Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 11-13

మాంసం తినేందుకు నియమాలు

11 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి: మీరు తినదగిన జంతువులు ఏవంటే: ఏ జంతువు డెక్కలు చీలి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం మీరు తినవచ్చును.

4-6 “కొన్ని జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. ఒంటెలు, సిరాయారకపు పొట్టికుందేలు, కుందేలు అలాంటివే కనుక అవి మీకు అపవిత్రం. మరికొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. పందులు కూడా మీకు అపవిత్రం. ఆ జంతువుల (పందుల) మాంసం తినవద్దు. వాటి శవాలను కనీసం తాకవద్దు అవి మీకు అపవిత్రం.

సముద్ర ఆహార నియమాలు

“సముద్రంలోగాని, నదిలోగాని ఉండే జలచరాలకు రెక్కలు, పొలుసు ఉంటే, మీరు వాటిని తినవచ్చును. 10-11 అయితే సముద్రంలోగాని నదిలో గాని ఉండే జలచరం దేనికైనా రెక్కలు, పొలుసు లేకపోతే, వాటిని మీరు తినకూడదు. అలాంటిది అసహ్యమయినది. దాని మాంసం తినవద్దు. కనీసం దాని శవాన్ని కూడా తాకవద్దు. 12 సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి.

తినకూడని పక్షులు

13 “అలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, క్రౌంచ పక్షులు, 14 గద్ద, అన్నిరకాల గద్దలు, 15 అన్ని రకాల నల్ల పక్షులు, 16 నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని రకాల డేగలు, 17 గుడ్లగూబలు, పగిడికంటెలు, పెద్దగుడ్ల గూబలు, 18 నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు, 19 గూడ బాతులు, సంకుబుడి కొంగలు, అన్నిరకాల కొంగలు, కుకుడుగువ్వలు, గబ్బిలాలు.

పురుగుల్ని తినటాన్ని గూర్చిన విధులు

20 “రెక్కలు ఉండి మొత్తం నాలుగు కాళ్లతో నడిచే జీవులన్నీ అసహ్యమైనవే. రెక్కలు ఉండి, నాలుగు కాళ్లతో నడిచే కీటకాలన్నీ అసహ్యమైనవే. ఆ కీటకాలను తినవద్దు. 21 అయితే కీటకాలకు రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో నడిస్తే, వాటికి కనుక పాదాలకు పైగా కీళ్లు ఉండి అవి ఎగురగలిగినవైతే, అలాంటి కీటకాలను మీరు తినవచ్చును. 22 ఏ కీటకాలను మీరు తినవచ్చునంటే: అన్ని రకాల మిడతలు, రెక్కలున్న అన్నిరకాల మిడతలు, అన్ని రకాల పెద్ద మిడతలు, అన్నిరకాల ఆకు మిడతలు.

23 “అయితే రెక్కలు, నాలుగు పాదాలు ఉన్న మిగిలిన కీటకాలు అన్నీ మీకు అసహ్యం. 24 ఆ కీటకాలు మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. ఈ కీటకాల శవాలను తాకిన ఏ వ్యక్తి అయినా సరే సాయంత్రంవరకు అపవిత్రం అవుతాడు. 25 ఒక వ్యక్తి చచ్చిన కీటకాల్లో ఒకదాన్ని గనుక పట్టుకొంటే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు.

తువుల్ని గూర్చి మరికొన్ని నియమాలు

26-27 “కొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయిగాని డెక్కలు సమానంగా చీలి ఉండవు. కొన్ని జంతువులు నెమరు వేయవు. కొన్ని జంతువులకు డెక్కలు ఉండవు, అవి వాటి పాదాలమీద నడుస్తాయి. ఆ జంతువులన్నీ మీకు అపవిత్రం. వాటిని ఎవరైనా తాకితే వారు అపవిత్రం అవుతారు. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు 28 వాటి శవాలను ఎవరైనా ఎత్తితే, ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువులు మీకు అపవిత్రము.

ప్రాకే జంతువులను గూర్చిన నియమాలు

29 “ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం: ముంగిసలు, పందికొక్కులు అన్ని రకాల పెద్ద బల్లులు. 30 అడవి ఎలుకలు, మొసళ్లు, తొండలు, సరటాలు, ఊసరవెల్లులు. 31 ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం. వాటిలో చచ్చిన వాటిని ఎవరైనా తాకితే అలాంటివారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు.

అపవిత్ర జంతువులను గూర్చిన నియమాలు

32 “అపవిత్రమైన ఆ జంతువుల్లో ఏదైనా చచ్చి దేనిమీదైనా పడితే, అది అపవిత్రం అవుతుంది. అది చెక్కతో, బట్టతో, తోలుతో చేయబడిన వస్తువులు కానీ, లేక ఏదైనా పనిముట్టుగానీ కావచ్చును. అది ఏదైనాసరే దాన్ని నీళ్లతో కడగాలి. సాయంత్రం వరకు అది అపవిత్రం. తర్వాత అది మరల పవిత్రం అవుతుంది. 33 అపవిత్రమైన ఆ జంతువుల శవం ఏదైనా మట్టి పాత్రలో పడితే, ఆ ప్రాతలో ఉన్నది ఏదైనా సరే అది అపవిత్రం అవుతుంది. నీవు ఆ పాత్రను పగులగొట్టి తీరాలి. 34 అపవిత్రమైన మట్టి పాత్రలోని నీళ్లు ఏ ఆహారపదార్థం మీద పడినా, అందులోని ఆహారం అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన పాత్రలోని పానీయం ఏదైనా అపవిత్రం అవుతుంది. 35 అపవిత్రమై చచ్చిన జంతువుయొక్క అవయవం ఒకటి దేనిమీద పడినా అది అపవిత్రం. అది మట్టి పొయ్యికావచ్చును, మట్టి కుంపటి కావచ్చును. దాన్ని ముక్కలుగా పగులగొట్టాలి. అవి ఇంకెంత మాత్రం పరిశుద్ధంగా ఉండవు. అవి మీకు ఎప్పటికీ అపవిత్రంగానే ఉంటాయి.

36 “నీళ్లు ఊరుతూండే ఊటగాని, బావిగాని, పరిశుద్ధంగా ఉంటుంది. అయితే అపవిత్రమైన ఏ జంతువు శవాన్నీ, తాకిన ఏ వ్యక్తి అయినాసరే అపవిత్రుడు. 37 అపవిత్ర జంతువుల్లోని ఏ శవమైనా, నాట్లువేసే ఏ విత్తనంమీద పడినా, ఆ విత్తనం ఇంకా పరిశుద్ధంగానే ఉంటుంది. 38 అయితే ఆ విత్తనాలమీద నీళ్లు పోసిన తర్వాత అపవిత్ర జంతువుయొక్క శవంలోని ఏ భాగమైనా ఆ విత్తనాలమీద మరల పడితే, అప్పుడు మీకు ఆ విత్తనాలు అపవిత్రం.

39 “మీరు ఆహారానికి ఉపయోగించే జంతువు ఏదైనా చస్తే, దాని శవాన్ని తాకిన వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. 40 మరియు ఈ జంతువు మాంసం తిన్న వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువు శవాన్ని ఎత్తే మనిషి తప్పక తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.

41 “నేలమీద ప్రాకే ప్రతి జంతువు అసహ్యమయిందే. దాన్ని తినకూడదు. 42 పొట్టతో ప్రాకే జంతువుల్లో దేనిని గాని లేక నాలుగు పాదాలతో నడిచే ఏ జంతువునుగాని లేక చాలా పాదాలుగల జంతువును గాని మీరు తినకూడదు. అవి మీకు అసహ్యమైనవి. 43 అసహ్యమైన ఆ జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు హేయం చేసుకోవద్దు. వాటితో మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 44 ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక. నేను పరిశుద్ధుడ్ని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైన ఆ ప్రాకే జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 45 మిమ్మల్ని ఈజిప్టునుండి నేను తీసుకొచ్చాను. మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేందుకు నేను ఇలా చేసాను. మీకు నేను దేవుడిగా ఉండాలని నేను ఇలా చేసాను. నేను పరిశుద్ధుడ్ని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి!”

46 భూమిమీద ఉండే పశువులు, పక్షులు, ఇతర జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. సముద్రంలో ఉండే జలచరాలు, నేలమీద ప్రాకే జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. 47 పవిత్ర జంతువులు ఏవో అపవిత్ర జంతువులు ఏవో ప్రజలు తేలుసుకోగలిగేందుకే ఆ ప్రబోధాలు. అందుచేత ఏ జంతువుల్ని తినవచ్చో, ఏ జంతువుల్ని తినకూడదో ప్రజలకు తెలుస్తుంది.

ప్రసవించిన తల్లులకు నియమాలు

12 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు:

“ఒక స్త్రీ మగ శిశువుకు జన్మనిస్తే ఆ స్త్రీ ఏడు రోజుల వరకు అపవిత్రంగావుంటుంది. ఇది ఆమె నెలసరి రక్తస్రావం విషయంలో అపవిత్రంగా ఉన్నట్టే. ఎనిమిదో రోజున ఆ మగ శిశువుకు సున్నతి చేయాలి. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు ముప్పయిమూడు రోజులు పడుతుంది. పరిశుద్ధమయింది దేన్నీ ఆమె తాకగూడదు. ఆమె పవిత్రపరచబడటం పూర్తి అయ్యేంతవరకు పరిశుద్ధ స్థలంలో ఆమె ప్రవేశించకూడదు. కానీ ఆ స్త్రీ ఒక ఆడ శిశువుకు జన్మనిస్తే నెలసరి రక్తస్రావ సమయంలో ఉన్నట్టే రెండు వారాలు ఆమె అపవిత్రంగా ఉంటుంది. ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు అరవై ఆరు రోజులు అవుతుంది.

“ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి. 7-8 ఒకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను ఇవ్వలేక పోతే, రెండు పావురపు పిల్లల్నిగాని రెండుగువ్వలనుగాని ఆమె తీసుకొని రావచ్చును. అందులో ఒకటి దహనబలి కోసం, మరొకటి పాప పరిహారార్థ బలికోసం. వాటిని యాజకుడు యెహోవా ఎదుట అర్పిస్తాడు. ఈ విధంగా ఆమెకోసం అతడు ఆమె పాపాలను తుడిచి వేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అవుతుంది. ఒక మగశిశువుకు లేదా ఆడశిశువుకు జన్మనిచ్చే స్త్రీకి అవి నియమాలు.”

చర్మరోగాలను గూర్చిన నియమాలు

13 మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు: “ఒక వ్యక్తి చర్మం మీద వాపు ఉండవచ్చును, లేక అది పొక్కుగాని, నిగనిగలాడు మచ్చగాని కావచ్చును. ఆ మచ్చ కుష్ఠురోగంలా కనబడితే, యాజకుడగు అహరోను దగ్గరకు గాని, యాజకులైన అతని కుమారుల దగ్గరకుగాని ఆ వ్యక్తిని తీసుకొనిరావాలి. ఆ వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, ఆ మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది కుష్ఠురోగమే. యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించటం ముగించగానే ఆ వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు ప్రకటించాలి.

“కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ ఉంటుంది. కానీ ఆ మచ్చ చర్మంలోపలికి ఉండదు. అదే నిజమైతే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరులనుండి యాజకుడు వేరు చేయాలి. ఏడో రోజున యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ మచ్చలో మార్పు లేకుండా, అది చర్మంమీద విస్తరించకుండా ఉన్నట్టు యాజకునికి కనబడితే, అప్పుడు ఆ వ్యక్తిని మరో ఏడు రోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి. ఏడు రోజుల తర్వాత మరల ఆ వ్యక్తిని యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చ మానిపోయి, చర్మంమీద విస్తరించకుండా ఉంటే, ఆ వ్యక్తి పరిశుద్ధుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కేవలం పొక్కే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, మళ్లీ పవిత్రుడు కావాలి.

“అయితే ఆ వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, ఆ పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి. యాజకుడు తప్పక పరిశీలించాలి. ఒకవేళ ఆ పొక్కు చర్మం మీద విస్తరిస్తే, ఆవ్యక్తి అపవిత్రుడని యాజకుడు తప్పక ప్రకటించాలి. అది కుష్ఠురోగం.

“ఒక వ్యక్తికి కుష్ఠురోగం ఉంటే అతణ్ణి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. 10 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. చర్మంలో తెల్లని వాపుఉండి, వెంట్రుకలు తెల్లబడి ఉండి, వాపులో చర్మంతెల్లగా కనబడితే 11 అప్పుడు అది ఆ వ్యక్తి చర్మంమీద చాలకాలంగా ఉన్న కుష్ఠురోగం. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. కొద్దికాలం ఆ వ్యక్తిని మిగిలిన ప్రజలనుండి యాజకుడు ప్రత్యేకించాలి. ఎందుచేతనంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అని అతనికి తెలుసు.

12 “కొన్నిసార్లు చర్మరోగం ఒక వ్యక్తి శరీరమంతటా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి తలనుండి పాదంవరకు చర్మంమీద అంతటా చర్మరోగం ఆవరిస్తుంది. యాజకుడు ఆ వ్యక్తి శరీరమంతా తప్పక చూడాలి. 13 చర్మరోగం శరీరమంతా వ్యాపించినట్టు, అది ఆ వ్యక్తి చర్మాన్ని పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. 14 అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు. 15 యాజకుడు చర్మం పచ్చిగా ఉండటం చూసినప్పుడు, ఆ వ్యక్తి అపవిత్రుడని అతడు ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్ఠురోగం.

16 “చర్మం మరల పచ్చిగా తయారై తెల్లగా మారితే, అప్పుడు ఆ వ్యక్తి తప్పక యాజకుని దగ్గరకు రావాలి. 17 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ తెల్లబారితే ఆ పొడగల ఆ వ్యక్తి పవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి పవిత్రుడు.

18 “ఒకవేళ దేహపు చర్మంమీద మానిపోయిన పుండు ఉండవచ్చును. 19 కాని ఆ పుండు స్థానంలో తెల్లటి వాపుగాని, తెలుపు ఎరుపు కలిసి నిగనిగలాడే మచ్చగానీ ఉండవచ్చును. అప్పుడు దేహం మీది ఈ చోటును యాజకునికి చూపెట్టాలి. 20 యాజకుడు పరిశీలించాలి. వాపు చర్మంకంటె లోతుగా ఉండి, దాని మీది వెంట్రుకలు తెల్లబడి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కుష్ఠురోగం పుండులోపలనుండి కుష్ఠురోగం బయటపడింది. 21 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా దానిమీద వెంట్రుకలు తెల్లబడక, ఆ మచ్చ చర్మంకంటె లోతుగా ఉండక మానుతున్నట్టు కనబడితే అప్పుడు యాజకుడు, ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ప్రత్యేకంగా ఉంచాలి. 22 ఒకవేళ ఆ మచ్చయింకా ఎక్కువగా చర్మంమీద విస్తరిస్తే, ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠుపొడ. 23 అయితే నిగనిగలాడే ఆ మచ్చ విస్తరించక, ఉన్నచోటనే ఉంటే, అది పాతపుండుకు సంబంధించిన దద్దురు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి.

24-25 “ఒక వ్యక్తి చర్మంమీద కాలి వాత కావచ్చును. ఒకవేళ ఆ పచ్చి చర్మం తెల్లగా గాని, తెలుపు ఎరుపురంగు మచ్చలా కానీ మారితే యాజకుడు తప్పక దాన్ని పరిశీలించాలి. ఆ తెల్ల మచ్చ చర్మంకంటె లోతుగా ఉన్నట్టుగానీ, ఆ మచ్చ మీది వెంట్రుకలు తెల్లబడినా అది కుష్ఠురోగం. ఆ వాతలోనుంచి కుష్ఠురోగం బయటపడింది. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం. 26 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా నిగనిగలాడే మచ్చమీద వెంట్రుకలు లేకుండా ఆ మచ్చ చర్మంకంటె లోతుగా లేకుండ అది మానుతున్నట్టు ఉంటే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు యాజకుడు వేరుచేయాలి. 27 ఏడవ రోజున యాజకుడు ఆ వ్యక్తిని మరల పరిశీలించాలి. ఆ మచ్చ చర్మంమీద విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం. 28 అయితే నిగనిగలాడే ఆ మచ్చ చర్మంమీద విస్తరించక మానుతుంటే, అది వాత మీది వాపు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కేవలం వాత మచ్చ మాత్రమే.

29 “ఒక వ్యక్తి తలమీదగాని గెడ్డంమీద గాని పొడరావచ్చును. 30 ఒక యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడినా, దానిచుట్టూ వెంట్రుకలు పలుచగాను, పసుపుగాను ఉన్నా, ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది చెడ్డ చర్మరోగం. 31 ఒక వేళ ఆ పొడ చర్మంకంటె లోతుగా లేకపోయినా, దానిలో నల్ల వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తిని ఏడురోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి. 32 ఏడవ రోజున ఆ పొడను యాజకుడు పరిశీలించాలి. ఆ పొడ విస్తరించకపోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగకపోయినా, ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, 33 ఆ వ్యక్తి క్షౌరం చేసుకోవాలి. కానీ అతడు ఆ పొడను కత్తిరించకూడదు. ఆ వ్యక్తిని యింకో ఏడు రోజుల వరకు యాజకుడు ప్రత్యేకించాలి. 34 ఏడవ రోజున యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుకుకొని శుద్ధుడు కావాలి. 35 కానీ ఆ వ్యక్తి పవిత్రుడయిన తర్వాత ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, 36 యాజకుడు మరల ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, పసుపు వెంట్రుకల కోసం యాజకుడు చూడక్కర్లేదు. ఆ వ్యక్తి అపవిత్రుడు. 37 అయితే ఆ వ్యాధి మానిపోయినట్టు యాజకుడు తలిస్తే, దానిలో నల్ల వెంట్రుకలు పెరుగుతుంటే ఆ రోగం మాని పోయింది. ఆ వ్యక్తి పవిత్రుడు. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.

38 “ఒక వ్యక్తి చర్మంమీద తెల్ల మచ్చలు ఉంటే, 39 ఒక యాజకుడు ఆ మచ్చలను పరిశీలించాలి. ఒకవేళ ఆ వ్యక్తి చర్మంమీది మచ్చలు వాడిపోయి తెలుపుగా ఉంటే అది హానికరము కాని పొక్కులు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు.

40 “ఒక వ్యక్తి తలమీద వెంట్రుకలు ఊడి పోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం బట్టతల 41 ఒకని తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం మరో రకం బట్టతల. 42 కానీ అతని తలమీద ఎరుపు తెలుపు పొడ ఉంటే అది చర్మవ్యాధి. 43 ఒక యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ వాపు ఎరుపు తెలుపుగా ఉండి, శరీరంలోని ఇతర భాగాల్లో కుష్ఠు రోగంలా కనబడితే, 44 ఆ వ్యక్తి తలమీద కుష్ఠు రోగం ఉంది. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.

45 “ఒక వ్యక్తికి కుష్ఠు రోగం ఉంటే అతడు ఇతరులను హెచ్చరించాలి. అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని కేకలు వేయాలి. అతడు తన బట్టలను చింపివేయాలి, తన తల వెంట్రుకలు విరబోసుకోవాలి, తన నోరు కప్పుకోవాలి. 46 ఆ వ్యాధి ఉన్న కాలమంతా అతను అపవిత్రుడే. ఆ వ్యక్తి అపవిత్రుడు. అతడు ఒంటరిగా బతకాలి. అతని నివాసం బసకు వెలుపల ఉండాలి.

47 “కొన్ని బట్టల మీద బూజుపొడ ఉండవచ్చును. ఆ బట్ట నారబట్ట లేక ఉన్నిది కావచ్చు. 48 బట్ట అల్లినది కావచ్చు, కుట్టినది కావచ్చు, లేదా ఒక తోలు మీద కాని, తోలుతో చేయబడిన మరి దేనిమీద కాని ఆ బూజుపొడ ఉండవచ్చును. 49 ఆ బూజుపొడ పచ్చగా కానీ ఎర్రగా కానీ ఉంటే దాన్ని యాజకునికి చూపించాలి. 50 ఆ బూజుపొడను యాజకుడు పరిశీలించాలి. దానిని ఏడు రోజుల వరకు ఒక ప్రత్యేక స్థలంలో అతడు ఉంచాలి. 51-52 ఏడవ రోజున ఆ బూజుపొడను యాజకుడు పరిశీలించాలి. ఆ బూజుపొడ తోలు మీద ఉన్నా బట్టమీద ఉన్నా ఒకటే. ఆ బట్ట కుట్టిందైనా అల్లినదైనా ఒకటే. ఆ తోలు ఉపయోగించబడింది దేని కొరకైనా ఒకటే. బూజుపొడ వ్యాపిస్తే అది నాశన కరమైనది. ఆ బట్ట లేక తోలు అపవిత్రం. ఆ పొడ అపవిత్రం. ఆ బట్ట లేక తోలును యాజకుడు కాల్చి వేయాలి.

53 “ఆ బూజుపొడ వ్యాపించినట్టు యాజకునికి కనబడకపోతే, ఆ తోలును లేక ఆ బట్టను ఉతకాలి. అది తోలుగాని, బట్టగాని లేక బట్ట అల్లికగాని, కుట్టింది గాని, దాన్ని ఉతకాల్సిందే. 54 ఆ బట్టను లేక తోలును ఉతకమని ఆ మనుష్యులకు యాజకుడు ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు ఆ బట్టలను ఇంకా ఏడు రోజుల వరకు వేరుపరచాలి. 55 ఆ సమయం తీరగానే యాజకుడు మళ్లీ పరిశీలించాలి. ఆ బూజుపొడ ఇంకా అలానే కనబడితే అది అపవిత్రం. ఆ పొడ వ్యాపించకపోయినా సరే ఆ బట్టను లేక ఆ తోలును మీరు కాల్చివేయాలి.

56 “కానీ ఒక వేళ, ఆ తోలు ముక్కను లేక ఆ బట్టను యాజకుడు చూచినప్పుడు, బూజుపొడ వాడిపోయి ఉంటే, ఆ బట్ట మీద లేక తోలు మీద ఉన్న ఆ పొడను యాజకుడు చింపివేయాలి. ఆ బట్ట అల్లికది గాని, నేసినది కానీ ఫర్వాలేదు. 57 లేదా ఆ బట్టమీద లేక ఆ తోలుమీద బూజుపొడ తిరిగి రావచ్చును. అలా జరిగితే ఆ బూజుపొడ వ్యాపిస్తుంది. ఆ చించిన బట్ట ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి. 58 అయితే ఉతికిన తర్వాత బూజుపొడ మళ్లీ రాకపోతే అప్పుడు ఆ బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. ఆ బట్ట కుట్టిందిగానీ అల్లిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. ఆ బట్ట పవిత్రం.”

59 తోలు ముక్కలు లేక బట్టముక్కల మీద బూజుపొడకు సంబంధించిన నియమాలు అవి. బట్ట కుట్టింది గాని అల్లిందిగాని ఫర్వాలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International