Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 28-29

యాజకుల వస్త్రాలు

28 “నీ సోదరుడైన అహరోను, అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి, నీ దగ్గరకు రావాలని చెప్పు. వీళ్లు యాజకులుగా నన్ను సేవిస్తారు.

“నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. ఈ వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు కల్గిస్తాయి. ఈ బట్టలు తయారుచేయగల నిపుణులు ప్రజల్లో ఉన్నారు. ఈ మనుష్యులకు ప్రత్యేక జ్ఞానం నేనిచ్చాను. అహరోనుకు బట్టలు తయారు చేయుమని వారికి చెప్పు. అతను ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నాడని ఈ బట్టలు చూపెడ్తాయి. అప్పుడు ఒక యాజకునిగా అతడు నన్ను సేవించవచ్చు. ఆ మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్పు వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక ప్రత్యేక అంగీ, తల కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు ఈ ప్రత్యేక దుస్తులను తయారు చేయాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను సేవించవచ్చు. బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టలను ఉపయోగించాలని ఆ మనుష్యులకు చెప్పు.

ఏఫోదు—నడికట్టు పట్టి

“ఏఫోదు తయారు చేయటానికి బంగారు దారాలు, సన్నని పేనిన నార బట్ట సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల నూలు ఉపయోగించాలి. నైపుణ్యం గల పనివారు ఈ ఏఫోదు చేస్తారు. ఏఫోదు[a] భుజాల దగ్గర ఒక్కో దాని దగ్గర ఒక్కో భుజం బట్ట వేయబడుతుంది. ఏఫోదు రెండుకొనలు ఈ భుజం బట్టలకు కట్టబడతాయి.

“ఏఫోదు మీద వేసుకొనే కండువాను వారు చాల జాగ్రత్తగా వేస్తారు. ఏఫోదులో ఉండేవాటితోనే బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగు బట్టతోనే ఈ కండువా తయారు చేయబడుతుంది.

“నీవు రెండు లేతపచ్చ రాళ్లు తీసుకోవాలి. ఇశ్రాయేలు పండ్రెండు మంది కుమారుల పేర్లు ఈ రత్నాల మీద చెక్కాలి 10 ఒక రత్నం మీద ఆరు పేర్లు, మరో రత్నం మీద ఆరు పేర్లు రాయాలి. పెద్ద కుమారుడు మొదలుకొని చిన్న కుమారుని వరకు క్రమపద్ధతిలో పేర్లు చెక్కు. 11 ముద్రలు చేసేవాడు ఎలాగైతే చెక్కుతాడో, అలా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఈ రాళ్ల మీద చెక్కు. ఈ రత్నాలను బంగారంలో పొదుగు. 12 అప్పుడు ఏఫోదు మీద ఉండే ఒక్కో భుజం బట్ట మీద ఒక్కో రత్నాన్ని అమర్చు. అహరోను యెహోవా ఎదుట నిలబడ్డప్పుడు ప్రత్యేకమైన ఈ అంగీ ధరిస్తాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడ్డ రెండు రాళ్లు ఏఫోదు మీద ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి తలంచేందుకు ఇది దేవునికి సహాయ పడుతుంది. 13 ఏఫోదు మీద రాళ్లు నిలబడి ఉండేటట్టు మంచి బంగారం ఉపయోగించు. 14 స్వచ్ఛమైన బంగారు గొలుసులను కలిపి తాడు పేనినట్టు మెలిపెట్టు. ఇలాంటివి రెండు బంగారు గొలుసులు చేసి, వాటిని బంగారు అల్లికలకు బిగించు.

న్యాయతీర్పు పథకం

15 “ప్రధాన యాజకుని కోసం న్యాయపతకం చేయి, ఏఫోదు చేసినట్టు నైపుణ్యం గల పనివారు ఈ పైవస్త్రం చేయాలి. బంగారు దారాలు, సున్నితమైన నారబట్ట, నీలం, ఎరుపు, ఊదారంగుబట్ట వాళ్లు ఉపయోగించాలి. 16 ఈ న్యాయతీర్పు పైవస్త్రం 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండాలి. అది ఒక సంచి అయ్యేటట్టుగా మడత చేయబడాలి. 17 న్యాయ పతకం మీద అందమైన రత్నాలు నాలుగు వరుసలు పెట్టాలి. ఈ రత్నాల మొదటి వరసలో పద్మరాగం, గోమేధికం, మరకతం ఉండాలి. 18 రెండో వరుసలో ఆకుపచ్చ నీలమణి, పచ్చమరకతం ఉండాలి. 19 మూడో వరుసలో ఎరుపు వన్నె మణి, ఊదారంగు మణి, వంగరంగు మణి ఉండాలి. 20 నాలుగో వరుసలో రక్తవర్ణం రాయి, లేతపచ్చ రాయి, సూర్యకాంతం ఉండాలి. న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రత్నాలన్నీ నిలబడేట్టు బంగారం ఉపయోగించాలి. 21 ఇశ్రాయేలు కుమారుల్లో ఒకొక్కరికి ఒకొక్కటి చొప్పున న్యాయ తీర్పు పైవస్త్రం మీద పన్నెండు రత్నాలు ఉంటాయి. ఈ రాళ్లలో ఒక్కొదానిమీద ఇశ్రాయేలు కుమారుల్లో ఒక్కొక్కరిది ఒక దాని మీది రాయి. ఒక్కోరాయిలో ఈ పేర్లను ముద్రించినట్టుగా చెక్కు.

22 “న్యాయతీర్పు పైవస్తానికి స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు చేయాలి. ఈ గొలుసులు తాడులా ఉంటాయి. 23 బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు. 24 న్యాయతీర్పు పైవస్త్రం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల్లోనుంచి ఈ బంగారు గొలుసులు రెంటిని దూర్చాలి. 25 ఆ గొలుసుల అవతలి కొనలను ఏఫోదు ముందర రెండు భుజం బట్టలమీద పెట్టు. 26 ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేసి, న్యాయతీర్పు పైవస్త్రం, అవతల ఉన్న మరి రెండుమూలల్లో పెట్టాలి. ఏఫోదు దగ్గరగా ఉన్న న్యాయతీర్పు పైవస్త్రం లోపలి వైపు ఇది. 27 ఇంకా రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందర భాగంలోని భుజభాగాల అడుగున పెట్టాలి ఏఫోదు దట్టీ పైభాగానికి దగ్గరగా బంగారు ఉంగరాలను ఉంచాలి. 28 న్యాయతీర్పు పైవస్త్రం ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు జత చేయాలి. నడికట్లతో వీటిని జత చేసేందుకు నీలం పతకం ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల న్యాయతీర్పు పైవస్త్రం నడికట్టును పట్టుకొని ఉంటుంది.

29 “అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఆయన గుండెమీద ఉంటాయి. న్యాయం తీర్చడానికి ఆయన ధరించే తీర్పు పతకం మీద ఈ పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఇశ్రాయేలు కుమారులు పన్నెండు మందిని యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాడు. 30 దేవుని నిర్ణయాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను న్యాయతీర్పు పైవస్త్రములో ఉంచాలి. అహరోను యెహోవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో తీసుకువెళ్తాడు.

యాజకుల యితర వస్త్రాలు

31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. 32 దాని మధ్యలో తల పట్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి. 33 నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం రంగుల బట్టతో దానిమ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య బంగారు గంటలు వ్రేలాడదీయాలి. 34 అంగీ అడుగున చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంట, మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి. 35 అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.

36-37 “స్వచ్ఛమైన బంగారంతో ఒక బద్ద చేయాలి, “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు ఒక ముద్రగా తలపాగా చుట్టూ ముందరవైపు కట్టేందుకు నీలం పతకం ఉపయోగించాలి. 38 అహరోను దీన్ని తన తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విషయంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ కానుకలు ప్రజలు యెహోవాకు అర్పించేవి. ప్రజల కానుకలను యెహోవా స్వీకరించేటట్టు అహరోను దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి.

39 “అంగీని తయారు చేసేందుకు సున్నితమైన నార బట్టను ఉపయోగించాలి. తలపాగా చేసేందుకు సున్నితమైన నారబట్టను ఉపయోగించాలి. నడికట్టు మీద బుట్టా కుట్టాలి. 40 చొక్కాలు, పట్టాలు, తలపాగాలు కూడా తయారు చేయాలి. ఇవి వారికి గౌరవమర్యాదలు కలిగిస్తాయి. 41 నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకు ఈ బట్టలు ధరింపజేయాలి. తర్వాత వారు యాజకులని చూపెట్టేందుకుగాను వారి తలమీద ఒలీవనూనె పోయాలి. ఇది వాళ్లను యాజకులుగా చేస్తుంది. ఒక ప్రత్యేక విధానంలో వారు నన్ను సేవిస్తున్నారని ఈ విధంగా నీవు తెలియజేస్తావు. అప్పుడు వారు నన్ను యాజకులుగా సేవిస్తారు.

42 “వారి ప్రత్యేక యాజక వస్త్రాల కింద ధరించేందుకు శ్రేష్ఠమైన బట్టను ఉపయోగించాలి. లోపల ధరించే ఈ వస్త్రాలు నడుంనుండి కాళ్ల వరకు ధరించాలి. 43 అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారములో ఎప్పుడు ప్రవేశించినా, ఈ వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులుగా సేవ చేసేందుకు బలిపీఠం దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారు ఈ వస్త్రాలు ధరించాలి. వారు ఈ వస్త్రాలు ధరించకపోతే, తప్పు చేసిన నేరస్థులై చావాల్సి వస్తుంది. అహరోను, అతని తర్వాత అతని కుటుంబం అంతటికీ ఇదంతా నిత్యం కొనసాగే ఒక చట్టంగా ఉండాలి.

యాజకుల నియామకం, వేడుక

29 “అహరోను, అతని కుమారులు యాజకులుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని యిప్పుడు నీకు నేను చెబుతాను. ఒక గిత్తను, కళంకం లేని రెండు పొట్టేళ్లను సంపాదించు. తర్వాత పులియజేసే పదార్థంలేని సన్నని గోధుమ పిండితో రొట్టె చేయాలి. ఒలీవ నూనెతో కలిపి చేసే రొట్టెలకు గూడ అవే వస్తువులు ఉపయోగించాలి. నూనెతో కలిపి చిన్న చిన్న పల్చటి అప్పడాలు చేయాలి. ఈ రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. ఆ బుట్టను అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమయంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి.

“తర్వాత అహరోనును అతని కుమారులను సన్నిధి గుడారం ముందటి ద్వారం దగ్గరకు తీసుకు రావాలి. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. అహరోనుకు అతని చొక్కా తొడిగించాలి. ప్రత్యేక ఏఫోదుతో వుండే అంగీని అతనికి ధరింపజేయాలి. అప్పుడు ఏఫోదును, న్యాయతీర్పు పైవస్త్రాన్ని అతనికి కట్టాలి. అందమైన దట్టీని అతనికి కట్టాలి. తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి. అభిషేక తైలము తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను ఈ పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది.

“తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకురావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి. అప్పుడు వారి నడుములకు దట్టీలు చుట్టాలి. ధరించేందుకు ప్రత్యేక టోపీలను వారికి ఇవ్వాలి. వారు యాజకులుగా ఉండడం అప్పుడు ప్రారంభం అవుతుంది. శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక చట్టంవల్ల వారు యాజకులుగా ఉంటారు. ఈ విధంగా అహరోనును, అతని కుమారులను నీవు యాజకులుగా చేయాలి.

10 “తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు గిత్తను తీసుకురావాలి. అహరోను, అతని కుమారులు ఆ గిత్త తల మీద వారి చేతులు పెట్టాలి, 11 “అప్పుడు ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి. దీనిని యెహోవా చూస్తాడు. 12 అప్పుడు గిత్త రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం దగ్గరకు వెళ్లాలి. బలిపీఠం కొమ్ముల మీద నీ వేళ్లతో కొంచెం రక్తం చిలకరించాలి. మిగిలిన రక్తం అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి. 13 తర్వాత గిత్త లోపలి కొవ్వు అంతా తీయాలి. కాలేయంలో కొవ్విన భాగాన్ని రెండు మూతగ్రంథులను వాటి చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి. 14 తర్వాత గిత్త మాంసం, చర్మం, ఇతర భాగాలు తీసుకొని మీ పాళెము వెలుపటికి వెళ్లాలి. అక్కడ, పాళెము వెలుపల వీటిని కాల్చివేయాలి. ఇది యాజకుల పాపాలను తీసివేయు అర్పణ.

15 “తర్వాత పొట్టేళ్లలో ఒకదాని తలమీద తమ చేతులు పెట్టమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు. 16 అప్పుడు ఆ పొట్టేలును చంపి ఆ రక్తం భద్రం చేయాలి. ఆ రక్తాన్ని బలిపీఠం నలువైపుల వెదచల్లాలి. 17 అప్పుడు పొట్టేలును ముక్కలు ముక్కలుగా కోయాలి. పొట్టేలు లోపలి భాగాలను కాళ్లను కడగాలి. వీటిని పొట్టేలు తల ఇతరభాగాలతో కలిపి పెట్టాలి. 18 అప్పుడు ఆ మొత్తాన్ని బలిపీఠం మీద దహించి వేయాలి. ఇది దహించబడ్డ దహన బలి. ఇది యెహోవాకు అర్పించబడింది. యెహోవా అర్పణను వాసన చూస్తాడు. అది ఆయనకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు అర్పించే అర్పణ.

19 “ఇంకో పొట్టేలు మీద వారి చేతులు వుంచమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు. 20 ఆ పొట్టేలును చంపి, దాని రక్తం భద్రం చేయాలి. అహరోనుకు, అతని కుమారులకు వారి కుడి చెవి కొనల మీద ఆ రక్తం చల్లాలి. ఇంక వారి కుడి చేతుల బొటన వేళ్ల మీద కొంత రక్తం ఉంచాలి. వారి కుడి పాదాల బొటన వేళ్లపై మరికొంత రక్తం ఉంచాలి. అప్పుడు బలిపీఠం మీద నాల్గువైపులా రక్తం చల్లాలి. 21 తర్వాత బలిపీఠం నుండి కొంత రక్తం తీసుకోవాలి. ప్రత్యేక తైలంతో దాన్ని కలిపి, అహరోను మీద, అతని బట్టల మీద దాన్ని చల్లాలి. ఆయన కుమారుల మీద, వారి బట్టల మీద దాన్ని చల్లాలి, అహరోను, అతని కుమారులు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది సూచిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, వారి బట్టలు ఉపయోగించబడుతాయని ఇది సూచిస్తుంది.

22 “అప్పుడు పొట్టేలు నుండి కొవ్వును తీయాలి. (అహరోనును ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించబడే పొట్టేలు ఇది). తోక చుట్టూ ఉండే క్రొవ్వును, శరీరం లోపలి భాగాలను కప్పివుండే కొవ్వును తీయాలి. కాలేయంలో క్రొవ్విన భాగాన్ని తీయాలి. మూతగ్రంధులు రెండింటిని, కుడి కాలును తీయాలి. 23 పులియని పదార్థం లేకుండా నీవు చేసిన రొట్టెలు గల బుట్టను తీసుకొని యెహోవా ముందు పెట్టాలి. బుట్టలోని రొట్టె ఒకటి, ఒలీవ నూనెతో చేసిన రొట్టె ఒకటి, పలుచని చిన్న అప్పడం ఒకటి బుట్టలో నుండి బయటికి తీయాలి. 24 అప్పుడు వీటిని అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వు. యెహోవా యెదుట వీటిని తమ చేతులతో పట్టుకొని ఉండమని వారితో చెప్పు. ఇది యెహోవాకు ప్రత్యేకమైన అర్పణ. 25 అప్పుడు అహరోను, అతని కుమారుల చేతుల్లోనుంచి వీటిని తీసుకొని, పొట్టేలుతో బాటు బలిపీఠం మీద పెట్టు. యెహోవా ఈ దహనబలి అర్పణ వాసన చూసి ఆనందిస్తాడు. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు ఇచ్చే అర్పణ.

26 “అప్పుడు పొట్టేలుయొక్క బోరను తీసుకోవాలి. (ఇది అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించే పొట్టేలు). పొట్టేలు బోరను యెహోవా సన్నిధిలో ఇచ్చి పుచ్చుకొనే ప్రత్యేక అర్పణగా అర్పించాలి. జంతువుల్లోని ఈ భాగం నీది. 27 అప్పుడు అహరోనును ప్రధాన యాజకునిగా చేయుటకు ఉపయోగించి పొట్టేలు రొమ్ము, కాలు తీసుకో, వాటిని అహరోనుకు, అతని కుమారులకు ఇయ్యి. ఇది అర్పణలో ఒక ప్రత్యేక భాగం అవుతుంది. 28 ఇశ్రాయేలు ప్రజలు ఈ భాగాలను అహరోనుకు, అతని కుమారులకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించినప్పుడల్లా ఈ భాగాలు ఎప్పుడూ యాజకులకే చెందుతాయి. ఈ భాగాలను వారు యాజకులకు ఇచ్చినప్పుడు అవి యెహోవాకు ఇచ్చినట్టే అవుతుంది.

29 “అహరోను తయారు చేసిన ఆ ప్రత్యేక వస్త్రాలను భద్రం చేయాలి. అతని తర్వాత జీవించే వారందరికీ ఈ వస్త్రాలు చెందుతాయి. వారు యాజకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు. 30 అహరోను తర్వాత అతని కుమారుడు ప్రధాన యాజకుడు అవుతాడు. ఈ కుమారుడు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేందుకు సన్నిధి గుడారంలోనికి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ధరిస్తాడు.

31 “అహరోనును ప్రధాన యాజకునిగా చేసేందుకు ఉపయోగించిన పొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర స్థలంలో వండాలి. 32 అప్పుడు అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారం ఎదుటి ద్వారం ముందు ఆ మాంసం తినాలి. మరియు బుట్టలోని రొట్టెను కూడ వారు తినాలి. 33 వారు యాజకులుగా చేయబడ్డప్పుడు వారి పాపాలను పరిహరించేందుకు ఈ అర్పణలు ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు వారు ఈ అర్పణలను తినాలి. 34 ఆ పొట్టేలు మాంసంలోగాని, ఆ రొట్టెలోగాని ఏమైనా మర్నాటి ఉదయానికి మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి. ఆ రొట్టె, మాంసం ఒక ప్రత్యేక సమయంలో, ఒక ప్రత్యేక విధానంలో మాత్రమే తినవలసినవి గనుక మీరు వాటిని తినకూడదు.

35 “అహరోను, అతని కుమారులకోసం నీవు చేయాలని నేను నీకు ఆజ్ఞాపించిన వీటన్నింటినీ నీవు చేయాలి. వీటిని ఏడురోజుల వ్యవధిలో నీవు చేయాలి. 36 రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి. ఇది అహరోను, అతని కుమారుల పాపముకోసం అర్పణగా ఉంటుంది. బలిపీఠాన్ని పవిత్రం చేసేందుకు నీవు ఈ బలులను ఉపయోగించాలి. బలిపిఠాన్ని పవిత్రం చేసేందుకు దాని మీద ఒలీవ నూనెపోయాలి. 37 ఏడురోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం చేయాలి. ఆ సమయంలో బలిపీఠం అతిపవిత్రం అవుతుంది.

38 “బలిపీఠం మీద ప్రతిరోజూ ఒక అర్పణ అర్పించాలి. ఒక సంవత్సరం వయస్సుగల రెండు గొర్రె పిల్లల్ని వధించాలి. 39 ఒక గొర్రెపిల్లను ఉదయం, మరో గొర్రెపిల్లను సాయంత్రం అర్పించాలి. 40 మొదటి గొర్రెపిల్లను నీవు వధించినప్పుడు పదవవంతు సన్నటి గోధుమ పిండిని ఒక పావు ద్రాక్షారసంతో కలిపి అర్పణగా చేయాలి. ఉదయం చేసినట్టే సాయంత్రం రెండో గొర్రెపిల్లను వధించినప్పుడు కూడ పదవవంతు సన్నని పిండిని అర్పించాలి. ఒక పావు ద్రాక్షారసం అర్పించాలి. 41 ఇది యెహోవాకు భోజన అర్పణం అవుతుంది. ఈ అర్పణ నీవు దహించినప్పుడు, యెహోవా దీని సునాసనను చూసి ఆనందిస్తాడు.

42 “ప్రతిరోజూ యెహోవాకు అర్పణగా వీటిని నీవు దహించాలి. సమావేశ గుడారం ముందు ద్వారం దగ్గర, యెహోవా ఎదుట వీటిని చేయాలి. ఇలానే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. నీవు అర్పణ అర్పించునప్పుడు, యెహోవానైన నేను నిన్ను అక్కడ కలుసుకొని నీతో మాట్లాడుతాను. 43 ఆ స్థలంలో నేను ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొంటాను. నా మహిమవల్ల ఆ స్థలం పవిత్ర పర్చబడుతుంది.

44 “కనుక సన్నిధి గుడారాన్ని నేను పవిత్రం చేస్తాను. మరియు బలిపీఠాన్ని నేను పవిత్రం చేస్తాను. అహరోను, అతని కుమారులు నాకు యాజకులుగా సేవ చేయగలిగేటట్టు నేను వారిని పవిత్రం చేస్తాను. 45 నేను ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. నేను వారికి దేవుడిగా ఉంటాను. 46 ‘నేనే యెహోవాను, వారి దేవుడ్ని’, అని ప్రజలు తెలుసుకొంటారు. నేను వారితో నివసించేందుకు వారిని ‘ఈజిప్టునుండి బయటికి రప్పించింది నేనే’ అని వారు తెలుసుకొంటారు. నేనే వారి దేవుడైన యెహోవాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International