Chronological
మళ్లీ ప్రజల ఫిర్యాదు
11 ఈ సారి ప్రజలు వారి కష్టాలనుగూర్చి ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదులను యెహోవా విన్నాడు. యెహోవా వీటిని విన్నప్పుడు ఆయనకు కోపం వచ్చింది. యెహోవా దగ్గరనుండి అగ్ని వచ్చి ప్రజల మధ్య రగులుకొంది. వారున్న స్థలంలో ఒక చివర కొన్ని ప్రాంతాలను అగ్ని కాల్చివేసింది. 2 కనుక ప్రజలు మోషేకు మొరపెట్టుకొన్నారు. మోషే యెహోవాను ప్రార్థించగా అగ్ని కాల్చివేయటం ఆగిపోయింది. 3 అందుచేత ఆ చోటు తబేరా[a] అని పిలువబడింది. ఆ ప్రజల మధ్య యెహోవా అగ్నిని దహింపజేసాడు గనుక ఆ స్థలానికి వారు ఆ పేరు పెట్టారు.
70 మంది వృద్ధనాయకులు
4 ఇశ్రాయేలీయులతో చేరిన విదేశీయులు తినేందుకు ఇంకా ఏవేవో కావాలనికోరటం మొదలు పెట్టారు. త్వరలోనే మొత్తం ఇశ్రాయేలీయులంతా మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఇలా అన్నారు, “తినటానికి మాకు మాంసం కావాలి! 5 ఈజిప్టులో మేము తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. చేపలు మాకు ఉచితంగా దొరికేవి. మంచి కూరగాయలు – దోసకాయలు, పుచ్చకాయలు, ఆకు కూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు మాకు దొరికేవి. 6 కానీ ఇప్పుడు మాకు బలంలేదు. మేము, ఈ మన్నా తప్ప ఇంకేమి తినటంలేదు!” 7 ఆ మన్నా కొతిమెర గింజల్లా ఉండి, చూపునకు చెట్టుమీద జిగురు (బంక)లా ఉంది. 8 ప్రజలు దీనిని పోగుచేసి, నూరి, పిండి చేస్తారు. లేక బండలను ఉపయోగించి దాన్ని పొడుం చేస్తారు. తర్వాత ఒక కుండలో దాన్ని వంట చేసేవారు, లేదా తియ్యటి అప్పాలు చేసేవారు. అప్పాలు ఒలీవ నూనెతో చేసిన రొట్టెల్లా రుచిగా ఉండేవి. 9 ప్రతి రాత్రీ నేల అంతా మంచుతో తడిసినప్పుడు మన్నా నేలమీద కురిసేది.
10 ప్రతి కుటుంబం వాళ్లు ఫిర్యాదు చేయటం మోషే విన్నాడు. ప్రజలంతా వారివారి గుడారాల్లో గొణుగుతున్నారు. యెహోవాకు చాల కోపం వచ్చింది. దానితో మోషేకు చాలా చికాకు కలిగింది. 11 మోషే యెహోవాను అడిగాడు, “యెహోవా, నీ సేవకుడనైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు నాకెందుకు ఇచ్చావు? 12 ఈ ప్రజలందరికీ నేను తండ్రిని కానని నీకు తెలుసు. నేను వీరికి జన్మ ఇవ్వలేదనీ నీకు తెలుసు. కానీ పాలిచ్చి పెంచే దాదిలా నేనే వీరిని నా చేతుల్లో ఎత్తుకొని పోవాల్సినట్టు కనబడుతుంది. నేను ఇలా చేసేటట్టుగా నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశానికి నేను వారిని మోసుకొని వెళ్లాలని నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? 13 ఈ ప్రజలందరికీ మాంసం నాదగ్గర లేదు. కానీ వారు నాకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ‘తినటానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు వారు. 14 ఈ ప్రజలందరినీ గూర్చి నేను ఒక్కడినే బాధ్యత వహించలేను. ఈ భారం నాకు చాల బరువుగా ఉంది. 15 వారి కష్టాలన్నీ నీవు నా మీదే పెట్టాలనుకొంటే, ఇప్పుడే నన్ను చంపేయి. నన్ను నీ సేవకునిగా నీవు అంగీకరిస్తే, నన్ను ఇప్పుడే చావనివ్వు. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి.”
16 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నాదగ్గరకు తీసుకొనిరా. వీరు ప్రజలలో నాయకులు. సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకొనిరా. అక్కడ నీతోబాటు వారిని నిలబెట్టు. 17 అప్పుడు నేను దిగివచ్చి, అక్కడ నీతో మాట్లాడతాను. ఇప్పుడు నీ మీదికి వచ్చిన ఆత్మను వారికికూడ నేను కొంత ఇస్తాను. అప్పుడు నీవు ప్రజల బాధ్యత వహించటంలో వారు కూడ నీకు సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ ప్రజల బాధ్యత నీవు ఒంటరిగా భరించాల్సిన అవసరం ఉండదు.
18 “ప్రజలతో ఇలా చెప్పు: రేపటికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. రేపు మీరు మాంసం తింటారు. మీ ఏడ్పు యెహోవా విన్నాడు. ‘తినటానికి మాకు మాంసం కావాలి. ఈజిప్టులోనే బాగుంది మాకు’ అని మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. కనుక యెహోవా ఇప్పుడు మీకు మాంసం ఇస్తాడు. మీరు అది తింటారు. 19 ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై రోజులకంటె ఎక్కువగానే మీరు అది తింటారు. 20 ఒక నెల అంతా మీరు ఆ మాంసం తింటారు. మొఖం మొత్తేటంతవరకు మీరు ఆ మాంసం తింటారు. యెహోవాకు వ్యతిరేకంగా మీరు ఫిర్యాదు చేసారు కనుక మీకు ఇలా జరుగుతుంది. యెహోవా మీ మధ్య సంచరిస్తూ, మీ అవసరాలను గ్రహిస్తాడు. కానీ మీరు ఆయన ఎదుట ఏడ్చి, ఫిర్యాదు చేసారు! అసలు ‘మేము ఈజిప్టు ఎందుకు విడిచిపెట్టాము’ అన్నారు మీరు.”
21 మోషే ఇలా అన్నాడు: “యెహోవా, ఇక్కడ 6,00,000 మంది పురుషులు సంచరిస్తున్నారు. ‘నీవేమో వారు ఒక నెలంతా తినటానికి సరిపోయే మాంసం ఇస్తాను అంటున్నావు!’ 22 మొత్తం గొర్రెలు, పశువులు అన్నింటినీ వధించినా, ఇంత మంది ప్రజలకు ఒక నెల అంతా భోజనంగా పెట్టాలంటే అది చాలదు. అలానే సముద్రంలో ఉన్న మొత్తం చేపలన్నీ మేము పట్టినా, అవీ వారికి చాలవు.”
23 అయితే, “యెహోవా శక్తిని పరిమితం చేయకు. నేను చేస్తానని చెప్పినవాటిని చేస్తానో లేదో నీవు చూస్తావు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
24 కనుక మోషే ప్రజలతో మాట్లాడటానికి బయటకు వెళ్లాడు. యెహోవా చెప్పినది మోషే వారితో చెప్పాడు. అప్పుడు మోషే 70 మంది పెద్దలను సమావేశ పరచాడు. గుడారం చుట్టూ నిలబడమని మోషే వారితో చెప్పాడు. 25 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చి, మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న దేవుని ఆత్మను ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు యెహోవా.[b] ఆత్మ వారిమీదికి దిగిరాగానే వారు ప్రవచించటం మొదలు పెట్టారు. అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఆ మనుష్యులు ఇలా చేసారు.
26 ఎల్దాదు, మేదాదు అనే అద్దరు పెద్దలు బయట గుడారం దగ్గరకు వెళ్లలేదు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండిపోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదకి కూడ వచ్చినందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవచించటం మొదలుపెట్టారు. 27 ఒక యువకుడు పరుగెత్తి వెళ్లి మోషేతో చెప్పాడు. “ఎల్దాదు, మేదాదు గుడారంలోనే ప్రవచిస్తున్నారు” అని అతడు చెప్పాడు.
28 అయితే నూను కుమారుడైన యెహోషువ “అయ్యా మోషే, నీవు వారిని ఆపివేయాలి” అని మోషేతో చెప్పాడు. (యెహోషువ చిన్నతనం నుండి మోషేకు సహాయకుడుగా ఉన్నాడు.)
29 కాని మోషే, “ఇప్పుడు నేను నాయకుడ్ని కానని ప్రజలు తలుస్తారేమోనని నీవు భయపడుతున్నావా? యెహోవా ప్రజలు అందరూ ప్రవచిస్తే బాగుటుందని నా ఆశ. వారందరి మీద యెహోవా తన ఆత్మను ఉంచితే బాగుండునని నా ఆశ” అని బదులు చెప్పాడు. 30 అప్పుడు మోషే, ఇశ్రాయేలు నాయకులు అంతా తిరిగి గుడారాలకు వెళ్లిపోయారు.
పూరేళ్లు వచ్చాయి
31 అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్పగాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక రోజున నడువగలిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు ఉన్నాయి. 32 ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకొన్నవాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగుచేసుకున్నాడు. తర్వాత ప్రజలు ఆ పూరేళ్లను వారి గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు.
33 ప్రజలు మాంసం తినటం మొదలుపెట్టారు కాని యెహోవాకు చాల కోపం వచ్చింది. ఆ మాంసం ఇంకా వారి నోటిలో ఉండగానే, ప్రజలు దానిని తినటంముగించక ముందే ఆ ప్రజలకు భయంకరమైన రోగం వచ్చేటట్టు చేసాడు యెహోవా. అనేకులు అక్కడే మరణించినందువల్ల అక్కడే పాతిపెట్టబడ్డారు. 34 కనుక ప్రజలు ఆ చోటుకు కిబ్రోత్ హత్తావా[c] అని పేరు పెట్టారు. గొప్ప భోజనం కోసం బలీయమైన కోరికగల వారందరినీ అక్కడ పాతిపెట్టినందువల్ల వారు ఆ చోటుకు ఆ పేరు పెట్టారు.
35 కిబ్రోత్ హత్తావా నుండి ప్రయాణం చేసి ప్రజలు హజేరోతు చేరి అక్కడ నివసించారు.
మిర్యాము, అహరోను మోషేను విమర్శించటం
12 మిర్యాము, అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతని భార్య ఇథియోపియా స్త్రీ గనుక వారు అతణ్ణి విమర్శించారు. మోషే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసుకోవటం మంచిది కాదని వారు తలంచారు. 2 “ప్రజలతో మాట్లాడటానికి యెహోవా మోషేను వాడుకొన్నాడు. కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ యెహోవా మాట్లాడాడు కదా” అని వారు తమలో తాము అనుకొన్నారు.
యెహోవా ఇది విన్నాడు. 3 (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) 4 కనుక యెహోవా అకస్మాత్తుగా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పుడే సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు.
కనుక మోషే, అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు. 5 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చాడు. గుడార ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే 6 దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవానగు నేను వారికి దర్శనంలో కనబడతాను. కలలో నేనే వారితో మాట్లాడతాను. 7 కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. 8 నేను అతనితో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత ధైర్యంగా మాట్లాడారు?”
9 అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది. 10 యెహోవా మేఘం గుడారం మీదనుండి పైకి లేచి పోయింది. అప్పుడు అహరోను అటు తిరిగి మిర్యామును చూడగా, ఆమెకు భయంకర కుష్ఠురోగం రావటం అతనికి కనబడింది. ఆమె శరీరం మంచులా తెల్లగా ఉంది.
11 అప్పుడు మోషేతో అహరోను అన్నాడు: “అయ్యా, బుద్ధిహీనంగా మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించు. 12 చచ్చి పుట్టిన శిశువులా ఆమె తన శరీరాన్ని పోగొట్టుకోనియ్యకు.” (కొన్ని సార్లు అలాంటి శిశువు సగం శరీరం తినివేయబడి పుడుతుంది.)
13 కనుక మోషే, “ఓ దేవా ఈ రోగంనుండి ఆమెను బాగుచేయి” అని యెహోవాకు మొరపెట్టాడు.
14 “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమెకు ఏడు రోజులు అవమానం కలుగుతుంది. కనుక ఆమెను ఏడురోజులు పాళెమునకు బయట ఉంచండి. ఆ తర్వాత ఆమె తిరిగి లోనికి రావచ్చు” అని యెహోవా జవాబిచ్చాడు.
15 కనుక మిర్యాము ఏడు రోజులపాటు పాళెమునకు వెలుపల ఉంచబడింది. ఆమె మరల లోనికి తీసుకొని రాబడేంతవరకు ప్రజలు అక్కడనుండి కదలలేదు. 16 అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి పారాను అరణ్యానికి ప్రయాణం చేసారు. ప్రజలు ఆ అరణ్యంలో గుడారాలు వేసుకొన్నారు.
గూఢచారులు కనాను వెళ్లటం
13 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కరిని పంపించు.”
3 కనుక యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. పారాను అరణ్యంలోనికి నాయకులను అతడు పంపించాడు. 4 వారి పేర్లు ఇవి:
రూబేను వంశంనుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ.
5 షిమ్యోను వంశంనుండి హోరీ కుమారుడైన షాపాతు.
6 యూదా వంశంనుండి యెపున్నె కుమారుడైన కాలేబు.
7 ఇశ్శాఖారు వంశంనుండి యోసేపు కుమారుడైన ఇగాలు.
8 ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారుడైన హోషేయ.
9 బెన్యామీను వంశంనుండి రాఫు కుమారుడైన పల్తీ.
10 జెబూలూను వంశంనుండి సోరీ కుమారుడైన గదీయేలు.
11 మనష్షే (యెసేపు వంశాల్లో ఒకటి) వంశంనుండి సూసీ కుమారుడైన గదీ.
12 దాను వంశంనుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు.
13 ఆషేరు వంశంనుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు.
14 నఫ్తాలి వంశంనుండి వాపెసీ కుమారుడైన నహబీ.
15 గాదు వంశంనుండి మాకీ కుమారుడైన గెయువేలు.
16 ఆ దేశాన్ని చూచి పరిశీలించేందుకు మోషే పంపించిన వారి పేర్లు అవి. (నూను కుమారుడైన హోషేయను మోషే యెహోషువ అని మరో పేరు పెట్టి పిలిచేవాడు.)
17 కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నెగెవు ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి వెళ్లండి. 18 ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బలవంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాలమంది ఉన్నారా? 19 వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా? 20 ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. ఆ భూమి, సారమైనదా కాదా? ఆ భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).
21 అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు. 22 నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను పట్టణం కంటె హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించబడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి నివసించారు. వీరు అనాకీ ప్రజలు. 23 వాళ్లు ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు ఒక ద్రాక్ష గెల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గెలను ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు. 24 అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత ఆ చోటు ఎష్కోలు[d] అని పిలువబడింది.
25 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు. 26 ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. 27 ఆ మనుష్యులు మోషేతో ఇలా చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన పండ్లు ఇవిగో. 28 కానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు చాలా బలము, శక్తి ఉన్న వాళ్లు. వారి పట్టణాలు బలంగా కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టణాలు చాల పెద్దవి. అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని కూడ మేము అక్కడ చూశాము. 29 అమాలేకీ ప్రజలు నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల ప్రాంతంలో నివసిస్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర ప్రాంతంలోను, యొర్దాను నదీతీరంలోను నివసిస్తున్నారు.”
30 అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” అని చెప్పాడు.
31 కానీ అతనితోకూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు. 32 మనం ఆ దేశ ప్రజలను జయించేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: “మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఎవరినైనాసరే తేలికగా జయించ గలిగినంత బలంగలవాళ్లు వారు. 33 అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూసాం (నెఫీలీ ప్రజలవాడగు అనాకు సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా ఉన్నట్టు అనిపించింది. మేమేదో మిడుతలంత చిన్నవాళ్లంగా మమ్మల్ని చూసారు.”
© 1997 Bible League International