Chronological
నేను మీతో రాను
33 అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను. 2 మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచిపెట్టేసేటట్టు బలవంతం చేస్తాను. 3 కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.”
4 ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. దీని తర్వాత ప్రజలు నగలు పెట్టుకోలేదు. 5 “మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు. 6 కనుక హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు.
తాత్కాలిక సన్నిధి గుడారం
7 గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయటకు జరిపాడు మోషే. “సన్నిధి గుడారం” అని మోషే దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది. 8 ఎప్పుడైనా సరే, బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడారపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో ప్రవేశించేవరకు అతణ్ణి గమనించి చూస్తుండేవారు. 9 మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లినప్పుడల్లా స్తంభంలా నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. ఈ విధంగా మోషేతో యెహోవా మాట్లాడతాడు. 10 సన్నిధి గుడారపు ద్వారం దగ్గర మేఘాన్ని చూడగానే ప్రజలు యెహోవాను ఆరాధించుటకు సాష్టాంగపడేవారు.
11 మోషేతో ముఖాముఖీగా యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో యెహోవా మాట్లాడాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడైన యెహోషువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యెహోషువ సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు.
యెహోవా మహిమను మోషే చూశాడు
12 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు. 13 నిజంగా నేను నీకు ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.”
14 “నేను నీతో కూడా వస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.
15 అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండి పంపించి వేయకు. 16 మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.”
17 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ల నాకు ఆనందం గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.”
18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను. 20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి బ్రతకలేడు.
21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు. 22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను. 23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”
కొత్త రాతి పలకలు
34 అప్పుడు మోషేతో యెహోవా ఇలాగు చెప్పాడు: “ముందు పగులగొట్టబడ్డ రెండు రాతి పలకల్లాంటివే మరో రెండు రాతి పలకలు తయారు చేయి. మొదటి రెండు రాళ్లమీద వ్రాయబడ్డ మాటలే ఈ రాళ్ల మీద నేను రాస్తాను. 2 రేపు ఉదయం సిద్ధంగా ఉండు. సీనాయి కొండమీదికి రమ్ము. అక్కడ కొండ శిఖరం మీద నా ఎదుట నిలబడు. 3 నీతో ఇంక ఏ వ్యక్తీ రావడానికి వీలులేదు. కొండమీద ఎక్కడా ఏ వ్యక్తి కనబడకూడదు. కనీసం ఆ కొండ కిందకూడ నీ పశువుల మందలు కాని, గొర్రెల మందలు గాని మేత కూడ మేయకూడదు.”
4 కనుక మొదటి వాటిలాగే మరో రెండు రాతి పలకలను మోషే చేసాడు. ఆ మర్నాడు ఉదయాన్నే సీనాయి కొండ మీదికి అతడు వెళ్లాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే అంతా చేసాడు. ఆ రెండు రాతి పలకలను మోషే తీసుకొని వెళ్లాడు. 5 మోషే కొండ మీద ఉన్నప్పుడు, ఒక మేఘం మీద యెహోవా దిగి వచ్చాడు. అక్కడ మోషే దగ్గర యెహోవా నిలబడ్డాడు. అతడు యెహోవాను పేరుపెట్టి పిలిచాడు. 6 మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా ప్రేమపూర్ణుడు. యెహోవా నమ్ముకోదగినవాడు. 7 వేలాది తరాలకు దయచూపించే వాడు యెహోవా. ప్రజలు చేసే తప్పులను యెహోవా క్షమిస్తాడు. అయితే నేరస్తులను శిక్షించడం యెహోవా మరచిపోడు. నేరస్తులను యెహోవా శిక్షించడమే కాదు, వారు చేసే తప్పులవల్ల వారి పిల్లలు, మనుమళ్లు, మూడు నాలుగు తరాల వరకు శ్రమ అనుభవిస్తారు.”
8 వెంటనే మోషే సాష్టాంగపడి యెహోవాను ఆరాధించాడు. మోషే ఇలా అన్నాడు: 9 “ప్రభూ, నా విషయం నీకు ఇష్టమైతే దయచేసి మాతోకూడా రమ్ము. వీళ్లు మొండి ప్రజలని నాకు తెలుసు. అయితే మేము చేసిన తప్పుల విషయంలో మమ్మల్ని క్షమించు. మమ్మల్ని నీ ప్రజలుగా స్వీకరించు.”
10 అప్పుడు యెహోవా చెప్పాడు: “నీ ప్రజలందరితో నేను ఈ ఒడంబడికను చేస్తున్నాను. భూమి మీద ఈ జనం కోసం ఇదివరకు ఎన్నడూ చేయని అద్భుతకార్యాలు నేను చేస్తాను. యెహోవానైన నేను మహాఘనుడనని నీతో ఉన్న ప్రజలు చూస్తారు. నేను నీ కోసం చేసే అద్భుత కార్యాలను వారు చూస్తారు. 11 ఈ వేళ నీకు నేను ఆజ్ఞాపిస్తున్న విషయాలకు లోబడు, నీ శత్రువులు నీ దేశము వదలివెళ్లి పోయేటట్టు నేను వారిని బలవంతం చేస్తాను. అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నేను బయటకు వెళ్ళగొడతాను. 12 జాగ్రత్తగా ఉండు! నీవు వెళ్తోన్న దేశంలో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకు. ఆ ప్రజలతో నీవు ఏదైనా ఒడంబడిక చేస్తే, అది నీకు చిక్కు తెచ్చిపెడుతుంది. 13 అయితే వారి బలిపీఠాలు నాశనం చేయి. వారు పూజించే రాళ్లను విరుగగొట్టు. వారి విగ్రహాలను నరికి వెయ్యి. 14 మరో దేవుడ్ని ఎవర్నీ ఆరాధించవద్దు. నేను రోషముగల యెహోవాను. అది నా పేరు. నేను రోషముగల దేవుడ్ని.
15 “ఆ దేశములో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకుండా జాగ్రత్తగా ఉండు. నీవు గనుక అలా చేస్తే, వారు వారి వారి దేవతలను ఆరాధించేటప్పుడు వాళ్లతో కలవమని ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు. వాళ్ల బలుల మాంసం నీవు తినకుండ జాగ్రత్త పడుము. 16 వారి కూతుళ్లు కొందరిని మీ కుమారులకు భార్యలుగా మీరు చేసుకుంటారేమో. ఆ కూతుళ్లు తప్పుడు దేవతలను సేవిస్తారు. మీ కుమారులు కూడా అలాగే చేసేటట్టు వారు నడిపించవచ్చు.
17 “విగ్రహాలు చేసుకోవద్దు.
18 “పులియని రొట్టెల పండుగ ఆచరించు. నేను ఇదివరకు మీతో చెప్పిన ప్రకారము పులియచేసే పదార్థం లేకుండా తయారు చేయబడిన రొట్టెలను ఏడు రోజులపాటు తినాలి. నేను ఏర్పరచుకున్న అబీబు నెలలో దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నెల అది.
19 “ఒక స్త్రీకి పుట్టిన ప్రథమ శిశువు ఎల్లప్పుడూ నాకే చెందుతుంది. మీ పశువులకు, గొర్రెలకు మొదటిదిగా పుట్టే పిల్లలు కూడా నాకే చెందుతాయి. 20 మొదటిదిగ పుట్టిన ఒక గాడిదను నీవు ఉంచుకోవాలంటే ఒక గొర్రె పిల్లను యిచ్చి నీవు దాన్ని కొనుక్కోవచ్చు. అయితే నీవు ఒక గొర్రె పిల్లను యిచ్చి ఆ గాడిదను కొనకపోతే, ఆ గాడిద మెడ నీవు విరుగగొట్టాలి. ప్రథమ సంతానమైన నీ కుమారులందరినీ నా దగ్గర్నుంచి నీవు కొనాలి. కానుక లేకుండా ఏ మనిషీ నా దగ్గరకు రాకూడదు.
21 “ఆరు రోజులు నీవు పనిచేస్తావు. అయితే ఏడో రోజున నీవు విశ్రాంతి తీసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు గూడ నీవు విశ్రాంతి తీసుకోవాలి.
22 “నీవు వారాల పండుగ ఆచరించాలి. గోధుమ కోతలో నుండి మొదటి పనను ఈ పండుగకు వినియోగించాలి. సంవత్సరాంతములో కోతకాలపు పండుగ ఆచరించాలి.
23 “ప్రతి సంవత్సరమూ మూడుసార్లు మీ పురుషులంతా మీ యజమానీ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కనబడాలి.
24 “మీరు మీ దేశంలోకి వెళ్లినప్పుడు, ఆ దేశంలో నుండి మీ శత్రువులను నేను వెళ్లగొట్టి వేస్తాను. మీ సరిహద్దులను నేను విశాలం చేస్తాను. మీకు ఇంకా భూమి లభిస్తుంది. ప్రతి సంవత్సరం మూడు సార్లు మీరు యెహోవా దేవుని ఎదుటకి వెళ్లాలి. ఆ సమయంలో ఎవ్వరూ మీ భూమిని మీ దగ్గర నుండి తీసుకునేందుకు ప్రయత్నించరు.
25 “బలి రక్తం నీవు నాకు అర్పిస్తే పులిసిన పదార్థము ఏదీ దానితోపాటు అర్పించవద్దు.
“పస్కా భోజనంలోని మాంసం ఏ మాత్రము మరునాటి ఉదయానికి మిగులకూడదు.
26 “మీ కోతలో నుండి మొట్టమొదటి పంట యెహోవాకు ఇవ్వాలి. మీ యెహోవా దేవుని ఆలయములోనికి వాటిని తీసుకొని రావాలి.
“మేక పిల్లను దాని తల్లి పాలతో ఎన్నడూ వండకూడదు.”
27 అప్పుడు మోషేతో యెహోవా, “నేను నీకు చెప్పిన విషయాలన్నీ వ్రాయి. నీతోను, ఇశ్రాయేలు ప్రజలతోను నేను చేసిన ఒడంబడిక విషయాలు అవి” అన్నాడు.
28 నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు.
ప్రకాశిస్తున్న మోషే ముఖం
29 అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు వ్రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు. 30 మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. 31 అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు. 32 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు.
33 మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు. 34 యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి – యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. 35 మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుగును తీసే వాడుకాదు.
సబ్బాతు నియమాలు
35 ఇశ్రాయేలు ప్రజలందర్నీ మోషే సమావేశ పర్చాడు. మోషే వారితో చెప్పాడు: “మీరు చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు నేను మీకు చెబుతాను.
2 “పని చేయడానికి ఆరు రోజులున్నాయి. అయితే ఏడో రోజు మీకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. ఆ ప్రత్యేక దినాన విశ్రాంతి తీసుకోవడంవల్ల మీరు యెహోవాను ఘనపరుస్తారు. ఏడో రోజున పనిచేసే వ్యక్తిని చంపెయ్యాలి. 3 సబ్బాతు రోజున మీరు నివసించే స్థలాల్లో నిప్పు కూడ రాజబెట్టకూడదు.”
పవిత్ర గుడారము కొరకు వస్తువులు
4 ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించినది ఇదే. 5 యెహోవా కోసం ప్రత్యేక కానుకలు సమకూర్చండి. మీరు ఏమి ఇస్తారో మీలో ప్రతి ఒక్కరూ మీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ కానుక యెహోవా కోసం తీసుకుని రావాలి. బంగారం, వెండి, ఇత్తడి. 6 నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట, శ్రేష్ఠమైన సన్నటి బట్ట, మేక బొచ్చు. 7 ఎరుపు రంగు వేసిన గొర్రె తోళ్లు, మంచి చర్మాలు, తుమ్మ కర్ర, 8 దీపాల కోసం ఒలీవ నూనె, అభిషేక తైలం కోసం పరిమళ ద్రవ్యాలు, సువాసన ధూపంకోసం పరిమళ ద్రవ్యాలు, 9 లేతపచ్చ రాళ్లు, యితర నగలు కానుకలుగా తీసుకు రావాలి. యాజకులు ధరించే ఏఫోదు, న్యాయ తీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు, నగలు అమర్చబడుతాయి.
10 “నైపుణ్యంగల వాళ్లందరూ యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ చేయాలి. (యెహోవా ఆజ్ఞాపించిన వస్తువులు ఇవి): 11 పవిత్ర గుడారం, దాని బయటి గుడారం, దాని కప్పు, కొక్కీలు, చట్రాలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, 12 ఒడంబడిక పవిత్ర పెట్టె, దాని కర్రలు, పెట్టెను మూసే దాని మూత, పెట్టె ఉండే చోటును కప్పి ఉంచే తెర 13 బల్ల, దాని కర్రలు, బల్ల మీద వస్తువులన్నీ, బల్ల మీద ఉండే ప్రత్యేక రొట్టె, 14 వెలుగు కోసం ఉపయోగించే దీప స్తంభం, దీప స్తంభానికి సంబంధించిన వస్తువులన్నీను, దీపాలు, దీపానికి నూనె, 15 ధూపం వేసేందుకు బలిపీఠం, దాని కర్రలు, అభిషేక తైలం, సువాసన గల ధూపద్రవ్యాలు, పవిత్ర గుడారం, ప్రవేశం దగ్గర ద్వారాన్ని కప్పి ఉంచే తెర, 16 అర్పణలు దహించే బలిపీఠం, దాని ఇత్తడి రేకు, కర్రలు, బలిపీఠం దగ్గర ఉపయోగించే అన్ని వస్తువులు, గంగాళం, దాని పీట, 17 ఆవరణపు తెరలు, వాటి కర్రలు, దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర 18 గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, మేకులకు కట్టే తాళ్లు, 19 పరిశుద్ధ స్థలంలో యాజకులు ధరించే ప్రత్యేక నేత వస్త్రాలు. యాజకుడైన అహరోను, అతని కుమారులు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలు ఇవి. వాళ్లు యాజకులుగా సేవ చేసేటప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.”
ప్రజల మహా గొప్ప అర్పణ
20 అప్పుడు ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లిపోయారు. 21 ఇవ్వాలి అనుకొన్న ప్రజలంతా వచ్చి యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, గుడారంలోని సమస్త సామగ్రి, ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి. 22 ఇవ్వాలనుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు వస్తువులు తెచ్చారు. ముక్కుకమ్ములు, చెవిపోగులు, ఉంగరాలు, ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ.
23 నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు బట్ట ఉన్న ప్రతి వ్యక్తీ వాటిని యెహోవా కోసం తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు ఎవరైనా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు. 24 వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి వచ్చి, దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మకర్ర ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా ఇచ్చాడు. 25 నిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట తయారు చేసింది. 26 సహాయం చేయాలనుకొన్న నైపుణ్యంగల స్త్రీలంతా మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు.
27 పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్లు తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి. 28 సుగంధ ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ ప్రజలు తెచ్చారు. సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తైలం, దీపాల నూనె కోసం ఉపయోగించబడ్డాయి.
29 సహాయం చేయాలనుకొన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహవాకు కానుకలు తెచ్చారు. ఈ కానుకలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలనుకొన్నారు గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి.
బెసలేలు, అహోలీయాబు
30 అప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు: “చూడండి, యూదా గోత్రానికి చెందిన ఊరు కుమారుడు బెసలేలును యెహోవా ఏర్పరచుకొన్నాడు. (హోరు కుమారుడు ఊరు). 31 బెసలేలును యెహోవా తన ఆత్మతో నింపాడు. అన్ని రకాల పనులు చేయడానికి యెహోవా అతనికి నైపుణ్యం ఇచ్చాడు. 32 అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో వస్తువులు చేయగలడు. 33 ప్రశస్తమైన రాళ్లను రత్నాలను చెక్కిసానబెట్టగలడు. బెసలేలు చెక్కపని చేసి అన్ని రకాల వస్తువులు తయారు చేయగలడు. 34 ఇతరులకు నేర్పించగల నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు దేవుడు యిచ్చాడు. (దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడు అహోలీయాబు). 35 అన్ని రకాల పనులు చేయటానికి ప్రత్యేక నైపుణ్యాన్ని యెహోవా వారికి ఇచ్చాడు. వడ్లవాని పనులు, లోహపు పనులు వారు చేయగలరు. నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు, నాణ్యమైన బట్టల మీద బుట్టా పని వారు చేయగలరు. ఉన్ని వస్త్రాలను వారు నేయగలరు.
© 1997 Bible League International