Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 5-6

పరిశుభ్రత నియమాలు

మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు వ్యాధులు, రోగములు లేకుండ వారి నివాసమును కాపాడుకోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కుష్ఠురోగం ఉన్న ఏ మనిషినైనా సరే వారి నివాసములో నుండి పంపించి వేయాలని ప్రజలతో చెప్పు. స్రావంగల ప్రతి మనిషిని వారి నివాసంలోనుండి పంపివేయాలని వారితో చెప్పు. శవాన్ని ముట్టిన ప్రతి మనిషినీ వారి నివాసమునుండి పంపివేయాలని వారితో చెప్పు. అతడు స్త్రీగాని, పురుషుడుగాని గొప్పేమీ కాలేదు. రోగాన్ని వ్యాధిని వారు మీ నివాసములో వ్యాపింపజేయకుండునట్లు వారిని మీ నివాసమునుండి బయటకు పంపించివేయండి. మీ నివాసములో మీ మధ్య నేను నివసిస్తున్నాను.”

కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞకు విధేయులయ్యారు. అలాంటి వారిని నివాసము వెలుపలకు వారు పంపించివేసారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు ఇలా చేసారు.

తప్పు చేస్తే చెల్లించాలి

మోషేతో యెహోవా ఈలాగు చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు: ఒకడు మరొక వ్యక్తికి కీడు చేస్తాడు. (ఒకడు ఇతరులకు కీడు చేస్తే వాడు నిజానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.) అతడు దోషి. కనుక అతడు తాను చేసిన పాపం గూర్చి ప్రజలతో చెప్పాలి. తర్వాత అతడు చేసిన తప్పుకు పూర్తిగా విలువ చెల్లించాలి. అతడు ఎవరికి నష్టం కలిగించాడో ఆ మనిషికి చెల్లించాల్సిన దానికి ఇంకా ఐదో వంతు కలిపి చెల్లించాలి. కానీ ఒక వేళ ఎవరికైతే అతడు నష్టం కలిగించాడో అతడు చనిపోయినయెడల, ఒక వేళ నష్టపరిహారం పుచ్చుకొనేందుకు చనిపోయిన వ్యక్తికి నావాళ్లు అనుటకు ఎవరు లేనియెడల, అలాంటప్పుడు తప్పు చేసినవాడు ఆ విలువను యెహోవాకు చెల్లించాలి. అతడు పూర్తి మొత్తాన్ని యాజకునికి చెల్లించాలి. యాజకుడు ప్రాయశ్చిత్తార్థపు పొట్టేలును బలిగా అర్పించాలి. తప్పు చేసిన ఆ మనిషి పాపాలు క్షమింపబడుటకు బలిగా పొట్టేలు అర్పించబడాలి. మిగిలిన విలువను యాజకుడు ఉంచు కోవచ్చును.

“ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు దేవునికి ఒక ప్రత్యేక కానుక ఇస్తే, దానిని స్వీకరించే యాజకుడు దానిని ఉంచుకోవచ్చును. అది అతనిదే. 10 ఈ ప్రత్యేక కానుకలు అర్పించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కాని ఎవరైనా అలా ఇస్తే, అవి యాజకునికే చెందుతాయి.”

అనుమానం భర్తలు

11 అప్పుడు మోషేతో యెహోవా ఈలాగున చెప్పాడు: 12 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: ఒకని భార్య అతనికి అపనమ్మకంగా ఉంటుంది. 13 ఆమె మరొకనితో శయనించి, తన భర్తకు తెలియకుండా ఈ విషయం దాచిపెడుతుంది. ఆమె చేసిన తప్పునుగూర్చి ఆమె భర్తకు ఎప్పటికి తెలియకపోవచ్చు. ఆమె ఆ పాపం చేసిందని అతనితో చెప్పేవారు ఎవరూ ఉండక పోవచ్చు. మరియు ఆ స్త్రీ తన పాపం విషయం తన భర్తకు చెప్పకపోవచ్చు. 14 కానీ, తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని ఆ భర్త అనుమానించటం ప్రారంభం కావచ్చు. అతనిలో కోపం కలుగుతూ వుండవచ్చు. ఆమె పవిత్రంగా లేదని, తనకు నమ్మకంగా లేదని అతనిలో అనుమానం ఏర్పడుతూ ఉండవచ్చు. 15 అలా జరిగితే, అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకునిపోవాలి. ఆ భర్త ఒక అర్పణకూడ తీసుకొని వెళ్లాలి. ఆ అర్పణ తూమెడు యవలపిండిలో పదోవంతు. యవలపిండిలో నూనెగాని సాంబ్రాణిగాని వేయకూడదు. ఈ యవల పిండి యెహోవాకు ధాన్యార్పణ. భర్త రోషం మూలంగా అది అర్పించబడింది. అతని భార్య అతనికి అపనమ్మకంగా ఉందని అతడు నమ్ముతున్నట్టు ఈ అర్పణ సూచిస్తుంది.

16 “యాజకుడు ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలువబెడ్తాడు. 17 అప్పుడు యాజకుడు మట్టి పాత్రలో పవిత్ర జలం పోస్తాడు. పవిత్ర గుడారంలోని నేల మీద మట్టి కొంత తీసుకుని, దానిని ఆ నీళ్లలో వేస్తాడు యాజకుడు. 18 ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలచివుండమని యాజకుడు ఆమెను బలవంతం చేస్తాడు. అప్పుడతడు ఆమె తల వెంట్రుకలను వదులుగా విడిచి, ధాన్యార్పణను ఆమె చేతిలో పెడతాడు. ఇది తన భర్త రోషం విషయం అర్పించే యవల పిండి. అదే సమయంలో పవిత్ర జలం ఉన్న మట్టి పాత్రను అతడు పట్టుకొంటాడు. ఇది ఆ స్త్రీకి చిక్కుతెచ్చిపెట్టే పవిత్ర జలం.

19 “అప్పుడు అబద్ధం చెప్పకూడదని యాజకుడు ఆ స్త్రీతో చెబుతాడు. సత్యం చెబుతానని ఆమె వాగ్ధానం చేయాలి. యాజకుడు ఆమెతో ఇలా అంటాడు, ‘నీవు ఇంకో మగవాడితో శయనించి ఉండకపోతే, నీ భర్తను పెళ్లాడిన నీవు, అతనికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, కష్టం కలిగించే ఆ జలం నీకు హాని చేయదు. 20 కానీ నీవు నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, నీవు మరో మగవాడితో శయనించి ఉంటే నీకు ఏదో కీడు జరుగుతుంది. నీవు పవిత్రురాలివి కాదు. ఎందుచేతనంటే నీ భర్తకాని వాడైన పర పురుషుడు నీతో శయనించి నిన్ను అపవిత్రం చేసాడు. 21 కనుక నీవు ప్రత్యేక జలం తాగినప్పుడు నీకు గొప్ప కీడు సంభవిస్తుంది. నీ కడుపు ఉబ్బిపోతుంది, ఇంక నీకు పిల్లలు పుట్టరు. నీవు గర్భవతివి అయితే నీ శిశువు చనిపోతుంది. అప్పుడు నీ వాళ్లంతా నిన్ను విడిచిపెట్టేసి, నిన్నుగూర్చి చెడుగా చెప్పుకొంటారు.’

“ఆ స్త్రీ యెహోవాకు ప్రత్యేక ప్రమాణం చేయాలని యాజకుడు ఆమెతో చెప్పాలి. ఆ స్త్రీ అబద్ధం గనుక చెబితే ఈ కీడు తనకు జరుగుతుందని ఒప్పుకోవాలి. 22 ‘నీ శరీరంలో హాని కలిగించే ఈ నీళ్లు నీవు తాగాలి. నీవు పాపం చేసి ఉంటే నీకు పిల్లలు పుట్టరు, నీకు కలిగే ఏ శిశువైనా సరే పుట్టక ముందే చనిపోతుంది’ అని యాజకుడు చెప్పాలి. అప్పుడు ఆ స్త్రీ ‘నీవు చెప్పినట్టు చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను’ అని చెప్పాలి.

23 “యాజకుడు ఈ హెచ్చరికలను ఒక పత్రంమీద వ్రాయాలి. అప్పుడు అతడు ఆ మాటలను నీళ్లలోనికి తుడిచివేయాలి. 24 అప్పుడు హాని కలిగించే ఆ నీళ్లను ఆ స్త్రీ తాగుతుంది. ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె దోషి అయితే, ఆమెకు చాల శ్రమ కలిగిస్తాయి.

25 “అప్పుడు యాజకుడు ఆమె దగ్గరనుండి ధాన్యార్పణ తీసుకుని (రోషమునకు అర్పించు అర్పణ) దానిని యెహోవా ఎదుట పైకి ఎత్తుతాడు. తర్వాత బలిపీఠం దగ్గరకు దానిని తెస్తాడు. 26 ఆ తర్వాత యాజకుడు తన చేతినిండా ధాన్యార్పణ పట్టుకొని బలిపీఠం మీద ఉంచుతాడు. అప్పుడు అతడు దానిని దహిస్తాడు. ఆ తర్వాత ఆ నీళ్లు త్రాగమని అతడు ఆ స్త్రీతో చెబుతాడు. 27 ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు. 28 కానీ ఆస్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, ఆమె పవిత్రంగా ఉంటే అప్పుడు ఆమె నిర్దోషి అని యాజకుడు చెబుతాడు. అప్పుడు ఆమె మామూలుగా ఉండి పిల్లలను కనగల్గుతుంది.

29 “అందుచేత రోషమునుగూర్చిన ఆజ్ఞ ఇది. తన భర్తతో వివాహం జరిగిన ఒక స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నీవు చేయాల్సింది ఇది. 30 లేక ఒకడు తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని అనుమానించినప్పుడు అతడు చేయాల్సింది ఇది. ఆ స్త్రీని యెహోవా యెదుట నిలువమని యాజకుడు చెప్పాలి. అప్పుడు యాజకుడు ఇవన్నీ చేయాలి. ఇది ఆజ్ఞ. 31 ఇలా చేసినందువల్ల భర్త తప్పు చేసినట్టు కాదు. కానీ ఆ స్త్రీ మాత్రం పాపం చేసి ఉంటే శ్రమ అనుభవిస్తుంది.”

నాజీరులు

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులతో ఈ విషయాలు చెప్పు: ఒక పురుషుడు గాని స్త్రీగాని కొన్నాళ్ల పాటు ఒకరినుండి ఒకరు ప్రత్యేకంగా ఉండాలని కోరవచ్చును. ఈ ప్రత్యేకించు కోవటంలో ఉద్దేశం, అతడు ఆ వ్యవధిలో తనను తాను సంపూర్ణంగా యెహోవాకు అర్పించుకోవటమే. అతడు నాజీరు అని పిలువబడతాడు. ఆ కాలంలో అతడు ద్రాక్షామద్యంగాని ఇంకే మత్తు పానీయంగాని తాగకూడదు. ద్రాక్షారసంనుండి తీయబడిన చిరకను గాని ఇంకే మత్తు పానీయంగాని అతడు త్రాగకూడదు. ద్రాక్షాపండ్లుగాని, ఎండిన ద్రాక్షాలుగాని అతడు తినకూడదు, ద్రాక్షారసం తాగకూడదు. వేరుగా ఉండే ఆ ప్రత్యేక సమయంలో ద్రాక్షానుండి వచ్చేది ఏదీ అతడు తినకూడదు. ద్రాక్షాగింజలను, దాని తోలును కూడ అతడు తినకూడదు.

“అలా వేరుగా ఉండే కాలంలో అతడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అతడు వేరుగా ఉండాల్సిన రోజులు గడచిపోయేంతవరకు అతడు పవిత్రంగా ఉండాలి. అతడు తన వెంట్రుకలను పొడవుగా పెరగనివ్వాలి. అతడు దేవునికి చేసిన వాగ్దానంలో అతని తల వెంట్రుకలు ఒక భాగం. ఆ వెంట్రుకలను ఒక కానుకగా అతడు దేవునికి ఇస్తాడు. అందుచేత వేరుగా ఉండే సమయం అయిపోయేంత వరకు అతడు తన తల వెంట్రుకలను పొడవుగా పెంచాలి.

“నాజీరు వేరుగా ఉన్న సమయంలో, అతడు శవాన్ని సమీపించకూడదు. ఎందుచేతనంటే అతడు తనను తాను పూర్తిగా యెహోవాకు అర్పించుకొన్నాడు. అతని సొంత తండ్రి లేక తల్లి, సోదరుడు లేక సోదరి చనిపోయినా సరే అతడు వారిని తాకగూడదు. అలా తాకితే అతడు అపవిత్రుడవుతాడు. అతడు ప్రత్యేకించుకొన్నట్టు, పూర్తిగా యెహోవాకు అర్పించు కొన్నట్టు అతడు చూపెట్టుకోవాలి. అతడు వేరుగా ఉన్న కాలమంతటిలో తనను తాను పూర్తిగా యెహోవాకు అర్పించుకొన్నాడు. నాజీరు మరొకనితో ఉన్నప్పుడు, ఆ మరొకడు అకస్మాత్తుగా మరణించవచ్చును. చనిపోయినవానిని నాజీరు ముట్టినట్టయితే నాజీరు అపవిత్రుడవుతాడు. ఇలా జరిగినట్లయితే నాజీరు తన తల వెంట్రుకలను తీసివేయాలి. (ఆ వెంట్రుకలు అతని ప్రమాణంలో ఒక భాగం.) ఏడో రోజున అతడు తన వెంట్రుకలను తీసివేయాలి. ఎందుచేతనంటే ఆ రోజునే అతడు శుద్ధి చయబడ్డాడు. 10 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను యాజకుని దగ్గరకు తీసుకుని రావాలి. పవిత్ర గుడార ద్వారం దగ్గరే అతడు వాటిని యాజకునికి ఇవ్వాలి. 11 అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలిగా ఒకదాన్ని అర్పిస్తాడు. రెండో దానిని దహన బలిగా అతడు అర్పిస్తాడు. ఈ దహనబలి ఆ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. (అతడు శవం దగ్గర ఉండటమే అతని పాపం.) అతడు తన తలవెంట్రుకలను దేవునికి ఇస్తానని ఆ సమయంలో మరల ప్రమాణం చేయాలి. 12 అనగా అతడు మరల ప్రత్యేకంగా ఉండేందుకు తనను యెహోవాకు అర్పించుకోవాలని దీని అర్థం. ఒక సంవత్సరం వయసు గల ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకురావాలి. అపరాధ పరిహారార్థ బలిగా అతడు దీనిని ఇవ్వాలి. అతడు ప్రత్యేకంగా ఉన్న రోజులన్నీ మరచిపోవటం జరిగింది. అతడు మరల ప్రత్యేకంగా ఉండటం ప్రారంభించాలి. అతడు మొదటిసారి ప్రత్యేకంగా ఉన్నప్పుడు శవాన్ని ముట్టినందువల్ల ఇలా చేయాలి.

13 “ఆ మనిషి ప్రత్యేకంగా ఉండాల్సిన సమయం అయిపోయిన తర్వాత అతడు ఇలా చేయాలి: సన్నిధి గుడార ద్వారం దగ్గరకు అతడు వెళ్లాలి. 14 అక్కడ తన అర్పణను అతడు యెహోవాకు ఇవ్వాలి. అతని అర్పణ ఏమిటంటే:

దహనబలి కోసం ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండకూడదు.)

పాప పరిహారార్థబలి కోసం ఒక్క సంవత్సరపు ఆడ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండ కూడదు.)

సమాధాన బలికోసం ఒక్క మగ గొర్రె (ఈ గొర్రెకు ఎలాంటి లోపం ఉండ కూడదు.)

15 ఒక గంపనిండా పొంగనిపిండి రొట్టెలు, (నూనెతో చేసిన మంచి గోధుమపిండి రొట్టెలు, ఈ రొట్టెల మీద నూనెపూయాలి).

ధాన్యార్పణం, పానార్పణం ఈ కానుకలలో భాగంగా వుండాలి.

16 “అప్పుడు యాజకుడు వీటిని యెహోవాకు అర్పిస్తాడు. పాపపరిహారార్థబలిని, దహనబలిని యాజకుడు అర్పిస్తాడు. 17 రొట్టెలబుట్టను యాజకుడు యెహోవాకు అర్పిస్తాడు. తర్వాత యెహోవాకు సమాధానబలిగా మగ గొర్రెను అతడు వధిస్తాడు. ధాన్యార్పణ, పానార్పణలతో అతడు దానిని యెహోవాకు అర్పిస్తాడు.

18 “సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గరకు నాజీరు వెళ్లాలి. యెహోవాకోసం అతడు పెంచిన తలవెంట్రుకలను అక్కడ అతడు తీసివేయాలి. సమాధాన బలియాగం క్రింద మండుతున్న మంటల్లో ఆ వెంట్రుకలు వేయబడుతాయి.

19 “నాజీరు తన తల వెంట్రుకలు తీసివేసిన తర్వాత, ఉడికిన మగ గొర్రె జబ్బను, గంపలో నుండి పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, రెండు రొట్టెలను యాజకుడు అతనికి ఇస్తాడు. ఈ రెండు రొట్టెలు పులియని పిండితో చేయబడినవి. 20 అప్పుడు యాజకుడు వీటిని యెహోవా ముందర అల్లాడిస్తాడు. ఇది నైవేద్యము. ఇవి పవిత్రమైనవి, యాజకునికి చెందుతాయి. మరియు మగ గొర్రె బోర, తొడ యెహోవా ముందర అల్లాడించబడుతాయి. ఇవికూడా యాజకునికి చెందుతాయి. ఆ తర్వాత నాజీరు ద్రాక్షారసం త్రాగవచ్చును.

21 “ఒక వ్యక్తి నాజీరుగా ప్రత్యేకించబడాలని నిర్ణయించుకొంటే, అప్పుడు అతడు ఈ కానుకలన్నీ యెహోవాకు అర్పించాలి. నాజీరు ప్రమాణానికి సంబంధించిన చట్టం అది. అయితే ఒక వ్యక్తి ఇంతకంటె చాల ఎక్కువే యెహోవాకి ఇవ్వగలిగి ఉండొచ్చు. అలాంటివాడు ఎక్కువ చేస్తానని వాగ్దనంచేస్తే, అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అది కూడ నాజీరు వాగ్దానపు చట్టమే.”

యాజకుల ఆశీస్సులు

22 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 23 “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి:

24 “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.
25 యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకాశింప చేయును గాక.
    ఆయన తన ప్రేమను నీకు కనబర్చును గాక.
26 యెహోవా నిన్ను చూచి,
    నీకు సమాధానం అనుగ్రహించును గాక.

27 అప్పుడు యెహోవా, ఈ విధంగా అహరోను, అతని కుమారులు ఇశ్రాయేలీయులను నా నామమును బట్టి ఆశీర్వదించినట్లు పలికినప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను” అని చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International