Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 21-22

కనానీ వాళ్లతో యుద్ధం

21 కనానీ ప్రజల రాజు పేరు అరాదు. అతడు నెగెవు లోయలో నివసించాడు. ఇశ్రాయేలు ప్రజలు అతారీము దారిన వస్తున్నారని అరాదు రాజు విన్నాడు. కనుక రాజు బయలుదేరి వెళ్లి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసాడు. వారిలో కొందరిని అతడు బంధించి, బందీలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో, “యెహోవా, దయచేసి ఈ ప్రజలను రక్షించు. వారిని మరల మా దగ్గరకు తీసుకునిరా. ఇది నీవు చేస్తే, మేము వారి పట్టణాలను సర్వనాశనం చేస్తాము” అని ప్రమాణం చేసారు.

ఇశ్రాయేలు ప్రజల మాట యెహోవా ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు కనానీ ప్రజలను ఓడించటానికి యెహోవా సమ్మతించాడు. కనానీ ప్రజలను, వారి పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా నాశనంచేసారు. అందుచేత ఆ స్థలానికి హోర్మ[a] అని పేరు పెట్టబడింది.

ఇత్తడి సర్పం

ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ విడిచి ఎర్ర సముద్రానికి వెళ్లే మార్గంలో ప్రయాణం చేసారు. ఎదోము అనే ప్రాంతాన్ని చుట్టి వచ్చేందుకు వారు ఇలా చేసారు. కానీ ప్రజల్లో సహనం లేదు. ప్రయాణం చేస్తూ దూరాన్ని గూర్చి వారు సణిగారు. దేవునికి, మోషేకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. “మమ్మల్ని ఈజిప్టునుండి నీవెందుకు తీసుకువచ్చావు? మేము ఇక్కడ అరణ్యంలోనే చస్తాము! రొట్టెలేదు, నీళ్లు లేవు. ఈ దారుణమైన ఆహారం మాకు అసహ్యము” అన్నారు ప్రజలు.

కనుక విష సర్పాలను ఆ ప్రజల మధ్యకు యెహోవా పంపించాడు. ఆ పాములు ప్రజలను కరిచాయి. ఇశ్రాయేలు ప్రజలు చాల మంది చనిపోయారు. ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి ఈ పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ఆ ప్రజల కోసం మోషే ప్రార్థించాడు.

“ఇత్తడి సర్పం ఒకటి చేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. పాము కరిచిన వ్యక్తి ఆ స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూడాలి. అప్పుడు అతడు చావడు” అని యెహోవా మోషేతో చెప్పాడు. కనుక మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, ఆ మనిషి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికాడు.

మోయాబుకు ప్రయాణం

10 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. ఓబోతు అనే చోట వారు నివాసం చేసుకొనిరి. 11 తర్వాత ఆ ప్రజలు ఓబోతునుండి ఈయ్యె అబారీము వెళ్లారు. ఇది తూర్పున మోయాబు సమీపంగా అరణ్యంలో ఉంది. 12 తర్వాత ప్రజలు ఆ స్థలం విడిచి, జెరెదు లోయకు ప్రయాణం చేసారు. అక్కడ నివాసాలు చేసుకొనిరి. 13 మళ్లీ ప్రజలు అర్నోను లోయకువచ్చి, అక్కడికి సమీపంలో నివాసం చేసుకొనిరి. ఇవి అమోరీయ దేశానికి దగ్గర్లో ఉన్న అరణ్యంలో ఉంది. మోయాబు ప్రజలను అమోరీ ప్రజలకు అర్నోనులోయ సరిహద్దు. 14 అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో ఇలా కనబడుతుంది.

“సుప్పాలోని వాహేబు, అర్నోను లోయలు, 15 ఆరు అను పట్టణం వరకుగల లోయల పక్క కొండలు. ఈ స్థలాలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి.”

16 ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలం విడిచి బెయేరు చేరారు. ఈ స్థలంలో ఒక బావి ఉంది. యెహోవా “ప్రజలను ఇక్కడికి తీసుకొనిరా. నేను వారికి నీళ్లిస్తాను” అని మోషేతో చెప్పాడు. 17 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు,

“బావీ, ఉప్పొంగి ప్రవహించు,
    దానిగూర్చి పాడండి!
18 మహాత్ములు ఈ బావి తవ్వారు.
    ప్రముఖ నాయకులు ఈ బావి తవ్వారు.
అధికార దండములతో, కర్రలతో వారు ఈ బావి తవ్వారు.
అరణ్యంలో ఇది ఒక కానుక.”

మత్తాన[b] అని పిలువబడే ఈ బావి దగ్గర ప్రజలు ఉన్నారు. 19 అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయేలుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు నుండి బామోతుకు ప్రయాణం చేసారు. 20 బామోతునుండి మోయాబు లోయకు ప్రజలు ప్రయాణం చేసారు. ఇక్కడ ఎడారికి ఎదురుగా పిస్గా శిఖరం కనబడుతుంది.

సీహోను, ఓగు

21 అమోరీ ప్రజల రాజు సీహోను దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపారు. వారు ఆ రాజుతో

22 “మమ్మల్ని నీ దేశంలో నుండి ప్రయాణం చేయనివ్వు. మేము పొలాల్లోనుంచి గాని, ద్రాక్షా తోటల్లోనుంచిగాని నడువము. నీ బావుల్లోనుంచి నీళ్లు త్రాగము. రాజ మార్గంలోనే మేము నడుస్తాము. నీ దేశం దాటి వెళ్లేంతవరకు మేము ఆ మార్గంలోనే ఉంటాము” అని చెప్పారు.

23 అయితే సీహోను రాజు ఇశ్రాయేలు ప్రజలను తన రాజ్యంలోనుండి ప్రయాణం చేయనియ్యలేదు. రాజు తన సైన్యాన్ని సమకూర్చుకొని అరణ్యంలోకి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలమీదికి అతడు వెళ్తూఉన్నాడు. యాహజు అనే చోట ఆ రాజు సైన్యం ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసారు.

24 కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజును చంపారు. అప్పుడు అర్నోను లోయ మొదలుకొని యబ్బోకు ప్రాంతంవరకు అతని దేశాన్ని వారు స్వాధీనం చేసుకొన్నారు. అమ్మోనీ ప్రజల సరిహద్దు వరకు ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అమ్మోనీ ప్రజలు ఆ సరిహద్దును చాల గట్టిగా కాపాడుతున్నందుచేత వారు అంతకంటె ఎక్కువ భూమిని స్వాధీనం చేసుకోలేదు. 25 అమోరీయుల ఈ పట్టణాలన్నింటినీ ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసికొని, అమోరీయుల పట్టణాలన్నింటిలో హెష్బోను, దాని చుట్టు ప్రక్కల ఉన్న చిన్న చిన్న పట్టణాలన్నింటిలోను వారు నివసించటం మొదలు పెట్టారు. 26 సీహోను రాజు నివసించిన పట్టణం హెష్బోను. గతంలో మోయాబు రాజును సీహోను ఓడించాడు. అందువల్ల అర్నోను లోయవరకు మోయాబు దేశాన్ని సీహోను రాజు స్వాధీనం చేసుకొన్నాడు. 27 అందుకే గాయకులు ఇలా పాడతారు:

“హెష్బోనూ, నీ నిర్మాణం మళ్లీ జరగాలి.
    సీహోను పట్టణం మళ్లీ కట్టబడును గాక!
28 హెష్బోనులో అగ్ని రగులుకొంది.
    ఆ అగ్ని సీహోను పట్టణంలో రగులుకొంది.
ఆర్, మోయాబులను అగ్ని నాశనం చేసింది.
    అర్నోను ఉన్నత స్థలాల కొండలను అది కాల్చేసింది.
29 ఓ మోయాబూ, అది నీకు కీడు.
    కెమోషు ప్రజలు నాశనం చేయబడ్డారు.
అతని కుమారులు పారిపోయారు.
    అమోరీ ప్రజల రాజైన సీహోను చేత అతని కుమార్తెలు బందీలు చేయబడ్డారు.
30 అయితే మేము ఆ అమోరీలను ఓడించాము.
    హెష్బోను నుండి దీబోను వరకు నషీమునుండి మేదెబా దగ్గరి నొఫహువరకు వారి పట్టణాలను మేము నాశనం చేసాం.”

31 కనుక ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజల దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు.

32 యాజెరు పట్టణాన్ని చూచి రమ్మని మోషే కొందరు మనుష్యుల్ని పంపించాడు. మోషే ఇలా చేసిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాలను కూడ వారు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నివసిస్తున్న అమోరీ ప్రజలు పారిపొయ్యేటట్టుగా ఇశ్రాయేలు ప్రజలు వారిని తరిమివేసారు.

33 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బాషాను దారిన ప్రయాణం చేసారు. బాషాను రాజైన ఓగు తన సైన్యాన్ని సిద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజల మీదికి వెళ్లాడు. ఎద్రేయి అనే చోట అతడు వారితో యుద్ధం చేసాడు.

34 అయితే యెహోవా, “ఆ రాజును గూర్చి భయపడవద్దు. మీరు అతన్ని ఓడించునట్లు నేను చేస్తాను. మొత్తం అతని సైన్యాన్ని, దేశాన్ని కూడ మీరు స్వాధీనం చేసుకొంటారు. అమోరీ ప్రజల రాజైన హెష్బోనులో నివసించిన సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడచేయండి” అని మోషేతో చెప్పాడు.

35 కనుక ఓగును, అతని సైన్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఓడించేసారు. అతన్ని, అతని కుమారులను, అతని సైన్యం అంతటినీ వారు చంపారు. అప్పుడు అతని దేశం అంతా ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకున్నారు.

బిలాము—మోయాబు రాజు

22 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి.

2-3 ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజు భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు.

మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు ఈ గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు.

అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు. బెయోరు కుమారుడు బిలామును పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు:

“ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. దేశం అంతా కమ్మేసేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు. వీళ్లను ఎదుర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి తరిమివేయగలను. నీకు గొప్పశక్తి ఉందని నాకు తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి వేయగలను.”

మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లిపోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు అతనికి చెప్పారు.

బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు ఇచ్చే జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి వారితో ఉండిపోయారు.

దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు.

10 బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు. 11 ఆ సందేశం ఇది: ఈజిప్టునుండి ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి అంతా నిండిపొయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి వీళ్లను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం చేసి నా దేశంనుండి వెళ్లగొట్ట గలుగుతానేమో.”

12 అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజలను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని బిలాముతో చెప్పాడు.

13 మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశానికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్ల నివ్వడు” అన్నాడు.

14 కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి బిలాము నిరాకరించాడు” అని చెప్పారు.

15 కనుక బాలాకు మరికొందరు నాయకులను బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. మొదటిసారి అతడు పంపిన వారికంటె వీరు ప్రముఖ నాయకులు. 16 వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు నీతోఇలా చెప్పమన్నాడు. దయచేసి నీవు రాకుండా ఏదీ నిన్ను అడ్డుపెట్టనియ్యకు. 17 నేను అడిగిన దాన్ని నీవు చేస్తే, నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా పక్షంగా ఈ ప్రజలను శపించు.”

18 కానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబిచ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహోవాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. నేను చెయ్యొచ్చు అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైనదైనా గొప్పదైనా నేనేమి చేయలేను. బాలాకు రాజు అందమైన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయను. 19 అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.”

20 ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, “ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా మాత్రమే చేయాలి” అని చెప్పాడు.

బిలాము, అతని గాడిద

21 మరునాడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు నాయకులతో వెళ్లాడు. 22 బిలాము తన గాడిద మీద వెళ్తున్నాడు. అతని ఇద్దరు సేవకులు అతనితో ఉన్నారు. బిలాము ప్రయాణం చేస్తుండగా దేవునికి కోపం వచ్చింది. కనుక యెహోవా దూత మార్గంలో బిలాము ఎదుట నిలబడ్డాడు. ఆ దూత బిలామును ఆపుజేయబోతున్నాడు.

23 దారిలో యెహోవా దూత నిలబడటం బిలాము గాడిద చూచింది. ఆ దూత చేతిలో ఖడ్గం ఉంది. కనుక గాడిద దారి తొలగి పక్క పొలంలోకి వెళ్లింది. బిలాము యెహోవా దూతను చూడలేదు. అందుచేత అతనికి తన గాడిద మీద చాల కోపం వచ్చింది. అతడు గాడిదను కొట్టి, మళ్లీ దారి మీదికి వెళ్లేందుకు దాన్ని బలవంతం చేసాడు.

24 తర్వాత ఆ దారిలో ఇరుకైన చోట యెహోవా దూత నిలబడ్డాడు. ఇది రెండు ద్రాక్ష తోటల మధ్యఉంది. దారికి రెండు వైపులా గోడలు ఉన్నాయి 25 మళ్లీ ఆ గాడిద యెహోవా దూతను చూచింది. అందుచేత ఆ గాడిద గోడకు రాసుకొనే అంత దగ్గరగా వెళ్లింది. కనుక బిలాము పాదం గోడకేసి నొక్కేసింది. బిలాము తన గాడిదను మళ్లీ కొట్టాడు.

26 తర్వాత యెహోవా దూత మరో చోట నిలబడ్డాడు. ఇది కూడ ఇరుకు దారి. గాడిద వెనుకకు తిరిగే అంత చోటుకూడ అక్కడలేదు. ఆ గాడిద కుడికి ఎడమకు కూడ తిరుగలేక పోయింది. 27 యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు.

28 అప్పుడు యెహోవా ఆ గాడిద మాట్లాడేటట్టు చేసాడు. ఆ గాడిద, “నీవు నా మీద ఎందుకు కోపగించు కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను మూడుసార్లు కొట్టావు” అంది బిలాముతో.

29 “నన్ను ఒక వెర్రివాడిలా చేసావు నీవు. నా చేతిలోనే గనుక ఒక కత్తి ఉంటే, ఈ పాటికి నిన్ను నరికేసి ఉండేవాడ్ని” అన్నాడు బిలాము తన గాడిదతో.

30 అయితే ఆ గాడిద “ఎన్నేన్నో సంవత్సరాలుగా నీవు స్వారీ చేస్తున్న నీ సొంత గాడిదను నేను. ఇంతకు ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు తెలుసు” అంది బిలాముతో.

“అది నిజమే” బిలాము అన్నాడు.

31 అప్పుడు దారి మీద నిలబడ్డ దేవదూతను బిలాము చూడగలిగేటట్టు చేసెను యెహోవా. ఆ దేవదూతను, అతని కత్తిని బిలాము చూసాడు. అప్పుడు బిలాము నేలమీద సాష్టాంగపడ్డాడు.

32 యెహోవా దూత బిలామును అడిగాడు: “నీవు నీ గాడిదను ఎందుకు మూడుసార్లు కొట్టావు? నీకు నామీద కోపం రావాలి. నిన్ను ఆపు చేయటానికే సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను. 33 గాడిద నన్ను చూచి మూడు సార్లు నా నుండి పక్కకు తప్పుకొంది. ఆ గాడిద కనుక తప్పుకొని ఉండకపోతే నిన్ను చంపేసి ఉండేవాడ్ని. కానీ నీ గాడిదను నేను చంపేవాడ్ని కాదు.”

34 అప్పుడు బిలాము: “నేను పాపం చేసాను. దారి మీద నీవు నిలబడ్డావని నేనెరగను. నేను చేస్తోంది తప్పు అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.

35 “లేదు! ఈ మనుష్యులతో, నీవు వెళ్లవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండు. నీవు చెప్పాలని నేను నీతో చెప్పేమాటలే నీవు చెప్పాలి” అన్నాడు బిలాముతో యెహోవా దూత. కనుక బాలాకు పంపిన మనుష్యులతో బిలాము వెళ్లాడు.

36 బిలాము వస్తున్నాడని బాలాకు విన్నాడు. కనుక అర్నోను సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం దగ్గర అతణ్ణి కలుసుకొనేందుకు బాలాకు వెళ్లాడు. ఇది అతని దేశపు పొలిమేర. 37 బాలాకు బిలామును చూడగానే “నీవు రావాలని ఇది చాలా ముఖ్యమయిందని ఇంతకు ముందే నీతో చెప్పాను. నీవు నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఇప్పుడు ఏమీ చెల్లించ లేకపోవచ్చును” అన్నాడు బిలాముతో.

38 అయితే బిలాము: “ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ నీవు అడిగింది మాత్రం నేను చేయలేక పోవచ్చు. చెప్పమని యెహోవా దేవుడు నాకు చెప్పిన సంగతులు మాత్రమే నేను చెప్పగలను,” అని జవాబిచ్చాడు.

39 అప్పుడు బిలాము బాలాకుతోకూడ కిర్యాత్ హుచ్చోతుకు వెళ్లాడు. 40 బాలాకు తన బలి అర్పణగా కొన్ని ఎడ్లను, గొర్రెలను వధించాడు. ఆ మాంసం కొంత బిలాముకు, మరికొంత అతనితో ఉన్న నాయకులకు అతడు ఇచ్చాడు.

41 ఆ మర్నాటి ఉదయం బాలాకు బామోతు బయలు పట్టణానికి బిలామును తీసుకుని వెళ్లాడు. ఆ పట్టణం నుండి వారు ఇశ్రాయేలు ప్రజలు వేసుకొన్న గుడారాలను కొంత చూడగలరు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International