Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 14-15

చర్మరోగుల నియమాలు

14 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, “చర్మరోగాలు కలిగి బాగుపడిన ప్రజలకు నియమాలు ఇవి.

“ఆ వ్యక్తిని పవిత్రం చేసేందుకు ఇవే నియమాలు. చర్మవ్యాధి వచ్చిన వ్యక్తిని ఒక యాజకుడు చూడాలి. బస వెలుపల ఆ వ్యక్తి దగ్గరకు యాజకుడు వెళ్లాలి. ఆ చర్మవ్యాధి బాగుపడినదేమో తెలుసుకొనేందుకు యాజకుడు పరిశీలించాలి. ఆ వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటే అతణ్ణి ఈ పనులు చేయమని యాజకుడు చెప్పాలి: ప్రాణంతో ఉన్న రెండు పవిత్ర పక్షుల్ని అతడు తీసుకొని రావాలి, ఒక దేవదారు చెక్క ముక్కను, ఎర్రటి గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు ముక్కను కూడా అతడు తీసుకొని రావాలి. ఇవన్నీ ఆవ్యక్తిని శుద్ధిచేసే పనికోసమే. ఒక మట్టి పాత్రలో పారుతున్న నీళ్లమీద ఒక పక్షిని చంపమని యాజకుడు చెప్పాలి. అప్పుడుయింకా ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, దేవదారు చెక్కముక్క, ఎర్ర గుడ్డ ముక్క, హిస్సోపు ముక్కను యాజకుడు తీసుకోవాలి. పారుతున్న నీళ్లమీద చంపబడిన మొదటి పక్షి రక్తంలో, ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, మిగతా వస్తువులను యాజకుడు ముంచాలి. చర్మవ్యాధి ఉన్న వ్యక్తి మీద యాజకుడు ఏడుసార్లు చిలకరించాలి. అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అప్పుడు యాజకుడు బహిరంగ స్థలానికి వెళ్లి, ప్రాణంతో ఉన్న పక్షిని స్వేచ్ఛగా ఎగిరిపోనివ్వాలి.

“తర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు తన వెంట్రుకలన్నింటినీ క్షౌరం చేసుకోవాలి. అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బసలోనికి వెళ్లవచ్చును. కానీ అతడు ఏడు రోజులవరకు తన గుడారంబయట ఉండాలి. ఏడవ రోజున అతడు తన వెంట్రుకలన్నీ క్షౌరం చేసుకోవాలి. అతడు తన తల, గడ్డం, కనుబొమ్మలు, వెంట్రుకలు అన్నీ క్షౌరం చేసుకోవాలి. తర్వాత అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రుడవుతాడు.

10 “ఎనిమిదో రోజున, చర్మవ్యాధి కలిగి ఉండినవాడు ఏ దోషం లేని రెండు మగ గొర్రెపిల్లలను తీసుకొని వెళ్లాలి. ఏ దోషం లేని ఒక్క సంవత్సరపు ఆడ గొర్రె పిల్లను కూడా అతడు తీసుకొని వెళ్లాలి. ధాన్యార్పణ కోసం నూనె కలిపిన మూడు పదోవంతుల మంచి పిండిని అతడు తీసుకొని వెళ్లాలి. ఒక అర్ధసేరు ఒలీవ నూనె ఆ వ్యక్తి తీసుకొని వెళ్లాలి. 11 ఆ వ్యక్తి పవిత్రుడు అని ప్రకటించే యాజకుడు, ఆ వ్యక్తిని, అతని బలులను సన్నిధిగుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. 12 గొర్రె పిల్లల్లో ఒకదాన్ని అపరాధపరిహారార్థ బలిగా అర్పించాలి. ఆ గొర్రెపిల్లను, కొంతనూనెను యెహోవా ఎదుట నైవేద్యంగా అర్పించాలి. 13 పాపపరిహారార్థ బలి, దహనబలి వధించే పవిత్ర స్థలంలోనే యాజకుడు మగ గొర్రెపిల్లను వధించాలి. అపరాధపరిహారార్థ బలి పాపపరిహారార్థ బలిలాగే ఉంటుంది. అది యాజకునికే చెందుతుంది. అది చాలా పవిత్రం.

14 “అపరాధపరిహారార్థ బలినుండి కొంత రక్తాన్ని యాజకుడు తీసుకోవాలి. పవిత్ర పర్చబడాల్సిన వ్యక్తికుడి చెవి కొన మీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద, కుడి పాదపు బొటనవేలిమీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి. 15 యాజకుడు కొంచెం నూనె తీసుకొని తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. 16 అప్పుడు యాజకుడు తన ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేత వేలిని ముంచాలి. ఆ నూనెలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించేందుకు ఆవేలిని అతడు ఉపయోగించాలి. 17 పవిత్ర పర్చబడాల్సిన ఆ వ్యక్తి కుడి చెవి కొనమీద యాజకుడు తన అరచేతిలోని నూనె కొంచెం పోయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద కుడి పాదం బొటనవేలి మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. అపరాధపరిహారార్థ బలి అర్పణపు రక్తం మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. 18 యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను పవిత్రపర్చబడాల్సిన వ్యక్తి తలమీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు.

19 “తర్వాత ఆ వ్యక్తి పవిత్రుడయ్యేటట్టు యాజకుడు పాపపరిహారార్థ బలిని అర్పించి, ఆ వ్యక్తి పాపాలను తుడిచివేయాలి. ఆ తర్వాత దహనబలి పశువును యాజకుడు వధించాలి. 20 అప్పుడు యాజకుడు దహనబలి అర్పణను, ధాన్యార్పణను బలిపీఠం మీద అర్పించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేయాలి. ఆ వ్యక్తి పవిత్రుడవుతాడు.

21 “అయితే ఆ వ్యక్తి పేదవాడై అలాంటి అర్పణలు ఇవ్వలేకపోతే, అపరాధపరిహారార్థబలిగా ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకొని రావాలి. యాజకుడు ఆ వ్యక్తి పాపాలను తుడిచివేసేందుకు అది నైవేద్యం. ధాన్యార్పణగా తూములో పదోవంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్థసేరు నూనెను 22 రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను అతడు తీసుకొనిరావాలి. పేదవాళ్లుకూడ వాటిని తీసుకొని రాగలుగుతారు. ఒక పక్షి పాపపరిహారార్థబలి కొరకు, మరొకటి దహనబలి కొరకు.

23 “ఎనిమిదో రోజున సన్నిధి గుడారం దగ్గర యాజకుని వద్దకు అతడు వాటిని తీసుకొని రావాలి. ఆ వ్యక్తి పవిత్రుడయ్యేందుకు వాటిని యెహోవా ఎదుట అర్పించాలి. 24 అపరాధపరిహారార్థ బలికోసం గొర్రెపిల్లను, నూనెను, యాజకుడు తీసుకొని యెహోవా ఎదుట నైవేద్యంగా వాటిని అల్లాడించాలి. 25 అప్పుడు అపరాధపరిహారార్థ బలికొరకైన గొర్రెపిల్లను యాజకుడు వధించాలి. అపరాధపరిహారార్థ బలి రక్తంలో కొంచెం యాజకుడు తీసుకోవాలి. పవిత్రం చేయబడాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు పోయాలి. ఈ వ్యక్తి కుడి చేతి బొటనవేలిమీద, కుడి పాదం బొటనవేలిమీద యాజకుడు ఈ రక్తం కొంచెం పోయాలి. 26 ఈ నూనెలో కూడ కొంచెం అతని ఎడమ చేతిలో యాజకుడు పోయాలి. 27 యాజకుడు తన కుడిచేతి వేలిని ప్రయోగించి తన ఎడమ చేతిలోని నూనె కొంచెం తీసి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి. 28 తర్వాత యాజకుడు తన చేతిలోని నూనె కొంచెం తీసి పవిత్రం కావాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలి మీద, కుడి పాదం బొటన వేలిమీద యాజకుడు ఈ నూనెను కొంచెం వేయాలి. అపరాధపరిహారార్థబలి రక్తం స్థానంలో యాజకుడు ఈ నూనె కొంచెం వేయాలి. 29 యాజకుడు తన చేతిలో మిగిలిపోయిన నూనెను, పవిత్రం కావాల్సిన వాని తల మీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేస్తాడు.

30 “అప్పుడు ఆ వ్యక్తి ఒక గువ్వ లేక పావురపు పిల్లలలో ఒకదానిని అర్పించాలి. (పేదవారు కూడా ఆ పక్షులను ఇవ్వగలరు, ఆ వ్యక్తి ఇవ్వగలిగిందే ఇవ్వాలి). 31 ఒక పక్షిని పాప పరిహారార్థబలిగాను మరొక దాన్ని దహనబలిగాను ఆ వ్యక్తి అర్పించాలి. అతడు వాటిని ధాన్యార్పణతో బాటు అర్పించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపాలను యెహోవా ఎదుట తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తి పవిత్రం అవుతాడు.”

32 ఒక వ్యక్తి చర్మ వ్యాధినుండి బాగు పడిన తర్వాత అతణ్ణి పవిత్రం చేయటానికి అవి నియమాలు. “పవిత్రం అయ్యేందుకు నియమం ప్రకారం బలులు అర్పించలేని ప్రజలకు అవి నియమాలు.”

ఇంటికి కుష్ఠుపొడను గూర్చిన నియమాలు

33 మోషే, అహరోనులతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు: 34 “కనాను దేశాన్ని నేను మీ ప్రజలకు ఇస్తున్నాను. మీ ప్రజలు ఆ దేశం చేరుతారు. ఆ సమయంలో ఎవరి యింట్లోనైనా (ఇంటి గోడకు) నేను కుష్ఠుపొడను పెరగనీయవచ్చు. 35 ఆ యింటి స్వంతదారుడు యాజకుని దగ్గరకు వచ్చి, ‘కుష్ఠుపొడలాంటిది ఏదో నాయింట్లో కనిపిస్తుంది’, అనిచెప్పాలి.

36 “అప్పుడు యాజకుడు ఆ ఇంటి వారిని ఇల్లు ఖాళీచేయమని ఆజ్ఞాపించాలి.” యాజకుడు కుష్ఠుపొడను చూడటానికి వెళ్లక ముందే వారు ఇల్లు ఖాళీచేయాలి. ఈ విధంగా ఆ ఇంట్లోని అపవిత్రమైన వాటన్నింటినీ యాజకుడు కాపాడవలసిన పనిలేదు. ఆ మనుష్యులు ఇల్లు ఖాళీచేసిన తర్వాత, ఆ ఇంటిని చూడటానికి యాజకుడు లోనికి వెళ్లాలి. 37 యాజకుడు కుష్ఠుపొడను పరిశీలించాలి. ఆ ఇంటి గోడలమీద పొడకు పచ్చటి లేక ఎర్రటి రంధ్రాలు ఉండి, ఆ పొడ గోడల ఉపరితలంలో చొచ్చుకు పోతున్నట్లు కనబడితే, 38 యాజకుడు ఆ ఇంటినుండి బయటకు వెళ్లిపోయి ఏడు రోజులవరకు ఆ ఇంటికి తాళంవేయాలి.

39 “ఏడో రోజున యాజకుడు తిరిగి వచ్చి ఆ ఇంటిని పరిశీలించాలి.” ఆ పొడ ఇంటి గోడలమీద వ్యాపించి ఉంటే, 40 పొడ ఉన్న రాళ్లను లాగి పారవేయమని యాజకుడు ఆ ప్రజలకు ఆజ్ఞాపించాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో వారు ఆ రాళ్లను వేయాలి. 41 అప్పుడు యాజకుడు ఆ ఇంటిలోపల అంతా గీకించాలి. అలా గీకిన పెచ్చులను వారు పారవేయాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో ఆ పెచ్చులను వారు వేయాలి. 42 అప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటికి కొత్త రాళ్లు పెట్టాలి. అతడు ఆ రాళ్లకు కొత్త అడుసు పూయించాలి.

43 “ఒకవేళ ఒకడు పాతరాళ్లను, పాత పెచ్చులను తీసివేసి, కొత్తరాళ్లు, కొత్త అడుసు పెట్టి ఉండొచ్చు. ఒకవేళ ఆ ఇంటిలో మరల పొడ కనబడవచ్చును. 44 అప్పుడు యాజకుడు లోనికి వచ్చి ఇంటిని పరిశీలించాలి. ఆ పొడ ఇంటిలో వ్యాపించి ఉంటే, అది త్వరగా యితర స్థలాలకు గూడా వ్యాపించే వ్యాధి. అందుచేత ఆ యిల్లు అపవిత్రము. 45 ఆ వ్యక్తి ఆ ఇంటిని కూలగొట్టాలి. ఆ రాళ్లను, పెచ్చులను, చెక్కముక్కలను పట్టణం వెలుపల అపవిత్రమైన ప్రత్యేక స్థలానికి తీసుకొని పోవాలి. 46 ఆ ఇంట్లోకి వెళ్లే ఏ వ్యక్తి అయినాసరే సాయంత్రం వరకు అపవిత్రమవుతాడు. 47 ఎవరైనా ఆ ఇంటిలో భోజనంచేసినా, పండుకొన్నా ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి.

48 “ఆ ఇంట్లో కొత్త అడుసుతో కొత్త రాళ్లు వేసిన తర్వాత యాజకుడు ఆ ఇంటిని పరిశీలించాలి. ఒకవేళ ఆ పొడ ఇంటిలో వ్యాపించకపోతే ఆ ఇల్లు పవిత్రం అని యాజకుడు ప్రకటించాలి. ఎందుచేతనంటే ఆ పొడ పోయింది గనుక!

49 “అప్పుడు ఆ ఇంటిని పవిత్రం చేయటానికి యాజకుడు రెండు పక్షులను, దేవదారు చెక్క ముక్కను, ఒక ఎర్ర గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు రెమ్మను తీసుకోవాలి. 50 పారుతున్న నీళ్లలో ఒక మట్టి పాత్రలో యాజకుడు ఒక పక్షిని వధించాలి. 51 తరువాత యాజకుడు దేవదారు చెక్క ముక్కను, హిస్సోపును, ఎర్రగుడ్డ ముక్కను, ప్రాణంతో ఉన్న పక్షిని తీసుకోవాలి. పారుతున్న నీళ్లలో వధించబడిన పక్షి రక్తంలో యాజకుడు వీటన్నింటినీ ముంచాలి. అప్పుడు యాజకుడు ఆ రక్తాన్ని ఇంటిమీద ఏడు సార్లు చిలకరించాలి. 52 ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయటానికి వీటిని ఉపయోగించాలి. 53 యాజకుడు పట్టణం వెలుపలి బయలు ప్రదేశానికి వెళ్లి, బ్రతికి ఉన్న పక్షిని అక్కడ స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయాలి. ఆ ఇల్లు పవిత్రం అవుతుంది.”

54 ఏ విధమైన కుష్ఠువ్యాధికి, 55 బట్టమీద లేక ఇంటి మీద కుష్ఠు పొడకు సంబంధించిన నియమాలు అవి. 56 చర్మంమీద వాపులు, దద్దురులు, నిగనిగలాడే మచ్చలకు అవి నియమాలు. 57 వస్తువులు పవిత్రంగా ఉన్నది లేనిదీ ఆ నియమాలు నేర్పిస్తాయి. అలాంటి వ్యాధులకు సంబంధించిన నియమాలు అవి.

దేహస్రావ నియమాలు

15 మోషే, అహరోనులతో యెహోవా యింకా యిలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలకు మీరిలా చెప్పండి: ఎవని దేహంలోనైనా స్రావం ఉంటే, వాడు అపవిత్రుడు. వాని శరీరంలోనుండి స్రావం కారుతున్నా లేక నిలిచిపోయినా సరే ఫర్వాలేదు.

“స్రావం ఉన్న వ్యక్తి పరుపుమీద పండుకొంటే, ఆ పరుపు అపవిత్రం. ఆ వ్యక్తి కూర్చునేవన్నీ అపవిత్రం అవుతాయి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఈ వ్యక్తి పరుపును తాకితే అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానంచేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. ఇంకా స్రావంగల వాడు కూర్చున్న దేనిమీదనైనా సరే కూర్చున్న ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. అలానే స్రావంఉన్న వ్యక్తిని తాకిన ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. స్రావంగల వాడు ఒక పవిత్రునిమీద ఉమ్మివేస్తే, ఈ పవిత్రుడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. ఈ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడుగా ఉంటాడు. స్రావంగల వ్యక్తి కూర్చొని స్వారీ చేసిన ప్రతి ఆసనం అపవిత్రం అవుతుంది. 10 కనుక స్రావంగలవాని కింద ఉన్న దేనినైనా తాకిన ప్రతి ఒక్కరూ సాయంత్రంవరకు అపవిత్రంగా వుంటారు. స్రావంగల వాని కింద ఉండే వస్తువులను మోసిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. 11 ఒకవేళ స్రావంగల వ్యక్తి నీళ్లతో తన చేతులు కడుగుకోకుండా మరొక వ్యక్తిని తాకవచ్చును. అప్పుడు అవతల వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.

12 “అయితే స్రావంగల వ్యక్తి ఒక మట్టి పాత్రను తాకితే ఆ పాత్రను పగులగొట్టివేయాలి. స్రావంగల ఈ వ్యక్తి గనుక ఒక చెక్క పాత్రను తాకితే, ఆ పాత్రను నీళ్లతో కడగాలి.

13 “స్రావంగల వాడు తన స్రావం నుండి పవిత్రునిగా చేయబడితే అతడు తన శుద్ధికోసం తానే ఏడు రోజులు లెక్కబెట్టుకోవాలి. అప్పుడు అతడు పారుతున్న నీటిలో తన బట్టలు ఉతుక్కొని, స్నానం చేయాలి. అతడు పవిత్రుడు అవుతాడు. 14 ఎనిమిదో రోజున రెండు గువ్వలను గాని రెండు పావురపు పిల్లలనుగాని ఆ వ్యక్తి తనకోసం తీసుకొని వెళ్లాలి. సన్నిధి గుడారద్వారం దగ్గర యెహోవా ఎదుటికి అతడు రావాలి. ఆ వ్యక్తి రెండు పక్షులను యాజకునికి యివ్వాలి. 15 ఒక పక్షిని పాపపరిహారార్థ బలిగాను, మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. కనుక యాజకుడు ఆ వ్యక్తిని యెహోవాకు పవిత్రునిగా చేస్తాడు.

16 “ఒకనికి వీర్యస్ఖలనం అవుతోంటే అతడు నీళ్లలో పూర్తిగా స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. 17 ఒకవేళ ఏ బట్టమీద గాని తోలుమీదగాని వీర్యం పడితే, ఆ బట్టను లేక తోలును నీళ్లలో కడగాలి. సాయంత్రంవరకు అది అపవిత్రంగా ఉంటుంది. 18 ఒకవేళ ఒక పురుషుడు ఒక స్త్రీతో శయనించగా వీర్యస్ఖలనమైనప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.

19 “ఒక స్త్రీకి తన నెలసరి రక్తస్రావంనుండి స్రావంతో ఉంటే, ఆమె ఏడు రోజులు అపవిత్రంగా ఉంటుంది. ఎవరైనా ఆమెను తాకితే వారు ఆ రోజు సాయంత్రంవరకు అపవిత్రంగా ఉంటారు. 20 మరియు ఆ స్త్రీ తన నెలసరి రక్తస్రావ సమయంలో పండు కొనేవన్నీ అపవిత్రం అవుతాయి. ఆ సమయంలో ఆమె కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి. 21 ఎవరైనా ఆ స్త్రీ పడకను తాకినట్టుయితే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రుడు. 22 ఒకవేళ ఎవరైనా ఆమె కూర్చున్న దేనినైనా తాకితే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రం. 23 ఒకవ్యక్తి ఆమె పడకను తాకినా, లేక ఆమె కూర్చున్న దేనినైనా తాకినా, ఆ వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.

24 “మరియు ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక పురుషుడు ఆమెతో లైంగిక పొందు అనుభవిస్తే, ఆ పురుషుడు ఏడురోజులపాటు అపవిత్రంగా ఉంటాడు. ఆ పురుషుడు పండుకొనే ప్రతి పడకా అపవిత్రం అవుతుంది.

25 “ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావ సమయంలో గాక, ఆ తర్వాత ఆమెకు రక్తం చాల రోజుల వరకు స్రవిస్తే, అలా రక్తం స్రవించినన్నాళ్లూ, నెలసరి రక్తస్రావంలో వలెనే ఆమె అపవిత్రంగా ఉంటుంది. 26 రక్త స్రావ సమయమంతటిలో ఆ స్త్రీ ఏ పడకమీద పరుండినా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో వలెనే ఉంటుంది ఆ పడక. ఆమె కూర్చొనేది ఏదైనా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో అపవిత్రమైనట్టే అపవిత్రం అవుతుంది. 27 ఆ వస్తువులను ఏ వ్యక్తి తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రుడవుతాడు. 28 ఆ తర్వాత ఆ స్త్రీ తన స్రావంనుండి పవిత్రం అయిన తర్వాత, ఆమె ఏడు రోజులు లెక్క పెట్టాలి. ఆ తర్వాత ఆమె పవిత్రం అవుతుంది. 29 అప్పుడు ఎనిమిదో రోజున ఆమె రెండు గువ్వలను లేదా రెండు పావురపు పిల్లలను తీసుకొని రావాలి. సన్నిధి గుడార ద్వారం వద్ద యాజకుని దగ్గరకు ఆమె వాటిని తీసుకొని రావాలి. 30 అప్పుడు ఒక పక్షిని పాపపరిహారార్థబలిగాను మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. అలా యాజకుడు యెహోవా ఎదుట ఆమెను పవిత్రం చేయాలి.

31 “అందుచేత ఇశ్రాయేలు ప్రజలు తమ అపవిత్రత విషయంలో వారి అపవిత్రతనుండి ప్రత్యేకించుకోవాల్సిందిగా మీరు హెచ్చరించాలి. మీరు ప్రజలను హెచ్చరించకపోతే, అప్పుడు వారు నా పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తారు. అప్పుడు వాళ్లు చావాల్సిఉంటుంది!”

32 స్రావంగల వారి విషయంలో అవి నియమాలు. వీర్యస్ఖలనం వలన అపవిత్రులైన పురుషులను గూర్చిన నియమాలు అవి. 33 మరియు నెలసరి రక్తస్రావం మూలంగా అపవిత్రమైన స్త్రీలకు అవి నియమాలు. అపవిత్రమైన స్త్రీతో శయనించి అపవిత్రమైన ఏ వ్యక్తికైనా అవి నియమాలు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International