Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 8-10

దీప స్తంభం

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “అహరోనుతో మాట్లాడి అతనితో ఇలా చెప్పు, నేను నీకు చూపించిన స్థలంలో ఏడు దీపాలను ఉంచు. దీపస్తంభం ముందు భాగాన్ని ఆ దీపాలు వెలిగించాలి.”

అహరోను అలా చేసాడు. అహరోను ఆ దీపాలను సరైన చోట పెట్టి, దీపస్తంభం ముందు భాగాన్ని అవి వెలిగించేటట్టుగా అతడు వాటిని ఉంచాడు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు అతడు విధేయుడయ్యాడు. దీపస్తంభం సాగగొట్టబడిన బంగారంతో చేయబడింది. దిమ్మదగ్గర మొదలుకొని బంగారు పూలవరకు అంతా బంగారమే. మోషేకు యెహోవా చూపించిన ప్రకారమే అదంతా చేయబడింది.

లేవీయులను ప్రతిష్టించటం

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులలో ఇతరులనుండి లేవీ ప్రజలను వేరు చేయి. ఆ లేవీ మనుష్యులను శుద్ధి చేయి. వారిని శుద్ధి చేసెందుకు నీవు చేయాల్సింది ఇదే. పాప పరిహారార్థ అర్పణనుండి ప్రత్యేక జలాన్ని వారిమీద చల్లాలి. ఈ జలం వారిని శుద్ధి చేస్తుంది. అప్పుడు వారు శరీరం అంతటా క్షవరం చేసుకొని, వారి బట్టలు ఉదుకు కోవాలి. ఇది వారి శరీరాలను పవిత్రం చేస్తుంది.

“అప్పుడు వారు ఒక కోడెదూడను, దానికి సంబంధించిన ధాన్యార్పణను తీసుకోవాలి. ఈ ధాన్యార్ఫణ నూనెతో కలుపబడ్డ గోధుమపిండి. అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఇంకో కోడెదూడను తీసుకోవాలి. లేవీ ప్రజలను సన్నిధి గుడారం ఎదుటి భాగంలోనికి తీసుకురావాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ చుట్టూరా సమావేశపర్చాలి. 10 అప్పుడు నీవు లేవీ ప్రజలను యెహోవా ఎదుటికి తీసుకురావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారిమీద తమ చేతులు ఉంచుతారు. 11 అప్పుడు అహరోను లేవీ మనుష్యులను యెహోవా ఎదుట కనపరుస్తాడు. వారు దేవునికి ఒక అర్పణవలె ఉంటారు. ఈ విధంగా యెహోవాకు ప్రత్యేక పని చేసేందుకు లేవీ ప్రజలు సిద్ధంగా ఉంటారు.

12 “లేవీ మనుష్యులు కోడెదూడ తలలమీద చేతులు ఉంచాలని వారితో చెప్పు. ఒక కోడెదూడ పాపపరిహారార్థ బలిగాను మరొక కోడెదూడ దహన బలిగాను యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలు లేవీ ప్రజల పాపాలను కప్పిపుచ్చుతాయి. 13 అహరోను, అతని కుమారుల ఎదుట నిలబడమని లేవీ మనుష్యులతో చెప్పు. అప్పుడు ఒక ప్రతిష్ఠ అర్పణగా లేవీ మనుష్యులను యెహోవాకు అర్పించు. 14 ఈ విధంగా లేవీ మనుష్యులు ప్రత్యేకం అవుతారు. ఇశ్రాయేలీయులలో ఇతరులకు వీరు వేరుగా ఉంటారు. లేవీ ప్రజలు నావారై ఉంటారు.

15 “కనుక లేవీ మనుష్యులను పవిత్రం చేయి. ప్రతిష్ఠార్పణగా వారిని యెహోవాకు అర్పించు. ఇలా చేసిన తర్వాత వారు సన్నిధి గుడారంలోనికి వచ్చి వారి పని చేయవచ్చును. 16 ఈ లేవీయులు నాకు ఇవ్వబడిన ఇశ్రాయేలు ప్రజలు. వారిని నా స్వంత ప్రజలుగా నేను స్వీకరించాను. గతంలో ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబంలో ప్రతి పెద్ద కుమారుడు నాకు ప్రతిష్ఠించబడ్డాడు. అయితే ఇశ్రాయేలుల్లో ఇతరుల జ్యేష్ఠ కుమారుల బదులు లేవీయులు మనుష్యులను నేను స్వీకరించాను. 17 ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబములో మొదట పుట్టిన ప్రతి మగ శిశువు నావాడే. అది మనిషిగాని పశువుగాని నాకే. ఎందుకంటే ఈజిప్టులో మొదట పుట్టిన పిల్లలను, జంతువులనుగూడ నేను చంపేసాను, కనుక మొదట పుట్టినవారు నావారై ఉండాలని పెద్ద కుమారులను మీ నుండి వేరు చేసాను. 18 ఇప్పుడు నేను లేవీ మనుష్యులను తీసుకున్నాను. ఇశ్రాయేలు కుటుంబాల్లో మొదటగా పుట్టిన కుమారులందరి స్థానంలో నేను వీరిని తీసుకున్నాను. 19 ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ మనష్యులను నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను వారిని అహరోనుకు అతని కుమారులకు కానుకలుగా ఇచ్చాను. సన్నిధి గుడారం దగ్గర వారు పని చేయాలని నేను కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా వారు సేవ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను కప్పిపుచ్చే బలులు అర్పించుటలో వారు సహాయం చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పవిత్ర స్థలాన్ని సమీపించినా ఏ గొప్ప రోగంగాని, కష్టంగాని వారికి కలుగదు.”

20 కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవాకు విధేయులయ్యారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానిని లేవీ మనుష్యులకు వారు జరిగించారు. 21 లేవీ ప్రజలు పవిత్రులయ్యారు. వారు వారిని శుద్ధి చేసుకున్నారు, వారి వస్త్రాలు ఉదుకు కొన్నారు. అప్పుడు అహరోను వారిని యెహోవా ఎదుట ప్రతిష్టార్పణగా అర్పించాడు. వారి పాపాలను క్షమించే అర్పణలను కూడా అర్పించి, అహరోను వారిను పవిత్రం చేసాడు. 22 ఆ తర్వాత లేవీ మనుష్యులు వారి పని చేసుకొనేందుకు సన్నిధి గుడారానికి వచ్చారు. అహరోను, అతని కుమారులు వారిని పర్యవేక్షించారు. లేవీ ప్రజల పనికి వారు బాధ్యులు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞకు అహరోను, అతని కుమారులు విధేయులయ్యారు.

23 మోషేతో యెహోవా చెప్పాడు: 24 “ఇది లేవీ ప్రజలకు ఒక ప్రత్యేక ఆజ్ఞ. 25 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల ప్రతి లేవీ మనిషి సన్నిధి గుడారం దగ్గరకు వచ్చి అక్కడ పని చేయాలి. 25 అయితే ఒకని వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతడు తన దినచర్యనుండి విశ్రాంతి తీసుకోవాలి. అతడు తిరిగి పని చేయాల్సిన అవసరం లేదు. 26 50 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల పురుషులు సన్నిధి గుడారం దగ్గర వారి సోదరులకు సహాయం చేయవచ్చును. కాని వారే స్వయంగా ఆ పని చేయకూడదు. వారిని విరమించుకోనివ్వవచ్చు. లేవీ ప్రజలకు వారి పనులను చెప్పేటప్పుడు ఇది చెప్పటం జ్ఞాపకం ఉంచుకో.”

పస్కా పండుగ ఆచరణ

సీనాయి అరణ్యంలో మోషేతో యెహోవా మాట్లాడాడు: ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, ఒక నెల నాటి మాట ఇది. మోషేతో యెహోవా అన్నాడు: “నిర్ణీత సమయంలో పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఈ నెల పద్నాల్గవ రోజు ఆ నిర్ణీత సమయం. మసక చీకటి వేళ వారు ఆ భోజనం చేయాలి. మరియు భోజనంనుగూర్చి నేను ఇచ్చిన నియమాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.”

కనుక పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోమని ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు. పద్నాల్గవ రోజున మసక చీకటివేళ సీనాయి అరణ్యంలో ప్రజలు ఇది చేసారు. ఇది మొదటి నెలలో. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు జరిగించారు.

అయితే ఆ రోజున కొందరు ప్రజలు పస్కా భోజనం చేయలేకపోయారు. ఒక శవంమూలంగా వారు అపవిత్రులయ్యారు. కనుక ఆ రోజున మోషే అహరోనుల దగ్గరకు వారు వెళ్లారు. “ఒక శవం మూలంగా మేము ‘అపవిత్రులమయ్యాము’. అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము కూడ యెహోవాకు ఈ నిర్ణీత సమయంలో కానుకలు అర్పించటంలోను పస్కా ఆచరించుటలోను యాజకులు అడ్డుకొన్నారు” అని ఆ ప్రజలు మోషేతో చెప్పారు.

“దీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను అడుగుతాను” అన్నాడు మోషే వారితో.

అప్పుడు మోషేతో యెహోవా: 10 “ఇశ్రాయేలీయులతో ఈ విషయాలు చెప్పు, ఒకవేళ సరైన సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నారేమో. మీరో లేక మీ సంతానంలోవారెవరైనా ఒక శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా మీరు ప్రయాణంలో ఉన్నారేమో. 11 అయితే మీరు కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్ణీత సమయంలో కాదు. రెండవ నెల పద్నాలుగో రోజు సందెవేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో మీరు గొర్రెపిల్లను, పులియని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి. 12 ఆ భోజనంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. మరియు ఎముకలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కావిందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ మీరు పాటించాలి. 13 అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కావిందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతుడు నిర్ణీత సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, అప్పుడు అతడ్ని తన ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు గనుక అతడు దోషి.

14 “ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం కూడ పెట్టాలి.”

మేఘం—అగ్ని స్థంబాలు

15 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది. 16 ఆ మేఘం రాత్రి అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది. 17 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. ఆ మేఘం ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొన్నారు. 18 ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు. 19 కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే ఆ మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై ముందుకు కదల్లేదు. 20 కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని వెంబడించారు. 21 కొన్నిసార్లు ఆ మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు. 22 రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు. 23 కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలు లోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ.

వెండి బూరలు

10 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “రెండు వెండి బూరలు చేయించు. వెండిని ఉపయోగించి, బూరలు చేసేందుకు దానిని సాగగొట్టాలి. ఆ బూరలు ప్రజలందర్నీ సమావేశపర్చి సేనలను ఎప్పుడు బయలుదేరదీయాలో చెప్పటానికి ఉండవలెను. ప్రజలు ఎక్కడ నివాసం చేయాలి అనేది వారికి చెప్పటానికి ఇది నీకు సహాయకరంగా ఉంటుంది. ఆ రెండు బూరలు ఒక ప్రకటనగా ఉంటాయి. ప్రజలంతా అది విని, సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నీ ఎదుట కూడుకొంటారు. నీవు ఒకే బూర ఊదితే నాయకులు (ఇశ్రాయేలు పన్నెండు కుటుంబాల నాయకులు) నీ ఎదుట కూడుకొంటారు.

“నీవు ఒక బూరను పదే పదే ఊదితే, తూర్పు వైపున నివాసం చేస్తున్న వంశాలు బయల్దేరాలి. ఒక బూరను నీవు రెండోసారి కూడా అలాగే ఊదితే దక్షిణాన నివాసం చేస్తున్నవారు బయల్దేరాలి. బూర శబ్దం ప్రజలు బయల్దేరాలని చెప్పే ఒక ప్రకటన. ప్రజలందరినీ ఒక్కచోట నీవు సమకూర్చాలంటే, బూరలను మరో విధంగా అంటే ఏకధాటిగా ఒకే శృతిలో ఊదాలి. అహరోను కుమారులు, యాజకులు బూరలు ఊదాలి. ఇది మీకు భవిష్యత్తులో కూడ కొనసాగే ఆజ్ఞ.

“మీ స్వంత స్థలంలో మీరు శత్రువుతో యుద్ధం చేయాల్సివస్తే, మీరు వారిమీదికి వెళ్లక ముందు బూరలను గట్టిగా ఊదాలి. అప్పుడు మీ యెహోవా దేవుడు వింటాడు, మీ శత్రువులనుండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు. 10 అలాగే మీ ప్రత్యేక సంతోష సమయాల్లోకూడ మీరు బూరలు ఊదాలి. మీ ప్రత్యేక పండుగ దినాల్లోను, నెలల ఆరంభ దినాల్లోను మీ బూరలు ఊదండి. మీ దహన బలులు, మీ సమాధాన బలులు అర్పించేటప్పుడు మీ బూరలు ఊదండి. అది మీరు మీ దేవుని జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరమైన ఒక ప్రత్యేక విషయం. మీరు ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”

ఇశ్రాయేలు ప్రజల నివాసం మార్పు

11 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన తర్వాత రెండో సంవత్సరం, రెండో నెలలో (20వ రోజు) సన్నిధి గుడారం మీదనుండి మేఘం పైకి లేచింది. 12 అందుచేత ఇశ్రాయేలు ప్రజలంతా సీనాయి అరణ్యంనుండి బయల్దేరి ప్రయాణం మొదలుబెట్టారు. పారాను అరణ్యంలో ఆ మేఘం నిలిచిపోయేంత వరకు, వారు ప్రయాణం చేసారు. 13 మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ ప్రజలు వారి స్థలాన్ని మార్చటం ఇది మొదటి సారి.

14 యూదా గుడారంలో మూడు విభాగాలు ముందుగా వెళ్లాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొదటి విభాగం యూదా వంశం. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ విభాగానికి సైన్యాధిపతి. 15 తర్వాత ఇశ్శాఖారు విభాగం. సూయారు కుమారుడైన నెతనేలు ఆ కుటుంబ విభాగానికి సైన్యాధిపతి. 16 ఆ తర్వాత జెబూలూను విభాగం. హెలోను కుమారుడైన ఏలీయాబు ఆ విభాగానికి సైన్యాధిపతి.

17 అప్పుడు సన్నిధి గుడారం దించబడింది. గెర్షోను, మెరారి కుటుంబ పురుషులు పవిత్ర గుడారం మోసారు. కనుక తర్వాత ఈ కుటుంబాల ప్రజలు వరుసలో ఉన్నారు.

18 తర్వాత రూబేను నివాసము నుండి మూడు భాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటిది రూబేను వంశం. షెదెయూరు కుమారుడైన ఏలీసూరు ఆ విభాగానికి సైన్యాధిపతి. 19 తర్వాత షిమ్యోను వంశం. సూరిషదాయి కుమారుడైన షెలుమీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 20 తర్వాత గాదు వంశం. దెయువేలు కుమారుడు ఎలీయాసాపు ఆ విభాగానికి సైన్యాధిపతి. 21 తర్వాత కహాతు కుటుంబ ప్రజలు. పవిత్ర గుడారం లోపల ఉండే పవిత్ర పరికరాలను వారు మోసారు. ఈ ప్రజలంతా వచ్చేయకముందే పవిత్ర గుడారం నిలబెట్టేందుకు వీలుగా వీరు ఈ సమయంలో వచ్చారు. ప్రజలు కూడా వచ్చారు.

22 తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగాం ఎఫ్రాయిము వంశం. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఆ భాగానికి సైన్యాధిపతి. 23 తర్వాత మనష్షే వంశం. పెదాసూరు కుమారుడైన గమలీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 24 తర్వాత బెన్యామీను వంశం. గిద్యోనీ కుమారుడైన అబీదాను ఆ విభాగానికి సైన్యాధిపతి.

25 వరుసలో చివరి మూడు వంశాలు మిగిలిన విభాగాలన్నిటికీ వెనుక కాపుగా ఉన్నాయి. ఇవి దాను నివాసానికి చెందినవి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటి విభాగం దాను వంశం. అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ విభాగానికి సైన్యాధిపతి. 26 తర్వాత ఆషేరు వంశం. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 27 తర్వాత నఫ్తాలి వంశం. ఏనాను కుమారుడైన అహీరా ఆ విభాగానికి సైన్యాధిపతి. 28 ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటు నుండి మరో చోటకు బయల్దేరినప్పుడు, వారు వెళ్లిన విధానం అది.

29 మిద్యానీ వాడగు రెవూయేలు కుమారుడు హోబాబు. (రెవూయేలు మోషేకు మామ.) “దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాము. కనుక మాతో రమ్ము. మేము నీకు మేలు చేస్తాము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా మంచివాటిని వాగ్దానం చేసాడు” అని హోబాబుతో మోషే చెప్పాడు.

30 “నేను మీతో రాను, నేను నా సొంతదేశానికి, నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లిపోతాను” అని హోబాబు జవాబిచ్చాడు.

31 అప్పుడు మోషే, “దయచేసి మమ్మల్ని విడువకు. అరణ్యంగూర్చి మాకంటె నీకే ఎక్కువ తెలుసు. నీవు మాకు మార్గదర్శిగా ఉండొచ్చు. 32 నీవు మాతో వస్తే, యెహోవా మాకు ఇచ్చే మంచివాటన్నింటిలో మేము నీకు భాగం ఇస్తాము” అని చెప్పాడు.

33 కనుక హోబాబు ఒప్పుకొన్నాడు. యెహోవా పర్వతం దగ్గరనుండి వారు ప్రయాణం మొదలు బెట్టారు. పురుషులు యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను పట్టుకొని ప్రజల ముందు నడిచారు. వారు స్థలం కోసం వెదుకుతూ, మూడు రోజులపాటు పవిత్ర పెట్టెను మోసారు. 34 యెహోవా మేఘం ప్రతిరోజూ వారిమీద ఉంది. ప్రతి ఉదయం వారు తమ స్థలం విడిచిపెట్టినప్పుడు, వారిని నడిపించేందుకు మేఘం అక్కడ ఉండేది:

35 ప్రజలు ప్రయాణం మొదలు బెట్టి, పవిత్రపెట్టె వారితో పాటు వెడలగానే, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు:

“యెహోవా, లెమ్ము
    నీ శత్రువులు అన్ని దిక్కుల్లో పారిపోదురు గాక:
    నీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులు నీ ఎదుట నుండి పారిపోదురుగాక,”

36 పవిత్ర పెట్టెను, దాని స్థలంలో దాన్ని ఉంచి నప్పుడు, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు,

“యెహోవా, లక్షలాదిమంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రమ్ము.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International