు ఆశ్రయంకోసం ఆ పట్టణాలకు పారిపోవచ్చు. ఈ ఆరు పట్టణాలు గాక, ఇంకా 42 పట్టణాలను మీరు లేవీయులకు ఇవ్వాలి. 7 కనుక మీరు మొత్తం 48 పట్టణాలను లేవీయులకు ఇవ్వవలెను. ఆ పట్టణాల చుట్టూ ఉండే భూమిని కూడ మీరు లేవీయులకు ఇవ్వవలెను. 8 ఇశ్రాయేలీయులలో పెద్ద కుటుంబాలు ఉన్న వారు ఎక్కువ భూభాగాలు ఇవ్వవలెను. ఇశ్రాయేలు చిన్న కుటుంబాలవారు చిన్న భూభాగాలు ఇవ్వవలెను. అయితే అన్ని వంశాల వారూ దేశంలోని వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను మాత్రం తప్పక లేవీవారికి ఇవ్వవలెను.”
9 తర్వాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 10 “ప్రజలతో ఈ సంగతులు చెప్పుము. మీరు యొర్దాను నది దాటి కనాను దేశంలో ప్రవేశిస్తారు. 11 ఆశ్రయ పురాలుగా పట్టణాలను మీరు ఏర్పాటుచేయాలి. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరో వ్యక్తిని చంపేస్తే, అప్పుడు అతడు భద్రత కోసం ఆ పట్టణాల్లో ఒకదానికి పారిపోవచ్చును. 12 చనిపోయిన మనిషి కుటుంబంనుండి, దెబ్బకు దెబ్బతీయాలని చూచే వారి బారినుండి అతడు క్షేమంగా ఉంటాడు. అతనికి న్యాయస్థానంలో తీర్పు జరిగేంతవరకు అతడు క్షేమంగా ఉంటాడు. 13 ఆశ్రయపురాలు ఆరు ఉంటాయి. 14 ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి తూర్పువైపున ఉంటాయి. ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి పశ్చిమాన కనాను దేశంలో ఉంటాయి. 15 ఇశ్రాయేలు పౌరులకు, విదేశీయులకు, యాత్రికులకు ఆ పట్టణాలు క్షేమమైన స్థలాలుగా ఉంటాయి. వారిలో ఎవరైనా సరే మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపేస్తే వారు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోగలుగుతారు.
16 “ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇనుప ఆయుధంతో చంపితే, అప్పుడు చంపినవాడూ చావాల్సిందే. 17 ఒక వ్యక్తి బండతో ఇంకో మనిషిని చంపితే, అతడు కూడ చావాల్సిందే. (ఆ బండ సాధారణంగా మనుష్యులను చంపేందుకు ప్రయోగించేది) 18 ఒక వ్యక్తి కర్రను ప్రయోగించి మరొకడ్ని చంపితే, అతడు కూడ చావాల్సిందే. (ఆ కర్ర సాధారణంగా మనుష్యులను చంపేందుకు ప్రయోగించే ఆయుధం) 19 చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఒకరు హంతకుణ్ణి తరిమి చంపవచ్చును.
20-21 “ఒక వ్యక్తి మరో వ్యక్తిని చేతితో కొట్టి చంపవచ్చు. లేదా ఒక వ్యక్తి మరొకరిని తోసేసి చంపవచ్చు. లేక ఒక వ్యక్తి మరో వ్యక్తిమీద ఏదైనా విసరడం ద్వారా వానిని చంపవచ్చును. ఆ హంతకుడు ద్వేషంతో అలా చేస్తే అతడు హంతకుడు. ఆ మనిషిని చంపివేయాలి. చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అతనిని తరిమి చంపవచ్చును.
22 “కానీ ఒక వ్యక్తి మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపవచ్చును. అతడు తాను చంపిన వాడిని ద్వేషించలేదు. అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. లేక ఒక వ్యక్తి మరొకరి మీద ఏదో విసిరినప్పుడు అవతల మనిషి చావవచ్చు – చంపాలని అతడు అలా చేయలేదు. 23 లేక ఒక వ్యక్తి ఒక బండను విసిరివేయవచ్చును. అతడు చూడని మరో వ్యక్తిమీద ఆ బండపడి, అతనిని చంపవచ్చు. అతడు ఎవరినీ చంపాలని పథకం వేయలేదు. తాను చంపినవాడిని అతడు ద్వేషించలేదు – అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. 24 అలా జరిగితే ఏమి చేయాలనేదీ సమాజం నిర్ణయం చేయాలి. 25 చనిపోయిన వాని కుటుంబంలో వారు ఎవరైనా తిరిగి అతడిని చంపవచ్చేమో సమాజపు న్యాయస్థానం నిర్ణయించాలి. న్యాయస్థానం హంతకుడిని బ్రతకనివ్వాలని ఒకవేళ నిర్ణయిస్తే, అప్పుడు ఈ వ్యక్తి తన ‘ఆశ్రయపురానికి’ వెళ్లాలి. పవిత్ర తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు అక్కడే ఉండాలి.
26-27 “ఆ మనిషి తన ‘ఆశ్రయ పురం’ హద్దులు దాటి ఎన్నడూ బయటకి వెళ్లకూడదు. అతడు ఆ హద్దులు దాటి బయటికి వెళ్తే, చనిపోయినవాని కుటుంబ సభ్యుల్లో ఒకరు అతన్ని పట్టుకొని చంపివేస్తే, అప్పుడు, ఆ సభ్యుని మీద హత్యా నేరం ఉండదు. 28 ప్రమాదవశాత్తూ చంపిన వ్యక్తి, ప్రధాన యాజకుడు మరణించేంతవరకు తన ‘ఆశ్రయ పురం’లోనే ఉండాలి. ప్రధాన యాజకుడు మరణించాక, అతడు తిరిగి తన చోటికి వెళ్లవచ్చును. 29 మీ ప్రజల పట్టణాలన్నింటిలోనూ ఆ నియమాలు శాశ్వత చట్టంగా ఉంటాయి.
30 “సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే హంతకుడు హంతకునిగా చంపబడాలి. ఒకే ఒక్క సాక్షి ఉంటే ఏ వ్యక్తినీ చంపకూడదు.
31 “ఒక్క వ్యక్తి హంతకుడైతే, అతడ్ని చంపి వేయాలి. డబ్బు తీసుకుని ఈ శిక్షను మార్చవద్దు. ఆ హంతకుడు తప్పక చంపబడాలి.
32 “ఒక వ్యక్తి మరొకర్ని చంపి, ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోతే, వాడిని ఇంటికి పోనిచ్చేందుకు డబ్బు తీసుకోవద్దు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండాలి.
33 “నిరపరాధుల రక్తంతో మీ దేశాన్ని నాశనం కానివ్వవద్దు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే, ఆ నేరానికి ఒకే శిక్ష. అది ఆ హంతకుడు చంపబడటమే. ఆ నేరంనుండి దేశాన్ని మరే శిక్షకూడ విమోచించదు. 34 నేనే యెహోవాను. నేను మీ దేశంలో ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. ఆ దేశంలో నేను నివసిస్తాను గనుక నిర్దోషుల రక్తంతో దానిని పాడు చేయవద్దు.”
సెలోపెహాదు కుమార్తెల భూమి
36 యోసేపు కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు మాకీరు. మాకీరు కుమారుడు గిలాదు. గిలాదు వంశపు నాయకులు మోషేతో, ఇశ్రాయేలు వంశాల నాయకులతో మాట్లాడటానికి వెళ్లారు. 2 వారు ఇలా అన్నారు: “అయ్యా, చీట్లు వేసి భూమిని తీసుకోమని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. మరియు అయ్యా, సెలోపెహాదు భూమిని అతని కుమార్తెలకు ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించాడు. సెలోపెహాదు మా సోదరుడు. 3 ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశంలోనుండి మరెవరైనా సెలోపెహాదు కుమార్తెల్లో ఒకరిని వివాహము చేసుకోవచ్చు. ఆ భూమి మా కుటుంబం నుండి పోతుందా? ఆ మరో వంశంవారు ఆ భూమిని తీసుకుంటారా? చీట్లు వేయడం ద్వారా మాకు లభించిన ఆ భూమిని మేము పొగొట్టుకుంటామా? 4 ప్రజలు వారి భూమిని అమ్మివేయవచ్చు. అయితే బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి అంతా దాని అసలైన సొంతదారులకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ సమయంలో, సెలోపెహాదు కుమార్తెలకు చెందిన భూమి ఎవరికి లభిస్తుంది? అలా గనుక జరిగితే మా కుటుంబం శాశ్వతంగా ఆ భూమిని పోగొట్టుకుంటుంది కదా?”
5 మోషే ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ యెహోవానుండి వచ్చింది. “యోసేపు వంశపు మనుష్యులు సరిగ్గా చెప్పారు. 6 ఇది సెలోపెహాదు కుమార్తెలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎవరినైనా వివాహమాడాలనుకుంటే మీ స్వంతవంశంలో వారినే వివాహము చేసుకోవాలి. 7 ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో భూమి ఒక వంశంనుండి మరో వంశానికి మారిపోదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి. 8 ఒకవేళ ఎవరైవా స్త్రీకి తన తండ్రి భూమి సంక్రమిస్తే, ఆమె తన స్వంత వంశం వారినే ఎవరినైనా వివాహము చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తీ తన పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి. 9 కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశంనుండి మరో వంశానికి భూమి పోకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.”
10 మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సెలోపెహాదు కుమార్తెలు విధేయులయ్యారు. 11 అందుచేత సెలోపెహాదు కుమార్తెలు మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా, వారి తండ్రి సోదరుని కుమారులను వివాహము చేసుకున్నారు. 12 వారి భర్తలు మనష్షే వంశం వారు గనుక వారి భూమి తమ తండ్రి కుటుంబం, వంశం వారికే చెందింది.
13 కనుక అర్బోతు మోయాబు ప్రాంతంలో, శ్రేష్ఠ యొర్దాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. ఆ చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.
© 1997 Bible League International