Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 31-32

మిద్యానీయులను ఇశ్రాయేలీయులు తిప్పికొట్టడం

31 యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: “మిద్యానీయుల విషయం తేల్చేందుకు ఇశ్రాయేలీయులకు నేను సహాయం చేస్తాను. ఆ తర్వాత నీవు మరణిస్తావు.”

కనుక మోషే ప్రజలతో మాట్లాడాడు. అతడు వారితో ఇలా చెప్పాడు: “మీ మనుష్యుల్లో కొందిరిని సైనికులుగా ఏర్పరచుకోండి. మిద్యానీయుల విషయం తేల్చేందుకు వారిని యెహోవా వాడుకొంటాడు. ఇశ్రాయేలీయుల్లో ఒక్కో వంశం నుండి 1,000 మందిని ఏర్పరచుకోండి. ఇశ్రాయేలు వంశాలన్నింటినుండి మొత్తం 12,000 మంది సైనికులు ఉంటారు.”

ఆ 12,000 మందిని మోషే యుద్ధానికి పంపించాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును వారితో అతడు పంపాడు. పవిత్ర వస్తువుల్ని, కొమ్ములను, బూరలను ఎలియాజరు తనతో తీసుకుని వెళ్లాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులతో పోరాడారు. మిద్యానీ మనుష్యులందరిని వారు చంపారు వారు చంపిన వారిలో మిద్యాను రాజులు అయిదుగురు, ఎవీ, రేకెము, సూరు, హోరు, రేబ ఉన్నారు. బెయోరు కొడుకైన బిలామునుకూడ వారు ఖడ్గంతో చంపారు.

ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీ స్త్రీలను, పిల్లలను బందీలుగా పట్టుకొన్నారు. వారి గొర్రెలను, పశువులను, ఇతరమైన వాటిని అన్నింటినీ వారు తీసుకున్నారు. 10 అప్పుడు వారి గ్రామాలు, పట్టణాలన్నింటినీ వారు కాల్చివేసారు. 11 మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ వారు తీసుకుని 12 మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయేలీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీయులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నదికి తూర్పున ఉంది. 13 అప్పుడు ఆ సైనికులను ఎదుర్కొనేందుకు మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారంనుండి బయటకు వెళ్లారు.

14 సైన్యాధిపతుల మీద మోషేకి చాల కోపం వచ్చింది. యుద్ధంనుండి తిరిగి వచ్చిన శతాధిపతుల మీద, సహస్రాధిపతులమీద అతనికి కోపం వచ్చింది. 15 మోషే వారితో అన్నాడు, “ఆ స్త్రీలను మీరెందుకు బ్రతకనిచ్చారు? 16 ఈ స్త్రీలు ఇశ్రాయేలు పురుషులకు తగరు. యెహోవానుండి ప్రజలు తిరిగి పోతారు. అది బిలాము కాలంలాగే ఉంటుంది. బయలు పెయోరు దగ్గర జరిగినట్టే జరుగుతుంది. ఆ రోగం యెహోవా ప్రజలకు మళ్లీ వస్తుంది. 17 ఇప్పుడు మిద్యానీ బాలురను అందరినీ చంపివేయండి. పురుషునితో కాపురం చేసిన ప్రతి మిద్యానీ స్త్రీని చంపివేయండి. పురుష సంయోగం ఎరిగిన మిద్యానీ స్త్రీలలో ప్రతి ఒక్కరినీ చంపేయండి. 18 ఏ పురుషునితోనూ ఎన్నడూ లైంగిక సంబంధంలేని స్త్రీలను మీరు బ్రతకనివ్వవచ్చును. 19 తర్వాత, ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసానికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని ముట్టినాసరే, నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి. 20 ఏడో రోజున మళ్లీ మీరు అలాగే చేయాలి. మీ బట్టలు అన్నీ మీరు ఉదుక్కోవాలి. తోలు, ఉన్ని, కట్టెతో చేయబడిన వాటిని అన్నింటినీ మీరు కడగాలి. మీరు తప్పక పవిత్రం కావాలి.”

21 అప్పుడు యాజకుడైన ఎలియాజరు సైనికులతో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “అవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. యుద్ధంనుండి తిరిగి వచ్చే సైనికులకోసం ఈ ఆజ్ఞలు. 22-23 అయితే అగ్నిలో వేయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి. 24 ఏడో రోజున తప్పక మీరు మీ వస్త్రాలను ఉదుక్కోవాలి. అప్పుడు మీరు పవిత్రం అవుతారు. ఆ తర్వాత మీరు నివాసంలోకి రావచ్చు.”

25 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 26 “సైనికులు యుద్ధంలో పట్టుకొన్న బందీలను, జంతువులను, సామగ్రి అతటినీ, నీవూ, యాజకుడైన ఎలీయాజరూ, నాయకులందరూ లెక్కపెట్టాలి. 27 తర్వాత వాటిని యుద్ధానికి వెళ్లిన సైనికులు, మిగిలిన ఇశ్రాయేలు ప్రజల మధ్య పంచుకోవాలి. 28 యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం తీసుకో. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నింటిలోను ఇలాగే. 29 యుద్ధంలో సైనికులు తెచ్చిన వాటిలోని వారి సగభాగంనుండి వాటిని తీసుకో. అప్పుడు వాటిని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. 30 ఆ తర్వాత ప్రజల సగభాగంలో ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం లేవీయులకు ఇవ్వాలి. (ఎందుచేతనంటే యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు తీసుకొన్నారు గనుక.)”

31 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఎలియాజరు చేసారు. 32 సైనికులు 6,75,000 గొర్రెలను, 33 72,000 పశువులను 34 61,000 గాడిదలను, 35 32,000 మంది స్త్రీలను తీసుకున్నారు. (వారు ఏ పురుషునితోనూ లైంగిక సంబంధం లేని వారు మాత్రమే.) 36 యుద్ధానికి వెళ్లిన సైనికులకు 3,37,500 గొర్రెలు వచ్చాయి. 37 675 గొర్రెలను వారు యెహోవాకు ఇచ్చారు. 38 సైనికులకు 36,000 పశువులు వచ్చాయి. 72 పశువులను వారు యెహోవాకు ఇచ్చారు. 39 సైనికులకు 30,500 గాడిదలు వచ్చాయి. 61 గాడిదలను వారు యెహోవాకు ఇచ్చారు. 40 సైనికుల వంతు 16,000 మంది స్త్రీలు. 32 మంది స్త్రీలను వారు యెహోవాకు ఇచ్చారు. 41 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఆ కానుకలన్నింటిని యెహోవా కోసం యాజకుడైన ఎలియాజరుకు మోషే ఇచ్చాడు.

42 అప్పుడు మోషే ప్రజల అర్ధ భాగాన్ని లెక్కించాడు. యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర మోషే తీసుకున్న ప్రజల భాగం ఇది. 43 3,37,500 గొర్రెలు 44 36,000 పశువులు, 45 30,500 గాడిదలు 46 16,000 మంది స్త్రీలు ప్రజల వంతు. 47 ప్రతి 50 లోంచి ఒకటి యెహోవాకోసం మోషే తీసుకున్నాడు. జంతువులు, మనుష్యుల్లో కూడ ఇలాగే. అప్పుడు అతడు వాటిని లేవీయులకు ఇచ్చాడు. ఎందుచేతనంటే వారు యెహోవా పవిత్ర గుడారం విషయమై బాధ్యత వహించారు గనుక. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇలా చేసాడు.

48 అప్పుడు సైన్యాధికారులు మోషే దగ్గరకు వచ్చారు (1,000 మంది మీద అధికారులు, 100 మంది మీద అధికారులు.) 49 వారు మోషేతో చెప్పారు, “నీ సేవకులమైన మేము మా సైనికులను లెక్కించాము. వారిలో ఎవరినీ మేము విడిచిపెట్టలేదు. 50 కనుక ప్రతి సైనికుని దగ్గర్నుండీ యెహోవా కానుకను మేము తెస్తున్నాము. బంగారంతో చేయబడిన దండపతకాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు మేము తెస్తున్నాము. మా పాపాలను కప్పేందుకు ఇది యెహోవాకు కానుక.”

51 కనుక బంగారంతో చేయబడిన ఆ వస్తువులన్నిటినీ మోషే తీసుకొని యాజకుడైన ఎలియాజరుకు ఇచ్చాడు. 52 1,000 మందిపైనున్న నాయకులు, 100 మందిపైనున్న నాయకులు యెహోవాకు ఇచ్చిన మొత్తం బంగారం బరువు 420 పౌన్లు. 53 సైనికులు యుద్ధంలో తీసుకొన్న మిగిలిన వస్తువులను వారు ఉంచుకొన్నారు. 54 1,000 మందిపైనున్న, 100 మందిపైనున్న అధికారుల దగ్గర బంగారాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరూ తీసుకున్నారు. తర్వాత ఆ బంగారాన్ని సన్నిధి గుడారంలో వారు ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఎదుట ఈ కానుక ఒక జ్ఞాపక చిహ్నం.

యొర్దాను నది తూర్పున ఇశ్రాయేలు వంశాలు

32 రూబేను, గాదు వంశాలకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. యాజెరు, గిలాదు ప్రదేశాన్ని ఆ ప్రజలు చూశారు. ఈ ప్రదేశం వారి పశువులకు బాగున్నట్టు వారికి కనబడింది. కనుక రూబేను, గాదు వంశాల వారు మోషే దగ్గరకు వచ్చారు. మోషేతో, యాజకుడైన ఎలియాజరుతో, ప్రజా నాయకులతో వారు మాట్లాడారు. 3-4 వారు ఇలా చెప్పారు: “మీ సేవకులమైన మాకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. మేము ఏ దేశంతో పోరాడామో అది పశువులకు మంచి ప్రదేశం. (అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షెబాం, నెబో, బెయోను ఈ ప్రాంతంలో ఉన్నాయి.) మీకు ఇష్టమైతే ఈ ప్రాంతాన్ని మాకు ఇవ్వవలెనని మేము కోరుతున్నాము. యొర్దాను నది ఆవలి వైపునకు మమ్మల్ని తీసుకొని వెళ్లొద్దు.”

రూబేను, గాదు వంశాల ప్రజలతో మోషే అన్నాడు: “మీరు మీ సోదరులను యుద్ధానికి వెళ్లనిచ్చి, మీరేమో ఇక్కడ స్థిరపడతారా? ఇశ్రాయేలు ప్రజలను మీరెందుకు అధైర్యపరుస్తున్నారు? నది దాటకుండా, యెహోవా వారికి ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా చేస్తారు మీరు. మీ తండ్రులు నాకు అలాగే చేసారు. కాదేషు బర్నేయ దగ్గర దేశాన్ని పరిశీలించి రావటానికి గూఢచారులను నేను పంపించాను. వారు ఎష్కోలు లోయవరకు వెళ్లారు. వారు ఆ దేశాన్ని చూశారు. వారే ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపర్చారు. యెహోవా ఇచ్చిన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ల నీయకుండా వారే అడ్డు చేసారు. 10 ప్రజల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా ఇలా ప్రమాణం చేసాడు: 11 ‘ఈజిప్టు నుండి వచ్చిన వారిలో 20 సంవత్సరాలుగాని అంతకంటె ఎక్కువ వయసుగాని ఉన్నవారెవరూ ఈ దేశాన్ని చూడలేరు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసాను. ఈ దేశాన్ని ఈ మనుష్యులకు ఇస్తానని నేను వాగ్దానం చేసాను. కానీ వీరు నన్ను వాస్తవంగా అనుసరించలేదు. కనుక వీరికి ఈ దేశం దక్కదు. 12 కెనెజీ వాడగు యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వాస్తవంగా యెహోవాను వెంబడించారు!’

13 “ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది. అందుచేతనే ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలోనే యెహోవా వుండనిచ్చాడు. యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రజలందరూ చనిపోయేంతవరకు వారిని యెహోవా అక్కడనే ఉండనిచ్చాడు. 14 ఇప్పుడు మీరు మీ తండ్రులు చేసిన పాపమే మళ్లీ చేస్తున్నారు. పాపాత్ములైన ప్రజలారా, యెహోవా ఆయన ప్రజల మీద మరింత ఎక్కువగా కోపగించాలని మీరు కోరుతున్నారా? 15 మీరు యెహోవాను వెంబడించటం మానివేస్తే, ఇశ్రాయేలీయులు ఇంకా ఎక్కువ కాలం అరణ్యంలో ఉండేటట్టు యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు ప్రజలందరినీ నాశనం చేస్తారు!”

16 కానీ రూబేను, మరియు గాదు వంశాల ప్రజలు మోషే దగ్గరకు వెళ్లారు. వారు మోషేకు ఈ విధంగా చెప్పారు: “ఇక్కడ మేము మా పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము. మరియు మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు కట్టుకుంటాము. 17 ఇశ్రాయేలీయులను వారివారి స్థలాలకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధానికి సిద్ధపడి సాగిపోతాము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయంచేత ప్రాకారంగల పట్టణాలలో సురక్షితంగా నివాసము వుండనియ్యండి. 18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగిరాము. 19 యొర్దాను నదికి పశ్చిమదిక్కునవున్న ఏ భూమినీ మేము తీసుకోము. యొర్దాను నదికి తూర్పు దిక్కున వున్న భూమే మాకు రావలసిన వారసత్వం.”

20 కనుక మోషే వారితో ఇలా చెప్పాడు: “మీరు వీటన్నింటినీ జరిగిస్తే, అప్పుడు ఈ దేశం మీది అవుతుంది. కానీ మీ సైనికులు మాత్రం యెహోవాకు ముందు యుద్ధానికి వెళ్లాలి. 21 మీ సైనికులు యొర్దాను నది దాటి, శత్రువు ఈ దేశాన్ని వదలి వెళ్లేటట్టుచేయాలి. 22 ఈ దేశాన్ని వశం చేసుకునేందుకు యెహోవా మనందరికీ సహాయం చేసిన తర్వాత, మీరు తిరిగి ఇంటికి వెళ్లవచ్చును. అప్పుడు యెహోవా గాని, ఇశ్రాయేలీయులు గాని మిమ్మల్ని దోషులుగా ఎంచరు. అప్పుడు యెహోవా మిమ్మల్ని ఈ దేశాన్ని తీసుకోనిస్తాడు. 23 కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసుకోండి. 24 మీ పిల్లల కోసం పట్టణాలు, మీ జంతువుల కోసం కొట్టాలు కట్టుకోండి. అయితే, మీరు మీ ప్రమాణం ప్రకారం తప్పక చేయాలి.”

25 అప్పుడు గాదు, రూబేను వంశాల నాయకులు మోషేతో ఇలా చెప్పారు: “మేము నీ సేవకులం, నీవు మా యజమానివి. కనుక నీవు ఏమి చెబితే అది మేము చేస్తాము. 26 మా భార్యలు, పిల్లలు, మా పశువులు గిలాదు పట్టణాల్లోనే ఉంటారు. 27 కానీ, నీ సేవకులమైన మేము మాత్రం యొర్దాను నది దాటుతాము. అయితే మా యజమాని చెప్పినట్టు మేము యెహోవా ముందర యుద్ధానికి ముందడుగువేస్తాం.”

28 కనుక ఇశ్రాయేలీయులు చేసిన ఈ ప్రమాణాన్ని మోషే, యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యోహోషువ, ఇశ్రాయేలు వంశాల నాయకులు అందరూ విన్నారు. 29 మోషే వారితో చెప్పాడు: “గాదు, రూబేను ప్రజలు యొర్దాను నది దాటుతారు. వారు యెహోవాముందు యుద్ధానికి నడుస్తారు. మీరు దేశాన్ని వశం చేసుకునేందుకు వారు సహాయం చేస్తారు. దేశంలో వారి భాగంగా గిలాదు ప్రాంతాన్ని మీరు వారికి ఇవ్వవలెను. 30 కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు మీకు సహాయం చేస్తామని వారు ప్రమాణం చేస్తున్నారు.”

31 గాదు, రూబేను ప్రజలు జవాబిచ్చారు: “యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మేము చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. 32 మేము యొర్దాను నది దాటి, యెహోవా ముందు కనాను దేశంలోకి నడుస్తాము. అయితే ఈ దేశంలో మా భాగం మాత్రం యొర్దాను నది తూర్పు ప్రదేశం.”

33 కనుక గాదు ప్రజలకు, రూబేను ప్రజలకు, మనష్షే వంశంలో సగంమంది ప్రజలకు ఆ ప్రదేశాన్ని మోషే ఇచ్చాడు. (మనష్షే యోసేపు కుమారుడు.) అమోరీవాడగు సీహోను రాజ్యం, బాషాను రాజైన ఓగు రాజ్యం ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నాయి.

34 గాదు ప్రజలు దీబోను, అతారోతు, అరోయేరు, 35 అత్రోతు షోపను, యాజెరు, యోగ్‌బహ, 36 బేత్‌ నిమ్రా, బేత్హారాను పట్టణాలు కట్టారు. బలమైన గోడలు గల పట్టణాలను, వారి జంతువులకు కొట్టాలను వారు నిర్మించారు.

37 రూబేను ప్రజలు హెష్బోను, ఏలాలే, కిర్యాతాయిము 38 నెబో, బయల్మెయోను, షిబ్మా పట్టణాలను నిర్మించారు. వారు మరల కట్టిన పట్టణాలకు పాత పేర్లనే ఉపయోగించారు. అయితే నెబో, బయల్మెయోను పేర్లను వారు మార్చివేసారు.

39 మాకీరు వంశం నుండి ప్రజలు గిలాదుకు వెళ్లారు. (మాకీరు మనష్షే కుమారుడు.) వారు ఆ పట్టణాన్ని ఓడించారు. అక్కడ నివసించిన అమోరీయులను వారు ఓడించారు. 40 కనుక మనష్షే వంశంలోని మాకీరుకు గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం అక్కడ స్థిరపడింది. 41 మనష్షే వాడైన యాయీరు అక్కడి చిన్న పట్టణాలను ఓడించాడు. అప్పుడు వాటిని యాయీరు పల్లెలు అని అతడు పిల్చాడు. 42 నాతును, దాని సమీపంలోని చిన్న పట్టణాలను నోబహు ఓడించాడు. తర్వాత ఆ స్థలానికి అతడు తన స్వంత పేరు పెట్టాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International